dumping yard
-
20 ఏళ్లుగా ఉంటున్నాం.. మీరెవరు పొమ్మనడానికి..
-
ఇళ్లు వదిలి పోండి..
-
మాంబట్టు సెజ్‌లో భారీ అగ్నిప్రమాదం
తడ (తిరుపతి జిల్లా): పరిశ్రమల్లో లభించే పాత వస్తువులను సేకరించే ఒక సంస్థ నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమలకు సమీపంలో నెలకొలి్పన డంపింగ్ యార్డులో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా తడలోని మాంబట్టు ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నిల్వ ఉంచిన చెత్తకు నిప్పు అంటుకోవడంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో పొగ ఆకాశాన్ని అంటుకుని చీకట్లు కమ్మేయడంతో సమీప పరిశ్రమల్లోని కార్మికులు ఆందోళన చెందారు.నాయుడుపేట సీఐ శ్రీనివాసులురెడ్డి, సూళ్లూరుపేట సీఐ మధుబాబు, తడ, సూళ్లూరుపేట ఎస్ఐలు నరశింహారావు, రహీంరెడ్డి తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సూళ్లూరుపేట, అపాచీ పరిశ్రమలకు చెందిన రెండు ఫైరింజన్లు మంటలు అదుపు చేసేందుకు శ్రమించాయి. మంటలతోపాటు మంటల్లో నుంచి భారీ శబ్దాలతో పేలుళ్లు వస్తుండటంతో పోలీసులు ఆ దారిన రాకపోకలు అడ్డుకుని ఇతర మార్గాల్లో వాహనాలు మళ్లించారు.కాగా పరిశ్రమలకు సమీపంలో ఎలాంటి జాగ్రత్తలు లేకుండా ఉన్న డంపింగ్ యార్డు వల్ల తీవ్ర ఇబ్బందులు జరుగుతాయని ఏడాది క్రితం సూళ్లూరుపేట ఫైర్ అధికారులు తిరుపతికి చెందిన స్థల యజమాని హర్షవర్ధన్, చెత్త సేకరించి నిల్వ చేసుకునేందుకు స్థలాన్ని లీజుకు తీసుకున్న షేర్ అలీ అనే వ్యక్తులకు సమాచారం ఇచ్చినా వారు పెడచెవిన పెట్టారని ఫైర్ సిబ్బంది తెలిపారు. డంపింగ్ యార్డులో పనికి రాని చెత్త మాత్రమే కాలిపోగా ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ఆనుకుని ఉన్న అల్యూమినియం క్యాస్టింగ్ కంపెనీ తీవ్రంగా నష్టపోయింది. -
ఆనంద్ మహీంద్రాను బాధించిన వీడియో.. అందులో ఏముందంటే..?
ముంబయి: సోషల్ మీడియాలో చురుకుగా ఉండే మహీంద్రా గ్రూప్ ఛైర్మెన్ ఆనంద్ మహీంద్రా తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో కొందరు వ్యక్తులు వ్యర్థాలను సముద్రంలో పడేస్తున్న దృశ్యాలు కనిపిస్తాయి. ఈ వీడియో తనను ఎంతగానే బాధించినట్లు ఆనంద్ మహీంద్రా ఆవేదన వ్యక్తం చేశారు. గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద సముద్రంలో కొందరు వ్యక్తులు వ్యర్థాలను పడేశారు. కార్లలో వచ్చి బస్తాల్లో తీసుకొచ్చిన వ్యర్థాలను సముద్ర నీటిలో వేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పర్యావరణాన్ని కలుషితం చేయడంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలింపు చేపట్టారు. నగర మున్సిపాలిటీ అధికారులు నిందితులకు రూ.10,000 జరిమానా కూడా విధించారు. The Good Citizens of Mumbai Early Morning at Gateway of India pic.twitter.com/FtlB296X28 — Ujwal Puri // ompsyram.eth 🦉 (@ompsyram) November 21, 2023 సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. ఈ వీడియోలోని దృశ్యాలు తనను ఎంతగానో బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణం పట్ల ప్రజల అభిప్రాయం మారకపోతే.. జీవన నాణ్యతా ప్రమాణాలు పెరగబోవని పేర్కొంటూ ట్వీట్ చేశారు. కాగా.. ఈ వీడియోపై నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అయితే.. నగరాన్ని శుభ్రంగా ఉంచడం కష్టమని అభిప్రాయపడ్డారు. బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరారు. ఇదీ చదవండి: 'అలా అయ్యుంటే టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్లో గెలిచేది! -
‘ప్లాస్టిక్ అడవి’లో ఏనుగులు
ఎటు చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తా చెదారం మధ్య ఏనుగుల గుంపు కనిపిస్తోందా? అంతటి కలుషిత, ప్రమాదకర పదార్థాల మధ్య ఆ ఏనుగులు ఆహారాన్ని వెతుక్కుంటున్నాయి. అభివృద్ధితోపాటు వస్తున్న కాలుష్య ప్రమాదానికి ఇదో సంకేతమని పర్యావరణ నిపుణులు అంటున్నారు. ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్థాలను తీసుకెళ్లి అడవుల సమీపంలో డంపింగ్ చేస్తుండటం కేవలం పర్యావరణానికి మాత్రమేకాదు వన్య ప్రాణులకు ఎంతో చేటు చేస్తున్న దారుణ పరిస్థితిని ఇది కళ్లకు కడుతోంది. శ్రీలంకలోని తూర్పు ప్రావిన్స్‌లో లలిత్ ఏకనాయకే అనే ఫొటోగ్రాఫర్ ఈ చిత్రాన్ని తీశారు. నేచర్ ఇన్ఫోకస్ సంస్థ ఇచ్చే ఫొటోగ్రఫీ అవార్డుల్లో ‘కన్సర్వేషన్ ఫోకస్’ విభాగంలో ఇది ఉత్తమ చిత్రంగా నిలిచింది. –సాక్షి సెంట్రల్ డెస్క్ -
యాభై ఏళ్లలో చేయనోళ్లు.. ఇప్పుడు అభివృద్ధి చేస్తారట!
సాక్షి, మేడ్చల్ జిల్లా: యాభై ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయనివాళ్లు.. ఇప్పుడు అవకాశమిస్తే ఎలా చేస్తారని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారకరామారావు ప్రతిపక్షాలను సూటిగా ప్రశ్నించారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో రూ.251 కోట్లతో 2000 కేఎల్డీ సామర్థ్యం కలిగిన లీచెట్ ప్లాంట్‌ను కార్మిక మంత్రి మల్లారెడ్డి, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి , రాంకీ సంస్థ ప్రతినిధులతో కలసి కేటీఆర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో 3,619 మంది స్థానిక లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ జవహర్‌నగర్ డంప్ యార్డ్ నుంచి ఉత్పత్తి అయ్యే లీచెట్ కారణంగా కలుషితమవుతున్న మల్కారం చెరువుతో పాటు యార్డు చుట్టుపక్కల చెరువుల్లో ఉన్న లీచెట్ శుద్దీకరణ ప్రక్రియను వచ్చే ఏడాది ఏప్రిల్ లోపు పూర్తి చేస్తామని ప్లాంట్ నిర్వాహకులు హామీ ఇచ్చారని తెలిపారు. దేశానికే హైదరాబాద్ ఆదర్శ నగరం కాబోతోంది.. హైదరాబాద్ మహానగరంలో రోజుకు దాదాపు 2వేల ఎంఎల్టీ ( 2వేల మిలియన్ లీటర్ల) మురికినీరు ఉత్పత్తి అవుతోందని, 100 శాతం ఎస్టీపీలతో జూలై కల్లా దేశంలోనే మొట్టమొదటి నగరం కాబోతుందని కేటీఆర్ తెలిపారు. ఇందుకోసం రూ.4 వేల కోట్లు ఖర్చుపెడుతున్నట్లు వెల్లడించారు. జపాన్‌లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ చూశానని అక్కడ పైన పార్కు, కింద ప్లాంట్ ఉందని, ఏ మాత్రం వాసన లేదని వివరించారు. జవహర్ నగర్, నాగారం, దమ్మాయిగూడలను ఆ విధంగా అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ హామీనిచ్చారు. 3 వేల మెట్రిక్ టన్నుల యార్డ్... 8 వేల మెట్రిక్ టన్నులైంది జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ మొదలుపెట్టినప్పుడు హైద రాబాద్ నుంచి 3వేల మెట్రిక్ టన్నుల చెత్త వస్తుందని డిజైన్ చేశారని, కానీ ఇప్పుడు 8 వేల మెట్రిక్ టన్నుల చెత్త వస్తోందన్నారు. ప్రస్తుతం జవహర్ నగర్‌కు వచ్చే చెత్తలో తడి చెత్త నుంచి ఎరువు ఉత్పత్తి చేసి, రైతులకు అమ్ముతున్నామని కేటీఆర్ తెలిపారు. రూ.550 కోట్లతో దక్షిణ భారతదేశంలోనే పెద్దదైన ఈ చెత్త నుంచి కరెంట్ ఉత్పత్తి చేసే యూనిట్‌ను ప్రారంభించి 20 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నామన్నారు. రెండోదశలో మరొక రూ.550 కోట్లతో 28వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని త్వరలో స్థాపించనున్నట్టు కేటీఆర్ తెలిపారు. దీంతో ఒక్క జవహర్‌నగర్ నుంచే 48 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తవుతుందన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే మొత్తం చెత్తతో 100 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. మూడో రకం చెత్తతో సిమెంట్, బ్రిక్స్ తయారీ తడి,పొడి చెత్త కాకుండా, ఇళ్లు కట్టినప్పుడు, కూలగొట్టినప్పుడు వచ్చే కంకర రాళ్లు, మట్టితో మూడో రకం చెత్త వస్తోందని కేటీఆర్ తెలిపారు. నిర్మాణం, శిథిలాల నుంచి వచ్చే ఈ వ్యర్థాలను పునరుత్పత్తి చేసి.. పునర్వినియోగం చేసి.. వాటి నుంచి సిమెంట్, బ్రిక్స్, ఫుట్‌పాత్‌ల మీద వేసే టైల్స్ తయా రు చేస్తున్నామన్నారు. ఈ రకమైన ప్లాంట్లను ఒకటి ఫతూల్గూడలో, రెండోది జీడిమెట్లలో పెట్టినట్లు వివరించారు. ఈ రెండూ కూడా ఒక్కోటి 500మెట్రిక్ టన్నుల కెపాసిటీతో నడుస్తున్నాయని, మరో రెండు కూడా త్వరలో పెట్టబోతున్న ట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కార్యక్రమంలో ఎంపీ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎం.సుదీర్‌రెడ్డి, కలెక్టర్ అమయ్‌కుమార్, మేయర్లు మేకల కావ్య, జక్కా వెంకట్‌రెడ్డి, జిల్లా గ్రంధాలయం చైర్మన్ దయాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, అడిషనల్ కలెక్టర్ నర్సింహారెడ్డి, ఆర్డీఓ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పంట నేల కాస్త విషం కక్కుతుంటే..
కరోనా కాదు.. అయినా జనాలు బయట అడుగుపెట్టాలంటే వణికిపోతున్నారు. తలుపులు, కిటికీలు గట్టిగా బిగించేసుకుని ఇళ్లలోనే ఉండిపోయారు. పోలీసులు సైతం జనాలు అనవసరంగా బయట తిరగడంపై నిఘా పెట్టారు. ఒకవేళ.. అత్యవసరానికి బయటకు వస్తే తప్పనిసరిగా మాస్క్‌లు ధరిస్తున్నారు. గత వారంగా ఇదే పరిస్థితి చోటు చేసుకుంది అక్కడ. లాక్డౌన్ లాంటి పరిస్థితులకు కారణం ఒక పే... ద్ద చెత్తకుప్ప!. కొన్నేళ్ల కిందటి వరకు అది సారవంతమైన నేల.. వ్యవసాయ భూమి. కానీ, కాలక్రమంలో అదొక చెత్త కుప్పగా మారింది. ఆ చెత్త కుప్పనే వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్‌గా మార్చేయాలని ప్రభుత్వం భావించి ప్రయత్నాలు మొదలుపెట్టింది. చుట్టుపక్కల జిల్లాల నుంచి ఈ ప్లాంట్‌కు చెత్త వచ్చి చేరుతుంటుంది. కానీ, ఆ చెత్తే ఇప్పుడు ప్రజల ప్రాణాల మీదకు వచ్చింది. నిర్వాహణ లోపం, నిర్లక్ష్యం కారణంగా టన్నులకు పైగా చెత్తకు నిప్పంటుకోవడంతో.. ఆ పరిసరాలు విషవాయువులతో నిండిపోయింది. కేరళ కొచ్చి సిటీలోని బ్రహ్మపురం ప్రాంతంలోని డంప్ యార్డ్.. జనాలకు ప్రాణాంతకంగా మారింది. చెత్త కుప్ప భారీ ఎత్తున్న తగలబడి.. అందులో ప్లాస్టిక్, మెటల్, ఇతరత్ర వస్తువులు కాలిపోయి విషపూరితమైన వాయువులు వెలువడుతున్నాయి. మంటలు వెలువడిన రెండోరోజునే ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. 30 బృందాలు నిరంతరం ఆ కుప్ప దగ్గరే ఉండి.. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. అయినప్పటికీ దట్టమైన పొగ వెలువడుతూనే ఉంది. విష వాయువులతో ఆ ప్రాంతమంతా కలుషితమైపోయింది. మరోవైపు బయటకు రావొద్దని స్థానికులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ బయటకు వెళ్లినా.. ఎన్95 మాస్క్‌లు ధరించాలని సూచిస్తున్నారు. గ్యాస్ ఛాంబర్ అంటూ.. బ్రహ్మపురం డంప్ యార్డ్ అగ్నిప్రమాదంపై కేరళ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. నగరం గ్యాస్ ఛాంబర్‌గా మారుతుంటే ఏం చేస్తున్నారని కొచ్చి మున్సిపల్ విభాగంపై మండిపడింది. అగ్ని ప్రమాదానికి కారణాలతో పాటు యాక్షన్ ప్లాన్‌ను వివరించాలని ఆదేశించింది కూడా. ఇబ్బందులతో ఆస్పత్రులకు.. వేస్ట్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లోని కాలనీవాసులు నరకం అనుభవిస్తున్నారు. విషపు వాయువుల పొగ కారణంగా.. రకరకాల ఇబ్బందులో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. అక్కడా వాళ్లకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాస కోశ సమస్యలు, ఇతర అనారోగ్యాలు ఉన్నవాళ్లను అసలు బయటికే రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. డంప్ యార్డ్‌లో 70 శాతం పొగ తగలబడిపోయిందని, మిగతా చెత్తకు మంటలు అంటుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు అంటున్నారు. మార్చి 2వ తేదీన బ్రహ్మపురం సాలిడ్‌వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో మంటలు అంటుకున్నాయి. ప్రమాదానికి కారణాలపై స్పష్టత లేకున్నా.. అధిక ఉష్ణోగ్రతతోనే మంటలు చెలరేగి ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు ప్రతిపక్షాలు ఆ అంశం ఆధారంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. వేస్ట్ మేనేజ్మెంట్లో విఫలం కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని మండిపడుతోంది. అయితే.. చెత్త నుంచి ప్లాస్టిక్, ఇతర కారకాలను తొలగిస్తూనే ఉన్నామని, అయినా పొరపొరలుగా పేరుకుపోయిన వ్యర్థాల వల్లే తీవ్ర కాలుష్యం చోటు చేసుకుందని ప్రభుత్వం అంటోంది. ప్లాంట్ కథాకమామీషు కొచ్చికి వ్యర్థాల తొలగింపు ఎప్పుడూ పెద్ద సమస్యగా ఉంది. 1998లో నగరానికి 17 కిలోమీటర్ల దూరంలోని బ్రహ్మపురం వద్ద కొచ్చి కార్పొరేషన్ 37 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసింది. అక్కడ వ్యర్థాల శుద్ధి కర్మాగారాన్ని నిర్మించేందుకు 2005లో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సమయంలో ఈ ప్రాజెక్టుపై నిర్వాసితుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. ► చివరికి.. 2007లో 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చిత్తడి నేలను పునరుద్ధరించి ఆ ప్రాంతంలో వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్‌ను నిర్మించారు. రోజుకు 250 టన్నుల సామర్థ్యంతో 2008లో వేస్ట్ ప్లాంట్‌ను ప్రారంభించారు. కానీ, ఏడాదిన్నర వ్యవధిలోనే ప్లాంట్ దెబ్బతింది. నిర్మాణ లోపాల వల్లే ఇది జరిగిందని గుర్తించిన అధికారులు.. పరిశోధనలు ప్రారంభించారు. కానీ, ఫలితం తేలలేదు. ► ఆపై డిమాండ్ మేరకు కొచ్చి కార్పొరేషన్ మరింత ఎక్కువ భూమిని సేకరించవలసి వచ్చింది. ఇవాళ.. బ్రహ్మపురం వ్యర్థాల కర్మాగారం అనేది కొచ్చి నగరంలోని ప్రధాన ఐటీ పార్కుల సమీపంలో 110 ఎకరాల స్థలంలో విస్తరించింది. ► కొచ్చి కార్పొరేషన్‌తో పాటు కళమస్సెరీ, ఆళువా, అంగమళి, త్రిక్కకారా, త్రిపునితారా మున్సిపాలిటీలతో పాటు చెరానల్లూరు, వడవుకోడ్ పుథాన్కురిష్ పంచాయితీల చెత్త కూడా ఈ ప్లాంట్‌కే వచ్చి చేరుతోంది. ► ప్రతిరోజూ సుమారు 400 టన్నుల చెత్త ఈ ప్లాంట్‌కు వస్తుంది. అందులో నలభై శాతం ప్లాస్టిక్, నాన్బయోడీగ్రేడబుల్ చెత్త ఉంటోంది. ► 2012లో భారత్ ట్రేడర్స్ అనే కంపెనీతో కొచ్చి కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం.. బ్రహ్మపురం ప్లాంట్ నుంచి చెత్త సేకరణలో భాగంగా ప్లాస్టిక్ కేజీకి రూపాయిన్నర చెల్లిస్తుంది. అయితే.. అది రీసైక్లింగ్ ప్లాస్టిక్‌కు మాత్రమే. దీంతో మిగతా వేస్ట్ అంతా అక్కడే ఉండిపోతోంది. ► ఇక ఇక్కడే చెత్త నుంచి కరెంట్ ఉత్పత్తికి ఒక ప్లాంట్ ఏర్పాటు చేయాలనే ప్రయత్నం జరిగింది. 2011లో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో ప్లాంట్‌కు శంకుస్థాపన చేయాలనుకున్నారు. 2015లో ఒప్పందం జరిగి.. మూడేళ్ల తర్వాత ప్లాంట్‌కు శంకుస్థాపన రాయి కూడా పడింది. కానీ, నిధులు లేక 2020లో ఆ ఒప్పందం రద్దు అయ్యింది. ► బ్రహ్మపురం వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు సైతం జోక్యం చేసుకున్నాయి. అయినప్పటికీ.. కొచ్చి కార్పొరేషన్ దాని పని తీరును మెరుగుపర్చలేదు. ఇంకో విషయం ఏంటే.. తాజా ఘటన నేపథ్యంలో కొచ్చి కార్పొరేషన్‌కు కేరళ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దాదాపు రూ.15 కోట్ల జరిమానా విధించింది. అయితే.. కార్పొరేషన్ ఈ ఆదేశాలపై హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంది. నాటకీయ పరిణామాల నడుమ.. బ్రహ్మపురం డంప్ యార్డ్ అగ్నిప్రమాదం నేపథ్యంలో.. గత వారం రోజులుగా అందులోని ఇతర ప్రాంతాల నుంచి చెత్తను అనుమతించడం లేదు. అలాగే.. ప్లాంట్ బయట ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు కూడా బైఠాయించారు. ఈ క్రమంలో.. శుక్రవారం అర్ధరాత్రి దాటాక 40 లారీల్లో చెత్త కుప్ప ప్లాంట్‌కు చేరింది. ఆ సమయంలో కాంగ్రెస్ సభ్యులు అడ్డగించే యత్నం చేయగా.. పోలీసులు వాళ్లను బలవంతంగా అక్కడి నుంచి పంపించేశారు. ఆపై లారీలను లోపలికి అనుమతించారు. విశేషం ఏంటంటే.. అగ్నిప్రమాద ఘటన తర్వాత ప్లాస్టిక డంపింగ్‌ను నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా.. అందుకు విరుద్ధంగా కొచ్చి కార్పొరేషన్ చెత్తను లోపలికి అనుమతించడం. -
డంపింగ్ గ్రౌండ్లతో మృత్యు ఘోష.. పదేళ్లలో 1,877 మంది మృతి
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో చెత్తవేసే డంపింగ్ గ్రౌండ్ల సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. 13 ఏళ్ల నుంచి గోవండీలో ఉన్న డంపింగ్ గ్రౌండ్, బయో మెడికల్ చెత్తను నిర్వీర్యం చేసే ప్రక్రియ ప్రాజెక్టువల్ల వాతావరణం కాలుష్యమైపోతోంది. ఫలితంగా గోవండి ప్రాంత ప్రజలు వివిధ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. గడచిన పదేళ్లలో బీఎంసీకి చెందిన ఎం– తూర్పు వార్డు పరిధిలో 1,877 మంది క్షయ వ్యాధితో మృత్యువాత పడ్డారని సమాచార హక్కు చట్టం కింద సేకరించిన వివరాలను బట్టి తెలిసింది. అంతేగాకుండా గడచిన పదేళ్ల కాలంలో 45,051 మందికి క్షయ వ్యాధి సోకినట్లు ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో గోవండీ, పరిసరాల్లో భీతావహ వాతావరణం నెలకొంది. గోవండీలో ఉన్న డంపింగ్ గ్రౌండ్, బయో మెడికల్ చెత్త నిర్వీర్యం చేసే ప్రకియ ప్రాజెక్టు వల్ల కమలారమణ్ నగర్, డింపింగ్ రోడ్, డా.జాకీర్ హుస్సేన్ నగర్, రఫిక్ నగర్, బాబానగర్, బైంగన్ వాడి, శివాజీనగర్, పీఎంజీపీ కాలనీ, టాటా నగర్ కాలనీ, ఇండియన్ ఆయిల్ నగర్, దేవ్నార్ తదితర పరిసరాల్లో కాలుష్యం పెరిగిపోయింది. దీని ప్రభావం అక్కడుంటున్న స్థానిక ప్రజల ఆరోగ్యంపై పడసాగింది. దీంతో స్థానికుల నుంచి అనేక ఫిర్యాదులు రావడం మొదలయ్యాయి. కానీ వాటిని స్ధలాంతరం చేయడానికి బీఎంసీకి ప్రత్యామ్నాయ మార్గం కనిపించలేదు. దీంతో అక్కడే కొనసాగిస్తూ వస్తున్నారు. సామాజిక కార్యకర్త శేఖ్ ఫైయాజ్ ఆలం సమాచార హక్కు చట్టం ద్వారా బీఎంసీ ఎం–తూర్పు వార్డు పరిధిలో ఎంత మంది క్షయ రోగులున్నారో వారి వివరాలు సేకరించారు. అందులో 2013 నుంచి 2022 వరకు మొత్తం 45,051 మందికి క్షయ వ్యాధి సోకినట్లు తేలింది. అందులో 1,877 మంది చనిపోయినట్లు ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. కానీ క్షయ సోకిన వారు, మృతి చెందిన వారంతా బయో మెడికల్ చెత్త నిర్వీర్యం చేసే ప్రక్రియ ప్రాజెక్టు నుంచి వెలువడుతున్న విషవాయువుల వల్ల చనిపోయినట్లు నిర్ధారించాల్సిన అవరసం ఎంతైన ఉందని ఎస్ఎంఎస్ కంపెనీ అంటోంది. చెత్తను నిరీ్వర్యం చేసే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ముఖ్యంగా ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా ఈ ప్రాజెక్టును కొనసాగిస్తున్నామని తెలిపింది. కొందరు స్థానికులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కంపెనీ స్పష్టం చేసింది. -
హైదరాబాద్ లోయర్ ట్యాంక్‌బండ్ సమీపంలో భారీ పేలుడు
సాక్షి, హైదరాబాద్: గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోయర్ ట్యాంక్ బండ్ స్నో వరల్డ్ సమీపంలోని చెత్త డంపింగ్ యార్డ్‌లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న తండ్రీ కొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, గాంధీనగర్ సీఐ మోహన్‌రావు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. పేలుడుకు గల కారణాలపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారు కర్నూలు జిల్లా నాంచార్ల గ్రామానికి చెందిన చంద్రన్న , ఆయన కుమారుడు సురేష్‌గా గుర్తించారు. సురేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చదవండి: కామారెడ్డి: గుహలో చిక్కుకున్న రాజు సురక్షితంగా బయటకి.. -
‘డంపింగ్ యార్డ్’కు ఢిల్లీ పాలిటిక్స్.. ఆప్, బీజేపీ పరస్పర విమర్శలు
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ)ఎన్నికలు ఈ ఏడాది చివర్లో లేదా 2023 తొలినాళ్లలో జరగనున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి. అధికార ఆప్, భాజపా మధ్య తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి ఈ ఎన్నికలు. తాజాగా గాజీపూర్‌లోని డంపింగ్ యార్డ్ ఇరు పార్టీల మధ్య వివాదానికి తెరతీసింది. అక్కడి చెత్త డంపింగ్ యార్డ్ వద్దకు గురువారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెళ్లగా.. భాజపా కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఆయనొక అబద్ధాలకోరు అంటూ నినాదాలు చేశారు. అందుకు కౌంటర్‌గా ఆప్ కార్యకర్తలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మూడు స్థానిక సంస్థల విలీనానికి ముందు పదేళ్లకు పైగా ఎంసీడీ అధికారం భాజపా చేతిలోనే ఉంది. ఆ అంశాన్ని లేవనెత్తుతూ.. విమర్శలు గుప్పించారు కేజ్రీవాల్. ‘భాజపా విమర్శల్లో ఎలాంటి లాజిక్ లేదు. భాజపా నేతృత్వంలోని స్థానిక సంస్థలు ఏం చేశాయో తెలుసుకునేందుకే ఇక్కడకు వచ్చాను. ఢిల్లీని శుభ్రంగా ఉంచే పనిలో బీజేపీ పూర్తిగా విఫలమైంది. మేం నిర్మించిన పాఠశాలలు, మొహల్లా క్లినిక్‌లను చూసేందుకు భాజపా వస్తే.. మేం ఇలా నల్ల బ్యాడ్జీలతో నిరసనలు చేయం. మేం అధికారంలోకి వస్తే.. ఢిల్లీని శుభ్రం చేస్తాం. మిమ్మల్ని ఉచితంగా తీర్థయాత్రలకు తీసుకెళ్లిన కుమారుడికి ఓటు వేయాలని ఢిల్లీలోని మాతృమూర్తులకు చెప్పాలనుకుంటున్నాను.’ అని వెల్లడించారు కేజ్రీవాల్. ఈ సందర్భంగా రామాయణంలోని శ్రవణ కుమారుడి పాత్రతో తనను తాను పోల్చుకున్నారు. మరోవైపు.. కేజ్రీవాల్ వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది. స్థానిక సంస్థలకు ఢిల్లీ సర్కార్ తగిన నిధులు ఇవ్వలేదని నిందించింది. ఇప్పుడు స్థానిక ఎన్నికల ముందు ప్రతిజ్ఞలు చేస్తోందని మండిపడింది. స్థానిక సంస్థల ఎన్నికలకు పారిశుద్ధ్య అంశాన్ని కేంద్ర సమస్యగా ఆప్ మార్చిందని, ఇతర ప్రాంతాలను చూపిస్తూ డంపింగ్ పర్వతాలను కప్పిపుచ్చుతోందని ఆరోపించింది. మరోవైపు.. ఎన్నికల తేదీలను ఇంకా ప్రకటించలేదు. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ గణాంకాల ప్రకారం.. నగరంలో నిత్యం 11వేల టన్నుల ఘన వ్యర్థాలు వస్తున్నాయి. వాటిల్లో 5 వేల టన్నులు ప్రాసెస్‌కు పంపగా.. మరో ఆరు వేల టన్నులు అక్కడి మూడు డంపింగ్‌యార్డులకు చేరుకుంటున్నాయి. ఇదీ చదవండి: ‘అదే మా లక్ష్యం’.. పీఓకేపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు! -
డంపింగ్ యార్డులో మూవీ సెట్ వేశాం : డైరెక్టర్
ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘నవాబ్’. రవిచరణ్ దర్శకత్వంలో నమో క్రియేషన్స్ పతాకంపై ఆర్ఎం నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో రవిచరణ్ మాట్లాడుతూ – ‘‘నా మొదటి సినిమా ‘నల్లమల’కు మంచి ఆదరణ లభించింది. ఆ ఉత్సాహంతో ‘నవాబ్’ తెరకెక్కిస్తున్నాం. పూర్తిగా డంపింగ్ యార్డ్‌లో సాగే కథతో ఈ సినిమా ఉంటుంది. దీని కోసం పదెకరాల్లో డంపింగ్ యార్డ్ సెట్ వేశాం. మా హీరో ముఖేష్ గుప్తా తెలుగు కాదు. ఆర్నెళ్లు తెలుగు నేర్చుకుని అద్భుతంగా నటిస్తున్నారు’’ అన్నారు. ‘‘ఓ మంచి కథతో రూపొందుతున్న ‘నవాబ్’లో హీరోగా నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు ముఖేష్ గుప్తా. -
‘జవహర్‌నగర్‌లో కర్చీఫ్ లేకుండా తిరగలేం’
సాక్షి,మేడ్చల్‌జిల్లా: డంపింగ్ యార్డు కారణంగా జవహర్ నగర్ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మాటల్లో చెప్పలేమని బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్చార్జ్ మురళీధర్ రావు అన్నారు. హైదరాబాద్ నగరాన్ని న్యూయార్క్, డల్లాస్, వాషింగ్టన్, లండన్‌లా మారుస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నారని, అయితే పక్కనే ఉన్న జవహర్‌నగర్ లో కర్చీఫ్ అడ్డం పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. సోమవారం దమ్మాయిగూడ ప్రజాసంగ్రామ యాత్ర సభలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ఎన్నికలు అంటే వరద సాయం అన్నారని, దుబ్బాక ఎన్నికలకు మరో పథకం, హుజురాబాద్ ఎన్నికల సమయంలో ‘దళిత బంధు’ మునుగోడు అంటే ‘గిరిజన బంధు’ పథకాలను తెరపైకి తెస్తున్నారన్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ విషయంపై గత కొంతకాలంగా బీజేపీ పోరాటం చేస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇక్కడి నుంచి డంపింగ్ యార్డును ఎత్తివేస్తామన్నారు. టీఆర్ఎస్ పాలనలో ఉస్మానియా యూనివర్సిటీలో ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. కుటుంబ పాలన, అవినీతి, మాఫియా రాజ్యాన్ని అంతమొందించాలంటే బీజేపీని గెలిపించాలన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే నీతివంతమైన పాలన ప్రజలకు అందుతుందన్నారు. సభలో బీజేపీ రాష్ట్ర నేతలు చాడ సురేష్‌రెడ్డి, డాక్టర్ విజయరామారావు , మాజీఎమ్మెల్సీ దిలీప్‌కుమార్, కొల్లి మాధవి, కొంపెల్లి మోహన్‌రెడ్డి, జిల్లా నేతలు పి.హరీష్‌రెడ్డి, పటోళ్ల విక్రంరెడ్డి, జిల్లాల తిరుమల్‌రెడ్డి, అమరం మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ చెత్త రాజకీయం.. హిందూపురంలో బాలకృష్ణ ఇంటి వద్ద ఉద్రిక్తత
సాక్షి, హిందూపురం: డంపింగ్ యార్డు తరలింపునకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో టీడీపీ నాయకుల కవ్వింపు చర్యలు హిందూపురంలో ఉద్రిక్తతకు దారి తీసాయి. వివరాలు... పట్టణంలోని 21వ వార్డు మోత్కుపల్లి సమీపంలోని డంపింగ్ యార్డు సమస్యపై మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ సోమవారం రాత్రి వాట్సాప్ గ్రూపుల్లో హిందూపురం పార్లమెంట్ టీడీపీ మీడియా కో–ఆర్డినేటర్ చంద్రమోహన్ పోస్టు చేశాడు. దీనిపై 21వ వార్డు కౌన్సిలర్ మారుతీరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు గోపీకృష్ణ స్పందించారు. పట్టణాభివృద్ధిలో భాగంగా∙మోత్కుపల్లి డంపింగ్ యార్డును చిన్నగుడ్డంపల్లి వద్దకు తరలించేలా ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ చర్యలు చేపట్టారని, త్వరలో యార్డును చిన్నగుడ్డంపల్లి వద్దకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాధానమిచ్చారు. 37 ఏళ్లుగా టీడీపీ ఎమ్మెల్యేలు ఈ సమస్యపై ఏమి చేశారంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ సైతం పట్టించుకోలేదని కౌంటర్ వేశారు. దీనిపై బహిరంగ చర్చకు రావాలన్న టీడీపీ నేత సవాల్‌ను వైఎస్సార్సీపీ నేతలు స్వీకరించి మంగళవారం ఉదయం 11 గంటలకు చౌడేశ్వరీ కాలనీలోని బాలకృష్ణ ఇంటి వద్దకే వస్తామని ప్రకటించారు. మంగళవారం ఉదయం 10.23 గంటలకు వేదిక మారుస్తూ టీడీపీ పట్టణాధ్యక్షుడు రమేష్ వాట్సాప్ గ్రూప్‌ల్లో మెసేజ్‌లు పంపారు. అప్పటికే వైఎస్సార్సీపీ నేత గోపీకృష్ణ, కౌన్సిలర్లు మారుతీరెడ్డి, శివ, తదితరులు బాలకృష్ణ ఇంటి వద్దకు చేరుకున్నారు. చదవండి: (అర్హతే ప్రామాణికం) గత టీడీపీ హయాంలో హిందూపురంలో బాలకృష్ణ ఎలాంటి అభివృద్ధి చేశారో వచ్చి చెప్పాలంటూ టీడీపీ నాయకులను ప్రశ్నించారు. సమాధానం చెప్పలేక జై బాలయ్య అంటూ టీడీపీ నేతలు నినాదాలతో వాతావరణాన్ని వేడెక్కించారు. ప్రతిగా వైఎస్సార్సీపీ నాయకులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఇరు వర్గాలకు నచ్చచెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. చదవండి: (నటుడు నాని ఏ కిరాణా కొట్టు లెక్కలు లెక్కపెట్టారో: మంత్రి పేర్ని నాని) జనవరి నుంచి కొత్త డంపింగ్ యార్డుకు చెత్త జనవరి నుంచి చిన్నగుడ్డంపల్లి వద్దకు డంపింగ్ యార్డును మార్చనున్నట్లు హిందూపురం మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. నాలుగు దశాబ్దాలుగా మోత్కుపల్లి రోడ్డులో ఉన్న డంపింగ్ యార్డు వల్ల స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయంగా ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ స్పందించి పర్యావరణ శాఖ నుంచి ఎన్ఓసీ తెప్పించి ఇవ్వడంతో 2022, జనవరి నుంచి చెత్తను కొత్త డంపింగ్ యార్డుకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందు కోసం అన్ని చర్యలూ పూర్తి అయ్యాయన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా యార్డు చుట్టూ వందలాది మొక్కలు నాటిస్తున్నట్లుగా తెలిపారు. -
వ్యర్థాలే ‘పవర్’ ఫుల్!
సాక్షి, అమరావతి: వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీకి రంగం సిద్ధమైంది. డంపింగ్ యార్డులో కుప్పలుగా పడి పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఈ వ్యర్థాలు ఇకపై వెలుగులను వెదజల్లనున్నాయి. దీనికి గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని నాయుడుపేటలో 15.50 ఎకరాల్లో ఏర్పాటు చేసిన కర్మగారం వేదికగా కానుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో జిందాల్ సంస్థ రూ.340 కోట్లతో ఈ కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. గత సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 8 వరకూ ప్రయోగాత్మకంగా ఇక్కడ విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఇది విజయవంతమవడంతో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్మాగారంలో విద్యుదుత్పత్తి జరిగే విధానంపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది.. ఇలా ఉత్పత్తి.. రోజుకు 1,200 మెట్రిక్ టన్నుల వ్యర్థాలతో 15 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. విజయవాడ, గుంటూరు, తాడేపల్లి–మంగళగిరి నగరపాలక సంస్థలతో పాటు సత్తెనపల్లి, చిలకలూరిపేట, నరసరావుపేట, పొన్నూరు, తెనాలి పురపాలక సంస్థల నుంచి వ్యర్థాలను ఇక్కడికి తీసుకొస్తారు. లారీల్లో వచ్చే చెత్తను కర్మాగారంలోని పిట్లో అన్లోడ్ చేస్తారు. చెత్తను నిల్వ చేసేందుకు 25 మీటర్ల వెడల్పు, 71 మీటర్ల పొడవుతో పిట్‌ను నిర్మించారు. పిట్లో ఉన్న వ్యర్థాలను గ్రాబ్ క్రేన్ సాయంతో ఫీడర్లో వేస్తారు. ఫీడర్ కింద అమర్చిన సోటకర్ నుంచి వెలువడే మంటలో వ్యర్థాలను మండిస్తారు. ఇవి మండినప్పుడు వచ్చే వేడికి బ్రాయిలర్‌లో స్టీమ్ వెలువడుతుంది. ఈ స్టీమ్.. టర్బైన్లను తిప్పినప్పుడు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 20 మెగా వాట్ల టర్బైన్ను అమర్చారు. ఉత్పత్తి అయిన విద్యుత్‌ను వెంగళాయపాలెంలోని విద్యుత్ సబ్ స్టేషన్‌కు సరఫరా చేసేందుకు వీలుగా కర్మాగారం నుంచి 32 కేవీ విద్యుత్ లైన్‌ను వేశారు. కర్మాగారంలో 11/33 కేవీ స్విచ్ యార్డు నెలకొల్పారు. కర్మాగారంలో ఉత్పత్తి అయిన విద్యుత్‌ను డిస్కమ్‌లకు యూనిట్‌కు రూ.6.16కు విక్రయిస్తారు. వ్యర్థాలు మండినప్పుడు బాటమ్ యాష్, ఫ్లైయాష్ అనే రెండు రకాలైన బూడిద వెలువడుతుంది. ఫ్లైయాష్‌ను నిర్మాణాలకు వాడే ఇటుకల తయారీకి వినియోగిస్తారు. బాటమ్ యాష్‌ను లోతట్టు ప్రాంతాల్లో పూడిక కోసం వినియోగించవచ్చు. ఇదే తరహాలో విశాఖలోనూ.. గుంటూరు తరహాలోనే విశాఖపట్నంలో 15 మెగా వాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం గల మరో కర్మాగారం నిర్మాణంలో ఉంది. 2016లో కర్మాగారాల ఏర్పాటుకు జిందాల్ సంస్థకు అనుమతులు లభించినా, అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో పనులు వేగంగా జరగలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ఈ రెండు కర్మాగారాల ఏర్పాటుతో సుమారు 400 మందికి ఉపాధి లభిస్తోంది. వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ కర్మాగారాలు దేశంలో ఇప్పటికే ఐదు ఉన్నాయి. ఢిల్లీలో మూడు, మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్, హైదరాబాద్‌లో ఒక్కొక్కటి చొప్పున ఉండగా, ఏపీలో ఉన్న రెండింటితో కలిపి మొత్తం ఏడయ్యాయి. త్వరలోనే విద్యుదుత్పత్తి ప్రయోగాత్మక పరిశీలన విజయవంతమైంది. కమర్షియల్ ఆపరేషన్ డేట్(సీవోడీ) కోసం ఏపీసీపీడీసీఎల్‌కు దరఖాస్తు చేశాం. సీవోడీ మంజూరైతే విద్యుదుత్పత్తిని ప్రారంభిస్తాం. త్వరలోనే కర్మాగారంలో పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. – ఎంవీ చారి, జిందాల్ ఏపీ ప్రాజెక్ట్‌ల ప్రెసిడెంట్ -
హుస్సేన్‌సాగర్‌ని డంపింగ్ సాగర్‌గా మార్చారు..
సాక్షి, హైదరాబాద్: నగరం నడిబొడ్డున ఉన్న చారిత్రక హుస్సేన్‌సాగర్‌ను స్వచ్ఛమైన జలాలతో నింపాలన్న సర్కారు సంకల్పం కాగితాలకే పరిమితమవుతోంది. తాజాగా బహుళ అంతస్తుల సెక్రటేరియేట్ భవనాల కూల్చివేత ద్వారా వచ్చిన సుమారు రెండు లక్షల టన్నుల నిర్మాణ వ్యర్థాలను సాగర్‌లో డంపింగ్ చేశారంటూ పలువురు పర్యావరణ వేత్తలు జాతీయ హరిత ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో సాగరమథనంపై అందరి దృష్టి మళ్లింది. కాగా స్వచ్ఛ సాగర్‌గా మార్చేందుకు గత దశాబ్దకాలంగా చేసిన వరుస ప్రయోగాలు ఆశించిన మేర సత్ఫలితాలివ్వకపోవడంతో మిషన్ గాడి తప్పిందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. దశాబ్దకాలంగా సాగర ప్రక్షాళనకు సుమారు రూ.326 కోట్లు ఖర్చుచేసినా ఫలితం శూన్యమని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. వ్యర్థాల డంపింగ్‌పై ఎన్జీటీలో పిటీషన్.. పాత సచివాలయం భవనాల కూల్చివేత ద్వారా వచ్చిన రెండు లక్షల టన్నుల ఘన వ్యర్థాలను అధికారులు వేరొక చోటుకు తరలించినట్లు చెబుతున్నా..అవన్నీ హుస్సేన్‌సాగర్‌లో కలిపేశారని, దీంతో సాగర్ 35 మీటర్ల మేర కుంచించుకుపోయిందని ఆరోపిస్తూ సేవ్ అవర్ అర్బన్ లేక్స్ సంస్థ కన్వీనర్, పర్యావరణ వేత్త లుబ్నాసర్వత్ జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో పిటీషన్ దాఖలు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను న్యాయస్థానానికి సమర్పించారు. దీనిపై సెప్టెంబరు 7న సమగ్ర విచారణ జరగనున్నట్లు ఆమె తెలిపారు. డంపింగ్‌పై వాస్తవాలు బయటపెట్టాలి: లుబ్నా సర్వత్ సచివాలయ కూల్చివేత వ్యర్థాలను హుస్సేన్ సాగర్‌లో కలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను ఎన్జీటీకి సమర్పించాం. ప్రభుత్వం ఈ విషయంలో వాస్తవాలు బయటపెట్టాలి. అందమైన హుస్సేన్ సాగర్‌ను ఇలా డంపింగ్ లేక్‌గా మార్చడం ఏమాత్రం సబబు కాదు. ఆస్ట్రియాలోని డాన్యుబ్ నది తరహాలో ప్రక్షాళన అవసరం సుమారు 900 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో విస్తరించిన హుస్సేన్‌సాగర గర్భంలో దశాబ్దాలుగా సుమారు 40 లక్షల టన్నుల ఘనవ్యర్థాలు పోగుపడినట్లు అంచనా. ప్రభుత్వం గత దశాబ్దకాలంగా సుమారు 5 లక్షల టన్నుల వ్యర్థాలను మాత్రమే తొలగించినట్లు సమాచారం. మిగిలిన 35 లక్షల టన్నుల ఘన వ్యర్థాలు సాగర గర్భంలోనే మిగిలిపోయాయి. ఈ ఘన వ్యర్థాలను కూడా డాన్యుబ్ నది తరహాలో ఆస్ట్రియా సాంకేతిక పరిజ్ఞానంతో తొలగించి మందమైన హెచ్డీపీఈ పైపుల్లో నింపి సాగరం చుట్టూ కట్టలా ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆస్ట్రియా నిపుణుల సహకారం, సాంకేతికతతో మాత్రమే ఈ పనులు చేయగలుగుతారని..ప్రస్తుతం మన వద్ద అందుబాటులో ఉన్న విధానాలతో అట్టడుగున ఉన్న ఘన వ్యర్థాలను తొలగించడం సాధ్యపడదని స్పష్టంచేస్తుండడం గమనార్హం. సాగర మథనం సాగుతోందిలా.. ► ప్రక్షాళనకు తీసుకున్న చర్యలు: 2006లో రూ.270 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం, ఘన వ్యర్థాల తొలగింపు ► 2014: రూ.56 కోట్లతో కూకట్పల్లి నాలా డైవర్షన్ పనులు ► 2015: జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఎనిమిది కాళ్ల ఎక్స్కావేటర్తో వ్యర్థాలు తొలగింపు. ► 2017: హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో సాగర జలాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు కెనడాకు చెందిన ఎజాక్స్ కంపెనీ శాటిలైట్ ఆధారిత టెక్నాలజీ వినియోగం. (ఈ ప్రయోగాన్ని ఉచితంగానే చేశారు) ► హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు దశాబ్దకాలంలో చేసిన వ్యయం: సుమారు రూ.326 కోట్లు చదవండి: ఇదేం రూల్ సారూ.. టులెట్ బోర్డుకు రూ.2 వేల జరిమానా! -
బాబోయ్ డంపు.. తట్టుకోలేక ప్రజలు..
సాక్షి, హైదరాబాద్: నిజాంపేట్‌లోని డంపింగ్ యార్డుతో స్థానికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. చాలాకాలం నుంచి దీనిని ఇక్కడ నుంచి తరలించాలని అధికారులను వేడుకుంటున్నా ఎవరూ స్పందించకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితం బాచుపల్లిలోని సర్వే నెంబర్ 186లో ప్రభుత్వ స్థలంలో అధికారులు డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. అయితే నిత్యం యార్డు నుంచి వెలువడే దుర్వాసనలు, చెత్తను కాల్చడంతో ఎగసి పడుతున్న మంటలు, పొగలతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సమస్య తీవ్రతను గుర్తించి ఇక్కడ నుంచి తరలించాలనే డిమాండ్ ప్రజల్లో ఊపందుకుంది. డంపింగ్ యార్డుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ► నిజాంపేట్ కార్పొరేషన్ బాచుపల్లిలోని సర్వే నంబర్ 186లో సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో చెత్త డంపింగ్ యార్డును గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో ఏర్పాటు చేశారు. ► రోజు రోజుకు పెరుగుతున్న జనాభాతో ఇళ్ల నుంచి సేకరించిన చెత్త టన్నుల కొద్దీ పెరుగుతోంది. ఇలా ప్రతి రోజు నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్ ప్రాంతాల్లోని 96 కాలనీల్లో, బస్తీలు, గేటెడ్ కమ్యూనిటీల నుంచి సుమారు 120 టన్నులకు పైగా చెత్తను సిబ్బంది సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ► అయితే ఇక్కడ చెత్తను ఇక్కడ వేరు చేసి జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలించడం అసలు ఉద్దేశం. ► కానీ నేడు ఏకంగా ఇక్కడే డంపింగ్ యార్డు ఏర్పాటైంది. దీంతో డంపింగ్ యార్డును తరలించాలని స్థానికులు ముక్తకంఠంతో కోరుతున్నారు. విష వాయువులతో ఉక్కిరి బిక్కిరి... ► చెత్త తరచూ తగులబెడుతుండటంతో డంపింగ్ యార్డు రావణ కాష్టంలా నిత్యం మండుతూనే ఉంది. ► గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్తలో ప్లాస్టిక్ వ్యర్థాలు, ఆసుపత్రి వ్యర్థాలు సైతం ఉంటున్నాయి. ► అయితే ఈ చెత్తను సిబ్బందే తగుల బెడుతున్నారా.? లేక ఏదైనా రసాయన చర్య వల్ల మండుతోందా.. అనేది మాత్రం అంతుచిక్కడం లేదు. ► ఈ మంటలతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ► అసలే దుర్వాసన ఆపై ఘాటైన పొగతో ప్రజలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ► మంటల మూలంగా వాతావరణంలో అనేక వాయువులు విడుదల అవుతున్నాయి. దీంతో ప్రజలు అనేక ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. ఆందోళనలో స్థానికులు.. ► డంపింగ్ యార్డు ఏర్పాటుతో తమకు ప్రశాంత జీవనం కరువైందని హిల్ కౌంటీ, సాయినగర్ కాలనీ, అదిత్య గార్డెన్, రాజీవ్ గృహకల్ప, బండారి లేఅవుట్, జర్నలిస్ట్ కాలనీల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక డంపింగ్ యార్డు పక్కనే నిర్మాణం పూర్తి చేసుకున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభైతే ముప్పు మరింత పెరిగే అవకాశం ఉంది. సమస్య తీవ్రతను గుర్తించి అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి త్వరితగతిన డంపింగ్ యార్డును ఇక్కడి నుంచి తరలించాలని కోరుతున్నారు. విష జ్వరాల బారిన ప్రజలు... ► డంపింగ్ యార్డు కారణంగా రోజుల తరబడి చెత్త పేరుకుపోవడంతో దోమలు, ఈగలు వృద్ధి చెందుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు మలేరియా, డెంగీ లాంటి విషజ్వారా -
కంపుకొడుతున్న చెరువుకట్ట.. కారణం ఏంటంటే!
సాక్షి, సిరిసిల్ల(కరీంనగర్): సిరిసిల్ల మున్సిపల్ పరిధి చంద్రంపేటలోని ఈదుల చెరువు కట్ట పరిసర ప్రాంతాల్లో చెత్త, కోళ్ల వ్యర్థాలను పడవేస్తున్నారు. చెరువు చుట్టు పక్కల ప్రాంతంలో దుర్గంధం వెదజల్లుతుందోని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని చెత్తచెదారాన్ని, చికెన్‌సెంటర్ నిర్వాహకులు కోళ్ల వ్యర్థాలను చెరువుకట్ట చుట్టూ పక్కల డంప్ చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈదుల చెరువు మత్తడి దూకడానికి సిద్ధంగా ఉందని, చెరువు పరిసర ప్రాంతాల్లో చెత్తను డంప్ చేయకుండా, నీరు కలుషితం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
చెత్త సమస్యను చిత్తు చేసేలా ‘స్వచ్ఛ సంకల్పం’
సాక్షి, అమరావతి: గ్రామాల్లో పేరుకుపోతున్న చెత్త సమస్యను చిత్తు చేసే చర్యలు త్వరలో మొదలు కాబోతున్నాయి. పట్టణాల్లో మాదిరిగా గ్రామాల్లోనూ ప్రతి ఇంటినుంచీ చెత్తను సేకరించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందుకోసం జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరిట వంద రోజుల ప్రణాళిక రూపొందించింది. తద్వారా ప్రతి గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేసి ప్రజారోగ్యాన్ని కాపాడాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించేలా గ్రామాల్లో ప్రతి 250 ఇళ్లకు ఒకరిని నియమించడంతో పాటు చెత్త సేకరణకు ఆటోలు, రిక్షాలు వంటివి ప్రభుత్వమే గ్రామ పంచాయతీలకు సమకూర్చనుంది. అలా సేకరించిన చెత్తను ఎక్కడికక్కడ ప్రాసెసింగ్ చేయటం ద్వారా వర్మీ కంపోస్టు తయారు చేస్తారు. ప్రాసెసింగ్ ద్వారా వేరు చేసిన పొడి చెత్తను ఫ్యాక్టరీలకు వెళ్లనుంది. ఇందుకు పంచాయతీరాజ్ శాఖ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యాచరణ సిద్ధం చేశాయి. గ్రామాల్లో రోజుకు 12,250 టన్నుల చెత్త గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వ్యక్తి రోజుకు సగటున 300 గ్రాముల చెత్తను పారబోస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఈ విధంగా కేవలం గ్రామీణ ప్రాంతాల నుంచే రోజుకు 500 లారీల్లో పట్టేంతగా 12,250 టన్నుల చెత్త పోగవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్లపై చెత్తను శుభ్రం చేయడం గ్రామ పంచాయతీలకు, పంచాయతీరాజ్ శాఖకు, ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. గ్రామాల్లో పోగయిన చెత్తను రోడ్లకు ఇరువైపులా కుప్పలుగా పోసి తగులబెట్టడం వల్ల వచ్చే పొగ, వాసనతో స్థానిక గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం ఓ శాస్త్రీయమైన, సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. కనీసం చెత్తను తగులబెట్టే అవసరం లేకుండా నిత్యం పోగయ్యే చెత్తను ఎప్పటికప్పుడే ప్రత్యామ్నాయ అవసరాలకు వినియోగించుకునేలా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. 12 శాతం చెత్తతోనే అసలు సమస్య గ్రామీణ ప్రాంతాల్లో పోగయ్యే మొత్తం చెత్తలో 65 శాతం తడి చెత్త రూపంలో ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో వర్మీ కంపోస్టు తయారు చేయాలని నిర్ణయించారు. మరో 12 శాతం పొడి చెత్త (గాజు పెంకులు, కార్డు బోర్డు, ఒక రకమైన ప్లాస్టిక్) వల్ల పర్యావరణానికి, ప్రజారోగ్యానికి సమస్యలొస్తున్నాయి. దీనిని విద్యుత్ ఉత్పత్తి, సిమెంట్ ఫ్యాక్టరీల్లో మండించడానికి ఉపయోగించేలా ప్రాథమిక కార్యాచరణ రూపొందించారు. మిగిలిన 23 శాతం చెత్తను రీసైక్లింగ్‌కు ఉపయోగించాలని ఆలోచన చేస్తున్నారు. నాలుగు ఫ్యాక్టరీలు ఎంపిక పొడి చెత్తతో గ్రామ స్థాయిలోనే వర్మీ కంపోస్టు తయారు చేసేలా రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి గ్రామంలో ఒక షెడ్ చొప్పున ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 9 వేలకు పైగా గ్రామాల్లో వీటి నిర్మాణం పూర్తయింది. రీ సైక్లింగ్‌కు ఉపయోగించే చెత్తను ఆ షెడ్లలోనే వేరుచేసి అక్కడే విక్రయిస్తారు. మిగిలిన 12 శాతం చెత్తను మండించేందుకు రాష్ట్రంలోని నాలుగు ప్రధాన ప్రాంతాల్లో నాలుగు ఫ్యాక్టరీలను ఎంపిక చేయనున్నారు. -
అమానవీయం: ప్రాణం లేదని.. చెత్తకుప్పలోకి
మహబూబ్‌నగర్: తల్లి గర్భంలోనే ఆ శిశువుకు నూరేళ్లు నిండాయి. ఆపరేషన్ ద్వారా వైద్యులు శిశువు మృతదేహాన్ని బయటకు తీయగా.. ఆ కుటుంబసభ్యులు మానవత్వం మరిచారు. పద్ధతి ప్రకారం అంత్యక్రియలు చేయకుండానే దారిలో చెత్తకుప్పలో ఆ ఆడ శిశువు మృతదేహాన్ని పడేసిన ఘటన గురువారం మహబూబ్‌నగర్‌లో కలకలం రేపింది. జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకిషన్ కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం బకారం గ్రామానికి చెందిన మహిళ మూడో కాన్పు కోసం మార్చి 29న నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి వెళ్లింది. అప్పటికే గర్భసంచిలో పిండం మృతి చెందడంతో హైరిస్క్ కేసు కింద వారు మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. మహబూబ్‌నగర్ ఆస్పత్రికి రాత్రి 11.30 వచ్చారు. రాత్రి 1.30 ప్రాంతంలో ఆపరేషన్ చేసి తల్లి గర్భంలో నుంచి మృతి చెందిన ఆడ శిశువును బయటకు తీశారు. తెల్లవారుజామున 3.30 ప్రాంతంలో శిశువు మృతదేహాన్ని తండ్రికి అప్పగించి స్వగ్రామానికి తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. అయితే కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లకుండా పట్టణంలోని ఓ డ్రైనేజీ సమీపంలో ఉండే చెత్తకుప్పలో పడేశారు. గురువారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో టూటౌన్ పోలీసులు శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం గదికి తరలించారు. శిశువు చేతిపై ఆస్పత్రి సిబ్బంది ఏర్పాటు చేసిన ట్యాగ్ ద్వారా ఎవరి శిశువు అనే విషయాన్ని అధికారులు గుర్తించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులను పిలిపించి అడిగితే తప్పు జరిగిందని ఒప్పుకున్నట్లు సూపరింటెండెంట్ తెలిపారు. ప్రస్తుతం తల్లి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటం వల్ల ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. -
పోలవరంలో ఎన్జీటీ బృందం
పోలవరం రూరల్: పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మూలలంక ప్రాంతంలోని డంపింగ్ యార్డు మట్టి జారిపోకుండా తీసుకున్న చర్యలు, ఇంకా చేపట్టాల్సిన పనులను జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) బృందం మంగళవారం పరిశీలించింది. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శేషశయనారెడ్డి నాయకత్వంలో బృంద సభ్యులు కోట శ్రీహర్ష, టి.శశిధర్, ఎస్.మన్నివరం, హెచ్డీ వరలక్ష్మి, డి.సురేష్ పోలవరం ప్రాజెక్టు డంపింగ్ యార్డులు, ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డంపింగ్ యార్డులను పరిశీలించి ప్రాజెక్టు సీఈ ఎం.సుధాకర్‌బాబు, ఎస్ఈ కె.నరసింహమూర్తిల నుంచి వివరాలు తెలుసుకున్నారు. బీసీ కాలనీ సమీపంలో ఉన్న 203 ఎకరాల డంపింగ్ యార్డు ఏమైనా జారిపోయిందా, మొక్కలు నాటారా.. కాలువ పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలను పరిశీలించారు. 902 హిల్ ప్రాంతంలోని స్పిల్ చానల్ మట్టిని పోస్తున్న రెండు ప్రదేశాలను కూడా చూశారు. హిల్ వ్యూ పై నుంచి స్పిల్ వే రేడియల్ గేట్ల అమరిక, ఎగువ కాఫర్‌డ్యామ్, ట్విన్‌టన్నెల్స్ పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బృందం సభ్యులు మూలలంక డంపింగ్‌యార్డు కోసం తీసుకున్న 203 ఎకరాల భూములకు పరిహారం చెల్లించారా లేదా అనే విషయాలను ఆరా తీశారు. 30 మంది రైతులు పరిహారం తీసుకోలేదని, వారికి సంబంధించిన సొమ్ము కోర్టులో జమచేశామని అధికారులు తెలిపారు. ఈ బృందం బుధవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో పబ్లిక్ హియరింగ్ నిర్వహించి ఆ ప్రాంత వాసుల నుంచి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకుంటుంది. ఆర్డీవో వైవీ ప్రసన్నలక్ష్మి, తహసీల్దార్ బి.సుమతి, ఈఈ మల్లికార్జునరావు, మేఘ జీఎం ఎ.సతీష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
ఆటోతో ఢీకొట్టి, ఆస్పత్రిలో చేర్చకుండా...
సాక్షి, హైదరాబాద్: మానవత్వం మనుషుల్లో రాన్రాను కానరాకపోతోందనడానికి, ఆటోడ్రైవర్ పేరుకు మచ్చతెచ్చే ఓ మచ్చుతునక ఈ అమానుష ఘటన. రోడ్డుపై నడుస్తున్న వ్యక్తిని ఆటోతో ఢీ కొట్టి గాయపరచడమే కాకుండా అతడిని ఆస్పత్రిలో చేర్చాలన్న కనీస మానవత్వాన్ని మరిచి డంపింగ్ యార్డులో పడేసి ఆ వ్యక్తి మృతికి కారణమయ్యాడు ఓ ఆటోడ్రైవర్. ఘటన జరిగిన రెండు నెలల తర్వాత సెల్‌ఫోన్ సిగ్నల్స్, సీసీ ఫుటేజీ ఆధారంగా ఆటోడ్రైవర్ కిరాతకం బయటపడింది. ఈ ఘటన వివరాలను కూకట్పల్లి ఏసీపీ సురేందర్‌రావు మంగళవారం విలేకరులకు వెల్లడించారు. ఫైనాన్స్ డబ్బులు చెల్లించేందుకు వెళ్లి... మియాపూర్ జనప్రియనగర్‌కు చెందిన కాకర రామకృష్ణ జనవరి 7న ఇంటి నుంచి బయటకు వెళ్లి మియాపూర్ రత్నదీప్ మార్కెట్ వద్ద ఫైనాన్స్ డబ్బులు చెల్లించేందుకు గాను రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో హఫీజ్‌పేటకు చెందిన సయ్యద్ షేర్ అలీ (38) తన స్నేహితుడైన గౌస్‌కు చెందిన ఆటో (టీఎస్07యూసీ 7684నంబర్)ను తీసుకుని ఆటోతో రామకృష్ణను ఢీ కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలైన రామకృష్ణ రోడ్డుపై పడి సృహ కోల్పోయాడు. స్థానికులు గమనించి రామకృష్ణను ఢీ కొట్టిన ఆటోలోనే ఎక్కించి ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఆటో డ్రైవర్ సయ్యద్ షేర్ అలీకి సూచించారు. సరేనంటూ ఆటోలో బాధితుడిని ఎక్కించుకున్న ఆటో డ్రైవర్ షేర్ అలీ కొద్దిదూరం వెళ్లిన తరువాత బాధితుడి పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని ఖైత్లాపూర్‌లోని డంపింగ్ యార్డులో పడవేసి వెళ్లిపోయాడు. రామకృష్ణ వద్ద ఉన్న సెల్‌ఫోన్‌తో పాటు రూ.3 వేల నగదును కూడా తీసుకుని వెళ్లిపోయాడు. మిస్సింగ్ కేసుగా నమోదు అదే నెల 8వ తేదీకి కూడా రామకృష్ణ ఇంటికి తిరిగిరాకపోవటంతో కుటుంబ సభ్యులు మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మరోవైపు 8వ తేదీనాడు సాయంత్రం నాలుగు గంటలకు ఖైత్లాపూర్ వద్ద ఉన్న జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డు వద్ద గుర్తుతెలియని శవం పడి ఉందన్న సమాచారంతో కూకట్పల్లి పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మియాపూర్‌లో రామకృష్ణ మిస్సింగ్ కేసు నమోదు కావడం, కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి శవం లభ్యం కావడంతో పాటు ఇద్దరి వివరాలు ఒకే విధంగా ఉండటంతో రామకృష్ణ కుటుంబసభ్యులను కూకట్పల్లి పోలీసులు పిలిపించగా..వారు మృతదేహాన్ని రామకృష్ణదిగా గుర్తించారు. మృతదేహంపై ఉన్న గాయాలను బట్టి ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును మొదలుపెట్టారు. ఆ క్రమంలో ముందుగా రామకృష్ణ రోడ్డు దాటుతుండగా ఆటో ఢీకొట్టడాన్ని సీసీ పుటేజీద్వారా గుర్తించారు. దీంతోపాటుగా రామకృష్ణ సెల్‌ఫోన్‌ను నిందితుడైన ఆటోడ్రైవర్ లతీఫ్ అనే వ్యక్తికి రూ.1000కి విక్రయించినట్లు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో లతీఫ్‌ను విచారించగా నిందితుడు ఆటోడ్రైవర్ సయ్యద్ షేర్ అలీ అని తేలింది. మంగళవారం ఆటో డ్రైవర్ సయ్యద్ షేర్అలీని అదుపులోకి తీసుకుని విచారించగా..సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్తే బ్రతికేవాడేనని, ఆస్పత్రికి తీసుకెళ్లితే తనపై కేసు అవుతుందేమోనన్న భయంతో పాటు వైద్యం ఖర్చులు కూడా తానే భరించాల్సి వస్తుందన్న కారణంతో రామకృష్ణను డంపింగ్ యార్డులో పడేసినట్లు షేర్ అలీ ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. -
సఫాయివాలా అవతారమెత్తిన హరీశ్‌రావు
సాక్షి, సిద్దిపేట: జిల్లాలోని బుస్సాపూర్ డంపింగ్ యార్డులోని తడి, పొడి చెత్తను వేరుచేసే యంత్రాన్ని మంగళవారం ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుడి యూనిఫాం వేసుకుని అక్కడున్న కార్మికులతో కలిసి పనిచేశారు. మంత్రి మాట్లాడుతూ, వ్యర్థం అనుకున్న ప్రతి వస్తువును ఉపయోగకరంగా మార్చుకోవచ్చని చెప్పారు. సాక్షి, సిద్దిపేట: వ్యర్థ పదార్థాలు, మనకు ఇబ్బంది కరంగా ఉన్న చెత్త, చెదారాన్ని కాస్తా ఆలోచించి, కొద్దిపేట శ్రమను జోడిస్తే ఉపయోగకరమైన పదార్థాలుగా, ఎరువులుగా తయారు చేసుకోవచ్చని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్‌లో చెత్త రీసైక్లింగ్ యూనిట్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిద్దిపేట పట్టణంలో రోజుకు 40 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుందన్నారు. ఈ తడి, పొడి చెత్తనే వేరు చేసేందుకు రూ. 2.5 కోట్లతో మానవ ఘన వ్యర్థాల నిర్వాహణ(ఎఫ్ఎస్టీపీ) కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇటుకల తయారీని పరిశీలిస్తున్న ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఇప్పటికే సిరిసిల్లలో తొలుత నిర్మించామన్నారు. ఇలా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిదన్నారు. సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాన్ని ఎఫ్‌ఎస్‌టీపీకి అందజేయాలన్నారు. దీన్ని ప్రాస్సెస్ చేసిన తర్వాత 16వేల లీటర్ల నీటిని పార్కులోని మొక్కలకు అందజేస్తారన్నారు. అదేవిధంగా 800 కేజీల ఎరువు వస్తుందని, ఈ ఎరువును రైతులకు ఉచితంగా అందజేస్తామన్నారు. డంప్‌యార్డులోకి ఎంత చెత్త వస్తుందనే విషయం తెలుసుకునేందరు. రూ. 12లక్షలతో వే బ్రిడ్జి నిర్మించామన్నారు. అదేవిధంగా తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు రూ. 50లక్షలతో మిషన్ కొనుగోలు చేశామని తెలిపారు. వేరుచేసిన తడి చెత్త నుండి సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నామన్నారు. అదేవిధంగా రూ. 30లక్షలతో కొనుగోలు చేసిన యంత్రంతో పొడి చెత్తలోని ప్లాస్టిక్ నుంచి సిమెంట్ బ్రిగ్స్, ఇతర కుండీలు, అలంకరణ వస్తువులు తయారు చేస్తున్నామన్నారు. త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్ త్వరలో ఉద్యోగాల నోటిఫికేషన్ శుభవార్తను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పనున్నారని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. కరోనాతో అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. త్వరలోనే రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలతో కూడిన నోటిఫికేషన్ రానుందని, అందుకోసం జిల్లాలో ప్రత్యేక శిక్షణ కేంద్రాలను యువతకు అందుబాటులో ఉంచడంతో పాటుగా, మెటీరియల్‌ను అందించనున్నట్లు తెలిపారు. దశల వారీగా ప్లాస్టిక్ రోడ్లు.. ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగకరంగా మార్చే ప్రక్రియలో భాగంగా సిద్దిపేటలో రాబోయే రోజుల్లో ప్లాస్టిక్ రోడ్లు వేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ రోడ్ల నిర్మాణం జరుగుతుందని గుర్తు చేశారు. సిద్దిపేటలో కొంత భాగాన్ని ఎంపిక చేసుకొని ప్లాస్టిక్ రోడ్లు వేస్తామని, దాని ఫలితాలను బట్టి దశల వారీగా విస్తరిస్తామని తెలిపారు. -
గోదా‘వర్రీ’.. పవిత్ర జలాలు అపవిత్రం
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం : పవిత్ర గోదావరి జలాలు కలుషితమవుతున్నాయి. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే నీళ్లు మురుగును తలపిస్తున్నాయి. పరీవాహకం వెంట ఉన్న ఫ్యాక్టరీలు.. నగర శివారు ప్రాంతాల్లోని వ్యర్థాలన్నీ గోదావరిలో సమ్మిళితం కావడంతో నదీ పవిత్రతను కోల్పోతోంది. రాష్ట్రంలో నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రం వద్ద మహారాష్ట్ర నుంచి తెలంగాణలో ప్రవేశించే గోదావరి.. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన దివ్యక్షేత్రం భద్రాచలం వద్ద ఏపీలోకి వెళ్తోంది. ఈ మధ్య ప్రాంతంలో 465 కిలోమీటర్ల మేర ప్రవహించే గోదావరిలోకి పలు చోట్ల భారీగా చెత్తా చెదారం చేరుతోంది. మురుగు నీటిని నేరుగా గోదావరిలోకి వదులుతుండటంతో పవిత్ర జలాలు అపవిత్రం అవుతున్నాయి. గోదావరిలో కలిసే అన్ని ఉపనదులు దట్టమైన అటవీ ప్రాంతాల నుంచి ప్రవహిస్తూ వస్తుండటంతో ఔషధ విలువలు ఉండాల్సిన జలాలు కాస్తా కాలుష్యమయం అవుతున్నాయి. దీంతో పర్యా వరణానికి హాని కలుగుతుండటంతో పాటు జం తువులు, వన్యప్రాణులు సైతం ఆ నీరు తాగి మృత్యువాత పడుతున్నాయి. బాసర, ధర్మపురి, మంచిర్యాల, రామగుండం, మంథని, భద్రాచలం పట్టణాల నుంచి ప్రతిరోజూ మురుగునీటిని శుద్ధి చేయకుండానే నేరుగా గోదావరిలోకి వదులుతున్నారు. మారని పరిస్థితి.. గోదావరి జలాల్లోకి నేరుగా ఒక్క చుక్క మురుగు నీరు వదలొద్దని.. ఎన్ని కోట్లు ఖర్చయినా మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ గతంలో ఆదేశించారు. అయినప్పటికీ పరిస్థితి మారకపోగా మరింత అధ్వానంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తిపోతల పథకాలు నిర్మించి రివర్స్ పంపింగ్ చేస్తోంది. దీంతో కలుషిత నీరు బ్యారేజీల్లోకి చేరి నీటిలోని జలచరాలు అంతరించిపోయే పరిస్థితి నెలకొంది. అలాగే ఈ నీటిని తాగేందుకు ఉపయోగిస్తే ప్రమాదకరమైన జబ్బుల బారిన పడే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. ఇటువంటి పరిíస్థితుల్లో ఎస్టీపీల (మురుగునీటి శుద్ధి ప్రక్రియ ప్లాంట్లు) ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. పని చేయని ప్లాంట్లు.. రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ల తర్వాత అతిపెద్ద రామగుండం కార్పొరేషన్ నుంచి ప్రతిరోజూ 32 మిలియన్ లీటర్ల మురుగునీరు గోదావరిలో కలుస్తోంది. ఈ నీటిని ఏమాత్రం శుద్ధి చేయకుండా వదిలిపెడుతుండటంతో గోదావరి మురికికూపంగా మారుతోంది. రామగుండం శివారులో నిర్మించిన ఎస్టీపీ ప్లాంట్‌లో 4 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ ఫర్ డే) వ్యర్థ జలాలను శుద్ధి చేయాలి. అయితే అది పనిచేయడం లేదు. అలాగే 8 ఎకరాల్లో నిర్మించిన మల్కాపూర్ ఎస్టీపీ ప్లాంట్ ద్వారా ప్రతిరోజూ 14 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాలను శుద్ధి చేయాలి.. ప్రస్తుతం అది కూడా పనిచేయడం లేదు. అలాగే కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన 14 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన సుందిళ్ల ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం మధ్యలోనే నిలిచింది. దీంతో ఇందుకు కేటాయించిన నిధులూ వృథా అయ్యాయి. రామగుండం కార్పొరేషన్ నుంచి వచ్చే వ్యర్థ జలాలతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర హానికరమైన రసాయన వ్యర్థాలు గోదావరిలో 18 మిలియన్ లీటర్లు కలుస్తున్నాయి. కాగా.. రూ.90 కోట్లతో 21 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన మురుగునీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీని ద్వారా శుద్ధి చేసిన నీటిని ఎన్టీపీసీకి అందించాలని ప్రతిపాదనలో పేర్కొన్నారు. అయితే దీనికి ఇంకా అనుమతులు లభించలేదు. ఇక కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి నీటి రివర్స్ పంపింగ్ కారణంగా ముంపునకు గురవుతున్న మల్కాపూర్ ఎస్టీపీ ప్లాంట్ స్థానంలో రూ.15.80 కోట్లతో మరో ప్లాంట్ నిర్మించాలని రామగుండం కార్పొరేషన్ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులకు ప్రతిపాదించారు. దీనిపై ఎలాంటి ముందడుగు పడలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు.. రామగుండంలో 8 ఎంఎల్డీ, మల్కాపూర్ శివార్లలో 21 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన 2 ఎస్టీపీ ప్లాంట్లకు ప్రతిపాదనలు పంపాం. లేటెస్ట్ టెక్నాలజీ వాడేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం. టెండర్ల ప్రక్రియ నడుస్తోంది. – పి.ఉదయ్‌కుమార్, కమిషనర్, రామగుండం కార్పొరేషన్ రోజూ 11 టన్నుల చెత్త నదిలోనే.. భద్రాచలంలోని 64 కాలనీల నుంచి ప్రతిరోజూ ఉత్పత్తవుతున్న 11 టన్నుల తడి, పొడి చెత్తను దేవస్థానానికి సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుక భాగంలో గోదావరి కరకట్ట లోపల నది పారుతున్న చోటే వేస్తున్నారు. దీంతో నదిలోని నీరు కాలకూట విషంలా మారుతోంది. భద్రాచలం పట్టణం మినహా మండలంలోని మిగిలిన గ్రామాలన్నీ పోలవరం ముంపు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. భద్రాచలం చుట్టూ ఏపీ గ్రామాలే ఉన్నాయి. చివరకు భద్రాచలం ఆలయ భూములు 950 ఎకరాలు సైతం ఏపీలోకే వెళ్లాయి. దీంతో పట్టణానికి డంపింగ్ యార్డుకు కూడా స్థలం లేకుండా పోయింది. ఈ క్రమంలో గోదావరికి ఇవతలి ఒడ్డున ఉన్న బూర్గంపాడు మండలం సారపాక పంచాయతీలోని భాస్కర్‌నగర్, గాంధీనగర్ వద్ద భద్రాచలం డంప్ యార్డ్ ఏర్పాటుకు అధికారులు ప్రయత్నాలు చేయగా.. సారపాక వాసులు వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల జరిగిన బూర్గంపాడు మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో పినపాక ఎమ్మెల్యే, విప్ రేగా కాంతారావు సైతం ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. దీంతో ప్రస్తుతానికి భద్రాచలం వద్ద గోదావరి నదీగర్భమే డంపింగ్ యార్డులా మారింది. ఇచ్చట చెత్త వేస్తే శిక్షార్హులని బోర్డు ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీయే ఆ బోర్డు వద్ద చెత్తను డంప్ చేస్తుండటం గమనార్హం. ఈ విషయమై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కొత్తగూడెం ఇన్చార్జ్ ఈఈ బి.శంకర్‌బాబును వివరణ కోరగా.. పరిశీలించి భద్రాచలం గ్రామపంచాయతీపై చర్యలు తీసుకుంటామన్నారు. సందట్లో సడేమియాలా.. రాష్ట్ర సరిహద్దులోని మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్‌లో ఉన్న పయనీర్ లిక్కర్ ఫ్యాక్టరీ వారు వ్యర్థాలను గోతుల్లో నిల్వ చేసి జూలైలో బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తిన సమయంలో సందట్లో సడేమియాలా వ్యర్థాలను గోదావరిలోకి వదులుతుంటారు. ఇక మంచిర్యాల జిల్లా కేంద్రం వద్ద ఉన్న 3 ఎస్టీపీ ప్లాంట్లు పనిచేయడం లేదు. దీంతో మురుగునీరు వాగుల ద్వారా నేరుగా గోదావరిలో కలుస్తోంది. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణం నుంచి మురుగు నీరు నేరుగానే గోదావరిలో కలుస్తోంది. ఇక్కడ ఎస్టీపీ ప్లాంట్ కోసం రూ.18 కోట్లతో ప్రభుత్వానికి ప్రతాపాదనలు పంపారు. ఇటు పెద్దపల్లి జిల్లా మంథని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణాల నుంచి కూడా మురుగునీరు శుద్ధి చేయకుండానే నేరుగా గోదావరిలో కలుపుతున్నారు. -
డంపింగ్ యార్డ్ చెత్త నుంచి విద్యుత్
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్‌లోని డంపింగ్ యార్డ్ నుంచి వెలువడే మీథేన్ వాయువు ఆధారంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ హైకోర్టుకు చెప్పారు. రెండు నెలల్లో రెండు విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత మరో రెండు నెలల్లోగా మరో యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. డంపింగ్ యార్డ్ వల్ల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు దోమలు, దుర్వాసన వంటి పలు సమస్యల్ని ఎదుర్కొనడంపై పత్రికల్లో వచ్చిన వార్తల ప్రతిని జత చేసి నగరానికి చెందిన సీతారాంరాజు రాసిన లేఖను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు లోకేష్ కుమార్ సోమవారం హైకోర్టుకు హాజరయ్యారు. పత్రికల్లో డంపింగ్ యార్డ్ వల్ల సమస్యల గురించి వార్తలు వస్తున్నాయని, దుర్గంధం వల్ల అక్కడి ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతుంటే జీహెచ్ఎంసీ ఎలాంటి నివారణ చర్యలు తీసుకుందని ధర్మాసనం ప్రశ్నించింది. యార్డ్ 337 ఎకరాల్లో చెత్త ఉండేదని, 137 ఎకరాలకు తగ్గించామని, శాస్త్రీయ పద్ధతుల్లో చెత్తపై పాలిథిన్ కవర్లు మట్టిని వేస్తున్నామని, ఇదే మాదిరిగా పలు పొరలుగా వేస్తామని, దీని వల్ల దుర్వాసన బయటకు వెళ్లదని కమిషనర్ వివరించారు. డంపింగ్ యార్డ్‌లో చెత్త వేసే పరిధి తగ్గించవచ్చని, అయితే చెత్త వెలువడే దుర్వాసన తగ్గేలా ఎందుకు చేయలేక పోతున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. ఒకేచోట చెత్త పేరుకుపోయి ఉంటే అందులోని దుర్గంధమైన నీరు భూమిలోకి చేరే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. చెత్తలో వానపాములు వేసి కొంతవరకూ సమస్యను పరిష్కరిం చేందుకు చర్యలు తీసుకుంటామని, చెత్తను ఎండబెట్టేలా చేసి నివారణ చర్యలు తీసుకుంటామని కమిషనర్ చెప్పారు. విచారణ అనంతరం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కమిషనర్‌ను ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఫిబ్రవరి 7కి వాయిదా వేసింది. -
రూ. 50 కోట్ల స్థలం మింగేశారు!
సాక్షి, రాజేంద్రనగర్: భూకబ్జాదారులు బరితెగిస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో ఏకంగా డంపింగ్ యార్డు స్థలానికి ఎసరు పెట్టారు. మొత్తం 22 ఎకరాల్లో దాదాపు 6 ఎకరాలను ప్లాట్లుగా మార్చి విక్రయించి యథేచ్ఛగా సొమ్ము చేసుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గండిపేట మండల పరిధిలోని గంధంగూడ సర్వేనంబర్ 43లో ప్రభుత్వానికి చెందిన 22.17 ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలాన్ని గతంలో ప్రభుత్వం డంపింగ్ యార్డును ఏర్పాటు చేసేందుకు సిలికాన్ అనే ప్రైవేటు సంస్థకు అప్పగించింది. నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన చెత్తాచెదారాన్ని ఇక్కడ డంప్ చేసి రీసైక్లింగ్ నిర్వహించేవారు. ఏడు సంవత్సరాల క్రితం ఈ డంపింగ్ యార్డు మూతబడింది. అంతకుముందు వేసిన చెత్తచెదారంతో ఆ ప్రాంతం ఓ గుట్టలా మారింది. అయితే, కొంతకాలంగా కొందరు స్థానిక నేతలు ఈ చెత్తను తొలగించి ప్లాట్లుగా మారి అమాయకులకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. చెత్తలోనే గుంతలు తీసి పిల్లర్లు వేసి ఇళ్లను నిర్మిస్తున్నారు. 120 నుంచి 180 గజాల వరకు ప్లాట్లుగా చేసి నిర్మాణాలను ప్రారంభించారు. ఈ నిర్మాణాలకు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎలాంటి అనుమతులు లేవు. డంపింగ్ యార్డు స్థలంలోనే నిర్మాణాలను చేపడుతున్న ఇక్కడి కార్పొరేషన్, రెవెన్యూ అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఈ స్థలాన్ని గండిపేట మండల ఆర్ఐ, వీఆర్వోల ఆధ్వర్యంలో డిజిటల్ సర్వే నిర్వహించడం కొసమెరుపు. స్థానికుడు కృష్ణాగౌడ్ ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలంటూ ఇటీవల ఫిర్యాదు చేయడంతో ఈ సర్వే చేపట్టారు. ఈ సర్వే వివరాలను 3–4 రోజుల్లో వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ ఒక్కో ఎకరం దాదాపు రూ. 8 కోట్ల వరకు పలుకుతోందని స్థానికులు చెబుతున్నారు. అక్రమార్కులు దాదాపు రూ. 50 కోట్ల విలువైన స్థలాన్ని మింగేసినా యంత్రాంగం పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఆర్ఐ వాణిరెడ్డిని వివరణ కోరగా.. కొన్నిరోజుల్లో సర్వేకు సంబంధించిన రిపోర్టు వస్తుందని, దాని ద్వారా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.