గుండె ఆపరేషన్‌లు చేసిన చిన్నారులతో వైద్యుల బృందం
లబ్బీపేట(విజయవాడ తూర్పు): గుండె జబ్బులతో బాధపడుతున్న 20 మంది చిన్నారులకు పునర్జన్మ లభించింది. ఆంధ్ర హాస్పిటల్‌లో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, మహేశ్‌బాబు, వసుధ, మదర్ అండ్ చైల్డ్ ఫౌండేషన్ల సహకారంలో బ్రిటన్‌కు చెందిన వైద్యుల బృందం ఉచితంగా వారికి శస్త్రచికిత్సలు నిర్వహించింది. దీనికి సంబంధించిన వివరాలను ఆంధ్ర హాస్పిటల్ చిల్డ్రన్స్ సర్వీసెస్ చీఫ్ డాక్టర్ పాతూరి వెంకట రామారావు గురువారం విజయవాడలో మీడియాకు వెల్లడించారు.
బ్రిటన్ వైద్యులు డాక్టర్ మహ్మద్ నిస్సార్, డాక్టర్ రమేశ్‌కుమార్, బ్రోచు, చెల్సీ, రాచెల్, ఆయులీష్‌తో పాటు ఆంధ్రా హాస్పిటల్ వైద్యులు దిలీప్, కె.విక్రమ్‌లు.. ఐదు రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో 20 మంది చిన్నారులకు శస్త్రచికిత్సలు చేశారని చెప్పారు. ఇప్పటివరకు తమ హాస్పిటల్‌లో 3 వేల మంది చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలు చేసినట్లు చెప్పారు. బ్రిటన్‌కు చెందిన హీలింగ్ లిటిల్‌హార్ట్స్, యూకే చారిటీస్ సౌజన్యంతో ఇప్పటివరకు 25 సార్లు శిబిరాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో బ్రిటన్ వైద్యుల బృందం, ఆంధ్ర హాస్పిటల్ వైద్యులు జె.శ్రీమన్నారాయణ, డాక్టర్ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment