‘విద్య, వైద్యం ప్రజలకు హక్కుగా లభించాలి. ఈ హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత. అందుకే అధికారంలోకి వచ్చిన రోజు నుంచే మన ప్రభుత్వం ఈ అంశాలపై విశేష కృషి చేసింది. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య పథకం కోసం ఇప్పటిదాకా దాదాపు రూ.12,000 కోట్లు, వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకం కోసం రూ.1,309 కోట్లు ఖర్చు చేశాం. 108, 104 అంబులెన్స్‌ల వ్యవస్థను బలోపేతం చేసేందుకు మరో రూ.750 కోట్లు వెచ్చించాం. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకు వేస్తూ.. ఆరోగ్య శ్రీ కింద రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించేందుకు శ్రీకారం చుడుతున్నాం.
– సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : నిరుపేద, మధ్య తరగతి కుటుంబాల ప్రజలకు ఉచిత వైద్య సేవల కల్పన విషయంలో అత్యంత మానవీయ దృక్పథంతో మనందరి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ క్రమంలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చామని స్పష్టం చేశారు. ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు వచ్చినా సరే ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తుందన్నారు. ప్రజారోగ్య రంగంలోనే ఇది చరిత్రాత్మక నిర్ణయమని ఉద్ఘాటించారు.
తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఆయన వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రూ.25 లక్షల వరకు వైద్యం ఉచితంగా లభిస్తుందని తెలియజేయండి. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన అనంతరం వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చికిత్స చేయించుకున్న వారు తిరిగి ఫాలో అప్ చెకప్ కోసం డాక్టర్ వద్దకు వెళ్లేలా చూడాలి. ఇందులో భాగంగా ఫాలో అప్ కన్సల్టేషన్ కోసం రవాణా చార్జీల కింద రూ.300 చొప్పున అందజేయండి.
మరోవైపు జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల నుంచి ఆస్పత్రులకు రెఫర్ చేసిన వారికి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. వీరు ఆస్పత్రులకు వెళ్లడం కోసం రవాణా చార్జీల కింద రూ.500 చొప్పున అందిస్తున్నాం. మరో విషయం ఏమిటంటే.. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా? అనే దానిపై రూపొందించిన వీడియో అందరికీ చేరేలా చూడండి. ఆరోగ్య సిబ్బంది, వలంటీర్లు, సచివాలయ సిబ్బంది సహా ప్రజలందరికీ ఈ వీడియోను అందుబాటులో ఉంచాలి’ అని ఆదేశించారు.
కిడ్నీ రోగులకు బాసటగా నిలవాలి
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగులకు అందుతున్న వైద్య సేవలు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. స్క్రీనింగ్, మందులు, చికిత్స తదితర అంశాల్లో రోగులకు బాసటగా నిలవాలన్నారు. డయాలసిస్‌పై ఉన్న రోగులు వాడుతున్న మందులు గ్రామ స్థాయిలో వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్‌లో అందుబాటులోకి తీసుకురావాలని, ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంతో అనుసంధానం చేసి.. బాధితుల ఆరోగ్యంపై వాకబు చేయాలని సూచించారు.
మార్కాపురంలోనూ పలాస తరహా వైద్య చికిత్స సౌకర్యాలు అందుబాటులోకి తేవాలన్నారు. కొత్తగా కడుతున్న మెడికల్ కాలేజీలో ఇప్పటికే నెఫ్రాలజీ విభాగం కోసం ఉత్తర్వులు ఇచ్చామని చెప్పారు. దీంతో పాటు యూరాలజీ విభాగం కూడా తీసుకురావాలని, ప్రభుత్వాస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల కొరతకు తావు లేకుండా చూడాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో పనిచేసే స్పెషలిస్ట్ డాక్టర్ కోసం అవసరమైన చోట క్వార్టర్‌లను నిర్మించాలని సూచించారు.
18న సీఎం చేతుల మీదుగా ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఈ నెల 18వ తేదీన ప్రారంభించనుంది. 19వ తేదీ నుంచి ప్రతి నియోజకవర్గంలో 5 గ్రామాల చొప్పున జరిగే కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. మండలంలో వారానికి నాలుగు గ్రామాల చొప్పున కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపడతారు. ప్రతి ఇంటికీ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ చేపట్టి, జనవరి నెలాఖరుకు పూర్తి చేయనున్నారు.
ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఎలా వైద్యం పొందవచ్చనే దానిపై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఏఎన్‌ఎం, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో), ఆశా వర్కర్లు, వలంటీర్లు, మహిళా పోలీసులు ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ సహా, పథకంపై అవగాహన పెంచే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆరోగ్యశ్రీ మొబైల్ యాప్‌ను ప్రజల సెల్‌ఫోన్‌లలో డౌన్లోడ్ చేసి, యాప్ ద్వారా కలిగే ప్రయోజనాలను వివరిస్తారు. పనిలో పనిగా దిశ యాప్‌ను కూడా డౌన్లోడ్ చేస్తారు. ఇదిలా ఉండగా జనవరి ఒకటో తేదీ నుంచి ఫేజ్–2 జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది.
ప్రతివారం మండలానికి ఒక గ్రామ సచివాలయం, పట్టణ ప్రాంతాల్లో ఒక వార్డు పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం నిర్వహించనున్నారు. జిల్లాల్లో సగం మండలాల్లో మంగళవారం, సగం మండలాల్లో శుక్రవారం శిబిరాల నిర్వహణ ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో బుధవారం నిర్వహిస్తారు. వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఆరోగ్యశ్రీ సీఈవో బాలాజీ పాల్గొన్నారు.
ఆరోగ్యానికి మరింత భరోసా
Published Thu, Dec 14 2023 4:22 AM | Last Updated on Thu, Dec 14 2023 3:51 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment