కౌరవులు పుట్టిందెలా? మట్టికుండలో అని మహాభారతం చెబుతోంది. అండం.. శుక్రకణం లేకుండా బిడ్డలెలా పుడతారు? అంతా పుక్కిటి పురాణం.. ట్రాష్..! ఇప్పటివరకూ అందరూ ఇలాగే అనుకున్నారు. కానీ.. తమ ప్రయోగశాలలో అచ్చంగా ఇదే చేసి చూపారు శాస్త్రవేత్తలు. కొందరికి గర్భం ఎందుకు నిలవదన్న అంశం మొదలుకొని.. ఏకరీతిలో ఉండే వందలాది మంది బిడ్డలను అభివృద్ధి చేయడం వరకూ.. అనేక సమస్యలను ఈ పరిశోధన పరిష్కరిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వినేందుకు కొంత ఆశ్చర్యకరంగానే ఉంటుంది ఈ విషయం. మహాభారతంలో ఏముంది? దాని వాస్తవికతలపై చర్చ కూడా అవసరం లేదు. అయితే బెల్జియంలోని మాస్ట్రిచ్ వర్సిటీ శాస్త్రవేత్తలు కేవలం మూలకణాలను ఉపయోగించి ప్రయోగశాలలో పిండాల్ని (పైచిత్రంలో) అభివృద్ధి చేశారు.
పరిశోధనల కోసం ఒకే రకమైన పిండాలను అభివృద్ధి చేసేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని అంచనా. కొంతమందిలో గర్భం ఎందుకు నిలవడం లేదన్న అంశాన్ని అర్థం చేసుకునేందుకు తద్వారా ఈ సమస్యను అధిగమించేందుకు కూడా ఈ పరిశోధన పనికొస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ టెక్నిక్‌ను దుర్వినియోగం చేసి క్లోనింగ్ కోసం వాడుకోవచ్చని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మూలకణాలతో పిండా న్ని అభివృద్ధి చేసే ప్రక్రియ చాలా ప్రాథమిక దశలోనే ఉందని.. పిండాన్ని అభివృద్ధి చేయగలిగామేగానీ.. దాన్ని గర్భసంచిలో స్థిరంగా ఉంచలేకపోయామని.. దీన్ని సాధించేందుకు దశాబ్దాల సమయం పడుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్తలు అంటున్నారు.
క్లోనింగ్‌కు అవకాశం..
అండం, శుక్రకణాల అవసరం లేకుండా జీవా న్ని సృష్టించడం ఆషామాషీ కాదు. ప్రస్తుతానికి పిండం పూర్తిస్థాయిలో అభివృద్ధి కానప్పటికీ ఇంకో మూడేళ్లలోనే తాము ఈ పద్ధతి ద్వారా ఎలుకలను పుట్టించగలమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇది మానవ క్లోనింగ్‌కు దారి తీయవచ్చని.. ఇంకో 20 ఏళ్లలోనే ఒకే రకమైన రూపురేఖలు, లక్షణాలున్న మానవులను తయారు చేసే వీలు ఏర్పడుతుందని నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. కావాల్సినన్ని ఎలుకలను తయారు చేసుకుంటే కొత్త మందులను పరీక్షించడం సులువు అవుతుందని, సంతానలేమి సమస్య పరిష్కారానికి ఉపయోగపడుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ప్రొఫెసర్ నికొలస్ రివ్రాన్ అంటున్నారు.
పిండాలపై పరిశోధనలకు అనేక ఆంక్షలు ఉన్నాయని, పైగా తగిన సంఖ్యలో పిండాలను పొందడం కూడా సాధ్యం కాదని.. కొత్త టెక్నాలజీతో సమస్యలను అధిగమించవచ్చని రివ్రాన్ వివరించారు. బ్లాస్టోసిస్ట్ స్థాయికి ఎదిగిన పిండం ఆ తర్వాత గర్భాశయానికి ఎందుకు అతుక్కోలేదన్నది తమకు తెలియదని, తాము అభివృద్ధి చేసిన పిండం..సాధారణ పిండాన్ని పోలి ఉందని వివరించారు. బహుశా కృత్రిమ పిండంలో కణాల అమరిక సక్రమంగా ఉండకపోవడమే కారణం కావచ్చన్నారు. మూలకణాలతో బ్లాస్టోసిస్ట్‌ను తయారు చేయడం ఇదే మొదలు కాబట్టి.. మరిన్ని పరిశోధనలు ఏం జరుగుతోందన్న విషయంపై స్పష్టత ఇవ్వవచ్చని చెప్పారు.
పిండం అభివృద్ధి ఇలా..
మూలకణాల గురించి మీకు తెలిసే ఉంటుంది. శరీరంలోని ఏ కణంగానైనా మారిపోగల సత్తా వీటి సొంతం. ఫలదీకరణమైన నాలుగైదు రోజులకు పిండంలో ఏర్పడతాయి ఇవి. పిండం ఎదిగే క్రమంలో వీటిల్లో కొన్ని గుండె కణాలుగా మారితే.. ఇంకొన్ని నాడీ కణాలుగా.. మరికొన్ని రక్తకణాలుగా మారిపోతాయి. మాస్ట్రిచ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఎలుకలకు సంబంధించిన రెండు రకాల మూలకణాలను ప్రయోగశాలలోని గాజు పాత్రలో కలిపారు. అంతే.. ఆశ్చర్యకరంగా అవి నాలుగైదు రోజుల పిండం స్థాయికి ఎదిగాయి. దీన్ని గర్భాశయంలోకి జొప్పించినప్పుడు గర్భధారణ జరిగే సమయంలో జరిగే మార్పులకు గురైనా కొంత సమయం తర్వాత నిర్వీర్యమైపోయింది. గర్భాశయానికి అతుక్కోలేకపోయింది.
– సాక్షి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment