Heart operations
-
నిమ్స్‌లో చిన్నారుల గుండె ఆపరేషన్లు విజయవంతం
హైదరాబాద్: నిజాం వైద్య విజ్ఞాన సంస్ధ(నిమ్స్) చార్లీస్ హార్ట్ హీరోస్ పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో తొలి రోజు నలుగురు చిన్నారులకు ఉచితంగా గుండె సంబందిత శస్త్ర చికిత్సలు చేశారు. సోమవారం లండన్‌కు చెందిన గుండె వైద్యనిపుణులు డాక్టర్ రమణ ధన్నపునేని ఆధ్వర్యంలో నిమ్స్ కార్డియా థొరాసిక్ సర్జరీ విభాగం వైద్యులు నీలోఫర్ వైద్యులతో కలిసి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఖమ్మం జిల్లాకు చెందిన లింగాల అవని(04), చత్తీస్‌ఘడ్‌కు చెందిన నిత్య(03), భువనగిరికి చెందిన యోగేష్(07), సిరిసిల్లకు చెందిన లక్ష్మీ ప్రసన్న(07)లకు ఆపరేషన్లు చేశారు. అనంతరం వారిని వార్డుకు తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. నిరుపేద చిన్నారుల ప్రాధాన్యత క్రమంలో శస్త్ర చికిత్సలు చేయనున్నట్లు నిమ్స్ కార్డియా థోరాసిక్ సర్జరీ విభాగం హెచ్ఓడి డాక్టర్ ఎం. అమరేష్‌రావు అన్నారు. ఇందులో భాగంగా మంగళవారం మరో ముగ్గురికి గుండె ఆపరేషన్లు చేయనున్నట్లు తెలిపారు. -
'ఆరోగ్యశ్రీయే అండ'
ఈ ఫొటోలో మంచంపై ఉన్న కృష్ణా జిల్లా కంకటావ గ్రామానికి చెందిన ఎన్.శివ ఆటో డ్రైవర్. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరగా బ్లడ్ క్యాన్సర్‌గా వైద్యులు నిర్ధారించారు. సంపాదించే కుటుంబ పెద్ద మంచం పట్టడంతో ఇంట్లోవారు తల్లడిల్లారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం అందుతుందని తెలియడంతో శివ భార్య భ్రమరాంబ విజయవాడలోని హెచ్‌సీజీ క్యాన్సర్ ఆస్పత్రిని సంప్రదించింది. నాలుగు నెలలుగా శివకు అక్కడ ఉచితంగా వైద్యం అందుతోంది. ఇప్పటివరకు రూ.రెండు లక్షలకు పైగా ప్రభుత్వమే చెల్లించింది. కష్టకాలంలో ఆరోగ్యశ్రీ తమ కుటుంబాన్ని ఆదుకుందని భ్రమరాంబ చేతులు జోడిస్తోంది. ఈ ఫొటోలో కనిపిస్తున్న కూరా సాహూ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం అరకబద్ర గ్రామవాసి. రెక్కాడితే గానీ డొక్కాడని పేద కుటుంబం. ఇంటి వద్ద చిన్న కొట్టు నిర్వహిస్తున్నాడు. 2020 డిసెంబర్ 23 అర్ధరాత్రి సమయంలో ఛాతీ నొప్పి రావడంతో బరంపురం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వెంటనే గుండె ఆపరేషన్ చేయాలని చెప్పడంతో చేతిలో చిల్లి గవ్వలేని కుటుంబ సభ్యులకు దిక్కు తోచలేదు. కొందరు ఆరోగ్యశ్రీ గురించి చెప్పడంతో విశాఖ తరలించారు. అక్కడ ఉచితంగా గుండె ఆపరేషన్‌తోపాటు ఇంటికి వెళ్లేప్పుడు ఉచితంగా మందులు, రూ.5 వేలు అందించారు. కోలుకున్న సాహూ యథావిధిగా షాప్ నిర్వహిస్తున్నాడు. ఆరోగ్యశ్రీ పథకం లేకుంటే తాను ప్రాణాలతో ఉండేవాడిని కాదేమో అని చెబుతున్నాడు. సాక్షి, అమరావతి: ఆపద కాలంలో ఆపద్బాంధవిలా ఆదుకుంటూ డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పునర్జన్మను ప్రసాదిస్తోంది. ఈ పథకం ద్వారా నాలుగేళ్లలో దాదాపు 40 లక్షల మందికి ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించడం, నెట్వర్క్ ఆస్పత్రుల సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరగడమే ఇందుకు నిదర్శనం. అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీకి ఊపిరిలూదుతూ చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత సర్కారు బకాయి పెట్టిన రూ.631 కోట్లను నెట్వర్క్ ఆస్పత్రులకు చెల్లించారు. ప్రొసీజర్ల సంఖ్యను ఏకంగా మూడు రెట్లకుపైగా పెంచారు. దీంతో ఎంత పెద్ద జబ్బుకైనా చేతి నుంచి చిల్లి గవ్వ ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం ఉచితంగా అందుతోంది. చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటితే ఉచితంగా వైద్యం అందించడంతోపాటు శస్త్ర చికిత్సల అనంతరం రోగి కోలుకునే సమయంలో ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలుస్తోంది. వైద్యులు సూచించిన మేరకు విశ్రాంతి సమయంలో ‘డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా’ ద్వారా సాయం అందిస్తున్నారు. వైఎస్సార్ ఆరోగ్య ఆసరాకి వెయ్యి కోట్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ ఏడాది మే నెలాఖరు నాటికి ఆరోగ్యశ్రీ పథకం కింద 39,97,617 మంది ఉచితంగా వైద్యం అందుకున్నారు. వీరికి వైద్యం కోసం ప్రభుత్వం రూ.7,949.76 కోట్లు ఖర్చు చేసింది. ఇక వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కోసం రూ.1,074.69 కోట్లను వెచ్చించింది. ఇలా ఇప్పటిదాకా పథకం కోసం రూ.9,024.45 కోట్లు వ్యయం చేసింది. 2014–19 మధ్య టీడీపీ హయాంలో పథకం కోసం రూ.5,177.38 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఆరోగ్యశ్రీకి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో వెచ్చించిన మొత్తంతో పోలిస్తే ఐదేళ్లలో టీడీపీ సర్కారు 57.37 శాతం మాత్రమే ఖర్చు చేసింది. కరోనాను పథకంలోకి తెచ్చిన తొలి ప్రభుత్వం కోవిడ్ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి ప్రజలకు ఊరట కల్పించింది. వైరస్ బారిన పడ్డ 2.06 లక్షల మందికి ఉచితంగా చికిత్స అందించి ఇప్పటివరకు రూ.743.75 కోట్లు ఖర్చు చేసింది. అదనంగా 2,198 ప్రొసీజర్లు.. మొత్తం 3,257 ప్రజారోగ్యానికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి జగన్ వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటే ప్రతి చికిత్సకు ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేస్తామని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. టీడీపీ హయాంలో కేవలం 1,059 ప్రొసీజర్లతో ఆరోగ్యశ్రీని నీరుగార్చగా సీఎం జగన్ అధికారంలోకి రాగానే 2020 జనవరిలో ప్రొసీజర్లను తొలుత 2,059కి పెంచారు. అదే ఏడాది జూలైలో 2,200కు ప్రొసీజర్లను పెంచి మరింత ప్రయోజనం చేకూర్చారు. తద్వారా 54 క్యాన్సర్ చికిత్సలు పథకం ద్వారా అందుబాటులోకి వచ్చాయి. 2020 నవంబర్‌లో బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సహా 235 చికిత్సలతో ప్రొసీజర్ల సంఖ్యను 2,436కి పెంచారు. 2021 మే, జూన్ నెలల్లో పది రకాల కరోనా వైరస్ చికిత్సలను పథకంలో చేర్చడంతో 2446కు ప్రొసీజర్స్ పెరిగాయి. గతేడాది మరో 809 చేర్చడంతో ఆరోగ్యశ్రీ పథకంలో ప్రొసీజర్లు 3,255కి చేరుకున్నాయి. గర్భిణులకు ఉచితంగా ‘టిఫా స్కాన్’ సేవలు అందించడం కోసం మరో రెండు ప్రొసీజర్లను ఇటీవలే పథకంలో చేర్చారు. ఇలా 2019 నుంచి ఇప్పటిదాకా 2,198 ప్రొసీజర్లను పథకంలో అదనంగా చేర్చి మొత్తం 3,257 ప్రొసీజర్లతో ఆరోగ్యశ్రీ పథకాన్ని సమర్థంగా అమలు చేస్తున్నారు. చికిత్సానంతరం అండగా వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా 1,519 ప్రొసీజర్లకు వైద్యులు సూచించిన మేరకు విశ్రాంతి సమయంలో రోగులకు రోజుకు రూ.225 లేదా నెలకు గరిష్టంగా రూ.ఐదు వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందచేస్తోంది. రోగి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రోజే బ్యాంకు ఖాతాలో ఆసరా మొత్తాన్ని జమ చేస్తున్నారు. 2019 డిసెంబర్ 12వతేదీ నుంచి ఈ ఏడాది మే నెలాఖరు వరకూ 17,25,238 మందికి రూ.1,074.69 కోట్ల మేర ఆరోగ్య ఆసరా ద్వారా సాయం అందింది. రోగి సంతృప్తే లక్ష్యం ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందే రోగుల సంతృప్తే లక్ష్యంగా పథకాన్ని సీఎం జగన్ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా పలు కీలక సంస్కరణలు చేపట్టారు. చికిత్స అనంతరం రోగుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని వారు సంతృప్తి చెందినట్టు తెలిపితేనే ఆస్పత్రులకు బిల్లుల చెల్లింపులు చేపడుతున్నారు. డిశ్చార్జి సమయంలో ప్రతి రోగి నుంచి కన్సెంట్ ఫామ్ తీసుకుంటున్నారు. అంతేకాకుండా రోగి ఖాతా నుంచి ఆస్పత్రులకు బిల్లుల చెల్లింపు విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో పాటు సేవల్లో సమస్యలుంటే ఫిర్యాదు చేయడానికి 104 కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. డిశ్చార్జి అనంతరం ఏఎన్ఎంలు రోగుల ఇళ్లకు వెళ్లి యోగక్షేమాలను తెలుసుకుటున్నారు. ఆరోగ్యంపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. మా బాబు మాట్లాడుతున్నాడు.. ఐదేళ్ల వయసున్న మా బాబుకు పుట్టుకతోనే వినికిడి లోపం ఉంది. రూ.లక్షలు ఖర్చు చేసి శస్త్ర చికిత్స చేయించే స్తోమత మాకు లేదు. ఆరోగ్యశ్రీ పథకం కింద కడప ఆస్పత్రిలో కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ ఉచితంగా చేశారు. రూ.10 లక్షలకు పైగా విలువైన సర్జరీని రూపాయి ఖర్చు లేకుండా చేశారు. ఈరోజు మా బాబు మాట్లాడటం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం. – వెంకటేశ్వర్లు, రేవతి, రాజంపేట, అన్నమయ్య జిల్లా క్యాన్సర్‌కు ఉచితంగా చికిత్స 2020లో అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరగా బ్లాడర్ క్యాన్సర్‌గా నిర్ధారించారు. చికిత్సకు రూ.3 లక్షలకు పైనే ఖర్చవుతుందని ప్రైవేట్ ఆస్పత్రిలో చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్ చికిత్స అందించే ఆస్పత్రికి వెళ్లడంతో రూపాయి ఖర్చు లేకుండా కీమోథెరపీ, రేడియో థెరపీతో రెండు చికిత్సలు అందించి మందులు కూడా ఉచితంగా ఇచ్చారు. ఆసరా కింద ప్రభుత్వం రూ.ఏడు వేలు అందించింది. క్యాన్సర్ చికిత్స ఖర్చు తలచుకుని ఎంతో ఎంతో భయపడ్డా. రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందటాన్ని నమ్మలేకపోతున్నా. – మారెన్న, బూదేడు గ్రామం, అనంతపురం జిల్లా ఆలస్యం లేకుండా వైద్యం భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసే నాకు ఇటీవల గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు కర్నూలులోని మెడికవర్ ఆసుపత్రిలో చేర్చారు. అదేరోజు వెంటనే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా బైపాస్ సర్జరీ చేశారు. డిశ్చార్జ్ అయ్యాక ఇంట్లో విశ్రాంతి తీసుకునే సమయంలో రూ.9,500 నా ఖాతాలో జమ అయింది. ఈ డబ్బులతో ప్రస్తుతం నా కుటుంబం జీవనం సాగిస్తోంది. – మండల ఆంజనేయులు, ఆదోని, కర్నూలు జిల్లా అత్యధిక ప్రాధాన్యం ఆరోగ్యశ్రీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. గ్రీన్ చానల్లో నెట్వర్క్ ఆస్పత్రులకు వేగంగా బిల్లులు చెల్లిస్తున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఏమాత్రం రాజీపడకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు. ప్రొసీజర్ల సంఖ్యను భారీగా పెంచడంతో ప్రజలకు వైద్య ఖర్చుల భారం తగ్గింది. – డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, ఏపీ ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ అధ్యక్షుడు -
ఆరోగ్యశ్రీ, మహేశ్‌బాబు ఫౌండేషన్ల సహకారంతో.. చిన్నారులకు పునర్జన్మ
లబ్బీపేట(విజయవాడ తూర్పు): గుండె జబ్బులతో బాధపడుతున్న 20 మంది చిన్నారులకు పునర్జన్మ లభించింది. ఆంధ్ర హాస్పిటల్లో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, మహేశ్‌బాబు, వసుధ, మదర్ అండ్ చైల్డ్ ఫౌండేషన్ల సహకారంలో బ్రిటన్‌కు చెందిన వైద్యుల బృందం ఉచితంగా వారికి శస్త్రచికిత్సలు నిర్వహించింది. దీనికి సంబంధించిన వివరాలను ఆంధ్ర హాస్పిటల్ చిల్డ్రన్స్ సర్వీసెస్ చీఫ్ డాక్టర్ పాతూరి వెంకట రామారావు గురువారం విజయవాడలో మీడియాకు వెల్లడించారు. బ్రిటన్ వైద్యులు డాక్టర్ మహ్మద్ నిస్సార్, డాక్టర్ రమేశ్‌కుమార్, బ్రోచు, చెల్సీ, రాచెల్, ఆయులీష్‌తో పాటు ఆంధ్రా హాస్పిటల్ వైద్యులు దిలీప్, కె.విక్రమ్‌లు.. ఐదు రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో 20 మంది చిన్నారులకు శస్త్రచికిత్సలు చేశారని చెప్పారు. ఇప్పటివరకు తమ హాస్పిటల్లో 3 వేల మంది చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలు చేసినట్లు చెప్పారు. బ్రిటన్‌కు చెందిన హీలింగ్ లిటిల్‌హార్ట్స్, యూకే చారిటీస్ సౌజన్యంతో ఇప్పటివరకు 25 సార్లు శిబిరాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో బ్రిటన్ వైద్యుల బృందం, ఆంధ్ర హాస్పిటల్ వైద్యులు జె.శ్రీమన్నారాయణ, డాక్టర్ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. -
20 ఏళ్లు..20 వేల గుండె ఆపరేషన్లు..
సాక్షి, విజయవాడ: ఇరవై వేల గుండె ఆపరేషన్లు నిర్వహించి విజయవాడ రమేష్ ఆసుపత్రి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. గురువారం ఆస్పత్రి యాజమాన్యం... 1,020 మంది పేషేంట్లను ఒకే వేదికపై సమావేశపరిచింది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అధినేత డా.రమేష్, సినీ హీరో రామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ మాట్లాడుతూ.. గిన్నిస్ రికార్డు సొంతం చేసుకోవడంతో తమపై మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న 3 వేల మంది సిబ్బంది సహకారంతోనే ఇది సాధ్యమయిందన్నారు. 1996లో ఆసుపత్రి ప్రస్థానం ప్రారంభమయ్యిందని, ఈస్ట్ కోస్ట్ ఏరియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నామని తెలిపారు. విజయవాడను ప్రపంచ పటంలో నిలపాలన్నదే ధ్యేయం అని పేర్కొన్నారు. 20 సంవత్సరాల్లో 20 వేల గుండె ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించామని వెల్లడించారు. త్వరలో హార్ట్ ట్రాన్స్ప్లాన్టేషన్ (గుండె మార్పిడి) కూడా చేపట్టబోతున్నామన్నారు. నిబద్ధత,పారదర్శకత ద్వారానే ఈ స్థాయికి చేరామని తెలిపారు. -
బుల్లి స్టిక్కర్‌తో భలే ఉపయోగాలు...
గుండెకు ఆపరేషన్ అయినవారు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలంటారు డాక్టర్లు. కొంచెం వేగంగా నడిచినా, అవసరానికి మించి ఆహారం తీసుకున్నా సమస్యలొచ్చి.. ప్రాణాలు పోయే అవకాశం ఉండటం దీనికి కారణం. రక్తపోటు, గుండెకొట్టుకునే వేగం వంటి అన్ని వివరాలను ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటే సమస్య వస్తుందనిపించినప్పుడు తగిన చర్యలు తీసుకోవచ్చు. అయితే ఇప్పటివరకూ ఇందుకు తగిన మార్గం లేకపోయింది. ఈ నేపథ్యంలో పర్డ్యూ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఓ స్టిక్కర్ (ఫొటోలో ఉన్నది) అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కాగితం టేపుతో తయారైన ఈ స్టిక్కర్‌ను మణికట్టు వద్ద అతికించుకుంటే చాలు, మన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చునని అంటున్నారు రామేస్ మార్టినెజ్. వ్యాయామం చేస్తున్నా, ఈత కొడుతున్నా కూడా ఈ స్టిక్కర్ చెక్కుచెదరకుండా ఉంటుంది. బ్యాక్టీరియా దరిచేరకుండా కూడా జాగ్రత్త తీసుకోవచ్చు. ఒక్కో స్టిక్కర్ ఖరీదు నాలుగు రూపాయలకు మించదు. ఇది కేవలం గుండెజబ్బులు ఉన్న వారికి ఉపయోపగడటమే కాకుండా.. భవిష్యత్తులో రోగ నిర్ధారణ పరీక్షలకూ చవకైన విధానంగా మారగలదని మార్టినెజ్ అంటున్నారు. -
‘గుండె’లు తీసిన బంట్లు
సాక్షి, హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన అనిల్‌కుమార్‌కు బీపీ, షుగర్ సహా ఏ అనారోగ్య సమస్యా లేదు. ఓ రోజు కడుపునొప్పి రావడంతో దారిలోని ఓ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యుడు ఓసారి కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లమన్నాడు. కార్పొరేట్లో ఏవేవో పరీక్షలు చేసి గుండె సమస్య ఉందని, వెంటనే స్టెంట్ వేయాలని చెప్పారు. అనిల్ అందుకు అంగీకరించడంతో మరుసటి రోజే ‘ఆరోగ్యశ్రీ’కింద స్టెంట్ వేసేశారు. నిజానికి అనిల్‌కు ఆ స్టెంట్ వేయాల్సిన అవసరం లేదు! వరంగల్‌కు చెందిన ఓ రైతు గుండెలో నొప్పి రావడంతో హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రికి వచ్చాడు. ఆయనకు అందించాల్సిన వైద్య వివరాలను సదరు ఆసుపత్రి ఆన్లైన్లో ఆరోగ్యశ్రీ ట్రస్టుకు పంపింది. రోగి గుండెకు స్టెంట్ వేయాలని ప్రతిపాదించాయి. ఈ వివరాలను ఆరోగ్యశ్రీలోని ఓ వైద్య నిపుణుడు పరిశీలించి.. స్టెంట్ అవసరం ఉండదు కదా అని ప్రశ్నించారు. ఆస్పత్రి వారు అందుకు బదులిస్తూ.. ‘‘ఇప్పుడు అవసరం లేదుగానీ త్వరలో అవసరం ఉండవచ్చు. అయినా ఉన్నతాధికారులు చెప్పాలి గానీ.. ధ్రువీకరించాల్సింది నువ్వు కాదు’’అంటూ దబాయించారు. మరుసటి రోజు ఆస్పత్రి ప్రతిపాదించిన ఆపరేషన్‌కు అనుమతి వచ్చేసింది! ...ఇలా ఒకటీ రెండు కాదు.. ఆరోగ్యశ్రీ కింద జరుగుతున్న గుండె ఆపరేషన్లలో కార్పొరేట్ ఆస్పత్రుల అక్రమాలకు లెక్కేలేదు. స్టెంట్లు, బైపాస్ సర్జరీల వంటి ఖరీదైన శస్త్ర చికిత్సల నిర్వహణ అడ్డగోలుగా మారింది. గుండె ఆపరేషన్లపై ఆరోగ్యశ్రీ ట్రస్టు కింది స్థాయి సిబ్బంది ఈ లోపాలను గుర్తించి ఉన్నతాధికారులకు నివేదించినా ఫలితం ఉండడం లేదు. లోపాలను సరిచేయకపోవడంతో.. ఆరోగ్యశ్రీ పథకంలో అక్రమాలు పరాకాష్టకు చేరుతున్నాయి. పేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఇలా ప్రైవేటు ఆస్పత్రులకు వరంగా మారుతోంది. ప్రజల ఆరోగ్యం ఏమైనా సరే.. తమకు కాసులు వస్తే చాలన్నట్టు ఆసుపత్రులు వ్యవహరిస్తున్నాయి. అవసరం లేకున్నా ఖరీదైన శస్త్ర చికిత్సలు చేస్తూ.. కోట్లు దండుకుంటున్నాయి. నిరంతర పర్యవేక్షణతో అక్రమాలను నిరోధించాల్సిన ఆరోగ్యశ్రీ ట్రస్టు ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు. గుండె ఆపరేషన్లే ఎక్కువ.. ఆరోగ్యశ్రీలో గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు ఎక్కువగా జరుగుతున్నాయి. స్టెంట్ల అమర్చడం, బైపాస్ సర్జరీలు కలిపి ఏటా సగటున 17 వేల ఆపరేషన్లు అవుతున్నాయి. ఇందులో స్టెంట్ల కేసులు 15 వేలు, బైపాస్ శస్త్ర చికిత్సలు 2 వేల దాకా ఉంటున్నాయి. ఒక్కో బైపాస్ ఆపరేషన్‌కు సగటున రూ.1.14 లక్షలు, స్టెంట్‌కు రూ.54 వేల చొప్పున ఆరోగ్యశ్రీ ట్రస్టు చెల్లిస్తోంది. ఎక్కువ డబ్బులు వచ్చే శస్త్ర చికిత్సలు కావడంతో ప్రైవేటు ఆస్పత్రులు వీటిని లాభదాయక వ్యవహారంగా మార్చేశాయి. గుండెకు సంబంధించిన వ్యాధులు కావడంతో ప్రజల్లోనూ ఎక్కువ ఆందోళన ఉంటోంది. దీన్ని అదనుగా చేసుకొని ప్రైవేటు ఆస్పత్రులు చెలరేగిపోతున్నాయి. అవసరం లేకపోయినా స్టెంట్లు అమర్చడం, నేరుగా బైపాస్ శస్త్రచికిత్స చేయాల్సిన సందర్భాల్లో.. ముందుగా స్టెంటు వేయడం వంటివి చేస్తున్నాయి. ఒక స్టెంట్ వేశాక ఆరు నెలల్లోపే మళ్లీ రెండో స్టెంట్ వేయాలని రోగులను హెచ్చరిస్తున్నాయి. ఇలా రెండు రకాలా డబ్బులు ఆర్జించిన తర్వాత అదే రోగికి బైపాస్ చేయాలని చెబుతున్నాయి. పెరిగిపోతున్న ‘రెండో స్టెంట్’ సాధారణంగా రోగులకు గుండె పనితీరు నిర్ధారణ పరీక్షలు (యాంజియోగ్రామ్) నిర్వహిస్తే వారిలో 60 మందిలో ఒక్కరికి మాత్రమే ఒక స్టెంట్ అవసరం ఉంటుందని, ఇక రెండో స్టెంట్ అవసరం ఇంకా తక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆరోగ్యశ్రీ పరీక్షల్లో మాత్రం రెండో స్టెంట్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. గతేడాది రెండో స్టెంట్ వేసుకున్న వారి సంఖ్య ఏకంగా 50.80 శాతం వరకు నమోదైంది. అవసరం లేకున్నా రెండో స్టెంట్ అమర్చడంతో ఆరోగ్యశ్రీలో ఏటా అదనంగా రూ.50 కోట్ల వరకు వృథా అవుతున్నట్లు అంతర్గత విచారణలో నిర్ధారించారు. అయినా చర్యలు తీసుకునే విషయంలో మాత్రం ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆరోగ్యశ్రీలోని వైద్య నిపుణుల సహకారంతోనే ఈ అక్రమ, అనవసర శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ గుర్తించిన కొన్ని లోపాలివీ ►గుండె శస్త్ర చికిత్సలలో ఎక్కువగా అవసరం లేనివే ఉంటున్నాయి. గుండె పని చేసేందుకు ఉపయోగపడే స్టెంట్ అమర్చాలంటే రక్తనాళాల్లో 70 శాతం కంటే ఎక్కువగా పూడిక ఉండాలి. కానీ 30 శాతం పూడిక ఉన్నా స్టెంట్ వేస్తున్నారు ► అవసరం లేకున్నా రెండో స్టెంట్ వేస్తున్నారు ► బైపాస్ సర్జరీ రోగుల్లో గుండెకు రక్తాన్ని పంపింగ్ చేసే సామర్థ్యం 70 శాతం వరకు ఉంటుంది. ఇది 40 శాతం కంటే తగ్గిపోయినప్పుడే ఐఏబీపీ చికిత్సను ఉపయోగిస్తారు. కానీ ప్రైవేటు ఆస్పత్రులు, ముఖ్యంగా కార్పొరేట్ ఆస్పత్రులు ప్రతి ఒక్కరికీ ఐఏబీపీ రకం చికిత్సనే చేస్తున్నాయి. 98 శాతం బైపాస్ సర్జరీల్లో ఐఏబీపీని ఉపయోగించినట్లు తేలింది. బీమా కంపెనీల ఆందోళన అడ్డగోలుగా గుండె ఆపరేషన్లపై బీమా కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ‘‘ఆస్పత్రికి వచ్చే రోగికి వైద్య బీమా ఉందా అని వైద్యుల నుంచి వచ్చే మొదటి ప్రశ్న. ఉంది అని అనడమే ఆలస్యం అన్ని టెస్టులు చేయాలంటూ ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకుంటున్నారు. అన్ని రకాల పరీక్షలు చేశామని, గుండె సమస్య ఉందని చెబుతారు. ఇప్పుడైతే స్టెంట్‌తో సరిపోతుందని, నిర్లక్ష్యం చేస్తే బైపాస్ చేయాల్సి రావచ్చని భయపెడతారు. సదరు వ్యక్తి స్టెంట్ వేయడానికి ఒప్పుకొని అంగీకార పత్రం రాస్తాడు. వెంటనే స్టెంట్ అమరుస్తారు. ఒక నెలలో అసాధారణంగా ఈ తరహా కేసులు మా దృష్టికి రావడంతో మేం వాటిని పరిశీలించాం. పరీక్షల నివేదికలు తెప్పించుకున్నాం. అన్ని పరిశీలిస్తే మేం పరిశీలించిన పది కేసుల్లో నాలుగు కేసుల్లో అసలు ఎలాంటి హృద్రోగ సమస్యలే లేవు. ఇద్దరికీ సమస్య ఉన్నా మందులతో నయమయ్యే స్టేజీలోనే ఉంది’’అని ఓ బీమా కంపెనీ ప్రతినిధి అంబుడ్స్‌మెన్‌కు ఫిర్యాదు చేశారు. -
గుంటూరు జీజీహెచ్‌లో నూతన అధ్యాయం
* బుధవారం ఇద్దరు చిన్నారులకు గుండె ఆపరేషన్లు * రాష్ట్రంలో తొలి ఆస్పత్రిగా రికార్డు గుంటూరు మెడికల్ : కొత్త సంవత్సరంలో గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి నూతన అధ్యాయాన్ని ప్రారంభించనుంది. రాష్ట్ర రాజధాని ఆస్పత్రిగా అవతరించిన జీజీహెచ్‌లో ఈ నెల మూడో తేదీ బుధవారం నాడు చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు నిర్వహించనున్నారు. సహృదయ హెల్త్, మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్టు నిర్వాహకుడు, గుండె మార్పిడి ఆపరేషన్ వైద్య నిపుణుడు డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా ఆపరేషన్లు చేయనున్నారు. ఈ చిన్నారులకే... పొన్నూరు మండలం నండూరుకు చెందిన వాసుబాబు, లావణ్య మూడున్నరేళ్ల కుమారుడు రాచూరి చరణాదిత్య, గుంటూరు జన్మభూమినగర్‌కు చెందిన ముత్యంశెట్టి దుర్గారావు, శ్రీదేవి దంపతుల మూడున్నరేళ్ల కుమార్తె భావనకు బుధవారం ఉదయం 10 గంటల నుంచి ఈ ఆపరేషన్లు నిర్వహించనున్నారు. ఒక్కో ఆపరేషన్ చేసేందుకు నాలుగు గంటలు సమయం పడుతుంది. సహృదయ ట్రస్టు ఆధ్వర్యంలో జీజీహెచ్‌లో మొట్టమొదటిసారిగా 2015 మార్చిలో పీపీపీ విధానంలో గుండె ఆపరేషన్లు (బైపాస్ సర్జరీలు) ప్రారంభమయ్యాయి. 2016 మేలో ఇద్దరికి గుండె మార్పిడి ఆపరేషన్లు నిర్వహించారు. తాజాగా 2017లో చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు ప్రారంభమవుతున్నాయి. దీంతో రాష్ట్రంలోనే గుండె ఆపరేషన్లు నిర్వహించే మొట్టమొదటి ప్రభుత్వ ఆస్పత్రిగా గుంటూరు జీజీహెచ్ చరిత్ర సృష్టించనుంది. ఏడాదికి సరిపడా నిధులు సమకూర్చాం : గోఖలే చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేసేందుకు ఏడాదికి సరిపడా నిధులు సహృదయ ట్రస్టు ఆధ్వర్యంలో సమకూర్చినట్లు ట్రస్టు నిర్వాహకుడు డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే తెలిపారు. జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే గత ఏడాది పెద్దవాళ్లకు ఆపరేషన్ చేసే సమయంలో రూ.12 లక్షలు విరాళాలు సేకరించి తమకు అందజేశారని, నేడు పిల్లలకు సైతం రూ.12 లక్షలు విరాళం అందించారని చెప్పారు. వసుధ ఫౌండేషన్, నాట్కో ఫార్మా సంస్థ, తన సోదరి అరుణ, ఇతర దాతలు పెద్ద మనస్సుతో ముందుకు వచ్చి విరివిగా విరాళాలు అందజేశారని వివరించారు. పిల్లల ప్రాణాలు కాపాడేందుకు సహాయం చేసిన దాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పిల్లల గుండె ఆపరేషన్ల ప్రక్రియలో 11 మంది పాల్గొంటున్నారని, వారిలో ఐదుగురు మత్తు వైద్యులు, ఆరుగురు సర్జన్లు ఉన్నారని వెల్లడించారు. తనతోపాటు హైదరాబాద్‌లో పనిచేసిన పిల్లల గుండె ఆపరేషన్ల వైద్య నిపుణుడు డాక్టర్ దమరసింగ్ వెంకటరమణ సేవాభావంతో ముందుకు వచ్చి జీజీహెచ్‌లో ఆపరేషన్లు చేస్తున్నారన్నారు. గుండె జబ్బులపై ప్రజలకు అవగాహన తక్కువగా ఉందని, పిల్లలు పుట్టిన వెంటనే ఎకో పరీక్ష చేయించడం ద్వారా గుండె జబ్బులను త్వరతిగతిన నిర్ధారించవచ్చని చెప్పారు. -
జీజీహెచ్‌లో చిన్నారులకు గుండె ఆపరేషన్లు
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో వచ్చే నెల నుంచి చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది సహృదయ ట్రస్టు ఆధ్వర్యంలో పీపీపీ పద్ధతిలో 300 మందికి గుండె ఆపరేషన్లు, రెండు గుండె మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా చేశామన్నారు. కొత్త సంవత్సరంలో డాక్టర్ ఆళ్ళ గోపాలకృష్ణ గోఖలే వైద్య బృంద సభ్యులు ఆపరేషన్లు చేస్తారన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవల్లో భాగంగా ఉచితంగా ఆపరేషన్లు చేయనున్నట్లు వెల్లడించారు. చిన్నారులకు పుట్టుకతో వచ్చే గుండె రంధ్రాలు, రక్తనాళాల అమరికలో మార్పులకు ఆపరేషన్లు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేసే సౌకర్యం లేదని, తామే మొట్టమొదటి సారిగా ప్రారంభిస్తున్నామన్నారు. ప్రభుత్వంతో పాటు, వసుధ ఫౌండేషన్, నాట్కో సంస్థలు వైద్య పరికరాలు కొనుగోలు చేసేందుకు విరాళం అందించాయన్నారు. వాటి సహకారం మరువలేనిదన్నారు. ఈ నెల 31న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆపరేషన్ల ప్రక్రియను లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు.