'ఆరోగ్యశ్రీయే అండ' | Free corporate medicine for 40 lakh people in four years with Aarogyasri | Sakshi
Sakshi News home page

ఈ రాష్ట్రంలో గుండె గుండెకూ తెలుసు 'ఆరోగ్యశ్రీయే అండ'

Published Mon, Jul 3 2023 3:54 AM | Last Updated on Mon, Jul 3 2023 11:54 AM

Free corporate medicine for 40 lakh people in four years with Aarogyasri - Sakshi

ఈ ఫొటోలో మంచంపై ఉన్న కృష్ణా జిల్లా కంకటావ గ్రామానికి చెందిన ఎన్‌.శివ ఆటో డ్రైవర్‌. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరగా బ్లడ్‌ క్యాన్సర్‌గా వైద్యులు నిర్ధారించారు. సంపాదించే కుటుంబ పెద్ద మంచం పట్టడంతో ఇంట్లోవారు తల్లడిల్లారు. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం అందుతుందని తెలియడంతో శివ భార్య భ్రమరాంబ విజయవాడలోని హెచ్‌సీజీ క్యాన్సర్‌ ఆస్పత్రిని సంప్రదించింది. నాలుగు నెలలుగా శివకు అక్కడ ఉచితంగా వైద్యం అందుతోంది. ఇప్పటివరకు రూ.రెండు లక్షలకు పైగా ప్రభుత్వమే చెల్లించింది. కష్టకాలంలో ఆరోగ్యశ్రీ తమ కుటుంబాన్ని ఆదుకుందని భ్రమరాంబ చేతులు జోడిస్తోంది.

ఈ ఫొటోలో కనిపిస్తున్న కూరా సాహూ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం అరకబద్ర గ్రామవాసి. రెక్కాడితే గానీ డొక్కాడని పేద కుటుంబం. ఇంటి వద్ద చిన్న కొట్టు నిర్వహిస్తున్నాడు. 2020 డిసెంబర్‌ 23 అర్ధరాత్రి సమయంలో ఛాతీ నొప్పి రావడంతో బరంపురం ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. వెంటనే గుండె ఆపరేషన్‌ చేయాలని చెప్పడంతో చేతిలో చిల్లి గవ్వలేని కుటుంబ సభ్యులకు దిక్కు తోచలేదు. కొందరు ఆరోగ్యశ్రీ గురించి చెప్పడంతో విశాఖ తరలించారు. అక్కడ ఉచితంగా గుండె ఆపరేషన్‌తోపాటు ఇంటికి వెళ్లేప్పుడు ఉచితంగా మందులు, రూ.5 వేలు అందించారు. కోలుకున్న సాహూ యథావిధిగా షాప్‌ నిర్వహిస్తున్నాడు. ఆరోగ్యశ్రీ పథకం లేకుంటే తాను ప్రాణాలతో ఉండేవాడిని కాదేమో అని చెబుతున్నాడు. 

సాక్షి, అమరావతి: ఆపద కాలంలో ఆపద్బాంధవిలా ఆదుకుంటూ డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పునర్జన్మను ప్రసాదిస్తోంది. ఈ పథకం ద్వారా నాలుగేళ్లలో దాదాపు 40 లక్షల మందికి ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించడం, నెట్‌వర్క్‌ ఆస్పత్రుల సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరగడమే ఇందుకు నిదర్శనం. అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీకి ఊపిరిలూదుతూ చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత సర్కారు బకాయి పెట్టిన రూ.631 కోట్లను నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు చెల్లించారు.

ప్రొసీజర్ల సంఖ్యను ఏకంగా మూడు రెట్లకుపైగా పెంచారు. దీంతో ఎంత పెద్ద జబ్బుకైనా చేతి నుంచి చిల్లి గవ్వ ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం ఉచితంగా అందుతోంది. చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటితే ఉచితంగా వైద్యం అందించడంతోపాటు శస్త్ర చికిత్సల అనంతరం రోగి కోలుకునే సమయంలో ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలుస్తోంది. వైద్యులు సూచించిన మేరకు విశ్రాంతి సమయంలో ‘డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా’ ద్వారా సాయం అందిస్తున్నారు.  

వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరాకి వెయ్యి కోట్లు 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ ఏడాది మే నెలాఖరు నాటికి ఆరోగ్యశ్రీ పథకం కింద 39,97,617 మంది ఉచితంగా వైద్యం అందుకున్నారు. వీరికి వైద్యం కోసం ప్రభుత్వం రూ.7,949.76 కోట్లు ఖర్చు చేసింది. ఇక వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా కోసం రూ.1,074.69 కోట్లను వెచ్చించింది. ఇలా ఇప్పటిదాకా పథకం కోసం రూ.9,024.45 కోట్లు  వ్యయం చేసింది. 2014–19 మధ్య టీడీపీ హయాంలో పథకం కోసం రూ.5,177.38 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఆరోగ్యశ్రీకి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో వెచ్చించిన మొత్తంతో పోలిస్తే ఐదేళ్లలో టీడీపీ సర్కారు 57.37 శాతం మాత్రమే ఖర్చు చేసింది.
 
కరోనాను పథకంలోకి తెచ్చిన తొలి ప్రభుత్వం 
కోవిడ్‌ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి ప్రజలకు ఊరట కల్పించింది. వైరస్‌ బారిన పడ్డ 2.06 లక్షల మందికి ఉచితంగా చికిత్స అందించి ఇప్పటివరకు రూ.743.75 కోట్లు ఖర్చు చేసింది.   

అదనంగా 2,198 ప్రొసీజర్లు.. మొత్తం 3,257 
ప్రజారోగ్యానికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి జగన్‌ వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటే ప్రతి చికిత్సకు ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేస్తామని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. టీడీపీ హయాంలో కేవలం 1,059 ప్రొసీజర్లతో ఆరోగ్యశ్రీని నీరుగార్చగా సీఎం జగన్‌ అధికారంలోకి రాగానే 2020 జనవరిలో ప్రొసీజర్లను తొలుత 2,059కి పెంచారు. అదే ఏడాది జూలైలో 2,200కు ప్రొసీజర్లను పెంచి మరింత ప్రయోజనం చేకూర్చారు. తద్వారా 54 క్యాన్సర్‌ చికిత్సలు పథకం ద్వారా అందుబాటులోకి వచ్చాయి.

2020 నవంబర్‌లో బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సహా 235 చికిత్సలతో ప్రొసీజర్ల సంఖ్యను 2,436కి పెంచారు. 2021 మే, జూన్‌ నెలల్లో పది రకాల కరోనా వైరస్‌ చికిత్సలను పథకంలో చేర్చడంతో 2446కు ప్రొసీజర్స్‌ పెరిగాయి. గతేడాది మరో 809 చేర్చడంతో ఆరోగ్యశ్రీ పథకంలో ప్రొసీజర్లు 3,255కి చేరుకున్నాయి. గర్భిణులకు ఉచితంగా ‘టిఫా స్కాన్‌’ సేవలు అందించడం కోసం మరో రెండు ప్రొసీజర్లను ఇటీవలే పథకంలో చేర్చారు. ఇలా 2019 నుంచి ఇప్పటిదాకా 2,198 ప్రొసీజర్లను పథకంలో అదనంగా చేర్చి మొత్తం 3,257 ప్రొసీజర్లతో ఆరోగ్యశ్రీ పథకాన్ని సమర్థంగా అమలు చేస్తున్నారు.  

చికిత్సానంతరం అండగా 
వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా ద్వారా 1,519 ప్రొసీజర్లకు వైద్యులు సూచించిన మేరకు విశ్రాంతి సమయంలో రోగులకు రోజుకు రూ.225 లేదా నెలకు గరిష్టంగా రూ.ఐదు వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందచేస్తోంది. రోగి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రోజే బ్యాంకు ఖాతాలో ఆసరా మొత్తాన్ని జమ చేస్తున్నారు. 2019 డిసెంబర్‌ 12వతేదీ నుంచి ఈ ఏడాది మే నెలాఖరు వరకూ 17,25,238 మందికి రూ.1,074.69 కోట్ల మేర ఆరోగ్య ఆసరా ద్వారా సాయం అందింది. 

రోగి సంతృప్తే లక్ష్యం 
ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందే రోగుల సంతృప్తే లక్ష్యంగా పథకాన్ని సీఎం జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా పలు కీలక సంస్కరణలు చేపట్టారు. చికిత్స అనంతరం రోగుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుని వారు సంతృప్తి చెందినట్టు తెలిపితేనే ఆస్పత్రులకు బిల్లుల చెల్లింపులు చేపడుతున్నారు. డిశ్చార్జి సమయంలో ప్రతి రోగి నుంచి కన్సెంట్‌ ఫామ్‌ తీసుకుంటున్నారు. అంతేకాకుండా రోగి ఖాతా నుంచి ఆస్పత్రులకు బిల్లుల చెల్లింపు విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో పాటు సేవల్లో సమస్యలుంటే ఫిర్యాదు చేయడానికి 104 కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. డిశ్చార్జి అనంతరం ఏఎన్‌ఎంలు రోగుల ఇళ్లకు వెళ్లి యోగక్షేమాలను తెలుసుకుటున్నారు. ఆరోగ్యంపై ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటున్నారు.  

మా బాబు మాట్లాడుతున్నాడు.. 
ఐదేళ్ల వయసున్న మా బాబుకు పుట్టుకతోనే వినికిడి లోపం ఉంది. రూ.లక్షలు ఖర్చు చేసి శస్త్ర చికిత్స చేయించే  స్తోమత మాకు లేదు. ఆరోగ్యశ్రీ పథకం కింద కడప ఆస్పత్రిలో కాక్లియర్‌ ఇంప్లాంటేషన్‌ సర్జరీ ఉచితంగా చేశారు.  రూ.10 లక్షలకు పైగా విలువైన సర్జరీని రూపాయి ఖర్చు లేకుండా చేశారు. ఈరోజు మా బాబు మాట్లాడటం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం.    
    – వెంకటేశ్వర్లు, రేవతి, రాజంపేట, అన్నమయ్య జిల్లా 

క్యాన్సర్‌కు ఉచితంగా చికిత్స 
2020లో అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరగా బ్లాడర్‌ క్యాన్సర్‌గా నిర్ధారించారు. చికిత్సకు రూ.3 లక్షలకు పైనే ఖర్చవుతుందని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్‌ చికిత్స అందించే ఆస్పత్రికి వెళ్లడంతో రూపాయి ఖర్చు లేకుండా కీమోథెరపీ, రేడియో థెరపీతో రెండు చికిత్సలు అందించి మందులు కూడా ఉచితంగా ఇచ్చారు. ఆసరా కింద ప్రభుత్వం రూ.ఏడు వేలు అందించింది. క్యాన్సర్‌ చికిత్స ఖర్చు తలచుకుని ఎంతో ఎంతో భయపడ్డా.  రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందటాన్ని నమ్మలేకపోతున్నా.  
    – మారెన్న, బూదేడు గ్రామం, అనంతపురం జిల్లా 

ఆలస్యం లేకుండా వైద్యం 
భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసే నాకు ఇటీవల గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు కర్నూలులోని మెడికవర్‌ ఆసుపత్రిలో చేర్చారు. అదేరోజు వెంటనే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా బైపాస్‌ సర్జరీ చేశారు. డిశ్చార్జ్‌ అయ్యాక ఇంట్లో విశ్రాంతి తీసుకునే సమయంలో రూ.9,500 నా ఖాతాలో జమ అయింది. ఈ డబ్బులతో ప్రస్తుతం నా కుటుంబం జీవనం సాగిస్తోంది.    
    – మండల ఆంజనేయులు, ఆదోని, కర్నూలు జిల్లా 

అత్యధిక ప్రాధాన్యం
ఆరోగ్యశ్రీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. గ్రీన్‌ చానల్‌లో నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు వేగంగా బిల్లులు చెల్లిస్తున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఏమాత్రం రాజీపడకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చర్యలు తీసుకున్నారు. ప్రొసీజర్ల  సంఖ్యను భారీగా పెంచడంతో ప్రజలకు వైద్య ఖర్చుల భారం తగ్గింది.
 – డాక్టర్‌ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, ఏపీ ఆరోగ్యశ్రీ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల అసోసియేషన్‌ అధ్యక్షుడు     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement