CM YS Jagan Review on Rural Medical Services, YSR Aarogya Sri Scheme - Sakshi
Sakshi News home page

పల్లెకు ‘ఫ్యామిలీ డాక్టర్‌’

Published Thu, Jul 14 2022 3:09 AM | Last Updated on Thu, Jul 14 2022 3:10 PM

CM YS Jagan on rural medical services YSR Aarogya Sri Scheme - Sakshi

సాక్షి, అమరావతి: గ్రామీణ వైద్యసేవల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమవుతోంది. స్వాత్రంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి మారుమూల పల్లెల్లో సైతం ప్రజలను పరామర్శిస్తూ వ్యక్తిగత శ్రద్ధతో డాక్టర్లు వైద్య సేవలందించేలా భారీ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి మరిన్ని చికిత్సలను చేర్చడంతోపాటు గ్రామీణ ప్రజలకు వ్యక్తిగత శ్రద్ధతో సొంత ఊరిలోనే మెరుగైన వైద్యం అందించే ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను విస్తృతంగా దశలవారీగా అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా ఆరోగ్యశ్రీలో సంస్కరణలు, నాడు–నేడు పనుల పురోగతి, రాష్ట్రంలో కరోనా పరిస్థితి తదితర అంశాలను పరిశీలించి సీఎం జగన్‌ పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ...
వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

రోగి వర్చువల్‌ ఖాతా నుంచి ఆస్పత్రికి
గత సర్కారు హయాంలో ఆరోగ్యశ్రీ ద్వారా కేవలం 1,059 చికిత్సలు మాత్రమే అందగా మన ప్రభుత్వం వాటిని 2,446కి పెంచింది. ఇప్పుడు చికిత్సల సంఖ్యను 3,000కిపైగా పెంచుతున్నాం. ఆగస్టు 1వతేదీ నుంచి పెంచిన చికిత్సలను పథకంలోకి చేర్చాలి. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో చేరే ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు వర్చువల్‌ బ్యాంకు ఖాతాలు తెరవాలి. చికిత్స అందించిన నెట్‌వర్క్‌ ఆస్పత్రికి చెల్లించాల్సిన డబ్బులు తొలుత నేరుగా రోగి వర్చువల్‌ ఖాతాలోకి జమ చేయాలి. అనంతరం ఆస్పత్రికి బదిలీ కావాలి.

ఈమేరకు పథకం కింద చికిత్స పొందిన రోగి నుంచి సమ్మతి (కన్సెంట్‌) పత్రం తీసుకోవాలి. ఏ జబ్బుకు చికిత్స అందించాం? ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది? అనే వివరాలు అందులో రోగికి తెలియజేయాలి. వైద్యం అందించేందుకు ఆస్పత్రిలో ఎవరైనా డబ్బుల వసూళ్లకు పాల్పడ్డారా? సేవలు ఎలా అందించారు? అనే విషయాలపై స్పష్టత తీసుకోవాలి. పథకం కింద చికిత్స అందించేందుకు ఎవరైనా లంచం డిమాండ్‌ చేస్తే ఫిర్యాదు చేసేందుకు ఏసీబీ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 14400, వైద్య సేవలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం 104 నంబర్‌ అందులో పొందుపరచాలి.

ఇంటికి వెళ్లి పరామర్శించాలి..
డిశ్చార్జి అనంతరం ఇంటికి వెళ్లిన రోగి ఆరోగ్యంపై కూడా మనం వాకబు చేయాలి. డిశ్చార్జి అయిన వారం రోజులకు  క్షేత్ర స్థాయి ఆరోగ్య శాఖ సిబ్బంది ఆ వ్యక్తి ఇంటికి వెళ్లాలి. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయాలి. చికిత్స అనంతరం ఏమైనా సమస్యలు తలెత్తాయా? అనే విషయాలు తెలుసుకోవాలి. మరింత వైద్య సాయం అవసరమైన పక్షంలో సమన్వయం చేసుకుని అందేలా చూడాలి. రోగికి అందిన సేవలు, అదనంగా కావాల్సిన మందులు, తదితర అంశాలపై ఫోన్‌కాల్‌ ద్వారా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలి.

ఎలాంటి ఇబ్బంది ఎదురైనా..
108, 104 సేవలు పొందేందుకు ప్రజలు లంచాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితులకు తావుండరాదు. అందుకు అనుగుణంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. ప్రతి వాహనంపై ఫిర్యాదు నంబర్‌ ప్రదర్శించాలి. సేవలు పొందడంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తినా ఫిర్యాదును స్వీకరించాలి. వాటిని సకాలంలో పరిష్కరించాలి.  

నెలాఖరు నుంచి నర్సీపట్నం వైద్య కళాశాల పనులు 
రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న 16 వైద్య కళాశాలల్లో 14 చోట్ల పనులు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. నర్సీపట్నంలో కళాశాల నిర్మాణ పనులను ఈ నెలాఖరు నుంచి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 

అదుపులోనే కరోనా
రాష్ట్రంలో కరోనా పూర్తిగా అదుపులో ఉందని అధికారులు తెలిపారు. అక్కడక్కడా కోవిడ్‌ కేసులున్నా ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య అత్యంత స్వల్పమని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,042 కరోనా యాక్టివ్‌ కేసులుండగా కేవలం 69 మంది మాత్రమే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో ప్రికాషన్‌ డోసుకు అర్హులైన 60.01 లక్షల మందిలో ఇప్పటికే 52.3 లక్షల మందికి టీకాలిచ్చామన్నారు. 15 – 17 ఏళ్ల వయసు వారికి రెండు డోసుల వ్యాక్సినేషన్‌ 99.69 శాతం పూర్తైందని వెల్లడించారు. 12–14 ఏళ్ల పిల్లల్లో 98.93 శాతం మందికి రెండు డోసుల టీకాలిచ్చామన్నారు. ప్రికాషన్‌ డోసు వ్యవధిని తగ్గించినందున మరింత ముమ్మరంగా చేపట్టి 60 ఏళ్లు దాటిన వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం జగన్‌ సూచించారు.

నాణ్యమైన వైద్యమే లక్ష్యం
ఆస్పత్రుల సామర్థ్యానికి సరిపడా వైద్యులు, సిబ్బంది నియామకాలను చేపట్టి ఇప్పటికే 40,476 పోస్టులను భర్తీ చేశామని అధికారులు తెలిపారు. ఈ నెలాఖరులోగా మిగతా నియామకాలు కూడా పూర్తి చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌ నుంచి బోధనాసుపత్రుల వరకు నిర్దేశిత సంఖ్యకు అనుగుణంగా వైద్య సిబ్బంది ఉండాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎక్కడా లోటుపాట్లు ఉండరాదని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఇందులో భాగంగానే వైద్య ఆరోగ్య శాఖలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, సీఎస్‌ సమీర్‌శర్మ, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ప్రత్యేక కార్యదర్శి జి.ఎస్‌.నవీన్‌కుమార్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో వినయ్‌చంద్, ఏపీఎంస్‌ఐడీసీ చైర్మన్‌ చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ మురళీధర్‌రెడ్డి, వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ వినోద్‌కుమార్, ఔషధ నియంత్రణ విభాగం డీజీ రవిశంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

వ్యక్తిగత శ్రద్ధతో వైద్యం
► ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ద్వారా వైద్యులు ప్రతి గ్రామానికి నెలలో రెండుసార్లు 104 వాహనంలో వెళ్లి వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని ప్రజలకు సేవలందిస్తారు. 
► ప్రాథమిక వైద్యాన్ని బలోపేతం చేయడంలో భాగంగా మండలానికి రెండు పీహెచ్‌సీలను ఏర్పాటు చేసి నలుగురు డాక్టర్ల చొప్పున ప్రభుత్వం నియమిస్తోంది. ఇద్దరు డాక్టర్లు పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉండగా మిగతా ఇద్దరు 104 వాహనంలో గ్రామాలకు చేరుకుని వ్యక్తిగత శ్రద్ధతో వైద్య సేవలు అందచేస్తారు.
► వయోభారం, అనారోగ్య సమస్యలతో మంచానికే పరిమితమైన వారికి ఇది ఎంతో ఉపయుక్తం.
► 104 వాహనాలు రెండేళ్ల వ్యవధిలో 1.49 కోట్ల మందికిపైగా సేవలు అందించాయి. 
► 20 రకాల వైద్యసేవలు, 8 రకాల వైద్యపరీక్షలు వీటి ద్వారా ఉచితంగా నిర్వహిస్తున్నారు. 
► ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సగటున రోజూ 40 వేల మందికి సేవలు అందుతున్నాయి. మధ్యాహ్నం వరకు ఓపీ చూసి తరువాత వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్య బాధితుల ఇంటి వద్దకే వెళ్లి సేవలు అందిస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement