- పుష్కర విధుల్లో జిల్లా పోలీసులు
- ఇదే అదునుగా పేట్రేగుతున్న స్మగ్లర్లు
- శేషాచలం నుంచి పెద్ద ఎత్తున ఎర్రచందనం రవాణా
- బుధ, గురువారాల్లో 13 మంది స్మగ్లర్లు అరెస్ట్
- బడా స్మగ్లర్ శ్రీనివాసరెడ్డి కోసం గాలింపు
సాక్షి ప్రతినిధి. తిరుపతి
శేషాచలంలోని ఎర్ర చందనం డంప్‌లు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తమిళనాడు నుంచి వస్తోన్న ఎర్ర స్మగ్లర్లు చాకచక్యంగా ఎర్రదుంగల తరలింపును ముమ్మరం చేశారు. జిల్లా పోలీసుల్లో 80 శాతం మంది కృష్ణా పుష్కర విధులకు హాజరవడం వీరికి కలిసొచ్చింది. ఇదే సరైన అదునుగా భావించిన స్మగ్లర్లు అడవుల్లో దాచిన ఎర్రచందనం దుంగల డంప్‌లను గుట్టూచప్పుడు కాకుండా బయటకు రవాణా చేసేందుకు యత్నిస్తున్నారు. గడచిన మూడు రోజులుగా ఈ రవాణా పెరిగినట్లు టాస్క్‌ఫోర్సు అధికారులు గుర్తించారు. బుధ, గురువారాల్లో విస్తృతంగా తనిఖీలు జరిపి 13 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.40 లక్షల విలువైన 58 ఎర్రచందనం దుంగలను (2 టన్నులు)స్వాధీనం చేసుకున్నారు.
చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లోని 5 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న శేషాచలంలో ఇంకా 30 శాతం ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. ఇప్పటికే నరికిన చెట్ల తాలూకు దుంగల నిల్వలు పెద్ద ఎత్తున అడవుల్లో నిల్వ ఉన్నాయి. వీటిని బయటకు తరలించే విషయంలో ఇటు ఆంధ్ర, అటు తమిళనాడు స్మగ్లర్లు విస్తృతంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. గడచిన రెండు నెలల్లో సుమారు 20 టన్నులకు పైన ఎర్ర దుంగలను స్వాధీనం చేసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు 25 మందికి పైబడి స్మగ్లర్లును అరెస్టు చేశారు. రెడ్‌శాండల్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్‌ఫోర్స్‌కు చెందిన 13 బృందాలు శేషాచలంలో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. వెలిగొండ, పాలకొండ, నల్లమల, లంకమల అటవీ ప్రాంతాల్లో వీరి కూంబింగ్ జరుగుతోంది. ఈ నెల ఏడో తేదీన జిల్లాకు చెందిన 80 శాతం మంది పోలీసులు కృష్ణా పుష్కర విధులకు వెళ్లిపోయారు. దీంతో అన్ని మార్గాల్లోనూ పోలీసుల తనిఖీలు లేకుండా పోయాయి. ఇదే అదునుగా తీసుకున్న స్మగ్లర్లు రాత్రి వేళల్లో యథేచ్చగా ఎర్రచందనాన్ని రవాణా చేస్తున్నారు.
13 మంది అరెస్టు ...పరారీలో ముగ్గురు
ఇదిలా ఉండగా బుధవారం మధ్యాహ్నం ఉగ్గరాల తిప్ప దగ్గర కూంబింగ్‌లో ఉన్న టాస్క్‌ఫోర్సు పోలీసులకు ఎర్ర చందనం దుంగలను రవాణా చేసే ముగ్గురు తమిళనాడు స్మగ్లర్లు దొరికారు. వీరిని చాకచక్యంగా అరెస్టు చేసిన పోలీసులు వీరి నుంచి 58 దుంగలు (2 టన్నులు)స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.40 లక్షలు ఉంటుందని టాస్క్‌ఫోర్సు డీఎస్సీ శ్రీధర్‌రావు విలేకరులకు తెలిపారు. గురువారం ఉదయం 5 గంటలకు జూపార్కు సమీపంలోని పెరుమాళ్లపల్లి అడవుల్లో అడవిలోకి ప్రవేశిస్తోన్న ఎర్ర స్మగ్లర్లపై టాస్క్‌ఫోర్సు ఆర్‌ఎస్‌ఐ వాసు, నర్సింహయ్యల టీములు ఒక్కసారిగా దాడులు జరిపాయి.
మొత్తం 10 మందిని అరెస్టు చేశారు. వీరిలో రేణిగుంటకు చెందిన కె. శివ, తిరుచ్చికి చెందిన లక్ష్మన్ సెంథిల్ కుమార్, రాసు షణ్ముగం, పిలెందిరన్ అంగముత్తు, క్రిష్టన్‌మూర్తి, రామర్ నాగరాజన్, నల్లిస్వామి పెరుమాళ్, నగరాజన్ సత్యవేల్, సంథానమ్ రవి, సంథానమ్ రాములు ఉన్నారని డీఎస్పీ శ్రీథర్‌రావు వివరించారు. వీరికి నాయకత్వం వహిస్తోన్న పేరూరి శ్రీనివాసరెడ్డి, మునస్వామి, రామానాయుడులు పరారయ్యారు. అరెస్టయిన వారి నుంచి ఓ ఆటో, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. బడా స్మగ్లర్ పేరూరి శ్రీనివాసరెడ్డి కోసం గాలిస్తున్నారు. సహకరిస్తోన్న అగ్రికల్చర్ కాలేజీ వాచ్‌మెన్, రైల్వే ఉద్యోగిలను విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.