ఆపరేషన్లు చేయించుకోనున్న చిన్నారులు భావన, చరణాదిత్య
గుంటూరు జీజీహెచ్‌లో నూతన అధ్యాయం
Published Sun, Jan 1 2017 9:08 PM | Last Updated on Tue, Sep 5 2017 12:08 AM
* బుధవారం ఇద్దరు చిన్నారులకు గుండె ఆపరేషన్లు
* రాష్ట్రంలో తొలి ఆస్పత్రిగా రికార్డు
గుంటూరు మెడికల్ : కొత్త సంవత్సరంలో గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి నూతన అధ్యాయాన్ని ప్రారంభించనుంది. రాష్ట్ర రాజధాని ఆస్పత్రిగా అవతరించిన జీజీహెచ్‌లో ఈ నెల మూడో తేదీ బుధవారం నాడు చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు నిర్వహించనున్నారు. సహృదయ హెల్త్, మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్టు నిర్వాహకుడు, గుండె మార్పిడి ఆపరేషన్ వైద్య నిపుణుడు డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా ఆపరేషన్లు చేయనున్నారు.
ఈ చిన్నారులకే...
పొన్నూరు మండలం నండూరుకు చెందిన వాసుబాబు, లావణ్య మూడున్నరేళ్ల కుమారుడు రాచూరి చరణాదిత్య, గుంటూరు జన్మభూమినగర్‌కు చెందిన ముత్యంశెట్టి దుర్గారావు, శ్రీదేవి దంపతుల మూడున్నరేళ్ల కుమార్తె భావనకు బుధవారం ఉదయం 10 గంటల నుంచి ఈ ఆపరేషన్లు నిర్వహించనున్నారు. ఒక్కో ఆపరేషన్ చేసేందుకు నాలుగు గంటలు సమయం పడుతుంది. సహృదయ ట్రస్టు ఆధ్వర్యంలో జీజీహెచ్‌లో మొట్టమొదటిసారిగా 2015 మార్చిలో పీపీపీ విధానంలో గుండె ఆపరేషన్లు (బైపాస్ సర్జరీలు) ప్రారంభమయ్యాయి. 2016 మేలో ఇద్దరికి గుండె మార్పిడి ఆపరేషన్లు నిర్వహించారు. తాజాగా 2017లో చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు ప్రారంభమవుతున్నాయి. దీంతో రాష్ట్రంలోనే గుండె ఆపరేషన్లు నిర్వహించే మొట్టమొదటి ప్రభుత్వ ఆస్పత్రిగా గుంటూరు జీజీహెచ్ చరిత్ర సృష్టించనుంది.
ఏడాదికి సరిపడా నిధులు సమకూర్చాం : గోఖలే
చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేసేందుకు ఏడాదికి సరిపడా నిధులు సహృదయ ట్రస్టు ఆధ్వర్యంలో సమకూర్చినట్లు ట్రస్టు నిర్వాహకుడు డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే తెలిపారు. జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే గత ఏడాది పెద్దవాళ్లకు ఆపరేషన్ చేసే సమయంలో రూ.12 లక్షలు విరాళాలు సేకరించి తమకు అందజేశారని, నేడు పిల్లలకు సైతం రూ.12 లక్షలు విరాళం అందించారని చెప్పారు. వసుధ ఫౌండేషన్, నాట్కో ఫార్మా సంస్థ, తన సోదరి అరుణ, ఇతర దాతలు పెద్ద మనస్సుతో ముందుకు వచ్చి విరివిగా విరాళాలు అందజేశారని వివరించారు. పిల్లల ప్రాణాలు కాపాడేందుకు సహాయం చేసిన దాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పిల్లల గుండె ఆపరేషన్ల ప్రక్రియలో 11 మంది పాల్గొంటున్నారని, వారిలో ఐదుగురు మత్తు వైద్యులు, ఆరుగురు సర్జన్లు ఉన్నారని వెల్లడించారు. తనతోపాటు హైదరాబాద్‌లో పనిచేసిన పిల్లల గుండె ఆపరేషన్ల వైద్య నిపుణుడు డాక్టర్ దమరసింగ్ వెంకటరమణ సేవాభావంతో ముందుకు వచ్చి జీజీహెచ్‌లో ఆపరేషన్లు చేస్తున్నారన్నారు. గుండె జబ్బులపై ప్రజలకు అవగాహన తక్కువగా ఉందని, పిల్లలు పుట్టిన వెంటనే ఎకో పరీక్ష చేయించడం ద్వారా గుండె జబ్బులను త్వరతిగతిన నిర్ధారించవచ్చని చెప్పారు.
Advertisement