సీసీఎంబీ స్థాయిలో ల్యాబొరేటరీ  | Laboratory at CCMB level | Sakshi
Sakshi News home page

సీసీఎంబీ స్థాయిలో ల్యాబొరేటరీ 

Published Tue, Oct 5 2021 3:51 AM | Last Updated on Tue, Oct 5 2021 10:47 AM

Laboratory at CCMB level - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద ల్యాబొరేటరీ ఏర్పాటు కాబోతోంది. ఇప్పటివరకూ క్లిష్టమైన నమూనాలను పూణె వైరాలజీ ల్యాబొరేటరీ లేదా సీసీఎంబీ (సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ–హైదరాబాద్‌)కు పంపించేవారు. ఇకపై ఈ స్థాయి ల్యాబొరేటరీని విజయవాడ సమీపంలో ఏర్పాటు చేయబోతున్నారు. తాజాగా ఎన్‌సీడీసీ (నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌) అధికారులు స్థల సేకరణకు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించి గన్నవరం విమానాశ్రయం వద్ద 3 ఎకరాల స్థలాన్ని మంజూరు చేసింది. ఈ ల్యాబొరేటరీ నిర్మాణానికి రూ. 15 కోట్ల నుంచి రూ. 20 కోట్ల వరకూ అవుతుందని అంచనా. దీన్ని రెండేళ్లలో అందుబాటులోకి తెస్తారు. పూర్తిస్థాయి నిర్మాణం తర్వాత ఇందులో 300 మందికి పైగా సిబ్బంది పనిచేయనున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో 14 వైరాలజీ ల్యాబొరేటరీలు అతి తక్కువ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 

ఉపయోగాలివే.. 
► ఈ ల్యాబొరేటరీలో అన్ని రకాల వైరస్‌లే కాదు, బ్యాక్టీరియా నమూనాలు, కీటకాలు, ఎల్లో ఫీవర్‌.. తదితర ఎలాంటి నమూనాలనైనా పరిశీలించవచ్చు.
► ప్రస్తుతం మన వద్ద మన రాష్ట్రంలో జినోమిక్‌ సీక్వెన్సీ ల్యాబ్‌ (వైరస్‌ ఉనికిని కనుక్కునే ల్యాబ్‌) లేదు. ఇకపై ఇలాంటి టెస్టులు ఇక్కడే చేసుకోవచ్చు. 
► గతంలో ఏలూరు పట్టణంలో వింత వ్యాధితో బాధితులు ఆస్పత్రికి వచ్చినప్పుడు నమూనాలు వివిధ రాష్ట్రాలకు పంపించాల్సి వచ్చింది. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు. ఎలాంటి టెస్టులైనా ఇక్కడే చేసుకోవచ్చు. 
► దీనికి సంబంధించిన నిర్మాణ వ్యయం, మానవ వనరులు కేంద్రం చూసుకుంటుంది. స్థలం మాత్రం ఏపీ సర్కారు ఇస్తుంది.

త్వరలోనే అవగాహన ఒప్పందం 
అతిపెద్ద ల్యాబొరేటరీ నిర్మాణానికి గన్నవరంలో 3 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం చూపించింది. రెండేళ్లలో అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటాం. త్వరలోనే అవగాహన ఒప్పందం చేసుకుంటాం. నిర్మాణం పూర్తయిన తర్వాత ఇతర రాష్ట్రాలకు నమూనాలు పంపించే పరిస్థితి ఉండదు. రకరకాల జబ్బుల ఉనికిని వీలైనంత త్వరగా తెలుసుకునే వీలుంటుంది.  
– డా.ఎం.అనురాధ, సీనియర్‌ రీజనల్‌ డైరెక్టర్, కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement