Electricity generation
-
Fact Check: నాడు ఒప్పు.. నేడు తప్పా..!
సాక్షి, అమరావతి: ఎందుకేడుస్తున్నావురా అంటే.. ఏదో ఒకటి ఏడవాలిగా.. అన్నాడటొకడు. కరెంటు కోసం కొనే విదేశీ బొగ్గుపై ఓ కథ అచ్చేసిన ఈనాడు తీరూ ఇలానే ఉంది. వాస్తవాలతో పని లేకుండా, ఏదో ఒకటి బురద జల్లడమే పనిగా ఈనాడు మరో తప్పుడు కథనం అచ్చేసింది. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా, తక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్ సమకూరుస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బరద జల్లే ప్రయత్నం చేసింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనూ విదేశీ బొగ్గును అడ్డగోలుగా కొన్న విషయాన్ని మరుగున పెట్టింది. ఇప్పుడు వీలైనంత తక్కువ ధరతో అత్యంత నాణ్యమైన హైగ్రేడ్ విదేశీ బొగ్గు కొంటుంటే అదే తప్పయినట్లు ఓ తప్పుడు కథనాన్ని ప్రచురించింది. పైపెచ్చు 4 శాతం విదేశీ బొగ్గు తప్పనిసరిగా వాడాలని కేంద్రం కూడా నిబంధన విధించింది. చంద్రబాబు హయాంలో ఇలాంటి కేంద్ర నిబంధనలేమీ లేకపోయినా విదేశీ బొగ్గు కొన్నప్పటికీ, రామోజీ కిమ్మనలేదు. రామోజీ ఈ కుట్రపూరిత రాతలను రాష్ట్ర ఇంధన శాఖ, ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఏపీపీడీసీఎల్), ఏపీజెన్కో ఖండించాయి. వాస్తవాలను ‘సాక్షి’కి వివరించాయి. విదేశీ బొగ్గు తప్పనిసరి అని కేంద్రం ఆదేశాలు దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలు అన్నీ 4 శాతం విదేశీ బొగ్గు తప్పనిసరిగా వాడాలని ఈ నెల 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతకు ముందు జనవరి నెలలో కూడా 6 శాతం విదేశీ బొగ్గు కొనాలంటూ కేంద్రం ఆదేశించింది. కేంద్రం ఆదేశాలను కాదని ముందుకు వెళ్లే అవకాశం రాష్ట్రాలకు లేదు. ఎందుకంటే.. స్వదేశీ బొగ్గు సరఫరా అంతా కేంద్రం చేతుల్లోనే ఉంది. స్వదేశీ బొగ్గు ఏ రాష్ట్రానికి ఎంత కేటాయించాలో కేంద్ర కమిటీ నిర్ణయిస్తుంది. కేంద్రం చెప్పిన మేరకు విదేశీ బొగ్గు కొనకపోతే స్వదేశీ బొగ్గులో కోత విధిస్తుంది. బయట కూడా కొనలేం. అదే జరిగితే రాష్ట్రానికి వచ్చే బొగ్గు తగ్గిపోయి, విద్యుత్ ఉత్పత్తి పడిపోతుంది. పైగా, దేశీయ బొగ్గుకు కూడా కొరత ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో సరిపడినంత బొగ్గు దొరకకపోతే రాష్ట్రం అంధకారమే అవుతుంది. ఇలా రాష్ట్రానికి అన్ని విధాలా నష్టమే కలుగుతుంది. మన రాష్ట్రమే కాదు.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎనీ్టపీసీ, ప్రైవేటు సంస్థలు కూడా కేంద్రం ఆదేశాలను పాటించి విదేశీ బొగ్గు కొంటున్నాయి. అయితే, ఈనాడుకు, టీడీపీకి విద్యుత్ ఉత్పత్తికంటే రాష్ట్రంలో అంధకారం నెలకొనడమే ఇష్టంలా ఉంది. అందుకే ఓ విషపు కథనాన్ని ఈనాడు అచ్చేసింది. చంద్రబాబు ప్రభుత్వంలో అడ్డగోలుగా కొనుగోళ్లు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, ఇటువంటి నిబంధనలేమీ లేకుండానే భారీ మొత్తంలో విదేశీ బొగ్గు కొనుగోలు చేశారు. ఇష్టానుసారం టెండర్లు పిలిచి, సరఫరా సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. దీనివల్ల అప్పట్లో తక్కువ ధరకు బొగ్గు లభించే అవకాశాలు ఉన్నప్పటికీ, ఎక్కువ ధరకే బొగ్గు కొన్నారు. 2015–16 నుంచి 2018–19 మధ్య రివర్స్ టెండరింగ్ లేకుండానే ఏపీపీడీసీఎల్ విదేశీ బొగ్గు కొనుగోలు చేసింది. 2015–16లో 1,24,361 టన్నులు, 2016–17లో 7,67,505 టన్నులు, 2017–18లో 3,80,049 టన్నులు, 2018–19లో 8,31,632 టన్నులు.. ఇలా మొత్తంగా ఆ ఐదేళ్లలో 21.03 లక్షల టన్నుల విదేశీ బొగ్గును బాబు ప్రభుత్వం కొన్నది. ఈ కొనుగోళ్లలో ఎక్కడా పారదర్శకత అన్నది లేదు. రివర్స్ టెండరింగ్ లేదు. దొంగ లెక్కలతో ఇష్టానుసారం టెండర్లు పిలిచి, ఇష్టమొచ్చిన సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టారు. తక్కువ ధరకు బొగ్గు లభించే అవకాశమున్నా, ఎక్కువ ధర చెల్లించారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు పెద్ద మొత్తంలో నష్టం జరిగింది. కృష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్‌కు విదేశీ బొగ్గు తప్పనిసరి రాష్ట్రంలోని కృష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్ స్టేజ్ –1 కింద నిర్మించిన రెండు యూనిట్లకు విదేశీ బొగ్గునే వాడాలి. 70:30 నిష్పత్తిలో స్వదేశీ, విదేశీ హైగ్రేడ్ బొగ్గు వాడాలి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా, ఇవ్వకపోయినా ఈ రెండు యూనిట్లకు ఇది తప్పనిసరి. అందువల్లే హైగ్రేడ్ విదేశీ బొగ్గు కోసం ఏపీపీడీసీఎల్ టెండర్లు పిలిచింది. విదేశీ బొగ్గుతో ప్రజలకూ లాభమే ముడి సరకుల ధరలు పెరగడంవల్ల విద్యుత్ ఉత్పత్తి వ్యయం, సరఫరా ఖర్చులు పెరిగితే ఆ భారాన్ని వినియోగదారుల నుంచే వసూలు చేయాలి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సిఫార్సు ప్రకారమే ట్రూఅప్, ఇంధన సర్దుబాటు ఛార్జీలు వినియోగదారుల నుంచి డిస్కంలు వసూలు చేస్తున్నాయి. దేశీయ బొగ్గుతో పోల్చితే విదేశీ బొగ్గు ధర ఎక్కువ ఉండవచ్చు. కానీ దేశీయ బొగ్గుకు విదేశీ హైగ్రేడ్ బొగ్గు 70:30 నిష్పత్తిలో కలపడంవల్ల అధిక ఉత్పత్తి వస్తుంది. ఉత్పత్తి వ్యయం యూనిట్‌కు రూ. 3.14 మాత్రమే అవుతుంది. బహిరంగ మార్కెట్ ధరతో పోల్చితే ఇది సగం కూడా ఉండదు. చాలాసార్లు మూడో వంతు మాత్రమే. విదేశీ బొగ్గు వల్ల ఎక్కువగా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను రాష్ట్ర ప్రజలకు సరఫరా చేస్తారు. ఆమేరకు బహిరంగ మార్కెట్లో అధిక ధరకు విద్యుత్ కొనాల్సిన భారం తగ్గి ప్రజలకు అంతిమంగా లాభమే చేకూరుతుంది. తెలంగాణతో పోలికేమిటి? తెలంగాణ ప్రభుత్వానికి సొంతంగా సింగరేణి బొగ్గు గనులు ఉన్నాయి. అందువల్ల ఆ రాష్టానికి విదేశీ బొగ్గు అవసరం లేదు. బొగ్గు గనులు లేని ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణతో పోల్చడానికి వీలు లేదు. ఈ తేడా చూడండి రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, రివర్స్ టెండరింగ్ విధానంతో తక్కువ ధరకు విదేశీ బొగ్గు కొనుగోలు చేస్తోంది. ఇందులో రాష్ట్ర ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవహరించినట్లుగా సరఫరా సంస్థలకు ప్రాధా న్యత ఇవ్వడంలేదు. దొంగ రేట్లు నిర్ణయించడంలేదు. కొనుగోళ్లన్నీ పారదర్శకంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది విదేశీ బొగ్గు కోసం పిలిచిన టెండర్లను నాలుగు సార్లు రద్దు చేయడమే ఇందుకు నిదర్శనం. 7.5 లక్షల టన్నుల విదేశీ బొగ్గు కోసం ఏపీపీడీసీఎల్ ఈ ఏడాది టెండర్లు పిలిచింది. ధర ఎక్కువగా ఉండటంతో నాలు గు సార్లు వాటిని రద్దు చేసింది. అయిదోసారి తక్కువ ధరకు నాణ్యమైన బొగ్గు లభిస్తుండటంతో ఆ టెండర్లు ఖరారు చేసింది. ఆ తర్వాత రివర్స్ టెండరింగ్ ద్వారా మరింత తక్కువ ధరతో హైగ్రేడ్ విదేశీ బొగ్గు కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. అన్నీ కలుపుకొని ప్లాంటు వరకు చేర్చేలా టన్నుకు రూ. 13,219 చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. ఇదే హైగ్రేడ్ విదేశీ బొగ్గుకు ఎనీ్టపీసీ రూ.18,509కి కొనుగోలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత నాణ్యమైన బొగ్గును ఎంత తక్కువ ధరకు కొంటోందో, ఎంత ఆదా చేస్తోందో ఈ గణాంకాలే చెబుతున్నాయి. దీనిద్వారా ఉత్పత్తి వ్యయమూ తగ్గి, వినియోగదారులకు లాభమూ కలుగుతుంది. ఎవరైనా టెండర్లు వేయొచ్చు 7.5 లక్షల టన్నుల హ్రైగ్రేడ్ విదేశీ బొగ్గు సరఫరా చేసే సంస్థలు బిడ్లు దాఖలు చేయాలంటూ ఏపీపీడీసీఎల్ అత్యంత పారదర్శకంగా గ్లోబల్ టెండర్లు పిలిచింది. నిబంధనల ప్రకారం ఏ సంస్థ అయినా టెండర్లలో పాల్గొని బిడ్లు వేసి కాంట్రాక్టు దక్కించుకోవచ్చు. అత్యంత నాణ్యమైన హైగ్రేడ్ బొగ్గు సరఫరా చేయవచ్చు. ఇందులో ప్రత్యేకంగా అదానీ సంస్థకు ప్రయోజనం కలిగించే ప్రశ్నే ఉత్పన్నమవదు. టెండర్లలో హడావుడి ఏముంది? ఈ ఏడాది జనవరిలో 7.5 లక్షల టన్నుల విదేశీ బొగ్గు సరఫరాకు ఏపీపీడీసీఎల్ టెండరు ఖరారు చేసింది. అందులో ఇప్పటికే 6.30 లక్షల టన్నులు సరఫరా అయింది. రావాల్సింది 1.20 లక్షల టన్నులు మాత్రమే. ప్రస్తుత అవసరాల్లో అది స్వల్ప పరిమాణమే. అందువల్లే మళ్లీ టెండర్లు పిలిచింది. టెండరు ఖరారు అనేది సుదీర్ఘ ప్రక్రియ. నోటిఫికేషన్ జారీ నుంచి రివర్స్ టెండరింగ్, సంప్రదింపుల ద్వారా ధర తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇదంతా సవ్యంగా పూర్తయ్యాకే ఒప్పందం చేసుకోవాలి. అందువల్ల హడావుడిగా టెండర్లు పిలిచిందనడంలో ఏమాత్రం వాస్తవంలేదు. టెండర్లలో అర్హత ఉన్న ఏ సంస్థలైనా పాల్గొనవచ్చు. ఏ సంస్థలు పాల్గొంటాయన్నది ఎవరూ ముందుగా చెప్పలేరు. ఒకవేళ ఏ సంస్థా టెండర్లలో పాల్గొనలేదంటే లాభదాయకం కాదని అర్థం. అలాంటప్పుడు ఏదో ఒక సంస్థకు ప్రయోజనమని ఎలా చెప్పగలం? టెండరు నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఏ సంస్థలైనా బిడ్లు దాఖలు చేస్తాయి. -
నైజీరియాలో కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థ
అబూజా: ఆఫ్రికా ఖండంలో అత్యధిక జనాభా కలిగిన దేశమైన నైజీరియాలో గురువారం గాఢాంధకారం అలుముకుంది. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థ కుప్పకూలడంతో దేశమంతటా కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఉదయం విద్యుత్ ఉత్పత్తి సున్నా మెగావాట్లుగా నమోదైంది. ఆ తర్వాత క్రమంగా కరెంటు సరఫరాను పునరుద్ధరించారు. నైజీరియాలో కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడడం మామూలే. 2022లో ఏకంగా నాలుగు సార్లు గ్రిడ్ కుప్పకూలింది. అయితే, సాంకేతిక కారణాల వల్లే ఈ సమస్య తలెత్తుతోందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, రెండు విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను అనుసంధానించే లైన్ అగ్నిప్రమాదానికి గురైందని, అందుకే గ్రిడ్ విఫలమైందని నైజీరియా విద్యుత్ శాఖ మంత్రి అడెబయో అడెలాబూ చెప్పారు. -
76 శాతం థర్మల్ ప్లాంట్ల నుంచే
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం విద్యుత్ అవసరాల్లో దాదాపు 76 శాతం అవసరాలను థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నుంచే సమకూర్చుకోవాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 1,750 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా లోక్‌సభలో విద్యుత్, పునరుత్పాదక ఇంథన శాఖ మంత్రి ఆర్కే సింగ్ చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచుకునే ఉద్దేశంతో నిర్మిస్తున్న భిన్నరకాల విద్యుత్ ప్లాంట్ల వివరాలనూ మంత్రి వెల్లడించారు. ‘మొత్తంగా 25వేలకుపైగా మెగావాట్ల సామర్థ్యంతో 18 బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిర్మిస్తున్నారు. వాటిలో ఒకటి గ్యాస్ ఆధారిత థర్మల్ ప్లాంట్ ఉంది. మొత్తంగా 18వేల మెగావాట్ల సామర్థ్యంతో 42 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. 8వేల మెగావాట్ల సామర్థ్యంతో అణువిద్యుత్ కేంద్రాలను నెలకొల్పుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్లు విద్యుత్ సామర్థ్యం దేశం సొంతం. 3.6 శాతం మిగులును సాధించాం. డిమాండ్ అత్యధికంగా ఉన్నప్పుడూ 0.7 శాతం మిగులును సాధించాం’ అని మంత్రి వెల్లడించారు. అయితే 2023 ఏప్రిల్–జూన్ కాలంలో మాత్రం 0.2 శాతం లోటు కనిపించిందని మరో ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా మంత్రి వెల్లడించడం గమనార్హం. -
అంచనాలకు మించి జల విద్యుదుత్పత్తి
విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో.. జెన్కో కాసుల పంట పండింది. గత ఏప్రిల్ 1 నుంచి ఈ నెల 10 వరకు భారీగా 3849.79 మిలియన్ యూనిట్ల (ఎంయూ) జల విద్యుదుత్పత్తి జరిపింది. సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో.. తెలంగాణ విద్యుదు త్పత్తి సంస్థ (జెన్కో) కాసుల పంట పండించింది. గత ఏప్రిల్ 1 నుంచి ఈ నెల 10 వరకు భారీగా 3,849.79 మిలియన్ యూనిట్ల (ఎంయూ) జల విద్యుదుత్పత్తి జరిపింది. అందులో 480.78 ఎంయూలను గడిచిన పది రోజుల్లోనే ఉత్పత్తి చేయడం విశేషం. గతేడాది మాదిరే మంచి వర్షాలు కురిస్తే 2022–23 ఆర్థిక సంవత్సరంలో 3,718.53 ఎంయూల ఉత్పత్తికి అవకాశముందని జెన్కో అంచనా వేయగా, ఈ అంచనాలను తలకిందులు చేస్తూ ఇప్పటికే 3,849 ఎంయూల ఉత్పత్తి జరగడం గమనార్హం. తొలి అర్ధ వార్షికం ముగిసే (సెప్టెంబర్ చివరి) నాటికే 3,369 ఎంయూల ఉత్పత్తి జరిగింది. 6,000 ఎంయూల ఉత్పత్తికి అవకాశం కృష్ణా బేసిన్‌లోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల తదితర జలాశయాల్లో నిల్వ ఉన్న 578 టీఎంసీల జలాలతో 2,052 ఎంయూలు, గోదావరి బేసిన్‌లోని నిజాంసాగర్, పోచంపాడు తదితర జలాశయాల్లో నిల్వ ఉన్న 137 టీఎంసీలతో 138 ఎంయూలు కలిపి మొత్తం 2,190 ఎంయూల జలవిద్యుత్ ఉత్పత్తికి అవకాశముందని జెన్కో అంచనాలు పేర్కొంటున్నాయి. సెప్టెంబర్‌తో నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసినా, ఇంకా విస్తారంగా వర్షాలు కొనసాగుతున్నాయి. జలాశయాలన్నీ నిండి ఉండటంతో విద్యుదుత్పత్తి ద్వారా వచ్చిన నీళ్లను వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి తెలంగాణ జెన్కో రికార్డుస్థాయిలో 6,000 ఎంయూల జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశముంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో.. 900 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం కలిగిన శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుదుత్పత్తి కేంద్రంలో ఒక్కొక్కటీ 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 6 యూనిట్లు ఉండగా, ఐదు యూనిట్లు మాత్రమే ఉత్పత్తికి లభ్యంగా ఉన్నాయి. రెండేళ్ల కింద జరిగిన అగ్నిప్రమాదంలో కాలిపోయిన ఓ యూనిట్ పునరుద్ధరణ ఇంకా పూర్తికాలేదు. ఇక్కడి నుంచి 100% స్థాపిత సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేయడానికి 45 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో అవసరం. ఇప్పటికే శ్రీశైలంలో నిల్వ ఉన్న 214 టీఎంసీల జలాలతో 1,009 ఎంయూల జల విద్యుదుత్పత్తి చేయొచ్చని జెన్కో అంచనా వేసింది. కొనసాగుతున్న ఇన్‌ఫ్లోను పరిగణనలోకి తీసుకుంటే ఉత్పత్తి మరింత పెరగనుంది. ►815.6 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం కలిగిన నాగార్జునసాగర్ జలవిద్యుత్ కేంద్రంలో 100శాతం ఉత్పత్తి చేసేందుకు 35 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో అవసరం. జలాశయంలో నిల్వ ఉన్న 311 టీఎంసీలతో 987 ఎంయూల జలవిద్యుదుత్పత్తికి అవకాశం ఉంది. డిస్కంలకు భారీ ఊరట తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్న డిస్కంలను.. ఈ ఏడాది జల విద్యుత్ కొంత వరకు ఆదుకుంది. చౌక ధరకు లభించే జల విద్యుత్ భారీ మొత్తంలో ఉత్పత్తి కావడంతో డిస్కంలపై విద్యుత్ కొనుగోళ్ల భారం కొంత తగ్గింది. 2022–23లో మొత్తం 3,561 ఎంయూల జలవిద్యుత్ కొనుగోళ్లు చేసేందుకు డిస్కంలకు విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతిచ్చింది. ఇందుకు రూ.1,307 కోట్లను ఫిక్స్డ్ చార్జీలుగా జెన్కోకు చెల్లించాలని ఆదేశించింది. జలవిద్యుత్‌కు వేరియబుల్ చార్జీలేమీ ఉండవు... అంతే వ్యయానికి అదనంగా ఉత్పత్తైన జల విద్యుత్‌ను సైతం డిస్కంలకు జెన్కో సరఫరా చేయాల్సి ఉంటుంది. దీంతో కనీసం రూ.వెయ్యి కోట్లకు పైగా రాష్ట్ర డిస్కంలకు ఆదా కానుంది. -
చెత్తకూ పవరుంది!
సాక్షి, అమరావతి: రోజురోజుకు పేరుకుపోతున్న చెత్త నగరాలు, పట్టణాలనే కాదు.. పచ్చని పల్లెలకూ సవాలు విసురుతోంది. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల (యూఎల్బీల) నుంచి రోజుకు 4,200 మెట్రిక్ టన్నుల చెత్త వస్తున్నట్టు తేలింది. ఈ చెత్త సమస్య పరిష్కారానికి ఉన్న వాటిలో ఉత్తమ మార్గం.. దాన్ని మండించి విద్యుత్ ఉత్పత్తి చేయడమే. ఈ ప్రక్రియ మన దేశంలో 1987లో ఢిల్లీలో మొదలైంది. అక్కడే మొదటి ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఇలా మున్సిపల్ వ్యర్థాలతో నడిచే విద్యుత్ ప్లాంట్లు ఢిల్లీ, జబల్పూర్, హైదరాబాద్‌లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. మన రాష్ట్రంలో రెండు ఉన్నాయి. గుంటూరు, విశాఖపట్నం నగరాలకు సమీపంలో ఒక్కోటి గంటకు 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు రెండింటిని రూ.640 కోట్లతో జిందాల్ సంస్థ నిర్మించింది. చెత్తే ఇంధనంగా విద్యుత్ ఉత్పత్తి పల్నాడు జిల్లా కొండవీడులో ఏర్పాటు చేసిన ఈ పవర్ ప్లాంట్‌కు విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు సమీపంలోని మరో 9 మున్సిపాలిటీల నుంచి ఘన వ్యర్థాలను తరలిస్తున్నారు. విశాఖ సమీపంలోని కాపులుప్పాడ వద్ద ఏర్పాటు చేసిన ప్లాంటుకు గ్రేటర్ విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం పట్టణాల చెత్తను తరలిస్తున్నారు. ఇక్కడ గార్బేజ్ పిట్స్‌లో వారం రోజులు ఆరబెట్టి, వాటి నుంచి విడుదలయ్యే మీథేన్, ఇతర వాయువులను ఫ్యాన్ల ద్వారా బర్నింగ్ చాంబర్‌కు అనుసంధానించారు. గార్బేజ్ పిట్లో చెత్తను క్రేన్లతో బర్నింగ్ చాంబర్లో వేసి ఈ గ్యాస్‌తో మండించి 1,000 డిగ్రీల వేడిని ఉత్పత్తి చేస్తున్నారు. దీనితో నీటిని ఆవిరిగా మార్చి టర్బయిన్లు తిప్పి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ప్లాంట్స్ ఒక్కోదానిలో రోజుకు 1,200 టన్నుల చెత్తను మండిస్తారు. 15 మెగావాట్ల చొప్పున 30 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ప్లాంట్ అవసరాలకు పోను 13.5 మెగావాట్ల చొప్పున 27 మెగావాట్లను గుంటూరు జిల్లా వెంగళాయపాలెం సబ్ స్టేషన్‌కు, విశాఖలోని విద్యుత్‌ను ఆనందపురం సబ్‌స్టేషన్‌కు సరఫరా చేస్తున్నారు. పట్టణ ఘన వ్యర్థాల్లో ఈ రెండు ప్లాంట్లకు చేరుతున్నది 1,800 నుంచి 1,900 టన్నులు. మిగిలిన చెత్తను సాధ్యమైనంత మేర తరలిస్తే మరింత విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. సమర్థంగా ఉప వ్యర్థాల వినియోగం కుళ్లిన చెత్త నుంచి ప్రధానంగా బయో గ్యాస్, లీచెట్ విడుదలవుతాయి. వీటిని జిందాల్ ప్లాంట్లలో సమర్థంగా శుద్ధి చేసి వినియోగిస్తున్నారు. రోజూ 1,200 టన్నుల వ్యర్థాల నుంచి 100 కిలో లీటర్ల (1కిలో లీటర్=1000 లీటర్లు) లీచెట్ వస్తోంది. లీటర్ లీచెట్‌లో 70 వేల నుంచి లక్ష మిల్లీగ్రాముల కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (సీఓడీ)తో పాటు ఇతర ప్రమాదకర రసాయనాలుంటాయి.దీన్ని భూమిలోకి ఇంకకుండా పిట్ అడుగునున్న చాంబర్ల ద్వారా సేకరించి శుద్ధి చేయగా 60 కిలో లీటర్ల శుద్ధి జలాలు, 35 కిలో లీటర్ల రిజెక్ట్ వాటర్‌తో పాటు 5 కిలో లీటర్ల స్లెడ్జ్ ఉత్పత్తి అవుతోంది. శుద్ధి జలాలను మొక్కలకు, రిజెక్ట్ వాటర్‌ను బూడిదను చల్లబరిచేందుకు, స్లెడ్జ్‌ను ఎండబెట్టి తిరిగి చెత్త మండించేందుకు వినియోగిస్తున్నారు, అంటే ఘన వ్యర్థాల నుంచి వచ్చే ఉప వ్యర్థాలను సైతం నూరు శాతం తిరిగి వినియోగిస్తున్నారు. ప్లాంట్లలో జరిగే కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు కాలుష్య నియంత్రణ మండలితో అనుసంధానించారు. కాలుష్య రహితంగా ప్లాంట్ నిర్వహణ దేశంలో ఉన్న ఐదు ప్లాంట్లలో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన రెండూ మన రాష్ట్రంలోనే ఉన్నాయి. జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలో రోజుకు వందల టన్నుల చెత్తను మండించినా కాలుష్యం ప్లాంట్ దాటి వెళ్లే పరిస్థితి లేదు. థర్మల్ విద్యుత్ ప్లాంట్ విడుదల చేసే కాలుష్యంలో 10 శాతానికంటే తక్కువ కారకాలు విడుదలవుతుండగా, వాటిని గాల్లోకి చేరకుండా ఆధునిక టెక్నాలజీతో అడ్డుకుంటున్నారు. బాయిలర్ అడుగున పడే బూడిదను, బ్లోయర్ల ద్వారా వచ్చే ఫ్లైయాష్‌ను, లీచెట్ శుద్ధి చేయగా వచ్చిన నీటితో చల్లబరిచి రోడ్లపై గుంతలు పూడ్చడానికి వినియోగిస్తున్నారు. మరోపక్క ఫ్లై యాష్‌తో ఇటుకల తయారీపై కూడా ప్రయోగాలు చేస్తున్నారు. రాష్ట్రంలో సగటున ఓ ఇంటికి రోజుకు 10 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తారు. నెలకు 300 యూనిట్లు. ఓ ఇంటి నుంచి రోజుకు సగటున వచ్చే చెత్త 2.5 కిలోలని మున్సిపల్ శాఖ లెక్కగట్టింది. నెలకు ఒక్కో ఇంటి నుంచి సుమారు 75 కేజీలు. పల్నాడు జిల్లా కొండవీడు వద్ద, విశాఖపట్నం సమీపంలోని కాపులుప్పాడ వద్ద ఉన్న ‘జిందాల్ ఎకోపోలిస్ ఎనర్జీ ప్లాంట్లు’ గంటకు 30 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. అంటే దాదాపు 72 వేల ఇళ్లకు ఒక రోజుకు సరిపోయేటంత. విద్యుత్, చెత్త వేర్వేరు. మనం నిత్యం బయట పడేసే చెత్త ద్వారానే విద్యుత్ తయారై తిరిగి మన ఇంటికి వెలుగునిస్తుంది. ఇలా.. వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తిపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్టు. మరో ఏడు ప్లాంట్లకు అవకాశం ఏపీ మున్సిపాలిటీల్లో రోజూ సుమారు 4,200 మెట్రిక్ టన్నుల చెత్త వస్తోంది. ఇది ఏటా 5 శాతం పెరుగుతుందని సర్వే చెబుతోంది. మా ప్లాంట్లు రెండింటిలోనూ గంటకు 20 మెగావాట్లు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. అనుకున్న స్థాయిలో చెత్తను అందిస్తే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేయగలం. మా ప్రగతిలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కృషి ఎంతో ఉంది. రాష్ట్రంలో మరో ఏడు ప్రాంతాల్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటుకు అవకాశం ఉంది. – ఎం.వి.చారి, జిందాల్ ఏపీ ఆపరేషన్స్ ప్రెసిడెంట్ సమర్థంగా వ్యర్థాల నిర్వహణ మున్సిపల్ ఘన వ్యర్థాలతో విద్యుత్ తయారీ ప్లాంట్లు దేశంలో ఐదు ఉండగా, వాటిలో రెండు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వాహనాలతో ఎప్పటికప్పుడు యూఎల్బీల నుంచి ప్లాంట్లకు చెత్త తరలిస్తున్నాం. దీనివల్ల వ్యర్థాల నిర్వహణ సమర్థంగా జరుగుతుంది. – డాక్టర్ సంపత్‌కుమార్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ -
జలవిద్యుత్ కేంద్రాలను పరిశీలించిన జెన్కో ఎండీ
సీలేరు (విశాఖ): విద్యుత్ ఉత్పత్తిలో దేశానికే తలమానికంగా నిలిచిన సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ పరిధిలోని పలు జలవిద్యుత్ కేంద్రాలను జెన్కో మేనేజింగ్ డైరెక్టర్ డి.శ్రీధర్ శనివారం సాయంత్రం సందర్శించారు. తొలుత మోతుగూడెం జలవిద్యుత్ కేంద్రాన్ని పరిశీలించి.. అక్కడే మరో రెండు యూనిట్ల నిర్మాణానికి సంబంధించిన ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే డొంకరాయి జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు. దీనిని ఆనుకుని ఉన్న రిజర్వాయర్ వద్దకు వెళ్లి నీటి మట్టాలను పరిశీలించారు. డొంకరాయి, మోతుగూడెం విద్యుత్ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఇంజనీర్లు.. ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి బదిలీ ప్రక్రియ చేపట్టాలని కోరారు. త్వరలో బదిలీల ప్రక్రియ చేపడతామని ఆయన హామీ ఇచ్చారని ఇంజనీర్లు తెలిపారు. నేడు సీలేరు, బలిమెల పర్యటన.. సీలేరు విద్యుత్ కాంప్లెక్సులో మొదటిరోజు పర్యటించిన జెన్కో మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ ఆదివారం సీలేరు జలవిద్యుత్ కేంద్రం, గుంటవాడ, బలిమెల జలాశయాలను సందర్శించనున్నట్లు తెలిసింది. అలాగే సీలేరు ఎత్తిపోతల పధకానికి సంబంధించిన ప్రదేశాన్ని పరిశీలించి ఒడిశాలో ఏపీ పవర్‌హౌస్ నిర్మాణానికి సంబంధించిన అంశాలపై స్థానిక అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. చీఫ్ ఇంజనీర్ (హెచ్పీసీ) సుజికుమార్‌తో పాటు సీలేరు కాంప్లెక్స్ చీఫ్ ఇంజనీర్ రాంబాబు, ఎస్ఈ ప్రశాంత్‌కుమార్, డీఈ బాలకృష్ణ, బాబురావు, తదితరులున్నారు. -
వ్యర్థాలే ‘పవర్’ ఫుల్!
సాక్షి, అమరావతి: వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీకి రంగం సిద్ధమైంది. డంపింగ్ యార్డులో కుప్పలుగా పడి పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఈ వ్యర్థాలు ఇకపై వెలుగులను వెదజల్లనున్నాయి. దీనికి గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని నాయుడుపేటలో 15.50 ఎకరాల్లో ఏర్పాటు చేసిన కర్మగారం వేదికగా కానుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో జిందాల్ సంస్థ రూ.340 కోట్లతో ఈ కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. గత సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 8 వరకూ ప్రయోగాత్మకంగా ఇక్కడ విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఇది విజయవంతమవడంతో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్మాగారంలో విద్యుదుత్పత్తి జరిగే విధానంపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది.. ఇలా ఉత్పత్తి.. రోజుకు 1,200 మెట్రిక్ టన్నుల వ్యర్థాలతో 15 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. విజయవాడ, గుంటూరు, తాడేపల్లి–మంగళగిరి నగరపాలక సంస్థలతో పాటు సత్తెనపల్లి, చిలకలూరిపేట, నరసరావుపేట, పొన్నూరు, తెనాలి పురపాలక సంస్థల నుంచి వ్యర్థాలను ఇక్కడికి తీసుకొస్తారు. లారీల్లో వచ్చే చెత్తను కర్మాగారంలోని పిట్లో అన్లోడ్ చేస్తారు. చెత్తను నిల్వ చేసేందుకు 25 మీటర్ల వెడల్పు, 71 మీటర్ల పొడవుతో పిట్‌ను నిర్మించారు. పిట్లో ఉన్న వ్యర్థాలను గ్రాబ్ క్రేన్ సాయంతో ఫీడర్లో వేస్తారు. ఫీడర్ కింద అమర్చిన సోటకర్ నుంచి వెలువడే మంటలో వ్యర్థాలను మండిస్తారు. ఇవి మండినప్పుడు వచ్చే వేడికి బ్రాయిలర్‌లో స్టీమ్ వెలువడుతుంది. ఈ స్టీమ్.. టర్బైన్లను తిప్పినప్పుడు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 20 మెగా వాట్ల టర్బైన్ను అమర్చారు. ఉత్పత్తి అయిన విద్యుత్‌ను వెంగళాయపాలెంలోని విద్యుత్ సబ్ స్టేషన్‌కు సరఫరా చేసేందుకు వీలుగా కర్మాగారం నుంచి 32 కేవీ విద్యుత్ లైన్‌ను వేశారు. కర్మాగారంలో 11/33 కేవీ స్విచ్ యార్డు నెలకొల్పారు. కర్మాగారంలో ఉత్పత్తి అయిన విద్యుత్‌ను డిస్కమ్‌లకు యూనిట్‌కు రూ.6.16కు విక్రయిస్తారు. వ్యర్థాలు మండినప్పుడు బాటమ్ యాష్, ఫ్లైయాష్ అనే రెండు రకాలైన బూడిద వెలువడుతుంది. ఫ్లైయాష్‌ను నిర్మాణాలకు వాడే ఇటుకల తయారీకి వినియోగిస్తారు. బాటమ్ యాష్‌ను లోతట్టు ప్రాంతాల్లో పూడిక కోసం వినియోగించవచ్చు. ఇదే తరహాలో విశాఖలోనూ.. గుంటూరు తరహాలోనే విశాఖపట్నంలో 15 మెగా వాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం గల మరో కర్మాగారం నిర్మాణంలో ఉంది. 2016లో కర్మాగారాల ఏర్పాటుకు జిందాల్ సంస్థకు అనుమతులు లభించినా, అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో పనులు వేగంగా జరగలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ఈ రెండు కర్మాగారాల ఏర్పాటుతో సుమారు 400 మందికి ఉపాధి లభిస్తోంది. వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ కర్మాగారాలు దేశంలో ఇప్పటికే ఐదు ఉన్నాయి. ఢిల్లీలో మూడు, మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్, హైదరాబాద్‌లో ఒక్కొక్కటి చొప్పున ఉండగా, ఏపీలో ఉన్న రెండింటితో కలిపి మొత్తం ఏడయ్యాయి. త్వరలోనే విద్యుదుత్పత్తి ప్రయోగాత్మక పరిశీలన విజయవంతమైంది. కమర్షియల్ ఆపరేషన్ డేట్(సీవోడీ) కోసం ఏపీసీపీడీసీఎల్‌కు దరఖాస్తు చేశాం. సీవోడీ మంజూరైతే విద్యుదుత్పత్తిని ప్రారంభిస్తాం. త్వరలోనే కర్మాగారంలో పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. – ఎంవీ చారి, జిందాల్ ఏపీ ప్రాజెక్ట్‌ల ప్రెసిడెంట్ -
రికార్డు స్థాయిలో జల విద్యుదుత్పత్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జల విద్యుదుత్పత్తి గణనీయంగా పెరిగింది. బుధవారం ఒక్కరోజే అత్యధికంగా 34.17 మిలియన్ యూనిట్ల జల విద్యుదుత్పత్తి జరిగింది. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు ఇదే అత్యధిక ఉత్పత్తి. రాష్ట్రంలోని జల విద్యుత్ కేంద్రాల స్థాపిత సామర్థ్యంలో 100 శాతం వరకు విద్యుదుత్పత్తి జరపాలని జెన్కోను ఆదేశిస్తూ గత సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వెంటనే జెన్కో ఉత్పత్తి పెంచింది. సోమవారం 11.13 ఎంయూల విద్యుత్ ఉత్పత్తి జరగగా, మంగళవారం 22.27 ఎంయూలు, బుధవారం 34.17 ఎంయూలకు ఉత్పత్తి పెరిగింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు ప్రస్తుతం రోజుకు 3 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుం డటంతో, ఈ అవసరాలను తీర్చేందుకు జలవిద్యుత్ ఉత్పత్తి పెంచినట్లు జెన్కో ఉన్నత స్థాయి అధికారవర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో బుధవారం అత్యధిక విద్యుత్ డిమాండ్ 11,116 మెగావాట్లు ఏర్పడగా, అందులో 1,400 మెగావాట్ల డిమాండ్‌ను జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా తీర్చారు. శ్రీశైలం, సాగర్‌లో భారీగా ఉత్పత్తి.. ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు, కృష్ణా బోర్డు సూచనలను బేఖాతరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుదుత్పత్తి కేంద్రంలో ఉత్పత్తి గణనీయంగా పెంచింది. శ్రీశైలం ఎడమగట్టుతో పాటు నాగార్జునసాగర్ జల విద్యుత్ కేంద్రంలోనూ భారీగా పెంచింది. గత సోమవారం శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో 4.42 ఎంయూల ఉత్పత్తి జరగగా, బుధవారం నాటికి 12.97 ఎంయూలకు పెంచారు. నాగార్జున సాగర్ జల విద్యుత్ కేంద్రంలో సోమవారం 1.89 ఎంయూల ఉత్పత్తి జరగగా, మంగళవారం 6.76 ఎంయూలు, బుధవారం 16.12 ఎంయూలకు పెంచారు. విద్యుదుత్పత్తి ద్వారా శ్రీశైలం జలాశయం నుంచి బుధవారం 22,239 క్యూసెక్కులు, గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు 28,252 క్యూసెక్కుల జలాలను రాష్ట్రం దిగువకు విడుదల చేసింది. జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు, గరిష్ట నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా, గురువారం మధ్యాహ్నం 3 గంటల నాటికి 823 అడుగుల నీటి మట్టం, 43.4 టీఎంసీల నిల్వలు ఉన్నాయి. ఆ సమయానికి ఎగువ నుంచి 10,728 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోలు వచ్చాయి. వార్షిక లక్ష్యం 2 వేల ఎంయూలు రాష్ట్రంలోని 11 జల విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 2021–22 ఆర్థిక సంవత్సరంలో 2 వేల ఎంయూల విద్యుత్ ఉత్పత్తి చేయాలని జెన్కో లక్ష్యంగా పెట్టుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణా, గోదావరి బేసిన్‌లోని జలాశయాలకు వచ్చే వరద ప్రవాహంపై ఆయా జల విద్యుత్ ఉత్పత్తి ఆధారపడి ఉండనుంది. ఈ ఏడాది వర్షాలు బాగా పడి ఆగస్టు, సెప్టెంబర్‌లోగా జలాశయాలు నిండితే లక్ష్యానికి మించి ఉత్పత్తి చేయడానికి అవకాశముందని జెన్కో అధికారులు తెలిపారు. -
టీఎస్ జెన్కో అధికారులకు పులిచింతల ఎస్ఈ మెమోరాండం
సాక్షి, విజయవాడ: ప్రొటోకాల్ ప్రకారం పులిచింతల ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని ఎస్ఈ రమేష్‌బాబు ఆదేశించారు. విద్యుదుత్పత్తికి, నీటి కేటాయింపులకు ప్రొటోకాల్ ఉందని తెలిపారు. ఇందుకు సంబంధించి తెలంగాణ అధికారులు, ఏపీ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. గడిచిన రెండేళ్లలో ప్రొటోకాల్ ప్రకారమే విద్యుదుత్పత్తి జరిగింది.. కానీ ఇప్పుడు తెలంగాణ అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని తెలిపారు. జూన్ 29 నుంచి టీఎస్ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తోందన్నారు. డెల్టాలో ఇప్పటివరకు నారుమళ్లు ప్రారంభం కాలేదు, నీటి అవసరాలు లేవని.. ఈ పరిస్థితుల్లో నీటిని కిందకు వదిలితే సముద్రంలో కలుస్తాయని తెలిపారు. ఇరిగేషన్ అవసరాలు ప్రారంభమైన తర్వాతే.. విద్యుదుత్పత్తి ప్రారంభించాలని తెలంగాణ అధికారులను కోరాం అని ఎస్ఈ రమేష్ బాబు తెలిపారు. చదవండి: తెలంగాణను నియంత్రించండి -
తెలంగాణను నియంత్రించండి
సాక్షి, అమరావతి: పులిచింతల ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి చేయకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని నియంత్రించాలని కృష్ణా బోర్డును ఏపీ ప్రభుత్వం కోరింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ ఏకపక్షంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న తెలంగాణ సర్కార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కృష్ణా డెల్టాలో పంటల సాగుకు నీటి అవసరాలు లేకున్నా.. నాగార్జునసాగర్, పులిచింతల నుంచి దిగువకు విడుదల చేసిన జలాలను తెలంగాణ కోటా కింద వినియోగించుకున్నట్టే లెక్కించాలని కూడా విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయపురేకు ఏపీ జల వనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి బుధవారం లేఖ రాశారు. ఆ లేఖలో ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. ► కృష్ణా డెల్టా నీటి అవసరాలను తీర్చేందుకు 45.77 టీఎంసీల సామర్థ్యంతో పులిచింతల ప్రాజెక్టును నిర్మించాం. విభజన తర్వాత ఈ ప్రాజెక్టు ఏపీ ప్రభుత్వ నిర్వహణలో ఉంది. ఈ ప్రాజెక్టుకు అనుబంధంగా 120 మెగావాట్ల సామర్థ్యంతో జల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. ఈ జల విద్యుత్ కేంద్రం తెలంగాణ అధీనంలో ఉంది. ► కృష్ణా డెల్టాలో పంటల సాగుకు నీటిని విడుదల చేయాలని ఎస్ఈ (విజయవాడ) ప్రతిపాదనలు పంపినప్పుడు తెలంగాణ జెన్కో అధికారులు విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు నీటిని విడుదల చేయాలన్నది ప్రాజెక్టు నియమావళి. ► ప్రస్తుత ఖరీఫ్‌లో కృష్ణా డెల్టాలో పంటల సాగుకు నీటిని విడుదల చేయలేదు. కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయాలని ఎస్ఈ ఎలాంటి ప్రతిపాదనలు పంపకున్నా, మంగళవారం ఉదయం 8 గంటల నుంచి పోలీసు పహరా మధ్య తెలంగాణ జెన్కో అధికారులు ఏకపక్షంగా విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ► బుధవారం నాటికి పులిచింతల ప్రాజెక్టులో 18.07 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేసే ప్రకాశం బ్యారేజ్ నీటి నిల్వ సామర్యం 3.07 టీఎంసీలే. ఈ దృష్ట్యా కృష్ణా డెల్టాకు నీటి అవసరాలు లేకపోయినా పులిచింతల నుంచి నీటిని విడుదల చేయడం వల్ల.. ఆ నీటిని ప్రకాశం బ్యారేజీ ద్వారా వృథాగా సముద్రంలోకి వదలాల్సి ఉంటుంది. ► కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయడానికి బోర్డు నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తోంది. తెలంగాణలో జల విద్యుత్‌ను వంద శాతం సామర్థ్యంతో ఉత్పత్తి చేయాలని గత నెల 28న ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ జెన్కో నిబంధనలు తుంగలో తొక్కి అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఈ దృష్ట్యా తెలంగాణపై కఠిన చర్యలు తీసుకోండి. -
పెరుగుతున్న ఏపీ జెన్కో సామర్థ్యం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ రంగ సంస్థ.. ఏపీ జెన్కో ఉత్పత్తి సామర్థ్యం మరింత పెరగబోతోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం (కృష్ణపట్నం)లో కొత్తగా 800 మెగావాట్లు అందుబాటులోకి రానుంది. మే 20 నాటికి ఈ ప్లాంట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి మొదలవుతుంది. దీన్ని గ్రిడ్‌కు అనుసంధానం చేస్తారు. జూన్ నెలాఖరు నాటికి వాణిజ్య ఉత్పత్తి (సీవోడీ)కి సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 5,010 మెగావాట్లు . కృష్ణపట్నం కొత్త యూనిట్‌ను కూడా కలుపుకుంటే ఇది 5,810 మెగావాట్లు అవుతుంది. వాస్తవానికి ఇబ్రహీంపట్నంలోని మరో 800 మెగావాట్ల ప్లాంట్ కూడా ఇదే సమయానికి అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ కాంట్రాక్టు సంస్థ నిర్మాణ పనుల్లో ఆలస్యం చేసింది. రెండేళ్లుగా పుంజుకున్న వేగం ► కృష్ణపట్నంలో మొదటి దశలో 800 మెగావాట్ల రెండు సూపర్ క్రిటికల్ (అత్యాధునిక టెక్నాలజీ) థర్మల్ యూనిట్లను నిర్మించారు. రెండో దశలో మరొక ప్లాంట్‌ను 2015లో ప్రారంభించారు. వాస్తవానికి ఇది 2018లోనే పూర్తవ్వాలి. కానీ గత టీడీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా కాంట్రాక్టులు ఇవ్వడం, సకాలంలో ప్రాజెక్టు పూర్తవ్వని కారణంగా వ్యయం పెరిగింది. ► కొత్తగా ఏర్పడ్డ ఈ ప్లాంటుకు మహానది కోల్ ఫీల్డ్ (ఎంసీఎల్) నుంచి ఏడాదికి 3.54 మిలియన్ టన్నుల బొగ్గు లింకేజీ కూడా ఉంది. రెండు ప్రాజెక్టులను ఒకే కాంట్రాక్టు సంస్థకు కాకుండా.. సివిల్ బాయిలర్, టరై్బన్, జనరేటర్ (బీటీజీ)ని ప్రభుత్వ రంగ సంస్థ.. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్)కు ఇచ్చారు. సివిల్ కాంట్రాక్టు పనులను టాటా సంస్థకు అప్పగించారు. ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ రెండు థర్మల్ ప్లాంట్ల పనులపై దృష్టి పెట్టింది. జాప్యం చేస్తే నిర్మాణ వ్యయం పెరిగి, విద్యుత్ ధర ఎక్కువయ్యే ప్రమాదం ఉండటంతో ప్లాంట్ల నిర్మాణ ప్రక్రియలో వేగం పెంచింది. ఒక్కోదానికి రూ. వెయ్యి కోట్ల చొప్పున ప్రభుత్వమే గ్యారెంటీగా ఉండి అప్పు ఇప్పించేందుకు ముందుకొచి్చంది. దీంతో పలు ఆర్థిక సంస్థలు ముందుకొచ్చాయి. రాష్ట్రానికి ఉపయోగాలివే.. ► జెన్కో కొత్త ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తే బయట నుంచి విద్యుత్‌ను కొనాల్సిన అవసరం తప్పుతుంది. ► అలాగే డిమాండ్ (పీక్) టైమ్‌లో కోతలకు ఆస్కారం లేకుండా విద్యుత్‌ను అందించవచ్చు. ► ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి నూటికి నూరు శాతం విద్యుత్ లభ్యతకు గ్యారెంటీ ఉంటుంది. ► అత్యధిక పీఎల్ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్) వచ్చే అవకాశం ఉంది. జూన్‌లో ఉత్పత్తి కృష్ణపట్నం 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్‌ను జూన్ చివరి నాటికి పూర్తి స్థాయిలో ఉత్పత్తిలోకి తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే స్టీమ్‌లైన్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాల మేరకు ఫ్యూల్ గ్యాస్ డీ సల్ఫరైజేషన్ (ఎఫ్‌జీడీ) ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. కింది భాగం నుంచే బూడిద విడుదలయ్యే కొత్త టెక్నాలజీని ఈ ప్లాంట్‌లో ఉపయోగిస్తున్నాం. ఈ ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభిస్తే రాష్ట్రానికి రోజుకు మరో 35 మిలియన్ యూనిట్ల విద్యుత్ అదనంగా అందుతుంది. – చంద్రశేఖర్‌రాజు, థర్మల్ డైరెక్టర్, జెన్కో -
నీరు ఉమ్మడి సంపద: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
న్యూఢిల్లీ: నీరు ప్రజల ఉమ్మడి వారసత్వ సంపదనే స్పృహ కలిగించేలా చట్టాలుండాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. ఆయన శక్రవారమిక్కడ నాలుగవ ‘భారత్ జలవారోత్సవం’ ముగింపు ఉత్సవంలో ప్రసంగించారు. చాలా సామాజిక వర్గాలకు ఇప్పటికీ నీరు అందుబాటులో లేదని ఆవేదన చెందారు. స్థానిక పరిష్కారాలతోనే ఈ సమస్యను అధిగమించొచ్చని సూచించారు. ‘ఆదాయ సంపాదన కన్నా నీటి సేకరణకు ప్రజలు అధిక సమయం, శక్తులను వెచ్చిస్తున్నారు. స్థానికంగా అమలయ్యే సాంకేతికత, వినూత్న పద్ధతులను ప్రవేశపెట్టాలి’అని చెప్పారు. నీటి సంరక్షణకు వాననీటిని ఒడిసిపట్టాలని , ఈ పనులను గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అనుసంధానించాలన్నారు. కాగా, నిర్మాణంలో ఉన్న 31 ప్రాజెక్టులు, నదుల అనుసంధాన ప్రక్రియ పూర్తయితే 35 మిలియన్ హెక్టార్లకు సాగునీరు ఇవ్వడంతో పాటు 34 వేల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని జలవనరుల మంత్రి ఉమాభారతి చెప్పారు. -
విద్యుదుత్పత్తిలో టీజెన్‌కో రికార్డు
79.21 శాతం పీఎల్ఎఫ్ నమోదు దేశంలోనే రెండో స్థానం ఏపీజెన్కోకు మూడో స్థానం నంబర్ వన్ స్థానంలో ఒడిశా సాక్షి, హైదరాబాద్: విద్యుత్తు ఉత్పత్తిలో తెలంగాణ జెన్కో రికార్డు నెలకొల్పింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్)లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని విద్యుత్తు ప్లాంట్ల సామర్థ్యాన్ని విశ్లేషిస్తూ సగటున 79.21 శాతం విద్యుత్తు ఉత్పత్తి జరిగినట్లు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) నిర్ధారించింది. ఇటీవలే దేశవ్యాప్తంగా అన్ని థర్మల్ పవర్ ప్లాంట్ల ఉత్పత్తి ప్రగతి నివేదికలను అథారిటీ విడుదల చేసింది. ప్లాంట్ల వారీగా ప్రతి నెలా విద్యుత్తు ఉత్పత్తి గణాంకాల ఆధారంగా ఈ నివేదికను తయారు చేసింది. దీని ప్రకారం... ఒడిశా రాష్ట్రంలోని విద్యుత్తు ప్లాంట్లు ఉత్పత్తిలో నంబర్ వన్‌గా నిలిచాయి. అత్యధికంగా 81.71 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్‌తో ఒడిశా దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడు నెలల వ్యవధిలో దేశంలో సగటున ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ 64.82 శాతంగా నమోదైంది. తెలంగాణ జెన్కో అంతకంటే 14.39 శాతం ఎక్కువ పీఎల్ఎఫ్ శాతం నమోదు చేయడం విశేషం. తెలంగాణ జెన్కో అధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న థర్మల్ విద్యుత్తు ప్లాంట్ల మొత్తం సామర్థ్యం 2082.5 మెగావాట్లు. కాగా, 76.90 శాతం పీఎల్‌ఎఫ్‌తో ఏపీ జెన్కో మూడో స్థానంలో ఉంది. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు.. వరుసగా ఆ తర్వాత స్థానాల్లో ఉన్నట్లు సీఈఏ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వరంగ సంస్థల అధ్వర్యంలో ఉన్న థర్మల్ విద్యుత్తు ప్లాంట్లకు సంబంధించి భూపాలపల్లిలోని కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (కేటీపీపీ) దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 500 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ 94.35 శాతంగా నమోదైంది. ప్రైవేటు, ప్రభుత్వరంగంలోని విద్యుత్తు ప్లాంట్లన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే కేటీపీపీ తొమ్మిదో స్థానంలో నిలిచింది. తెలంగాణలో విద్యుత్తు కొరతను అధిగమించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా అన్ని యూనిట్లలో ఉత్పత్తి సామర్థ్యం మెరుగుపడిందని, అందుకే రికార్డు స్థాయిలో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ సాధించగలిగామని టీఎస్జెన్కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ప్రభాకర్‌రావు తెలిపారు. -
‘అయ్యగారి’ ఆకాంక్ష
ఇది డాక్టర్ ఎ.ఎస్.రావు (అయ్యగారి సాంబశివరావు) శతజయంతి సంవ త్సరం. ప్రతిష్టాత్మక ఈసీఐఎల్ రూపకర్త రావుగారే. దేశీయ ఎలక్ట్రానిక్ రంగ మనే కలను సాకారం చేసిన ప్రతిభాశీలి. భారతదేశ ఎలక్ట్రానిక్ రంగం పురోగ మించడానికి అవిశ్రాంతంగా శ్రమించిన కార్యశీలి. హైదరాబాద్ ఆధునికతకు కార కులు ముగ్గురని చెబుతారు. బి.హెచ్.ఇ.ఎల్. స్థాపనకి డా॥కె.ఎల్.రావు; రక్షణ రంగానికి చెందిన డి.ఆర్.డి.ఎల్. వంటి సంస్థలు అందడానికి సూరి భగవంతం, ఇ.సి.ఐ.ఎల్., ఎన్.ఎఫ్.సి. సంస్థలు మనకే దక్కడానికి కారణం ఏఎస్రావుగారు. అయితే తన పేరు కాకుండా హోమి జె బాబాకి ఆ ఘనతను ఆపాదించిన నిగర్వి రావు. హోమీ బాబా తలలో నాలుకలా వ్యవహరించి, మహారాష్ట్ర, తమిళనాడు నాయకుల ఒత్తిడులని అధిగమించి, అన్ని విధాలా హైదరాబాద్ మౌలాలి ప్రాంతం అనుకూలమన్న నివేదికలను రావు రూపొందింపజేశారు. విద్యుత్ ఉత్పాదనపై రావుగారికి స్పష్టమైన అవగాహన ఉంది. ఆ రంగంలో నిష్ణాతుడు నార్ల తాతారావుతో ఆత్మీయత దాని ఫలితమే. ప్రస్తుతం ఎదుర్కొంటున్న విద్యుత్ సంక్షోభాన్ని రావు అప్పుడే ఊహించారు. అణు విద్యుత్ తయారీపై అపోహలను తొలగించి నాణ్యమైన విద్యుత్‌ని అందించాలని చెప్పారు. ఎలాంటి పరిమితులు లేని సౌరశక్తిని ఇందుకోసం వాడొచ్చని సూచించారు. భారత ప్రతినిధిగా ఐక్యరాజ్య సమితితో బాటు పలు అంతర్జాతీయ వేదికలపై మన అణుశాస్త్ర పరిజ్ఞానపు విజ్ఞాన ఖనిలా నిలిచారు. దేశ, విదేశాల పత్రికల్లో వెలువడిన వారి వ్యాసాలు ఇప్పటికీ అణుశాస్త్ర విద్యార్థులకి మార్గదర్శనం చేస్తున్నాయి. నలుపు, తెలుపు టీవీల తయారీ ఈసీఐఎల్‌లో చేపట్టి ఆవైపు మన చూపు మరల్చింది రావుగారే. ఏఎస్ రావునగర్‌లో 1994లో ‘ఇండోట్రానిక్స్’ అనే ఎలక్ట్రానిక్స్ శిక్షణ సంస్థ ప్రారంభోత్సవానికి విచ్చేసినపుడు ఎల్రక్టానిక్ రంగంలో చైనా పోటీని తట్టుకు నేందుకు రావుగారు చేసిన సూచనలు మరువలేనివి. యువత, గృహిణులు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను కుటీర పరిశ్రమగా చేపడితే మరింత నాణ్యంగా చౌకగా అందించవచ్చునని చెప్పారు. ఏఎస్ రావు మానవతా దృష్టికి ఇదో మచ్చుతునక. ఈసీఐఎల్ చైర్మన్‌గా ఉన్నప్పుడు ఒక నియామకం మీద రావుగారి నిర్ణయాన్ని కోరారు. ఆ ఉద్యో గార్థికి గుండె వ్యాధి ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. నిజానికి ఇలాంటి అభ్యర్థిని తిరస్కరిస్తారు. అయితే అతడిని ఉద్యోగంలోకి తీసుకొమ్మని రావు గారు ఆదేశించారు. అదేమంటే, ఇలాగైనా ఆపదలో ఉన్న వ్యక్తికి మనం సాయ పడిన వారమవుతామని చెప్పారు. నిరాడంబరతకు చిరునామాగా నిలిచే రావుగారు పదవీ విరమణ చేశాక నాచారంలో ఉండేవారు. సందర్శకులను అనుమతించేవారు కాదు. దయచేసి సందర్శకులు రావద్దని బోర్డు పెట్టుకున్నారు. ఉద్యోగ విరమణ తరువాత తానేమీ సహాయం చెయ్యలేని స్థితి కనుకనే ఎవరినీ నిరాశ పరచడం ఇష్టం లేక బోర్డు పెట్టానని అన్నారు. ఎప్పుడూ మూసి ఉండే ఆ ఇంటి గేట్లు మిత్రు లెవరైనా ఫోన్ చేస్తే మాత్రమే తెరుచుకునేవి. చేతి సంచితో ఎప్పుడూ ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించేవారు రావుగారు. ఒకసారి కండక్టర్‌తో ఎ.ఎస్. రావునగర్కి టికెట్ కావాలన్నారు. వారే ఎ.ఎస్. రావుగారని తెలిసిన కండక్టర్ ఆయన నిరాడంబరతని అందరికీ చాటాడు. పదవీ విరమణ తరువాత రావుగారు కుమార్తె పెళ్లి ఖర్చులకై నాచారం ఇంటిలో సగభాగం అమ్మేశారు. రావుగారు 2003లో పరమపదించారు. వారి పేరుపై అవార్డులను అంతకు ముందు నుంచే ప్రారంభించి కొనసాగిస్తున్నారు. సుమారు 120 ఎకరాల్లో రూపుదిద్దుకొన్న డాక్టర్ ఎ.ఎస్.రావు నగర్ మౌలాలి ప్రాంతానికి తలమానికం. ఇక్కడ నుంచి వెళ్లి స్థిరపడినవారి పిల్లలు విదేశాల్లో తమ అపార్ట్‌మెంటుల్లో ఎ.ఎస్.రావునగర్ పేరు పెట్టుకుంటూ విశ్వవ్యాప్తం చేస్తు న్నారు. న్యూజెర్సీలో ఒక వీధికి వీరి పేరు పెట్టారు. పద్మశ్రీ, పద్మభూషణ్, భట్నాగర్ పురస్కారం, నాయుడమ్మ బంగారు పతకం, కళాప్రపూర్ణ... ఎన్నెన్నో గౌరవాలు వరించినా చివరివరకు రావుగారిలో అదే వినమ్రత. అదే నిరాడం బరత. అందుకే ఎప్పటికీ రావు ఒక స్ఫూర్తి ప్రదాత. (ఎ.ఎస్.రావు శతజయంతి సందర్భంగా స్మారక తపాలా బిళ్ల విడుదల నేడు) పేరిచర్ల రాజగోపాలరాజు మౌలాలి, హైదరాబాద్ డాక్టర్ ఎ.ఎస్.రావు 1914-2003 -
మళ్లీ శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి
హైదరాబాద్: శ్రీశైలంలో మళ్లీ విద్యుత్తు ఉత్పత్తి మొదలైంది. రెండు రోజులపాటు ఎడమగట్టున విద్యుదుత్పత్తి కొనసాగింది. కృష్ణా బోర్డు నిర్ణయం.. రెండు రాష్ట్రాల వివాదం నేపథ్యంలో అయిదు రోజుల విరామం తర్వాత తెలంగాణ ప్రభుత్వం మళ్లీ ఉత్పత్తి ప్రారంభించటం చర్చనీయాంశంగా మారింది. ఈనెల రెండో తేదీ అర్ధరాత్రి నుంచి టీఎస్జెన్కో అక్కడ విద్యుత్తు ఉత్పత్తిని నిలిపేసిన విషయం తెలిసిందే. మూడు టీఎంసీల కోటా నిండగానే... విద్యుదుత్పత్తి ఆపేయటంతో తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డు నిర్ణయాన్ని అమలు చేసినట్లు సంకేతాలు జారీ చేసింది. అయితే, బోర్డు నిర్ణయాన్ని సవాలు చేస్తూ మంత్రి హరీశ్‌రావు ఢిల్లీకి వెళ్లి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అయిదు రోజుల విరామం తర్వాత విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభమైంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 2.81 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసినట్లు టీఎస్ జెన్కో తెలిపింది. తక్షణ అవసరాల నిమిత్తం చేయాల్సి వచ్చిందని సంబంధిత అధికారులు అభిప్రాయపడ్డారు. శనివారం మధ్యాహ్నం నుం చి రాత్రి వరకు 120 మెగావాట్ల సామర్ధ్యంతో నాలుగు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి జరిగింది. దాదాపు 28 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి 145 మెగావాట్ల సామర్థ్యంతో 3 యూనిట్ల ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేపట్టారు. 21 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఉత్పత్తి జరగలేదని టీఎస్జెన్కో తెలి పింది. మరోవైపు నాగార్జునసాగర్ నుంచి యథాతథంగా విద్యుత్తు ఉత్పత్తి కొనసాగుతోంది. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు అక్కడ 6.22 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి జరిగింది. రెండు చోట్ల ఉత్పత్తి జరిగినా.. రాష్ట్రంలో డిమాండ్ మేరకు విద్యుత్తు అందుబాటులో లేకపోవటంతో లోటు తప్ప లేదు. రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ 134 మిలియన్ యూనిట్లకు చేరింది. దీంతో 7.94 మి.యూ. విద్యుత్తు కొరత నమోదైంది. -
ఇసుకతో కరెంట్
-
చీకట్లు
ఒంగోలు, న్యూస్‌లైన్: విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో జిల్లా మొత్తం సోమవారం అంధకారం అలుముకుంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత 12.30 గంటల సమయంలో ఒంగోలులో సగం నగరం కటిక చీకట్లోకి వెళ్లిపోయింది. ఒంగోలు ట్రంకురోడ్డుకు పశ్చిమం వైపు ఉన్న ప్రాంతమంతా అంధకారంగా మారిపోయింది. దాదాపు రెండున్నర గంటల తరువాత విద్యుత్ పునరుద్ధరించారు. జిల్లాలోని చాలా మండలాల్లో ఉదయం 5 గంటల సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉదయాన్నే ఆకాశం మేఘావృతమవడంతో పాటు..పెనుగాలులు వీచాయి. గాలులకు చాలా చోట్ల వైర్లు తెగిపోయాయి.అన్ని ధర్మల్ పవర్ ప్రాజెక్టుల్లో సిబ్బంది సమ్మె కారణంగా ఉత్పత్తి నిలిచిపోయింది. 11 వేల మెగావాట్లకుగాను కేవలం 6 వేల మెగావాట్లు మాత్రమే ఉంది. దీంతో అధికారులు ఆఘమేఘాల మీద పరిశ్రమలకు సోమవారం పవర్‌హాలిడే ప్రకటించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ విద్యుత్ వినియోగించి పరిశ్రమలు నడపవద్దని హెచ్చరించారు. జిల్లాలో 7.048 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉండగా..ఆదివారం అది 6.4 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. విద్యుత్ సమస్య నివారించేందుకు సెంట్రల్ పవర్ గ్రిడ్ నుంచి విద్యుత్ తీసుకునేందుకు అధికారులు యత్నిస్తుండగా..చాలాచోట్ల లోడ్ ఎక్కువై బ్రేక్డౌన్లు పెరుగుతున్నాయి. బ్రేక్డౌన్లు నివారించాలంటే విద్యుత్ సిబ్బంది సహకారం అవసరం. జిల్లాలో 98 శాతం మంది సమ్మెలో ఉండటంతో బ్రేక్డౌన్లు సరిచేయడం తలకు మించిన భారంగా మారింది. ఒంగోలులో ఉదయం విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్నా..రాత్రికి రోజూలాగే గంట కరెంటు కోత విధించారు. గ్రామాల్లో పరిస్థితి యధాతథంగా ఉంది. దీనిపై విద్యుత్ శాఖ ఎస్ఈ జయకుమార్‌ను వివరణ కోరగా..ధర్మల్ పవర్ స్టేషన్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడం వల్ల పలు ప్రాంతాల్లో సమస్యగా మారిందన్నారు. అయినా సాధ్యమైనంత వరకు సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. -
సమ్మె చీకట్లు
సాక్షి, ఏలూరు : విద్యుత్ ఉద్యోగులు సమ్మెను విరమించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఉద్యోగులు సమ్మెకు దిగడంతో సోమవారం జిల్లావ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. జిల్లాలోని పరిశ్రమలకు ‘జీ రో వినియోగం’ ప్రకటించారు. అంటే పరిశ్రమలు ఒక్క యూనిట్ కూడా వాడటానికి వీల్లేదు. వ్యవసాయ రంగానికి 7 గంటల పాటు ఇవ్వాల్సిన వ్యవసాయ విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. గృహాలకు సైతం అత్యవసర లోడ్ రిలీఫ్ పేరుతో విడతలవారీగా పెద్దఎత్తున కోతలు విధించారు. ఏలూరు నగరంలో 6గంటలపాటు, పట్టణ కేంద్రాల్లో 8 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలచిపోయింది. మండల కేంద్రాలు, గ్రామాల్లో పూర్తిస్థాయిలో చీకట్లు అలుముకున్నాయి. ఇక్కడ కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. విద్యుత్ కోతలకు ఉక్కపోత తోడై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపార, వాణిజ్య కేంద్రాలు సగానికిపైగా మూతపడ్డాయి. విధులను బహిష్కరించిన ఉద్యోగులు శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగులు సోమవారం విధులు బహిష్కరించి ఏలూరులోని ఈపీడీసీఎల్ జిల్లా కార్యాలయం విద్యుత్ భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఉద్యోగుల జేఏసీ జిల్లా కన్వీనర్ తురగా రామకృష్ణ, కో-కన్వీనర్లు సుబ్బారావు, శ్రీనివాస్, మురళి ఆధ్వర్యంలో ఉద్యోగులు ఉదయం నుంచి విధులు బహిష్కరించారు. తమ కోర్కెలు తీరుస్తామని చెప్పిన యాజమాన్యం మోసపూరితంగా వ్యవహరించి చివరి నిమిషంలో చేతులెత్తేయడంతో సమ్మె చేపట్టక తప్పలేదని జేఏసీ కన్వీనర్ రామకృష్ణ అన్నారు. ట్రాన్స్‌కో సీఎండీ నిర్లక్ష్య వైఖరి వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని వివరించారు. సమ్మెకు కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. సీఐ టీయూ నాయకులు ఆందోళనలో పాల్గొని ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. సాయంత్రం వరకూ విద్యుత్ ఉద్యోగులు విధుల్లోకి వెళ్లలేదు. కార్యాలయం ఎదుటే బైఠాయించి ఆందోళన కొనసాగించారు. ప్రజాగ్రహం విద్యుత్ కోతలతో అల్లాడుతున్న ప్రజలు ఆ శాఖపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బుట్టాయగూడెం మండలం రామారావుపేట సెంటర్లోని విద్యుత్ సబ్‌స్టే షన్ వద్ద రైతులు, గిరిజనులు ధర్నా చేశారు.కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సాయంతో... కొవ్వూరు : విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగడంతో జిల్లాలోని ఆ శాఖ కార్యాలయాలు మూతపడ్డాయి. అన్ని విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద ముందు జాగ్రత్తగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సబ్ స్టేషన్లలో కాంట్రాక్టు ఉద్యోగులు సేవలందిస్తున్నారు. సమ్మెను దృష్టిలో ఉంచుకుని తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా మునిసిపల్ అధికారులు జనరేటర్లు సిద్ధం చేసుకున్నారు. -
జనం విలవిల
చీకట్లో తడుముకుంటున్న వేళ కంట్లో నలుసు పడితే ఎలా ఉంటుంది? విద్యుత్ ఉద్యోగుల రెండురోజుల సమ్మెతో జనం పరిస్థితి అలాగే అయింది. అసలే వేసవి.. షరామామూలుగాకొరత, కోతతో అవస్థ పడుతున్న జనానికి ఉద్యోగుల ఆందోళన అదనపు కష్టాల్ని చవి చూపింది. సరఫరా అస్తవ్యస్తమై; కొరత ముమ్మరమై; కోతలు ఇతోధికమై.. ఇక్కట్లు మిక్కుటమయ్యాయి. కాగా సోమవారం అర్ధరాత్రి సమ్మె విరమించడంతో జనం ‘అమ్మయ్యా’ అనుకున్నారు. సాక్షి, రాజమండ్రి : విద్యుత్తు ఉద్యోగుల రెండురోజుల సమ్మెతో ప్రజలు రెట్టింపు కరెంటు కష్టాల్ని చవి చూశారు. పట్టణాలు, పల్లెలు అని తేడా లేకుం డా గంటల తరబడి కరెంటు కోత విధించడం తో అన్ని వర్గాల వారూ విలవిలలాడారు. గ్రామాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగితే పునరుద్ధరించే వారే లేరు. పట్టణాల్లోనూ అత్యవసర సేవలకు తప్ప సాధారణసేవలకు అంతరాయం కలిగితే పునరుద్ధరించ లేక పోయారు. సోమవారం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ కరెంటు లేదు. ఇక రాత్రి ఆరు గంటల తర్వాత జిల్లావ్యాప్తంగా అంధకారం అలముకుంది. మరో పక్క జిల్లాలో పరిశ్రమలు మూతపడి, కోట్లాది రూపాయల ఉత్పత్తి నిలిచిపోయింది. సమ్మెలో రెండోరోజైన సోమవారం ఉదయం నుంచి ఆయా ప్రాంతాల్లో ఉద్యోగులు సబ్స్టేషన్లు, డివిజన్ కార్యాలయాల ముందు ఆందోళనలు, ధర్నాలు చేపట్టారు. ఈపీడీసీఎల్ రాజమండ్రి సర్కిల్ కార్యాలయం గేటు ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఎలుగెత్తారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకూ రాజమండ్రి సిటీ, రూరల్ పరిధిలో ఆరు గంటల పాటు విద్యుత్తు సరఫరా నిలిపి వేశారు. పిఠాపురం, పెద్దాపురం, ప్రత్తిపాడు పరిసర ప్రాంతాల్లో ఉదయం 7.40 గంటల నుంచి రాత్రి వరకూ ఎనిమిది గంటలు కరెంటు లేదు. రాజోలు, కొత్తపేట, అమలాపురం, రామచంద్రపురం పరిసర గ్రామాల్లో ఏడు గంటల అత్యవసర కోత విధించారు. ఇవి కాక ఉత్పత్తిలో లోటు ఏర్పడితే అర్ధరాత్రి కూడా కోత విధించే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. రిటైర్డు ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగుల సహాయంతో అత్యవసర సేవలు అందించగలిగినా సాధారణ సమస్యలను పట్టించుకోలేక పోయారు. దీంతో సరఫరాలో అవాంతరాలను తొలగించే వారు లేక ప్రజలు నానా అగచాట్లూ పడాల్సి వచ్చింది. కాగా ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో సోమవారం అర్ధరాత్రి నుంచి సమ్మె విరమించారు. పరిశ్రమలకు రూ.150 కోట్ల నష్టం ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకూ జిల్లాలోని చిన్న మధ్యతరహా పరిశ్రమలకు విద్యుత్తు సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. ఉదయం మరింత కొరత ఎదురవడంతో తిరిగి పది గంటల నుంచి సాయంత్రం వరకూ నిలిపివేశారు. ప్రత్యామ్నాయ విద్యుత్తు సదుపాయం ఉన్న మధ్యతరహా పరిశ్రమలు తప్ప చిన్న పరిశ్రమలు పూర్తిగా మూతపడ్డాయి. రెండు రోజుల విద్యుత్తు నిలిపివేతతో జిల్లాలో సుమారు రూ.150 కోట్లు నష్టపోయాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఉత్పత్తి కేవలం 800 మెగావాట్లే.. రాష్ట్రంలో 2500 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉండగా సోమవారం కేవలం 800 మెగావాట్ల ఉత్పత్తే జరిగింది. బొగ్గు కొరతతో విజయవాడలోని థర్మల్ పవర్ హౌస్‌లోని ఒకటి నుంచి ఏడు యూనిట్లలో 710 మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. రాయలసీమ పవర్ ప్లాంటులో 210, కొత్తగూడెం థర్మల్ ప్రాజెక్టులో 60 మెగావాట్ల ఉత్పత్తికి బొగ్గు కొరత వల్ల అంతరాయం కలిగింది. -
ఎగువ సభకు ఈశ్వర, పరమేశ్వర?
అభ్యర్థిత్వాల కోసం కాంగ్రెస్, బీజేపీలో పోటాపోటీ మొత్తం ఏడు స్థానాలు ఖాళీ కాంగ్రెస్ 4, బీజేపీ 2, జేడీఎస్ ఒక స్థానాన్ని గెలుచుకునే అవకాశం రేపు ఢిల్లీ వెళ్లనున్న సిద్ధు, పరమేశ్వర సాక్షి ప్రతినిధి, బెంగళూరు : శాసన సభ నుంచి శాసన మండలికి జరుగనున్న ఎన్నికల్లో అభ్యర్థిత్వాలను దక్కించుకోవడానికి అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీలో పోటీ ఎక్కువైంది. అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో చర్చించడానికి కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. స్వయానా పరమేశ్వర కూడా ఆశావహుడే. శాసన సభ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయనకు ప్రత్యామ్నాయ పదవి ఇవ్వడానికి అధిష్టానం కూడా సానుకూలంగా ఉంది. కనుక ఆయన అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారైనట్లే. లోక్‌సభ ఎనికల్లో మండ్య నుంచి ఓడిపోయిన నటి రమ్యతో పాటు మాజీ మంత్రి రాణి సతీశ్ కూడా ఎగువ సభ సభ్యత్వాలను ఆశిస్తున్నారు. రమ్యకు ఇక్కడ కాకపోయినా రాజ్యసభ సభ్యత్వమైనా ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరో వైపు బీజేపీ నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్. ఈశ్వరప్ప ఎగువ సభకు వెళ్లడం దాదాపుగా ఖాయం. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయాన్ని పరిగణనలోకి తీసుకున్న బీజేపీ అధిష్టానం ఈశ్వరప్పకు సముచిత పదవిని ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. కాగా లోక్‌సభకు ఎన్నికైన డీవీ. సదానంద గౌడ ఇదివరకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. వాస్తవానికి ఆయన వచ్చే నెలాఖరులో రిటైర్డ కావాల్సి ఉంది. ఇంకా భారతి శెట్టి, కేవీ. నారాయణ స్వామి, ఎంసీ. నాణయ్య, ఎంవీ. రాజశేఖరన్, సిద్ధరాజు, మోనప్ప భండారీలు పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఇలా ఏర్పడిన ఏడు ఖాళీలను ఎమ్మెల్యేల ఓట్ల ద్వారా భర్తీ చేస్తారు. వీటిలో కాంగ్రెస్ నాలుగు స్థానాలను సునాయాసంగా గెలుచుకుంటుంది. బీజేపీ రెండు, జేడీఎస్ ఒక స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశాలున్నాయి.