సాక్షి, అమరావతి: ఓ మనిషి ప్రాణాన్ని కాపాడేందుకు వైద్యులు ఎంతో శ్రమిస్తారు.. అందుకే డాక్టర్‌ని దేవుడంటారు! మరి ఏకంగా కోటిన్నర కుటుంబాలకు ఆరోగ్యదాతను ఏమని పిలవాలి? నాలుగున్నరేళ్లలో దాదాపు నలభై లక్షల మందికి ఉచిత వైద్యంతో ప్రాణం పోసిన ‘డాక్టర్’ను ఎవరితో పోల్చాలి? ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లాక జీవన భృతి కోసం ఆదుర్దా పడకుండా రోగికి డబ్బులిచ్చి మరీ చిరునవ్వుతో సాగనంపే మానవీయ కోణాన్ని ఎవరైనా ఎలా మరువగలరు? ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి ఊపిరిలూదిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించాలని నిర్ణయించారు.
తద్వారా గుండె, కిడ్నీ, న్యూరో లాంటి ఎంత పెద్ద జబ్బులకైనా చేతి నుంచి చిల్లి గవ్వ ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు ఖరీదైన వైద్యం అందనుంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ కింద అందించే చికిత్సల సంఖ్యను 1,059 నుంచి ఏకంగా మూడు రెట్లకుపైగా పెంచి 3,257కి చేర్చిన సీఎం జగన్ ఇక క్యాన్సర్ లాంటి ఖరీదైన జబ్బుల చికిత్సకు సైతం పరిమితి లేకుండా వ్యయాన్ని భరించేందుకు సిద్ధమయ్యారు. ఆరోగ్యశ్రీ సేవలను ప్రజలు అత్యంత సులభంగా పొందేలా ఆధునిక ఫీచర్లతో కొత్తగా కార్డులను రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 18వతేదీన నూతన మార్గదర్శకాలు జారీ చేయనుంది.
ఈ సందర్భంగా అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో), ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, గృహ సారథులు, వలంటీర్లనుద్దేశించి సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. ఆరోగ్యశ్రీ సేవలను ప్రజలు మరింత మెరుగ్గా వినియోగించుకునేలా విస్తృత ప్రచారం కల్పించడంపై దిశా నిర్దేశం చేస్తారు. అనంతరం 19వతేదీ నుంచి కొత్తగా రూపొందించిన 1.42 కోట్ల వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది.
దేశ ఆరోగ్య రంగంలో తొలిసారిగా...
ఇటీవల జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పలు పార్టీలు ఆరోగ్యశ్రీ తరహాలో ఉచిత వైద్యం అందిస్తామని హామీలిచ్చాయి. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ రూ.10 లక్షల వరకూ ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇవ్వగా బీఆర్‌ఎస్ రూ.15 లక్షల వరకూ ఉచిత వైద్యం సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కూడా రాజకీయ పార్టీలు ఇలాంటి హామీలనే ఇచ్చాయి.
అయితే దేశంలో ఎక్కడాలేని విధంగా ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.25 లక్షల వరకూ ఉచితంగా వైద్యానికి ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం భరోసా నివ్వడం గమనార్హం. గతంలో క్యాన్సర్ చికిత్సకు ఆరోగ్యశ్రీ కింద ఇచ్చే డబ్బులపై రూ.5 లక్షల వరకు పరిమితి ఉంది. ఆ తర్వాత ఎంత ఖర్చు అయినా రోగులే భరించాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ పరిమితిని ఎత్తివేయడం ద్వారా పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యానికి పూర్తి భరోసానిస్తున్నారు.
అందరికీ అభయం
2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ ఏడాది నవంబర్ నెలాఖరు నాటికి ఆరోగ్యశ్రీ పథకం కింద 37,40,525 మంది ఉచితంగా వైద్యం అందుకున్నారు. వీరి వైద్యం కోసం ప్రభుత్వం ఏకంగా రూ.11,859.96 కోట్లు ఖర్చు చేసింది. చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటితే ప్రభుత్వమే ఉచితంగా పథకం కింద వైద్యాన్ని అందిస్తోంది. మరోవైపు వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కోసం రూ.1,309 కోట్లు వెచ్చించింది.
ఇలా నాలుగున్నరేళ్లలో ఆరోగ్యశ్రీ, ఆసరా కోసం ఏకంగా రూ.13,168.96 కోట్లు వెచ్చించింది. గత సర్కారు 2014 – 19 మధ్య అరకొర ప్రొసీజర్లతో రూ.5,177.38 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. సీఎం జగన్ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా కరోనాకు సంబంధించిన 10 రకాల చికిత్సలను 2021 మే, జూన్ నెలల్లో ఆరోగ్యశ్రీలోకి చేర్చింది. రెండు లక్షల మందికిపైగా బాధితులకు ఉచితంగా కోవిడ్ చికిత్స కోసం రూ.744 కోట్ల మేర ఖర్చు చేసింది.
2,198 ప్రొసీజర్స్ పథకంలోకి తెచ్చిన సీఎం జగన్
ప్రజారోగ్యానికి పెద్దపీట వేసిన సీఎం జగన్ వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటే ప్రతి చికిత్సకు ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేస్తామని 2019 ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టో ద్వారా ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకున్నారు. 2020 జనవరిలో ప్రొసీజర్లను తొలుత 2059కి పెంచారు. అనంతరం అదే ఏడాది జూలైలో ప్రొసీజర్లను 2,200కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనిద్వారా 54 క్యాన్సర్ చికిత్సలు పథకంలో అందుబాటులోకి వచ్చాయి.
మరోవైపు 2020 నవంబర్‌లో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ లాంటి పలు పెద్ద చికిత్సలతో సహా 235 చికిత్సలతో ప్రొసీజర్స్ సంఖ్యను 2,436కి పెంచారు. పది రకాల కరోనా చికిత్సలను పథకంలోకి చేర్చడంతో ప్రొసీజర్స్ 2,446కి చేరాయి. గతేడాది మరో 809 చికిత్సలను చేర్చడంతో ఆరోగ్యశ్రీ పథకంలో 3,257 ప్రొసీజర్లు సమకూరాయి.
గర్భిణులకు ఉచితంగా టిఫా స్కాన్ సేవలు అందించేందుకు ఇటీవలే మరో రెండు ప్రొసీజర్లను పథకంలో చేర్చారు. 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చే నాటికి 1,059 ప్రొసీజర్లు మాత్రమే ఉండగా వీటికి అదనంగా 2,198 ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీలో చేర్చి మొత్తం 3,257 ప్రొసీజర్లతో పథకాన్ని అమలు చేస్తూ సీఎం జగన్ చరిత్ర సృష్టించారు.
ఇంటికి వెళ్లి యోగక్షేమాల ఆరా..
వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా 1,519 ప్రొసీజర్లకు సంబంధించి రోగి ఇంటివద్ద కోలుకుంటూ విశ్రాంతి తీసుకునే సమయంలో రోజుకు రూ.225 చొప్పున నెలకు గరిష్టంగా రూ.ఐదు వేలు వరకు ప్రభుత్వం అందిస్తోంది. రోగి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రోజే బ్యాంకు ఖాతాలో ఆసరా మొత్తాన్ని జమ చేస్తున్నారు. డిశ్చార్జి అనంతరం ఏఎన్‌ఎంలు రోగుల ఇళ్లకు వెళ్లి యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు.
ఆరోగ్యశ్రీ సేవల్లో ఏవైనా సమస్యలుంటే ఫిర్యాదు చేసేందుకు 104 కాల్ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చారు. 2019లో టీడీపీ సర్కారు దిగిపోయే నాటికి ఆరోగ్యశ్రీ కింద రూ.477.40 కోట్లు, ఈహెచ్‌ఎస్ కింద రూ.154.1 కోట్లు బకాయిలు పెట్టగా మొత్తంగా రూ.631.56 కోట్లను వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే చెల్లించింది.
Comments
Please login to add a commentAdd a comment