
మధుమేహ బాధితులూ ఇకపై మీరంతా అధికంగా కార్బొహైడ్రేట్స్ ఉండే ఆహారాన్ని నిశ్చింతగా తినేయొచ్చు. ఊబకాయులు సైతం కార్బొహైడ్రేట్స్‌ను ఎంత కావాలంటే అంత లాగించేయొచ్చు. అవును.. మీరు వింటున్నది నిజమే. అదెలా సాధ్యమని ఆశ్చర్యపోకండి. ఆహారంలో గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ)ను అదుపులో ఉంచే స్మార్ట్ కుక్కర్ సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ బాపట్లలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్ శాస్త్రవేత్తలు మూడేళ్లపాటు శ్రమించి అభివృద్ధి చేసిన ఈ వినూత్న ఆవిష్కరణ త్వరలోనే మార్కెట్‌లోకి రాబోతోంది. ప్రపంచంలోనే తొలి స్మార్ట్ కుక్కర్‌గా పేటెంట్ సైతం దీనికి లభించింది.
గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) మనం తీసుకునే ఆహారంలో 55% కంటే తక్కువగా ఉంటే రక్తంలో సుగర్ అత్యంత నిదానంగా పెరుగుతాయి. జీఐ 56–70% మధ్య ఉంటే నెమ్మదిగా.. 70% పైబడి ఉంటే వేగంగా పెరుగుతాయి. రక్తంలో చక్కెర పాళ్లు పరిమితికి మించి పెరిగితే క్లోమ గ్రంధి (పాంక్రియాస్)పనితీరు మందగించి ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇది డయాబెటిస్‌కు దారితీస్తుంది.
గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయిని తగ్గించడమే లక్ష్యంగా..
ప్రస్తుత పరిస్థితుల్లో పెద్దల్లోనేకాదు.. పిల్లల్లోనూ టైప్–1 డయాబెటిస్ విపరీతంగా పెరగడానికి కారణమవుతున్న ఆహారంలో గ్లైసెమిక్ ఇండెక్స్‌ను నియంత్రించాలన్న సంకల్పంతో బాపట్ల వ్యవసాయ విశ్వవిద్యాలయం పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్ బయో కెమిస్ట్రీ శాస్త్రవేత్త డి.సందీప్‌రాజా నేతృత్వంలో డాక్టర్ బీవీఎస్ ప్రసాద్, వి.వాసుదేవరావు, ఎల్.ఏడుకొండలుతో కూడిన శాస్త్రవేత్తల బృందం మూడేళ్లపాటు చేసిన పరిశోధన ఎట్టకేలకు ఫలించింది. ఎలాంటి వరి రకమైనా సరే ప్రాసెసింగ్ ట్రీట్‌మెంట్ ద్వారా వాటిలోని జీఐ స్థాయిలను తగ్గించి ఆహారం నెమ్మదిగా జీర్ణమయ్యేలా అభివృద్ధి చేసిన స్మార్ట్ కుక్కర్ ఆహార రంగంలో విప్లవమే.
ఇదెలా పనిచేస్తుందంటే..
ప్రాసెసింగ్ ట్రీట్‌మెంట్ ద్వారా జీఐను తగ్గించడమే లక్ష్యంగా ఈ స్మార్ట్ రైస్ కుక్కర్‌ను అభివృద్ధి చేశారు. ఇందులో బియ్యాన్ని స్టీమింగ్ ప్రక్రియ ద్వారా ఉడికిస్తారు. గంజిని సోలనాయిడ్ వాల్వ్ ద్వారా వేరు చేస్తారు. తర్వాత అన్నం వేగంగా చల్లబడే (ర్యాపిడ్ కూలింగ్) చాంబర్‌లోకి పంపి 1–2 డిగ్రీల సెల్సియస్‌లో ప్రాసెస్ చేస్తారు. శాస్త్రీయంగా చెప్పాలంటే.. బియ్యాన్ని రీట్రో గ్రేడ్ చేయడం (అన్నేలింగ్, హీట్ మాయిశ్చర్ ట్రీట్‌మెంట్ (హెచ్‌ఎంటీ) ద్వారా అన్నంలో ఉండే స్టార్చ్ (పిండి పదార్థం)లో 20 నిమిషాల్లో జీర్ణమయ్యే పదార్థం (ర్యాపిడ్లీ డైజెస్టబుల్ స్టార్చ్–ఆర్‌డీఎస్)ను 90 నిముషాల్లో నెమ్మదిగా జీర్ణయ్యే పదార్థం (స్లో డైజెస్టబుల్ స్టార్చ్–ఎస్‌డీఎస్)గా మారుస్తుంది.
దీంతో పాటు అన్నంలో రెసిస్టెంట్ స్టార్చ్ పెరుగుతుంది. ఇది అసలు జీర్ణ మవకుండా డైటరీ ఫైబర్‌లా ప్రవర్తించేలా ఒక రకమైన పిండి పదార్థం. బియ్యాన్ని వండే సమయంలో అదనపు పానీడు తీసేయడంతో కొంత స్టార్చ్ తగ్గిపోతుంది. ఈ స్మార్ట్ కుక్కర్‌లో వండితే 45% ఆర్‌డీ ఎస్‌ను ఎస్‌డీఎస్‌గా మార్చి ఆర్‌ఎస్‌ను 121% శాతానికి పెంచుతుంది. ఫలితంగా గ్లైసెమిక్ ఇండెక్స్ 22% వరకు తగ్గిపోతుంది. ఇలా వండిన అన్నం సాధారణ అన్నంలాగే ఉంటుంది. సాధారణంగా వండే అన్నా నికి ఉన్నట్టుగానే రంగు, రుచి, వాసనలు పాడవకుండా ఉంటుంది.
ప్రపంచంలోనే తొలి డయాబెటిస్ రైస్ కుక్కర్
ఇది పూర్తిగా స్మార్ట్ కంట్రోల్స్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ఇంటిగ్రేషన్‌తో పనిచేస్తుంది. ఐవోటీ కంట్రోల్ రిమోట్ (మొబైల్ యాప్) ద్వారా ఎంతదూరం నుంచైనా దీనిని నియంత్రించవచ్చు. కేవలం ఒక కమాండ్ ఇస్తే చాలు ఇంట్లో అన్నం నిర్ణయించిన సమాయనికి రెడీ అయి ఉండేలా సెట్ చేసుకోవచ్చు. రైస్ వేరియంట్, బియ్యం–నీరు నిష్పత్తి, వండే ఉష్ణోగ్రత, చల్లదనం, స్టీమింగ్ సమయం వంటి వాటిని మొబైల్ ద్వారానే సెట్ చేసేలా ఏర్పాటు చేశారు.
మనం పెట్టే బియ్యం రకం ఆధారంగా దానికి అవసరమైన నీటి నిష్పత్తి, ఉడికే ఉష్ణోగ్రత, ఉడికే సమయం, చల్లబడే ఉష్ణోగ్రత, చల్లబడే కాలం, స్టీమింగ్‌కు అవసరమైన సమయం, వంటి అంశాలను కూడా ప్రత్యేక ఆల్గారిథం ద్వారా స్వయం చాలకంగా నియంత్రిచబడతాయి. 2022లో ప్రారంభమైన ఈ పరిశోధనకు మూడేళ్ల సమయం పట్టింది.
ఈ పరిశోధన పూర్తిగా బాపట్లలోనే జరిగింది. ఫ్యాబ్రికేషన్ కోసం కోయంబత్తురులోని ఓ కంపెనీ సహకారం తీసుకున్నారు. ఈ వినూత్నమైన రైస్ కుక్కర్‌కు గత నెలలోనే భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ హక్కు(405194–001) లభించింది.
డయాబెటిస్ రోగులకు ఎంతో ఉపయోగం
స్మార్ట్ రైస్ కుక్కర్‌లో వండిన అన్నం తినడం వల్ల రక్తంలోని సుగర్ స్థాయిలను పూర్తిగా నియంత్రించవచ్చు. నిధానంగా జీర్ణమవడం వల్ల మళ్లీ ఆకలి వేయడానికి సమయం పడుతుంది. తక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల శరీర బరువును కంట్రోల్ చేస్తుంది. శరీరంలోని శక్తి పెరగడమే కాకుండా అలసట తగ్గుతుంది. రోజంతా ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది.
త్వరలోనే ఈ స్మార్ట్ రైస్ కుక్కర్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇందుకోసం ఒక కంపెనీతో ఎంవోయూ చేసుకోబోతున్నాం. గతంలో నేను అభివృద్ధి చేసిన ఆప్లాటాక్సిన్‌ను కనుగొనే ఒక రాపిడ్ కిట్‌తో పాటు అతి తక్కువ ధరలోనే గైసెమిక్ ఇండెక్స్‌ను తగ్గించేలా తయారు చేసిన కిట్‌కు పేటెంట్ హక్కులు లభించాయి. వరుసగా మూడో ఆవిష్కరణకు పేటెంట్ హక్కు రావడం ఆనందంగా ఉంది.
– డాక్టర్ దోనేపూడి సందీప్ రాజా, బయో కెమిస్ట్రీ శాస్త్రవేత్త, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం, బాపట్ల