
సాక్షి, అమరావతి: పేద, మధ్యతరగతి ప్రజలకు సంజీవని అయిన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరింత బలోపేతం చేయబోతోంది. పథకంలో చికిత్సల సంఖ్యను పెంచడానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2007లో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆయన హఠాన్మరణంతో తర్వాతి ప్రభుత్వాలు పథకాన్ని నిర్వర్యం చేశాయి. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ పథకాన్ని బలోపేతం చేస్తూ అనేక సంస్కరణలు చేపట్టింది. ఇందులో భాగంగా.. పథకం పరిధిని గతంలో ఎన్నడూలేని విధంగా విస్తరించింది. అయితే, అక్కడితో ఆగకుండా పథకంపై నిరంతరం సమీక్ష జరుపుతూ అవసరమైతే కొత్త చికిత్సలను చేర్చాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
కొత్తగా 700 చికిత్సలు
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే పథకం వర్తించేది. కానీ, 2019 అనంతరం రూ.ఐదు లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ పథకం పరిధిలోకి తెచ్చారు. దీంతో రాష్ట్రంలో 1.40 కోట్ల కుటుంబాలకు ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి. అలాగే, పథకం కింద టీడీపీ హయాంలో 919 ఆస్పత్రుల్లో మాత్రమే చికిత్స అందించేవారు. ఇందులో 79 పొరుగు రాష్ట్రాల్లో ఉండేవి. వీటిలోను వైద్యం అరకొరగానే అందేది. కానీ, ప్రస్తుతం ఈ పథకం కింద 1,700లకు పైగా ఆస్పత్రుల్లో ప్రజలకు ఉచితంగా వైద్యసేవలు అందుతున్నాయి.
ఇందులో పొరుగు రాష్ట్రాల్లోని 137 ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులు, 17 సూపర్ స్పెషాలిటీల్లో వైద్య సేవలు ఉచితంగా అందుతున్నాయి. ఇక 2019కి ముందు ఆరోగ్యశ్రీ పథకం కింద 1,059 రకాల చికిత్సలు అందుతుండేవి. అదే నేడు వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే చాలు ఈ పథకం భరోసా ఇస్తోంది. కరోనా చికిత్సను పథకం పరిధిలోకి తేవడంతో పాటు, బ్లాక్‌ఫంగస్, మిస్–సి వంటి జబ్బులనూ ఇందులో చేర్చడంతో ప్రజలపై పెనుభారం తప్పింది. ఇలా ఇప్పటికే 2,446 చికిత్సలు ఈ పథకంలో ఉన్నాయి. తాజాగా.. మరో 700 చికిత్సలను పథకంలో చేర్చడానికి కసరత్తు జరుగుతోంది. దీంతో త్వరలో చికిత్సల సంఖ్య మూడు వేలు దాటనున్నాయి.
‘ఆసరా’గా నిలుస్తున్న ప్రభుత్వం
పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఎవరైనా జబ్బుచేసి మంచానికి పరిమితమైతే ఆ సమయంలో వారి పోషణకు మిగిలిన కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను గుర్తించిన వైఎస్ జగన్ సర్కారు ‘ఆరోగ్య ఆసరా’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 1,519 రకాల చికిత్సల్లో ఏదైనా చేయించుకున్న వారికి వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తే రోజుకు రూ.225.. లేదా గరిష్టంగా నెలకు రూ.5వేలు చొప్పున భృతి అందిస్తోంది. ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకూ దాదాపు 10 లక్షల మందికి ప్రభుత్వం ఆర్థికసాయం చేసింది. ఇక దీనిపై వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈఓ హరీంద్రప్రసాద్ స్పందిస్తూ.. పథకంలో మరికొన్ని చికిత్సలను చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపుతున్నట్లు ఆయన చెప్పారు.