జీజీహెచ్‌లో చిన్నారులకు గుండె ఆపరేషన్లు
Published Tue, Dec 27 2016 10:40 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 PM
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో వచ్చే నెల నుంచి చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది సహృదయ ట్రస్టు ఆధ్వర్యంలో పీపీపీ పద్ధతిలో 300 మందికి గుండె ఆపరేషన్లు, రెండు గుండె మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా చేశామన్నారు. కొత్త సంవత్సరంలో డాక్టర్ ఆళ్ళ గోపాలకృష్ణ గోఖలే వైద్య బృంద సభ్యులు ఆపరేషన్లు చేస్తారన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవల్లో భాగంగా ఉచితంగా ఆపరేషన్లు చేయనున్నట్లు వెల్లడించారు. చిన్నారులకు పుట్టుకతో వచ్చే గుండె రంధ్రాలు, రక్తనాళాల అమరికలో మార్పులకు ఆపరేషన్లు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేసే సౌకర్యం లేదని, తామే మొట్టమొదటి సారిగా ప్రారంభిస్తున్నామన్నారు. ప్రభుత్వంతో పాటు, వసుధ ఫౌండేషన్, నాట్కో సంస్థలు వైద్య పరికరాలు కొనుగోలు చేసేందుకు విరాళం అందించాయన్నారు. వాటి సహకారం మరువలేనిదన్నారు. ఈ నెల 31న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆపరేషన్ల ప్రక్రియను లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు.
Advertisement
Advertisement