గుండె జబ్బుల నుంచి చిన్నారుల ప్రాణాలు కాపాడుకోవాలి
తల్లిదండ్రులకు వైద్య నిపుణుల సూచన
ఇటీవలి కాలంలో పిల్లల్లో పెరుగుతున్న గుండె జబ్బుల ముప్పు
హఠాత్తుగా కుప్పకూలి చనిపోతున్న వైనం
పుట్టినప్పటి నుంచే గుండెజబ్బుకు సంబంధించిన లక్షణాలు ఉంటాయి: వైద్యులు
సమస్యను ముందే గుర్తించి జాగ్రత్త పడాలని స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: చిన్నపిల్లల్లో గుండెజబ్బుల ముప్పు పెరుగుతోంది. ఇటీవలి కాలంలో చిన్నపిల్లలతో పాటు యుక్త వయసు వారు కూడా హఠాత్ గుండెపోటుతో మరణిస్తున్నారు. ముఖ్యంగా అప్పటివరకు ఆడుకుంటూ సందడి చేసిన ఐదు, పదేళ్ల లోపు పిల్లలు హఠాత్తుగా కుప్ప కూలిపోతున్నారు. క్షణాల్లోనే మృత్యువాత పడుతున్నారు. గుండెపోటు వల్ల తమ బిడ్డలు మరణించారని తెలుసుకుంటున్న తల్లిదండ్రులు, బంధువులు విస్తుపోతున్నారు. తమకెందుకీ శాపం అంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. రాష్ట్రంలో సైతం ఇటీవలి కాలంలో పెరుగుతున్న ఈ తరహా మరణాలపై ఆందోళన వ్యక్తమవుతోంది.
అయితే అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటు కారణంగానే వారు మరణించినప్పటికీ, పుట్టినప్పటి నుంచే..జన్యుపరమైన కారణాలు, ఇతరత్రా కారణాలతో గుండె జబ్బులకు సంబంధించిన లక్షణాలు వారిలో ఉంటాయని, వాటిని గుర్తించడం ద్వారా, గుర్తించిన తర్వాత నిర్లక్ష్యం చేయకుండా ఉండటం ద్వారా ఈ ప్రాణాంతక ముప్పును తప్పించవచ్చని వైద్య నిపుణులు సూచిçస్తున్నారు. ముందుగానే ఆయా జబ్బులతో ముడిపడిన చిన్న చిన్న లక్షణాలను గుర్తించి సరైన వైద్యం చేయిస్తే ప్రమాదం ఉండదని చెబుతున్నారు. కార్పొరేట్ ఆసుపత్రులలోనే పరీక్షలు, వైద్యం చేయించాల్సిన పనిలేదని, పేద కుటుంబాల వారు నిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో ‘పీడియాట్రిక్ ఐసీయూ’, ఇతర రూపాల్లో ఉత్తమ సేవలు పొందవచ్చునని వివరిస్తున్నారు.
ఇటీవలే బ్రిటన్‌కు చెందిన నిపుణులైన వైద్యుల బృందం పేద పిల్లలకు ఆపరేషన్లు చేయడంతో పాటు ఇతర రూపాల్లో వైద్య సేవలు అందించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న ఈ అంశంపై, హృద్రోగ సంబంధిత సమస్యలపై.. నిమ్స్ కార్డియో థొరాసిక్ సర్జరీ హెడ్ డాక్టర్ అమరేష్ రావు మాలెంపాటì, æఉస్మానియా మెడికల్ కాలేజీ కార్డియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హరీ‹Ùలు తమ అభిప్రాయాలు, సూచనలను ‘సాక్షి’తో పంచుకున్నారు.
⇒ ఇటీవల ఖమ్మం జిల్లాలో అప్పటివరకు తల్లిదండ్రులతో కలిసి ఆట పాటలతో సందడి చేసిన ప్రహర్షిక అనే నాలుగేళ్ల చిన్నారి గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయింది.
⇒ మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఏడో తరగతి చదువుతున్న నివృతి హఠాత్తుగా గుండెపోటుకు గురై మరణించింది.
⇒ జగిత్యాల జిల్లాలో సంజీవ్ అనే యువకుడు పెళ్లి బారాత్‌లో నృత్యం చేస్తూ గుండెపోటుతో కుప్పకూలాడు.
గమనించడం ముఖ్యం
గుండె జబ్బుకు సంబంధించి లక్షణాలను ముందే గమనించవచ్చు. వారి శరీరరంగు ముఖ్యంగా పెదవు లు, చేతులు నీలం రంగులోకి మారుతుంటే జాగ్రత్తపడాలి. ఏడుస్తూ మారాం చేస్తున్నపుడు ఏదైనా మార్పు కనిపించినా, కొంచెం సేపే ఆటలు ఆడినా ఎక్కువగా ఆయాసపడుతున్నా, పాలు తాగుతున్న సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతు న్నా, చెమటలు పడుతున్నా, పాలు వదిలేయడం వంటివి చేస్తున్నా తేలిగ్గా తీసుకోకూడదు. సాధారణంగా పసిపిల్లలుగా ఉన్నపుడే 3,4 పర్యాయాలు శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు సోకుతాయి.
అంతకు మించిన సంఖ్యలో అంటే నెలనెలకు ఇన్ఫెక్షన్లు వస్తున్నాయంటే తల్లిదండ్రులు అలర్ట్ కావాలి. వయసుకు తగ్గట్టుగా బరువు పెరగకపోవడం, ఏడాది వయసు పూర్తయ్యేలోగా తొలి అడుగు వేయకపోవడం లాంటివి బాగా ఆలస్యమైతే ఏదైనా సమస్య ఉండొచ్చునని భావించాలి. ఇలాంటి లక్షణాలు కని్పస్తే వారికి కచ్చితంగా గుండెజబ్బు ఉందని కానీ వస్తుందని కానీ చెప్పలేం. వీటిని కేవలం కొన్ని సూచికలుగానే పరిగణనలోకి తీసుకుని జాగ్రత్తపడాలి.
తగిన పరీక్షలు, వైద్యం చేయించాలి. పిల్లల్లో చిన్నప్పుడే గుండెలో చిన్న రంధ్రం బయటపడినా, వారు పెద్దయ్యేటప్పటికి అది పూడుకుపోతుందని కొందరు తల్లిదండ్రులు భావిస్తుంటారు. అయితే దీనికి సంబంధించిన లక్షణాలు క్రమంగా తగ్గొచ్చుకానీ సమస్య అలాగే ఉండే అవకాశాలున్నాయి. అందువల్ల వైద్యులను సంప్రదించాలి. మొన్నీమధ్యే ఏడేళ్ల పిల్లవాడికి నిమ్స్‌లో కాంప్లికేటెడ్ ‘రాస్ ప్రొసీజర్’తో విజయవంతంగా సర్జరీ చేశాం. – డాక్టర్ అమరేష్ రావు మామెంపాటి, కార్డియో థొరాసిక్ సర్జరీ హెడ్ , నిమ్స్, హైదరాబాద్
గర్భస్థ శిశువులో సమస్యను కూడా గుర్తించవచ్చు
హఠాత్ గుండెపోటును చాలా మటుకు నివారించే అవకాశాలున్నాయి. గుండెకు చిల్లులున్నా గుండెపోటుకు గురికాకుండా జాగ్రత్త పడవచ్చు. శస్త్రచికిత్సలతో వాటిని ఆపొచ్చు. చిన్నపిల్లల్లో రక్తనాళాలు ఉండాల్సిన స్థితిలో సవ్యంగా లేకుండా తేడాగా ఉంటే గుండెపోటు వచ్చే అవకాశాలుంటాయి. ఏదైనా అంశంపై వారు భావోద్వేగానికి గురైనా, ఎగ్జైట్‌మెంట్ పెరిగినా వారి గుండె కదలికల్లో మార్పులు సంభవిస్తాయి. ఎక్కువగా ఆయాసపడుతున్నా, తరచుగా మూర్ఛ (ఫిట్స్) పోవడం జరుగుతున్నా గుండె సమస్యలున్నట్టుగా అనుమానించాలి.
మైకాండ్రియా సెల్స్‌లో పొటాíÙయం, కాల్షియం, సోడియం సమతూకం దెబ్బతింటే రిథమ్ డిస్టర్బెన్స్ వచ్చి కుప్పకూలే అవకాశాలుంటాయి. పుట్టినప్పటి నుంచే గుండె పనితీరుకు సంబంధించి ఏవైనా లోపాలుంటే ప్రాథమికంగా ఈసీజీ, 2 డీ ఎకో పరీక్షల ద్వారా కనిపెట్టవచ్చు. ప్రస్తుతం వైద్య చికిత్సలో అధునాతన సౌకర్యాలు అందుబాటులోకి వచి్చనందున గుండె సమస్యలున్న చిన్నారులకు తగిన చికిత్స అందించేందుకు అవకాశం ఉంది. గర్భస్త శిశువుగా ఉన్నపుడు కూడా గుండె సంబంధిత సమస్యలను గుర్తించి సరిచేయవచ్చు. బిడ్డ పుట్టాక ఫాలో అప్ చేయడం ద్వారా కూడా అకస్మాత్తుగా గుండెపోటుకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. – డాక్టర్ హరీష్ తంగెళ్లపల్లి, డీఎం కార్డియాలజీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment