ఎమర్జెన్సీ కార్డియాక్ కేర్‌లో భాగంగా నర్సీపట్నంలోని ఆస్పత్రిలో రోగికి చికిత్స
గుండెపోటు మరణాల నియంత్రణకు సీఎం జగన్ ప్రభుత్వం సమర్థవంతంగా అడుగులు
గోల్డెన్ అవర్‌లో చికిత్స కోసం ఎమర్జెన్సీ కార్డియాక్ కేర్ కార్యక్రమం
హబ్ అండ్ స్పోక్ విధానంలో అమలుచేసిన ప్రభుత్వం
ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ కింద 3.67 లక్షల మంది బాధితులకు ఉచితంగా చికిత్స
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంభవిస్తున్న మరణాల్లో 32.4 శాతం గుండె సంబంధిత వ్యాధుల కారణంగానే ఉంటున్నాయి. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్‌సీడీ)లో గుండె జబ్బులదే అగ్రస్థానం. ఈ క్రమంలో ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కలిగిన సీఎం వైఎస్ జగన్ మునుపెన్నడూలేని రీతిలో ఎన్‌సీడీ నిర్వహణపై పక్కా ప్రణాళికతో అడుగులు వేశారు. ఇందులో భాగంగా.. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయిలో ప్రభుత్వాస్పత్రుల ఆధునీకరణ సహా అనేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రధానంగా గుండె జబ్బులు, క్యాన్సర్ తదితర పెద్ద జబ్బులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది.
కార్డియాలజీ, కార్డియో వాసు్క్యలర్ సేవలను మరింతగా విస్తృతం చేసి, ప్రజలకు చేరువ చేస్తూ ఎమర్జెన్సీ కార్డియాక్ కేర్ (ఈసీసీ) కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఇందులో భాగంగా గుండెపోటు బాధితులకు గోల్డెన్ అవర్‌లో చికిత్స అందించి బాధితుల ప్రాణాలను కాపాడింది. నగరాలకు దూరంగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు గుండెపోటు బారినపడితే తొలి 40 నిమిషాల్లోనే ఈ కార్యక్రమం ద్వారా ప్రాథమిక వైద్య సేవలు లభించేలా చర్యలు తీసుకున్నారు. హబ్ అండ్ స్పోక్ విధానంలో ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నారు.
సామాన్యులకూ అందుబాటులోకి హార్ట్‌కేర్ సర్వీసులు..
తిరుపతి రుయా ఆస్పత్రిలో 2022 జనవరి నుంచి పైలెట్ ప్రాజెక్టుగా ఈ ఈసీసీ నడుస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం జీజీహెచ్‌లను హబ్‌లుగా తీర్చిదిద్ది కార్యక్రమాన్ని విస్తరించారు. నాలుగు చోట్ల కార్డియాలజిస్ట్ వైద్యులతో పాటు, క్యాథ్‌ల్యాబ్ సౌకర్యం ఉంది. హబ్‌లకు ఆయా జిల్లాల పరిధిలోని 69 స్పోక్స్ (సెకండరీ హెల్త్ సర్వీసెస్ ఆస్పత్రులు)ను అనుసంధానంచేసి హార్ట్‌కేర్ సర్వీసులను సామాన్యులు, గ్రామీణులకు అందుబాటులోకి తెచ్చారు.
అనంతరం అన్ని జీజీహెచ్‌లను హబ్‌లుగా, సెకండరీ హెల్త్ ఆస్పత్రులను స్పోక్స్‌గా తీర్చిదిద్ది రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాన్ని అమలులోకి తెచ్చారు. స్పోక్స్‌గా వ్యవహరించే ఆస్పత్రుల్లో ఛాతినొప్పి, ఇతర గుండెపోటు లక్షణాలతో వచ్చిన వ్యక్తులకు వెంటనే ఈసీజీ తీస్తున్నారు. ఆ ఫలితాన్ని హబ్‌లో ఉన్న కార్డియాలజిస్ట్‌కు పంపుతున్నారు. కార్డియాలజిస్ట్‌లు సంబంధిత కేసు గుండెపోటుదా కాదా అని నిర్ధారించి గుండె రక్తనాళం ఎంత శాతం పూడుకుపోయిందో పరిశీలించి థ్రాబోలైసిస్ థెరపీని సూచిస్తున్నారు.
ఇలా సూచించిన కేసుల్లో రూ.40 వేల విలువ చేసే థ్రాంబోలైసిస్ ఇంజక్షన్‌ను బాధితులకు ఉచితంగా ఇస్తున్నారు. గతేడాది సెప్టెంబరు 29 నుంచి ఇప్పటివరకూ 3 వేల మందికి పైగా ఛాతినొప్పితో స్పోక్స్‌కు రాగా వారికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో గుండె రక్తనాళం 100 శాతం పూడిపోవడంతో వచ్చే ఎస్‌టీ ఎలివేషన్ మయోకార్డియాల్ ఇన్‌ఫార్‌క్షన్ (స్టెమీ) సమస్యతో బాధపడుతున్న 489 మందికి వెంటనే థ్రాంబోలైసిస్ నిర్వహించారు. వీరిలో 424 మంది క్షేమంగా ఉన్నారు. సకాలంలో వైద్యసాయం అందకపోయినట్లయితే వీరందరూ కూడా మృత్యువాత పడేవారని వైద్యులు చెబుతున్నారు.
భవిష్యత్‌లోనూ మరింత రక్షణ..
మరోవైపు.. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా బీపీ, షుగర్, ఇతర ఎన్‌సీడీ వ్యాధిగ్రస్తుల ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షించారు. గుండె జబ్బులకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ ఆస్పత్రుల్లో పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించారు. ఐదేళ్లలో 3.67 లక్షల గుండెపోటు బాధితులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు చేశారు. ఇందుకు రూ.2,300 కోట్లకు పైగా వెచ్చించారు. మరింత సమర్థవంతంగా గుండెపోటు మరణాలను నియంత్రించడానికి ఈసీసీను అమలులోకి తెచ్చారు. ఇక వచ్చే ప్రభుత్వంలో గుండె సంబంధిత వైద్యసేవల కోసం విశాఖ, కర్నూలు, గుంటూరుల్లో హబ్‌లు ఏర్పాటుచేస్తామని వైఎస్సార్‌సీపీ 2024 మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment