రోజువారీ ప్రస్తుత వినియోగం 211 మిలియన్ యూనిట్లు
గతేడాది ఇదే సమయానికి 248.985 మిలియన్ యూనిట్ల వినియోగం
15.26 శాతం తగ్గిన విద్యుత్ డిమాండ్
భారీగా పెరిగిన థర్మల్ విద్యుత్ ఉత్పత్తి
బహిరంగ మార్కెట్‌లో కొనుగోళ్లు తగ్గుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండ వేడి తగ్గింది. ఫలితంగా కరెంటు వినియోగం కూడా తగ్గింది. అది కూడా సాధారణంగా కాదు. ఈ ఏడాది వేసవిలో ఇప్పటికే రికార్డు స్థాయిలో పెరిగిన డిమాండ్.. వాతావరణం అనుకూలించడంతో తగ్గుదలలోనూ రికార్డులు సృష్టిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రోజుకి 211 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతోంది. గతేడాది ఇదే సమయానికి 248.985 మిలియన్ యూనిట్ల వినియోగంతో పోలిస్తే.. ప్రస్తుతం ఇది 15.26 శాతం తక్కువగా నమోదైంది.
ఈ నెల ప్రారంభంలో విద్యుత్ డిమాండ్ రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేనంతగా పైపైకి పరుగులు తీసింది. భానుడి భగభగలను తట్టుకోలేని ప్రజలు ఏసీలు, ఫ్యాన్లను ఆపాలంటేనే భయపడిపోయారు. ఈ నెల 5న రోజువారీ డిమాండ్ 259.173 మిలియన్ యూనిట్లకు చేరుకుంది.
ఇది గతేడాది జరిగిన వినియోగం 193 మిలియన్ యూనిట్ల కంటే 34.29 శాతం ఎక్కువ. అయినప్పటికీ రాష్ట్రంలో వినియోగదారులకు అవసరమైనంత విద్యుత్‌ను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఎక్కడా కోతలు లేకుండా, డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్ సరఫరా చేయడంలో విజయవంతమైంది.
అత్యధికంగా థర్మల్ ఉత్పత్తి
కొద్దిరోజుల క్రితం వరకూ రాష్ట్రంలో సౌర విద్యుత్ భారీగా పెరిగి దాదాపు రెట్టింపు విద్యుత్‌ను అందించేది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో అది కాస్త తగ్గింది. అనూహ్యంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి పెరిగింది. ప్రస్తుతం ఏపీ జెన్‌కో థర్మల్ నుంచి 95.221 మిలియన్ యూనిట్ల విద్యుత్ సమకూరుతోంది. అంటే రాష్ట్ర విద్యుత్ డిమాండ్‌లో దాదాపు 45 శాతం జెన్‌కో థర్మల్ కేంద్రాల నుంచే వస్తోంది.
ఇందుకోసం వీటీపీఎస్‌లో 48,141 మెట్రిక్ టన్నులు, ఆరీ్టపీపీలో 28,984 మెట్రిక్ టన్నులు, కృష్ణపట్నంలో 18,313 మెట్రిక్ టన్నుల చొప్పున బొగ్గు అందుబాటులో ఉంది. దీనికి తోడు ఏపీ జెన్‌కో హైడల్ నుంచి 4.63 మి.యూ., ఏపీ జెన్‌కో సోలార్ నుంచి 1.98 మి.యూ. వస్తోంది. ఇక సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల నుంచి 32.999 మి.యూ., సెయిల్, హెచ్‌పీసీఎల్, గ్యాస్ వంటి ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ల నుంచి 30.939 మి.యూ., విండ్ నుంచి 10.937 మి.యూ., సోలార్ నుంచి 15.738 మిలియన్ యూనిట్ల చొప్పున సమకూరుతోంది.
సౌర విద్యుత్ గత వారంతో పోలిస్తే దాదాపు సగానికిపైగా పడిపోయింది. మరోవైపు బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం కూడా సగానికిపైగా తగ్గింది. ప్రస్తుతం యూనిట్ సగటు రేటు రూ.8.433 చొప్పున రూ.17.983 కోట్లతో 21.324 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే కొనుగోలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment