శాస్త్ర పరిశోధనలను లోతుగా సాగించడం సర్వసాధారణం. అలాగని వాటి కోసం ప్రయోగశాలలను లోతైన ప్రదేశాలలో భూగర్భంలో నిర్మించడం మాత్రం విడ్డూరమే! ఈ విడ్డూరం చైనాలోనిది. ప్రపంచంలోనే అత్యంత లోతైన లాబొరేటరీని చైనా నిర్మిస్తోంది. భూమికి ఏకంగా 2,400 మీటర్ల లోతైన చోట నిర్మిస్తున్న ఈ లాబొరేటరీ ప్రపంచంలోనే అత్యంత లోతైన భూగర్భ ప్రయోగశాలగా ఇప్పటికే గుర్తింపు పొందింది.
‘డీప్ అండర్‌గ్రౌండ్ అండ్ అల్ట్రా లో రేడియేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఫెసిలిటీ’ పేరుతో సింఘువా యూనివర్సిటీ, యలాంగ్ రివర్ హైడ్రోపవర్ డెవలప్‌మెంట్ కంపెనీలు కలసి 2020 డిసెంబర్ నుంచి ఈ లాబొరేటరీ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నాయి. సిచువాన్ ప్రావిన్స్‌లోని జిన్‌పింగ్ పర్వతం దిగువన నిర్మానుష్య ప్రదేశంలో నిర్మిస్తున్న ఈ లాబొరేటరీ గురించిన వార్తలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
ఏకంగా 120 ఒలింపిక్ స్విమింగ్ పూల్స్‌తో సమానమైన లోతులో నిర్మిస్తున్న ఈ లాబొరేటరీ ఘన పరిమాణం 330,000 క్యూబిక్ మీటర్లు. చైనా నిర్మిస్తున్న ఈ లాబొరేటరీ విస్తీర్ణం ఇటలీలోని గ్రాన్ సాసో నేషనల్ లాబొరేటరీ కంటే ఎక్కువే! ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద అండర్‌గ్రౌండ్ లాబొరేటరీగా గుర్తింపు పొందిన గ్రాన్ సాసో లాబొరేటరీ చైనా దెబ్బకు రెండో స్థానానికి చేరుకుంది.
ఇంతకీ ఈ లోతైన భూగర్భ ప్రయోగశాలలో దేని గురించి అంత లోతైన పరిశోధనలు సాగిస్తారనుకుంటున్నారా? ఇక్కడ కృష్ణ పదార్థం (డార్క్ మేటర్) గురించి పరిశోధనలు సాగిస్తారట! అందువల్ల ఏమాత్రం సూర్యకిరణాలు సోకని రీతిలో, రేడియేషన్ ప్రభావం తాకని రీతిలో దీనిని నిర్మిస్తున్నారట!.
Comments
Please login to add a commentAdd a comment