ఆరోగ్యశ్రీతో 3,67,305 మందికి పునర్జన్మ | YSR Aarogya Sri 3,67,305 people were reborn in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీతో 3,67,305 మందికి పునర్జన్మ

Published Fri, Jan 26 2024 4:53 AM | Last Updated on Fri, Jan 26 2024 4:58 AM

YSR Aarogya Sri 3,67,305 people were reborn in Andhra Pradesh - Sakshi

గుండె పోటు అనగానే ఎవరికైనా సరే సగం ప్రాణాలు పోతాయి. మిగతా సగం ప్రాణాలు పోకుండా కాపాడుకోవాలంటే వెంటనే అత్యుత్తమ వైద్యం అందాలి. ఇది జరగాలంటే చేతిలో కనీసం రెండు మూడు లక్షల రూపాయలుండాలి. డబ్బులున్నోళ్లయితే వెంటనే కార్లో వెళ్లి కార్పొరేట్‌ ఆస్పత్రిలో జాయినైపోతారు. మరి రెక్కాడితే కానీ డొక్కాడని పేదల పరిస్థితి ఏమిటి? ప్రాణాలు పోగొట్టు­కోవాల్సిందేనా? ఇదంతా గతం. గత టీడీపీ ఐదేళ్ల దుర్మార్గపు పాలనలో, మనసు లేని పాలకుల హయాంలో ఇలాగే జరిగేది. ఇప్పుడా పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడా లేదు. నేనున్నానంటూ ‘వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ’  రూపంలో సీఎం వైఎస్‌ జగన్‌ గుండె గుండెకూ భరోసా ఇస్తున్నారు. ఇలా ఇప్పటిదాకా వంద కాదు.. వెయ్యి కాదు.. లక్ష కాదు.. ఏకంగా 3.67 లక్షల మందికి పునర్జన్మ ఇచ్చారు. ఇంతటి మేలు ఏపీ మినహా ఏ రాష్ట్రంలోనూ జరగలేదనడం పచ్చి నిజం. 

అతనో ఆటో డ్రైవర్‌.. పేరు పొందూరు విజయ్‌ కుమార్‌.. ఊరు పార్వతీపురం. వచ్చే ఆదాయం ఇంట్లో వాళ్లు మూడు పూటలా తినడానికి కూడా సరిగా సరిపోదు.. ఒకరోజు ఉన్నట్టుండి ఛాతిలో నొప్పి రావడంతో వైద్యుడి వద్దకు వెళ్లాడు. గుండెలో మూడు రక్తనాళాలు మూసుకుపోయినట్లు గుర్తించి, వెంటనే బైపాస్‌ సర్జరీ చేయాలని చెప్పారు. ఆ మాట వినగానే అతడు వణికిపోయారు. తానిక బతకనంటూ కుటుంబ సభ్యుల ఎదుట కన్నీరు పెట్టుకున్నాడు. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఏం చేయాలో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతుంటే.. ‘ఏదో ఒక పెద్దాసుపత్రికి వెంటనే వెళ్లిపోండి.. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్‌ చేస్తారు’ అని అక్కడి వారు చెప్పారు. విశాఖ మెడికవర్‌ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఇతనికి వెంటనే రెండున్నర లక్షల రూపాయల ఆపరేషన్‌ను ఉచితంగా చేశారు. రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తూ వైఎస్సార్‌ ఆసరా కింద రూ.10,000 అందజేశారు. ఇప్పుడు చక్కగా ఆటో తోలుకుంటూ ఆనందంగా జీవిస్తున్నాడు. 
–సాక్షి, అమరావతి

3.67 లక్షల మందికి పునర్జన్మ
2019 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,67,305 మంది గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు అందుకున్నారు. వీరికి 4,87,303 ప్రొసీజర్‌లలో చికిత్సలు అందించడానికి ప్రభుత్వం ఏకంగా రూ.2,229.21 కోట్లు ఖర్చు చేసింది. కాగా, 3.67 లక్షల మందిలో 2,22,571 మంది యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, హార్ట్‌ స్ట్రోక్, స్టెంట్‌లు వంటి కార్డియాలజీ సంబంధిత 2.82 లక్షల ప్రొసీజర్‌లలో చికిత్సలు అందుకున్నారు. మిగిలిన 1,44,734 మంది బైపాస్‌ సర్జరీలు, వాల్వ్‌ రిపేర్, కార్డియాక్, కార్డియోథొరాసిక్‌ సర్జరీ విభాగంలో 2.05 లక్షల ప్రొసీజర్‌లలో ఉచిత వైద్య సేవలు అందుకున్నారు. మరో వైపు చికిత్స అనంతరం ఆరోగ్య ఆసరా కింద విశ్రాంత సమయానికి నెలకు గరిష్టంగా రూ.5 వేల వరకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. 

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం అరకబద్ర గ్రామానికి చెందిన కె.సాహూ ఇంటి వద్ద చిన్న కొట్టు నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. నిరుపేద కుటుంబం. 2020 డిసెంబర్‌ 23 అర్ధరాత్రి ఛాతీలో నొప్పి రావడంతో తొలుత బరంపురం ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. వెంటనే గుండె ఆపరేషన్‌ చేయాలని చెప్పగా, కుటుంబ సభ్యులు విశాఖకు తీసుకెళ్లారు. ఆరోగ్య శ్రీ కింద అక్కడ ఉచితంగా గుండె ఆపరేషన్‌ నిర్వహించారు. తర్వాత ఆరోగ్య ఆసరా కింద ప్రభుత్వం రూ.5 వేలు అతని ఖాతాలో జమ చేసింది. 

గుంటూరు రాజీవ్‌గాంధీనగర్‌లో ఉంటున్న ఆటో డ్రైవర్‌ రావెల ప్రభాకర్‌దీ అదే పరిస్థితి. రూ.3 లక్షల ఖర్చయ్యే ఆపరేషన్‌ను ఉచితంగా చేయించిన ప్రభుత్వం పునర్జన్మనిచ్చింది. ఇలాంటి వారు తక్కువలో తక్కువ రాష్ట్ర వ్యాప్తంగా ఊరికొకరున్నారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులతో బతికి బట్టకట్టగలిగారు. ఈ పథకమే లేకపోయి ఉండుంటే తామంతా ప్రాణాలతో ఉండే వాళ్లం కాదంటున్నారు. చేతి నుంచి చిల్లిగవ్వ ఖర్చు పెట్టే పని లేకుండా ఖరీదైన గుండె ఆపరేషన్, గుండె మార్పిడి చికిత్సలను సైతం ప్రభుత్వం ఉచితంగా చేయిస్తోంది. ఏపీతో పాటు, రాష్ట్రం వెలుపల చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలోని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి.  

రూ.25 లక్షల వరకు వైద్యం ఉచితం 
నిరుపేదలు, రూ.5 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాల ప్రజలకు ఒక్క గుండె సంబంధిత చికిత్సలే కాకుండా అనేక రకాల ఆరోగ్య సమస్యల్లో  ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు అందిస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం జగన్‌ ఈ పథకాన్ని విప్లవాత్మకంగా బలోపేతం చేశారు. ఇటీవల వైద్య ఖర్చుల పరిమితిని రూ.25 లక్షలకు పెంచారు. గత ప్రభుత్వంలో 1,059 ప్రొసీజర్‌లు ఉండగా, వాటిని 3,257కు పెంచారు. 2019 నుంచి ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా కోసం ఏకంగా రూ.13 వేల కోట్లకు పైగానే ఖర్చు చేసింది. 40 లక్షల మందికి ఉచితంగా వైద్య సేవలు అందించారు. కొత్తగా 17 మెడికల్‌ కళాశాలల ఏర్పాటుకు నడుం బిగించారు.

ఇందులో ఐదు కళాశాలలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరో ఐదు వచ్చే ఆర్థిక ఏడాదిలో ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. నాడు–నేడు కింద ప్రభుత్వ ఆస్పత్రులన్నింటినీ అభివృద్ధి చేస్తున్నారు. 53 వేల మందికి పైగా వైద్యులు, వైద్య సిబ్బందిని కొత్తగా నియమించారు. ఉద్దానంలో వైఎస్సార్‌ కిడ్నీ పరిశోధన కేంద్రం, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించారు. ఫ్యామిలీ డాక్టర్‌ పేరుతో గ్రామీణులకు వైద్యాన్ని మరింత చేరువ చేశారు. వీటన్నింటికీ తోడు వైఎస్సార్‌ ఆరోగ్య సురక్ష క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారు. తొలి విడత 12,423 శిబిరాలు నిర్వహించి, 60.27 లక్షల మందికి ఓపీ సేవలు అందించారు. రెండవ దశలో ఇప్పటి వరకు 2,838 క్యాంపులు నిర్వహించి, 9.48 లక్షల మందికి వైద్యం అందించారు. 

దేవుడిలా ఆదుకున్నారు
నాకు 71 ఏళ్లు. అరటిపళ్లు, కొబ్బరికాయలు అమ్ముకునే చిరు వ్యాపారిని. ఆయాసంతో బాధ పడుతున్నాను. దీంతో గత ఏడాది ప్రభుత్వం మా ఊళ్లో ఆరోగ్య సురక్ష క్యాంప్‌ పెట్టినప్పుడు వైద్యులను సంప్రదించా. రాజమండ్రిలో ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లమన్నారు. అక్కడకు వెళ్లగా పరీక్షలు చేసి రక్తనాళాలు పూడిపోయాయని చెప్పారు. బైపాస్‌ సర్జరీ చేయాలన్నారు. మా అబ్బాయి ఎలక్ట్రికల్‌ పనులు చేస్తుంటాడు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి మాది.

ఈ క్రమంలో బైపాస్‌ సర్జరీ చేయించుకోవడానికి అప్పులు చేయాల్సి వస్తుందని భయపడ్డాను. ఆరోగ్యశ్రీ పథకం దేవుడిలా అదుకుంది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే అక్టోబర్‌ 25న సర్జరీ చేయించింది. డిశ్చార్జి అయ్యాక కోలుకునే సమయానికి రూ.9500 భృతి బ్యాంక్‌ ఖాతాలో జమ చేసింది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. ప్రభుత్వం మేలును ఎన్నటికీ మరువము. 
– గుత్తికొండ వెంకటరమణ, తేతలి గ్రామం, పశ్చిమగోదావరి జిల్లా

ఆరోగ్యశ్రీ నా ప్రాణం నిలబెట్టింది
వీధి వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నాను. 2022 జూన్‌లో ఎక్కువగా గుండె నొప్పి వచ్చింది. ఆస్పత్రికి వెళ్లి చూపిస్తే వెంటనే ఆపరేషన్‌ చేయాలన్నారు. దీంతో నా గుండె ఆగినంత పనైంది. ముగ్గురు ఆడపిల్లల్లో ఇద్దరికి పెళ్లి చేశాను. ఇంకా ఒక అమ్మాయి ఉంది. రోజంతా రోడ్డు మీద కొబ్బరికాయలు, పళ్లు అమ్మితేనే నోటికి కూడు దక్కుతాది. వచ్చే డబ్బుతో కుటుంబ పోషణ, మూడో అమ్మాయి పెళ్లి ఇలా చాలా సమస్యలున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఆపరేషన్‌ అంటే ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీతో డబ్బులు లేకుండానే ఆపరేషన్‌ చేస్తారని మా ఊరి నర్స్‌ చెప్పంది. దీంతో శ్రీకాకుళంలో ఆస్పత్రికి వెళ్లగా అక్కడ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్‌ చేశారు. ఈæ పథకం లేకపోతే.. నాలాంటి పేదోడికి దిక్కేది? ఈ పథకమే నా ప్రాణం నిలబెట్టింది.   
– బోర రామ్మూర్తి, రాందాస్‌పేట, శ్రీకాకుళం జిల్లా

పేదలపై వైద్య ఖర్చుల భారం లేదు
రాష్ట్రంలో వైద్యం కోసం పేదలు, మధ్యతరగతి ప్రజలు అప్పులపాలు కాకూడదు అనేది ప్రభుత్వ లక్ష్యం. ఆ మేరకు పథకానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. అర్హులందరికీ ఉచితంగా చికిత్సలు అందేలా చూస్తున్నాం. గుండె, కాలేయం, కిడ్నీ సంబంధిత, క్యాన్సర్‌ వంటి పెద్ద పెద్ద జబ్బులకు చికిత్సలు పథకం పరిధిలో ఉన్నాయి. సేవలు పొందడంలో ఏవైనా సందేహాలుంటే 104ను సంప్రదించవచ్చు. వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి పథకం గురించి ప్రజలకు వివరిస్తున్నారు. 
– డి.కె.బాలజీ, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ సీఈవో 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement