వ్యర్థాలే ‘పవర్‌’ ఫుల్‌! | Power generation from waste of Dumping yard | Sakshi
Sakshi News home page

వ్యర్థాలే ‘పవర్‌’ ఫుల్‌!

Published Sun, Oct 31 2021 4:22 AM | Last Updated on Sun, Oct 31 2021 2:30 PM

Power generation from waste of Dumping yard - Sakshi

గుంటూరు నాయుడుపేటలో నిర్మితమైన చెత్త నుంచి విద్యుదుత్పత్తి చేసే కర్మాగారం

సాక్షి, అమరావతి: వ్యర్థాల నుంచి విద్యుత్‌ తయారీకి రంగం సిద్ధమైంది. డంపింగ్‌ యార్డులో కుప్పలుగా పడి పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఈ వ్యర్థాలు ఇకపై వెలుగులను వెదజల్లనున్నాయి. దీనికి గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని నాయుడుపేటలో 15.50 ఎకరాల్లో ఏర్పాటు చేసిన కర్మగారం వేదికగా కానుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో జిందాల్‌ సంస్థ రూ.340 కోట్లతో ఈ కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. గత సెప్టెంబర్‌ 30 నుంచి అక్టోబర్‌ 8 వరకూ  ప్రయోగాత్మకంగా ఇక్కడ విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఇది విజయవంతమవడంతో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్మాగారంలో విద్యుదుత్పత్తి జరిగే విధానంపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది..  

ఇలా ఉత్పత్తి..
రోజుకు 1,200 మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలతో 15 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. విజయవాడ, గుంటూరు, తాడేపల్లి–మంగళగిరి నగరపాలక సంస్థలతో పాటు సత్తెనపల్లి, చిలకలూరిపేట, నరసరావుపేట, పొన్నూరు, తెనాలి పురపాలక సంస్థల నుంచి వ్యర్థాలను ఇక్కడికి తీసుకొస్తారు. లారీల్లో వచ్చే చెత్తను కర్మాగారంలోని పిట్‌లో అన్‌లోడ్‌ చేస్తారు. చెత్తను నిల్వ చేసేందుకు 25 మీటర్ల వెడల్పు, 71 మీటర్ల పొడవుతో పిట్‌ను నిర్మించారు. పిట్‌లో ఉన్న వ్యర్థాలను గ్రాబ్‌ క్రేన్‌ సాయంతో ఫీడర్‌లో వేస్తారు. ఫీడర్‌ కింద అమర్చిన సోటకర్‌ నుంచి వెలువడే మంటలో వ్యర్థాలను మండిస్తారు.

ఇవి మండినప్పుడు వచ్చే వేడికి బ్రాయిలర్‌లో స్టీమ్‌ వెలువడుతుంది. ఈ స్టీమ్‌.. టర్బైన్‌లను తిప్పినప్పుడు విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 20 మెగా వాట్ల టర్బైన్‌ను అమర్చారు. ఉత్పత్తి అయిన విద్యుత్‌ను వెంగళాయపాలెంలోని విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌కు సరఫరా చేసేందుకు వీలుగా కర్మాగారం నుంచి 32 కేవీ విద్యుత్‌ లైన్‌ను వేశారు.   కర్మాగారంలో 11/33 కేవీ స్విచ్‌ యార్డు నెలకొల్పారు. కర్మాగారంలో ఉత్పత్తి అయిన విద్యుత్‌ను డిస్కమ్‌లకు యూనిట్‌కు రూ.6.16కు విక్రయిస్తారు. వ్యర్థాలు మండినప్పుడు బాటమ్‌ యాష్, ఫ్లైయాష్‌ అనే రెండు రకాలైన బూడిద వెలువడుతుంది. ఫ్లైయాష్‌ను నిర్మాణాలకు వాడే ఇటుకల తయారీకి వినియోగిస్తారు. బాటమ్‌ యాష్‌ను లోతట్టు ప్రాంతాల్లో పూడిక కోసం వినియోగించవచ్చు.

ఇదే తరహాలో విశాఖలోనూ..  
గుంటూరు తరహాలోనే విశాఖపట్నంలో 15 మెగా వాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం గల మరో కర్మాగారం నిర్మాణంలో ఉంది. 2016లో కర్మాగారాల ఏర్పాటుకు జిందాల్‌ సంస్థకు అనుమతులు లభించినా, అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో పనులు వేగంగా జరగలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ఈ రెండు కర్మాగారాల ఏర్పాటుతో సుమారు 400 మందికి ఉపాధి లభిస్తోంది. వ్యర్థాల నుంచి విద్యుత్‌ తయారీ కర్మాగారాలు దేశంలో ఇప్పటికే ఐదు ఉన్నాయి. ఢిల్లీలో మూడు, మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్, హైదరాబాద్‌లో ఒక్కొక్కటి చొప్పున ఉండగా, ఏపీలో ఉన్న రెండింటితో కలిపి మొత్తం ఏడయ్యాయి.  

త్వరలోనే విద్యుదుత్పత్తి 
ప్రయోగాత్మక పరిశీలన విజయవంతమైంది. కమర్షియల్‌ ఆపరేషన్‌ డేట్‌(సీవోడీ) కోసం ఏపీసీపీడీసీఎల్‌కు దరఖాస్తు చేశాం. సీవోడీ మంజూరైతే విద్యుదుత్పత్తిని ప్రారంభిస్తాం. త్వరలోనే కర్మాగారంలో పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.  
– ఎంవీ చారి, జిందాల్‌ ఏపీ ప్రాజెక్ట్‌ల ప్రెసిడెంట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement