
ప్రపంచంలో 40 ఏళ్లకు మాత్రమే సరిపడా విద్యుత్ ఉత్పత్తి వనరులు
స్టార్ రేటెడ్ విద్యుత్ ఉపకరణాల వాడకంతో విద్యుత్ ఆదా
ఈవీలు, ఎల్‌ఈడీ బల్బులు, బీఎల్‌డీసీ ఫ్యాన్లతో ఖర్చులు మిగులు
వేసవిలో ఏసీల వినియోగంలో మెళకువలు పాటిస్తే విద్యుత్ పొదుపు
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా 40 ఏళ్లకు మాత్రమే సరిపడా విద్యుత్ ఉత్పత్తి వనరులు అందుబాటులో ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు వేసవిలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. తద్వారా బిల్లులు కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విద్యుత్‌ను ఆదాచేసే స్టార్ రేటెడ్ ఉపకరణాలను వాడటంతో పాటు పొదుపు కోసం పాటించాల్సిన విధానాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
ఏసీ పెంచేయొద్దు
రాష్ట్రంలో ప్రతి 100 ఇళ్లల్లో 24 ఇళ్లకు ఏసీలున్నట్టు ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్‌ఎల్) ఇటీవల వెల్లడించింది. రాష్ట్రంలో ఏసీలకు ఏటా దాదాపు 3 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ ఖర్చవుతోంది. ఇది రాష్ట్రం మొత్తం విద్యుత్ వినియోగంలో 5 శాతం.
ఏసీ ఉష్ణోగ్రతను 24 డిగ్రీల సెల్సియస్‌కు పెట్టుకుంటే దేశంలో ఏటా రూ.10 వేల కోట్ల విలువైన దాదాపు 20 బిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేయవచ్చని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) నివేదికలో పేర్కొంది. ఉష్ణోగ్రతలో 1 డిగ్రీ సెల్సియస్ పెరుగుదల వల్ల విద్యుత్తులో 6 శాతం ఆదా చేయవచ్చని అధ్యయనంలో తేలింది.
ఎల్‌ఈడీలు మేలు
ఎల్‌ఈడీ బల్బుల్లో విద్యుత్ సామర్థ్యం ఎక్కువ. అధిక నాణ్యతతో దీర్ఘకాలం మన్నుతాయి. ప్రకాశించే బల్బులతో పోలి్చనప్పుడు 88 శాతం తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తాయి. ఎల్‌ఈడీల లైటింగ్ టెక్నాలజీ సాధారణంగా ప్రకాశించే లైటింగ్ కంటే 25 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఈ బల్బు వల్ల ఏడాదికి 73.7 యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని ఆంధ్రా విశ్వవిద్యాలయం, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా చేసిన అధ్యయనంలో తేలింది.
స్టార్ రేటింగ్ చూసి కొనండి
విద్యుత్ ఉపకరణాలు స్టార్ రేటెడ్‌వి వాడితే మరింతగా విద్యుత్‌ను ఆదా చేయవచ్చనే ఉద్దేశంతో స్టార్ లేబులింగ్ ప్రోగ్రామ్(ఎస్‌ఎల్‌పీ)ను 2006లో బీఈఈ ప్రారంభించింది. ఇంధన సామర్థ్యం ఆధారంగా ఎల్రక్టానిక్ ఉపకరణాలకు స్టార్ రేటింగ్‌ను (1–5 స్టార్‌లు) కేటాయిస్తుంది. 5 స్టార్ రేటింగ్ లేబుల్ ఉంటే అత్యంత సమర్థవంతమైన మోడల్‌గా సూచిస్తుంది. 5 స్టార్ రేటింగ్ పరికరాలు విద్యుత్ బిల్లులను ఆదా చేయడమే కాకుండా పర్యావరణానికి కూడా ప్రయోజనం చేకూర్చేందుకు దోహదపడతాయి. – మిలింద్ డియోరా, సెక్రటరీ, బీఈఈ
విద్యుత్ ఆదాకు మరిన్ని చిట్కాలు
» పగటిపూట కర్టెన్లు తెరిచి, లైట్లకు బదులు సూర్యకాంతిని వినియోగించుకోండి.
» ఏసీ ఆన్‌లో ఉన్నప్పుడు కిటికీలు, తలుపులు తెరిచి ఉంచవద్దు.
» ఎండగా ఉన్నప్పుడు, డ్రైయర్‌ని ఉపయోగించకుండా దుస్తులు ఆరు బయట ఆరబెట్టుకోవాలి.
» లేత రంగు, వదులుగా ఉండే కర్టెన్లను ఉపయోగించాలి. పగలు కిటికీలు తెరిచి ఉంచాలి. సన్ ఫిల్మ్‌లు, కర్టెన్లు ఉన్న కిటికీలు ఉండాలి.
» ఎలక్ట్రిక్ ఐరన్, సీలింగ్ ఫ్యాన్ల కోసం సంప్రదాయ రెగ్యులేటర్లకు బదులు ఎలక్ట్రానిక్ రెగ్యులేటర్లను వాడాలి.
» సీలింగ్ ఫ్యాన్ల కంటే ఎక్కువ ఎత్తులో ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఇన్‌స్టాల్ చేయండి.
» ఏసీతో పాటు ఫ్యాన్‌ని ఆన్‌లో ఉంచండి. రూఫ్ గార్డెన్ ఎయిర్ కండీషనర్‌పై భారాన్ని తగ్గిస్తుంది.
» ఎలక్ట్రిక్ వాటర్ హీటర్‌కు బదులు సోలార్ వాటర్ హీటర్ ఉపయోగించండి.
» నియాన్ సైన్ బోర్డులకు బదులు పెయింట్ చేసిన సైన్ బోర్డులను ఉపయోగించండి.
» వ్యవసాయ బోర్లకు వాడే త్రీఫేజ్ మోటార్ టెర్మినల్స్ వద్ద షంట్ కెపాసిటర్‌లను అమర్చాలి.
» ఇంటి పైభాగంపై కూల్ సర్ఫేస్ పెయింట్ వేస్తే ఇంట్లో వేడితో పాటు ఏసీ వినియోగం తగ్గుతుంది.
బీఎల్‌డీసీ ఫ్యాన్లు వాడండి
సాధారణ ఫ్యాన్లతో పోలిస్తే బ్రష్ లెస్ డైరెక్ట్ కరెంటు (బీఎల్‌డీసీ) టెక్నాలజీతో పని చేసే సూపర్ ఎఫిషియెంట్ ఫ్యాన్లు దాదాపు సగం విద్యుత్ మాత్రమే వినియోగిస్తాయి. బీఎల్‌డీసీ ఫ్యాన్ 28 నుంచి 38 వాట్ల విద్యుత్‌ను మాత్రమే వినియోగిస్తుండగా.. సాధారణ సీలింగ్ ఫ్యాన్ 75 వాట్ల విద్యుత్ తీసుకుంటుంది. ఈ ఫ్యాన్ 9 నెలల పాటు రోజుకు 7 గంటల చొప్పున వినియోగిస్తే ఏడాదికి 81 యూనిట్లు ఆదా చేస్తుంది.