సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఆరోగ్యశ్రీ అమలులో జవాబుదారీతనం, పారదర్శకత పెంపొందించడంలో భాగంగా పథకాన్ని మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అక్రమాలు, పొరపాట్లకు ఏమాత్రం తావుండరాదని స్పష్టం చేశారు. జూలై 26 లోగా వైద్య ఆరోగ్యశాఖలో నియామకాల ప్రక్రియను ముగించాలని నిర్దేశించారు. రిటైర్మెంట్, ఇతర కారణాలతో ఖాళీ అయిన పోస్టులను ఇకపై వెంటనే భర్తీ చేయాలన్నారు. సంస్కరణల ఫలితాలు సజావుగా అందాలంటే తగినంత మంది వైద్యులు, సిబ్బందిని నియమించడం తప్పనిసరన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో నాడు–నేడు కార్యక్రమాల పురోగతి, ఆరోగ్యశ్రీ అమలు తదితరాలపై మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ..
మొదటి రెఫరల్ పాయింట్‌గా విలేజ్ క్లినిక్
ఆరోగ్యశ్రీ ద్వారా సులభంగా చికిత్స పొందేలా రెఫరల్ విధానాన్ని బలోపేతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. మొదటి రెఫరల్ పాయింట్‌గా వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను అభివృద్ధి చేయాలని సూచించారు. ఆరోగ్యశ్రీ సేవల గురించి ప్రజలకు విస్తృతంగా తెలియచేసేలా విలేజ్ క్లినిక్‌లలో హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో అందే వైద్య సేవలు, ఏ జబ్బుకు ఏ ఆస్పత్రికి రెఫర్ చేయాలి? ఎలా రెఫర్ చేయాలి? తదితర వివరాలతో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్(ఎంఎల్‌హెచ్‌పీ), ఏఎన్‌ఎంలకు బుక్‌లెట్‌లు అందజేయాలన్నారు.
రోగి సంతకంతో కన్సెంట్, కన్ఫర్మేషన్
ఆరోగ్యశ్రీ పథకం అమలులో జవాబుదారీతనం, పారదర్శకత పెరిగేలా సీఎం జగన్ పలు సూచనలు చేశారు. చికిత్స అనంతరం డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లేప్పుడు సంబంధిత రోగికి ఆరోగ్యశ్రీ ద్వారా ఏ జబ్బుకు చికిత్స అందించాం? చికిత్సకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది? తదితర వివరాలను తెలియచేయాలని ఆదేశించారు. ఆస్పత్రిలో చికిత్స అందించేందుకు డబ్బులేమైనా డిమాండ్ చేశారా? వైద్య సేవలు ఎలా ఉన్నాయి? అనే విషయాలను ఆరా తీసి సేవల పట్ల రోగి సంతృప్తిగా ఉన్నాడో లేదో తెలుసుకోవాలన్నారు. ఈ మేరకు డిశ్చార్జి సమయంలో రోగి సంతకంతో సమ్మతి(కన్సెంట్), నిర్ధారణ (కన్ఫర్మేషన్) పత్రం తీసుకోవాలన్నారు. క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ఆస్పత్రులు వాటిని అప్‌లోడ్ చేయాలన్నారు.
వర్చువల్ ఖాతా ద్వారా చెల్లింపు
ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సకు సంబంధించి ప్రభుత్వం అందించే డబ్బులు నేరుగా ఆస్పత్రికి వెళ్లకుండా రోగి పేరిట వర్చువల్ ఖాతాను రూపొందించాలని సీఎం జగన్ ఆదేశించారు. రోగి సమ్మతి తీసుకుని ఈ ఖాతాకు తొలుత నేరుగా డబ్బులు జమ చేయాలన్నారు. అనంతరం ఆస్పత్రికి డబ్బులు బదిలీ చేయాలని నిర్దేశించారు. లబ్ధిదారుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతా విషయంలో ఎలాంటి సందేహాలు, భయాందోళనలు లేకుండా ఈ ప్రత్యేక వర్చువల్ అకౌంట్ ఉపయోగపడుతుందన్నారు.
వైఎస్సార్ ఆరోగ్య ఆసరాలో డబ్బులు నేరుగా రోగి వ్యక్తిగత ఖాతాకు డీబీటీ విధానంలో జమ చేస్తున్న పద్ధతినే కొనసాగించాలన్నారు. పథకం కింద సేవలు అందించడానికి ఆస్పత్రుల యాజమాన్యాలు అదనంగా డబ్బులు వసూలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ సేవలపై ఫిర్యాదులుంటే ఏ నెంబరుకు ఫోన్ చేయాలన్న విషయం ప్రతి రోగికి తెలిసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సచివాలయాల ద్వారా లేఖలు
ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన లబ్ధిదారులకు గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా లేఖలు పంపాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆ లేఖను వలంటీర్, ఏఎన్‌ఎంలు లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి అందజేసి ఆరోగ్యంపై ఆరా తీయాలని సూచించారు. లేఖలో పథకం ద్వారా లబ్ధిదారుడికి ప్రభుత్వం అందించిన సాయాన్ని తెలియజేయాలన్నారు.
చురుగ్గా ఆరోగ్యమిత్రలు
ఆరోగ్యశ్రీ పథకం అమలులో ఆరోగ్యమిత్రలు మరింత చురుగ్గా వ్యవహరించాలని సీఎం జగన్ సూచించారు. రోగి ఆస్పత్రిలో చేరిన దగ్గర నుంచి డిశ్చార్జి అయ్యేవరకూ అండగా, తోడుగా నిలవాలన్నారు. ప్రస్తుతం 2,446 చికిత్సలను పథకం కింద ఉచితంగా చేస్తున్నామన్నారు. అవసరమైన మేరకు చికిత్సా విధానాల సంఖ్యను పెంచాలన్నారు. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటే ప్రతి చికిత్సకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందించాలన్నారు.
సేవలు ఉచితంగా అందాలి..
108, 104, వైఎస్సార్ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలు ప్రజలకు ఉచితంగా అందాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. వీటిద్వారా సేవలు అందించడానికి ఎక్కడా లంచాలు వసూలు చేసే పరిస్థితి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా సిబ్బంది లంచం డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయాల్సిన ఫోన్ నెంబర్‌లను వాహనాలపై ప్రదర్శించాలన్నారు.
ఎక్కడా కొరత ఉండకూడదు
2019 నుంచి వైద్య శాఖలో 40,188 పోస్టులు భర్తీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరో 1,132 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. మండలానికి రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటులో భాగంగా 176 కొత్త పీహెచ్‌సీలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. వీటిల్లో పని చేయడానికి 2,072 మంది వైద్యులు, ఇతర సిబ్బంది అవసరం కాగా భవన నిర్మాణాలు పూర్తి కాగానే భర్తీ చేపడతామన్నారు.
వైఎస్సార్ విలేజ్ క్లినిక్ నుంచి బోధనాస్పత్రి వరకూ ఎక్కడా మానవ వనరుల కొరత ఉండకూడదని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అవసరం అయితే పదవీ విరమణ పొందిన వైద్యుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. వైద్యుల పదవీ విరమణ వయసు పెంపుపై పరిశీలన చేయాలని ఆదేశించారు. సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, సీఎస్ సమీర్‌శర్మ, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులు ఎం.టి.కృష్ణబాబు, ముద్దాడ రవిచంద్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి కె.వి.వి.సత్యనారాయణ, ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ డి.మురళీధర్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈవో వి.వినయ్‌చంద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment