సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ వాహనాల(ఈవీ) వినియోగం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఏపీలో 22 వేల విద్యుత్ వాహనాలుండగా.. 2034 నాటికి ఆ సంఖ్య 10.56 లక్షలకు చేరుకోనుందని రాష్ట్ర విద్యుత్ ప్రణాళికలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) వెల్లడించింది. 2024–25లో 52,334 టూ వీలర్, 6,951 త్రీ వీలర్, 9,318 ఫోర్ వీలర్, 239 గూడ్స్, 133 విద్యుత్ బస్సులు రోడ్లెక్కుతాయని పేర్కొంది.
అంటే మొత్తం వాహనాల సంఖ్య 68,975కు పెరుగుతుంది. 2034 నాటికి 10,56,617 విద్యుత్ వాహనాలను ప్రజలు వినియోగిస్తారని వెల్లడించింది. ఈవీల సంఖ్యతో పాటు వాటి చార్జింగ్‌కు వాడే విద్యుత్ వినియోగం కూడా భారీగా పెరగనుంది. 2022లో 16 మిలియన్ యూనిట్లుగా ఉన్న వినియోగం.. 2034 నాటికి 677 మిలియన్ యూనిట్లకు చేరుతుందని ఏపీఈఆర్‌సీ పేర్కొంది.
‘ఈవీలకు’ ప్రభుత్వ ప్రోత్సాహం..
జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్ వాహనాలకు ప్రాధాన్యత ఇస్తోంది. డౌన్ పేమెంట్ లేకుండా నేరుగా వాయిదా పద్ధతుల్లో ఉద్యోగులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈవీలు కొనుగోలుచేసిన వారికి రాయితీలు కూడా వస్తాయని స్పష్టం చేసింది. ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 9 శాతం వడ్డీ రేటుతో బ్యాంకులు రుణాలిచ్చేలా చర్యలు తీసుకుంది.
రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ స్థలాలు, ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు తదితర చోట్ల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు 4 వేల ప్రాంతాలను ఇప్పటికే గుర్తించింది. తక్కువ సమయంలో ఎక్కువ చార్జింగ్ అయ్యేలా వీటిని అందుబాటులోకి తెస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment