సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఇక నుంచి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అబార్షన్లకు అనుమతి ఉంటుంది. విచ్చలవిడి అబార్షన్ల (ఎంటీపీ–మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ)కు దేశవ్యాప్తంగా చెక్ పడనుంది. దీనిపై ఇప్పటికే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ, న్యాయ శాఖలు అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశాయి. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇదో పెద్ద వ్యాపారంగా మారిన నేపథ్యంలో 1971లో చేసిన చట్టానికి 2021లో సవరణ చేసి కొత్త చట్టాన్ని రూపొందించారు. కొత్త సవరణ చట్టం అమలుకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కసరత్తు మొదలుపెట్టింది. ఏటా రాష్ట్రంలో 7.50 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయి. ఇందులో 50 వేలకు పైగా అబార్షన్లు ఉంటున్నట్లు వైద్యుల అంచనా.
ఇక ప్రతి అబార్షన్ రికార్డుల్లోకి..
ఇకపై అబార్షన్ చట్ట నిబంధనలకు లోబడి చేయాల్సి ఉంటుంది. పైగా ప్రతి అబార్షన్ వివరాలను రికార్డుల్లో తప్పనిసరిగా నమోదు చేయాలి. కడుపులోని బిడ్డకు 20 వారాలకు మించి వయసుంటే అబార్షన్ చేయకూడదని గత చట్టంలో పేర్కొన్నారు. తాజా చట్టం ప్రకారం 24 వారాల వరకు పొడిగించారు. తల్లికి తీవ్ర మానసిక రుగ్మతలున్నా, అత్యాచారానికి గురైనా, కడుపులో అసాధారణ పరిస్థితుల్లో బిడ్డ ఉన్నా, కడుపులో బిడ్డ పెరగడం వల్ల తల్లి ప్రాణానికి ప్రమాదం ఉన్నా.. ఇలాంటి కేసుల్లో మాత్రమే 24 వారాల వరకు ప్రత్యేక పరిస్థితుల్లో అబార్షన్ చేయొచ్చు. మిగిలిన పరిస్థితుల్లో అబార్షన్ చేసినట్లు ఫిర్యాదులొస్తే సంబంధిత డాక్టరుపై కఠిన చర్యలు తీసుకుంటారు. అవసరమైతే డాక్టరు పట్టాను రద్దు చేయొచ్చు.
ప్రతి జిల్లాకో మెడికల్ బోర్డు
విచ్చలవిడి అబార్షన్లను అరికట్టేందుకు ప్రతి జిల్లాలో ముగ్గురు వైద్యులతో ఓ మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తున్నారు. వీరిలో గైనకాలజిస్ట్, పీడియాట్రిక్ వైద్యులు, రేడియాలజిస్ట్ లేదా సోనాలజిస్ట్ ఉంటారు. అబార్షన్ చేసే వైద్యులు రిజిష్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అయి ఉండాలి. ఎవరికైతే అబార్షన్ చేయాలో వారి వివరాలు, దానికి గల కారణాలు విధిగా పేర్కొని, బోర్డుకు నివేదిక ఇవ్వాలి. బాధితురాలి వయసు, ఆరోగ్య పరిస్థితులు, కడుపులో బిడ్డ వయసు విధిగా పేర్కొనాలి. కొత్త చట్టాన్ని త్వరలోనే అమలు చేయనున్నామని, దీనికి సంబంధించిన మెడికల్ బోర్డులు జిల్లాల వారీగా ఏర్పాటు చేస్తున్నామని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ హైమావతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment