Redwood
-
ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ కమెడియన్
బుల్లితెరలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి అందరికీ తెలిసిందే. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ వెండితెరపై కూడా పలు అవకాశాలు దక్కించుకున్నారు. తాజాగా జమర్దస్త్ కమెడియన్ హరిపై ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు నమోదు అయింది. అతని ముఠాకు చెందిన కిషోర్ అనే వ్యక్తిని చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 60 లక్షలు విలువైన ఎర్రచందనం దుంగలను వారు స్వాధీనం చేసుకున్నారు. (ఇదీ చదవండి: గోపీచంద్ కొత్త సినిమా ఇదే.. 13 ఏళ్ల తర్వాత పూరిని గుర్తుకు తెచ్చాడు) కానీ కమెడియన్ హరి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతని కోసం గాలిస్తున్నట్లు వారు చెప్పారు. ఇప్పటికే అతనిపై ఎర్రచందనం అక్రమ రవాణా విషయంలో పలు కేసులు ఉన్నాయని పోలీసులు తెలుపుతున్నారు. చిత్తూరు జిల్లా పోలీసులు గతంలోనే హరిపై స్మగ్లింగ్ కేసులతో పాటు, పలు కేసులు నమోదు చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాడనే ఆరోపణలు ఉన్నాయి. జబర్దస్త్ షో ద్వారా లేడీ గెటప్‌లో చాలా రోజుల నుంచి హరి మెప్పిస్తున్న విషయం తెలిసిందే (ఇదీ చదవండి: తెలుగు ఇండస్ట్రీపై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు) -
అమెరికాలో కోర్టుకు వెళ్లిన బైజూస్.. ఎందుకంటే..
న్యూఢిల్లీ: 1.2 బిలియన్ డాలర్ల రుణాన్ని (టీఎల్‌బీ) త్వరితగతిన చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తోందన్న ఆరోపణలతో ఇన్వెస్ట్మెంట్ సంస్థ రెడ్వుడ్పై దేశీ ఎడ్టెక్ సంస్థ బైజూస్.. అమెరికాలోని న్యూయార్క్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. టీఎల్‌బీ ఒప్పంద నిబంధనలకు విరుద్ధంగా రెడ్‌వుడ్ తమ రుణంలో గణనీయమైన భాగాన్ని కొనుగోలు చేసి, తమపై బెదిరింపు వ్యూహాలను ప్రయోగిస్తోందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో రుణదాతగా రెడ్‌వుడ్ అనర్హమైనదిగా తాము పరిగణిస్తున్నట్లు బైజూస్ ఒక ప్రకటనలో తెలిపింది. న్యాయ వివాదం తేలేంత వరకు టీఎల్బీకి సంబంధించిన ఎటువంటి చెల్లింపులు చేయరాదని నిర్ణయించుకున్నట్లు వివరించింది. వడ్డీ కింద సోమవారం నాడే 40 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉన్నప్పటికీ బైజూస్ చెల్లించలేదు. సాంకేతిక డిఫాల్టులు తదితర కారణాలతో రుణదాతలు అనవసర చర్యలకు దిగాయని.. తమ అమెరికా విభాగం బైజూస్ ఆల్ఫాను ఆధీనంలోకి తీసుకోవడంతో పాటు కొత్త మేనేజ్మెంట్ను నియమించాయని బైజూస్ తెలిపింది. తాము టీఎల్‌బీ రుణదాతలతో చర్చలు జరిపేందుకు, వారు తమ చర్యలను వెనక్కి తీసుకుంటే యథాప్రకారం చెల్లింపులను జరిపేందుకు సిద్ధంగానే ఉన్నామని వివరించింది. మరోవైపు, తప్పుడు విధానాలకు పాల్పడిందన్న ఆరోపణలతో బైజూస్ అమెరికన్ విభాగాలపై(బైజూస్ ఆల్ఫా, టాంజిబుల్ ప్లే) రుణదాత గ్లాస్ ట్రస్ట్ కంపెనీ, ఇన్వెస్టరు తిమోతి ఆర్ పోల్ దావా వేశారు. బైజూస్ ఆల్ఫా నుంచి 500 మిలియన్ డాలర్లను కంపెనీ దారి మళ్లించిందని ఆరోపించారు. -
జంగిల్ సఫారీ.. ఆనందాల సవారీ
రాజంపేట: శేషాచలం అటవీ ప్రాంతమైన రాజంపేట–రాయచోటి అటవీ మార్గంలోని తుమ్మలబైలులో రెడ్‌ఉడ్ జంగిల్ సఫారీని 2010లో ఏర్పాటుచేశారు. ఇపుడు వనవిహారం పేరుతో రూ.10లక్షల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. పర్యాటకులకు అనువుగా మారుస్తున్నారు. వన్యప్రాణుల గురించి అవగాహన కల్పించే విధంగా హోర్డింగ్స్‌ను కూడా ఏర్పాటుచేస్తున్నారు. ఎర్రచందనం చెట్ల సముహంలో వనవిహారం ఆద్యంతం ఆహ్లాదకరంగా ఉంటుంది. సేద తీరేందుకు ఏర్పాటు చేసిన అతిథి గృహం, పిల్లలు ఆడుకోవడానికి నెలకొల్పిన పార్కు అదనపు ఆకర్షణగా ఉంటాయి. తెల్లదొరల కాలం నుంచే.... తెల్లదొరల కాలం నుంచి తుమ్మలబైలు అతిథిగృహాన్ని పర్యాటకపరంగా ఏర్పాటు చేసి ఉన్నారు. వేసవి విడిదిగా అక్కడే కాలం గడిపేవారు. అటవీ అందాలను ఆస్వాదించేందుకు వీలుగా తెల్లదొరలు సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం అవి కాలగర్భంలో కలిసిపోయాయి. తర్వాత అటవీశాఖ తుమ్మలబైలు ప్రాంతాన్ని రెడ్‌వుడ్ జంగిల్ సఫారీ పేరుతో అభివృద్ధి చేసి తొలిసారిగా శేషాచలం అటవీ అందాలను పర్యాటకులకు చూపించనున్నారు. శేషాచలం ఇలా.. రాజంపేట డివిజన్లో అరుదైన జంతువులకు నిలయమైన శేషాచలం అటవీ ప్రాంతం విస్తీర్ణం 82,500 ఎకరాల్లో ఉంది. ఎర్రచందనం విస్తారంగా కలిగి ఉన్న దీనిని కేంద్రంఇప్పటికే బయోస్పెయిర్‌గా ప్రకటించింది..ఈ ప్రాంత అందాలను పర్యాటకులు వీక్షించేలా ఎకో టూరిజం కింద రెడ్‌వుడ్ జంగిల్ సఫారీని రూపుదిద్దారు. ప్రధానంగా రెడ్‌వుడ్ జంగిల్ సఫారీలో చిరుత, ఎలుగుబండ్లు, నెమళ్లు, రోసికుక్కలు, అడవిపందులు, జింకలు, కొండగొర్రెలు, కణితులు ఉంటాయి. డిసెంబరు మాసంలో ఏనుగులు సంచరిస్తాయి. పర్యాటకులకు అనుకూలంగా.. అటవీ అందాలను వీక్షించేందుకు అనుకూలంగా రెడ్‌వుడ్ జంగిల్ సఫారీలో ఏర్పాట్లు చేశారు. దీని ముఖద్వారం నుంచి తుమ్మలబైలు బంగ్లా, చిల్డ్రన్స్ పార్కు, ఐరన్‌వాచ్‌టవర్, సేదతీరేందుకు సౌకర్యాలు, వాచ్‌టవర్‌ను ఏర్పాటుచేశారు. జంగిల్ సఫారీ వాహనం కూడా సిద్ధం చేస్తున్నారు. దెబ్బతిన్న రోడ్డును బాగు చేస్తున్నారు. రెడ్‌వుడ్ జంగిల్ సఫారీలో 30 కిలోమీటర్ల మేర అటవీ ప్రయాణం ఆహ్లాదకరంగా కొనసాగుతుంది. మల్లాలమ్మ కుంట సాకిరేవు ఏరియాలో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఉన్నతాధికారులు సైతం సేదతీరే..సఫారీ నిత్యం బిజీగా విధులు నిర్వహించే జిల్లా ఉన్నతాధికారులు పర్యటించి ఊరటపడుతుంటారు. జిల్లా కలెక్టర్లు, వివిధ జిల్లా అధికారులు జంగిల్ సఫారీలో పర్యటించి ఆహ్లాదకర అటవీ అందాలను వీక్షించి మానసిక ఉల్లాసాన్ని గడుపుతున్నారు. పర్యాటకులకు అనుమతితో సఫారీకి వెళుతుంటారు. ఇందుకోసం గతంలో వాహనాలను కూడా అందుబాటులో ఉంచేది. వనవిహారం స్కీం.. వనవిహారం స్కీం కింద గత ఏడాది రూ.5లక్షలతో అతిథిగృహం పునరుద్ధరించారు. ట్రీమచ్, రోడ్లు, మల్లెలమ్మ కుంట వద్ద అభివృద్ధి చేశారు. ఈ ఏడాది కూడా రూ.10లక్షలతో అభివృద్ధి చేసేందుకు ప్రతి పాదనలు సిద్ధం చేస్తున్నారు. ఏనుగులు రాకుండా కంచెను ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకుల కోసం వసతి సౌకర్యాలు, సోలార్ విద్యుత్‌ను ఏర్పాటుచేస్తున్నారు. పర్యాటకులు రూ.10 లు ప్రవేశ రుసుంతో సఫారీలో పర్యటించవచ్చు. అది కూడా సాయంత్రం 5గంటల వరకు తిరిగి బయటికిరావాల్సి ఉంటుంది. రాత్రి వేళలో ఉండేందుకు వీలులేని పరిస్థితి. జంగిల్ సఫారీ వాహనం రూ.2 లక్షలతో మరమ్మతులు చేసి పర్యాటకుల తిరిగేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రెడ్‌వుడ్ జంగిల్ సఫారీ అభివృద్ధికి చర్యలు రూ.10లక్షలతో తుమ్మలబైలు అటవీ ప్రాంతంలో రెడ్‌వుడ్ జంగిల్ సఫారీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. ట్రీమచ్‌లు ఏర్పాటుచేశాం. ఏనుగులు రాకుండా కంచెను బలోపేతం చేస్తున్నాం. సోలార్ వెలుగులు తీసుకొచ్చాం. పర్యాటకులకు వసతి సౌకర్యాలు పునరుద్ధరిస్తున్నాం. రూ.3లక్షలతో జంగిల్ సఫారీ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. ఎర్రచందనం, జంతువుల గురించి పర్యాటకులకు తెలిసే సైన్‌బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. –నరసింహారావు, ఇన్చార్జి డీఎఫ్ఓ, రాజంపేట -
జంగిల్ సఫారీ.. ఆనందాల సవారీ
రాజంపేట: శేషాచలం అటవీ ప్రాంతమైన రాజంపేట–రాయచోటి అటవీ మార్గంలోని తుమ్మలబైలులో రె డ్ఉడ్ జంగిల్ సఫారీని 2010లో ఏర్పాటుచేశారు. ఇపుడు వనవిహారం పేరుతో రూ.10లక్షల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. పర్యాటకులకు అనువుగా మారుస్తున్నారు. ఎర్రచందనం చెట్ల సముహంలో వనవిహారం ఆద్యంతం ఆహ్లాదకరంగా ఉంటుంది. సేద తీరేందుకు ఏర్పాటు చేసిన అతిథి గృహం, పిల్లలు ఆడుకోవడానికి నెలకొల్పిన పార్కు అదనపు ఆకర్షణగా ఉంటాయి. తెల్లదొరల కాలం నుంచే.... తెల్లదొరల కాలం నుంచి తుమ్మలబైలు అతిథిగృహాన్ని పర్యాటకపరంగా ఏర్పాటు చేసి ఉన్నారు. వేసవి విడిదిగా అక్కడే కాలం గడిపేవారు. అటవీ అందాలను ఆస్వాదించేందుకు వీలుగా తెల్లదొరలు సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం అవి కాలగర్భంలో కలిసిపోయాయి. తర్వాత అటవీశాఖ తుమ్మలబైలు ప్రాంతాన్ని రెడ్‌వుడ్ జంగిల్ సఫారీ పేరుతో అభివృద్ధి చేసి తొలిసారిగా శేషాచలం అటవీ అందాలను పర్యాటకులకు చూపించనున్నారు. శేషాచలం ఇలా.. రాజంపేట డివిజన్లో అరుదైన జంతువులకు నిలయమైన శేషాచలం అటవీ ప్రాంతం విస్తీర్ణం 82,500 ఎకరాల్లో ఉంది. ఎర్రచందనం విస్తారంగా కలిగి ఉన్న దీనిని కేంద్రంఇప్పటికే బయోస్పెయిర్‌గా ప్రకటించింది..ఈ ప్రాంత అందాలను పర్యాటకులు వీక్షించేలా ఎకో టూరిజం కింద రెడ్‌వుడ్ జంగిల్ సఫారీని రూపుదిద్దారు. ప్రధానంగా రెడ్‌వుడ్ జంగిల్ సఫారీలో చిరుత, ఎలుగుబండ్లు, నెమళ్లు, రోసికుక్కలు, అడవిపందులు, జింకలు, కొండగొర్రెలు, కణితులు ఉంటాయి. డిసెంబరు మాసంలో ఏనుగులు సంచరిస్తాయి. పర్యాటకులకు అనుకూలంగా.. అటవీ అందాలను వీక్షించేందుకు అనుకూలంగా రెడ్‌వుడ్ జంగిల్ సఫారీలో ఏర్పాట్లు చేశారు. దీని ముఖద్వారం నుంచి తుమ్మలబైలు బంగ్లా, చిల్డ్రన్స్ పార్కు, ఐరన్‌వాచ్‌టవర్, సేదతీరేందుకు సౌకర్యాలు, వాచ్‌టవర్‌ను ఏర్పాటుచేశారు. జంగిల్ సఫారీ వాహనం కూడా సిద్ధం చేస్తున్నారు. దెబ్బతిన్న రోడ్డును బాగు చేస్తున్నారు. రెడ్‌వుడ్ జంగిల్ సఫారీలో 30 కిలోమీటర్ల మేర అటవీ ప్రయాణం ఆహ్లాదకరంగా కొనసాగుతుంది. మల్లాలమ్మ కుంట సాకిరేవు ఏరియాలో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఉన్నతాధికారులు సైతం.. నిత్యం బిజీగా విధులు నిర్వహించే జిల్లా ఉన్నతాధికారులు పర్యటించి ఊరటపడుతుంటారు. జిల్లా కలెక్టర్లు, వివిధ జిల్లా అధికారులు జంగిల్ సఫారీలో పర్యటించి ఆహ్లాదకర అటవీ అందాలను వీక్షించి మానసిక ఉల్లాసాన్ని గడుపుతున్నారు. వనవిహారం స్కీం.. వనవిహారం స్కీం కింద గత ఏడాది రూ.5 లక్షలతో అతిథిగృహం పునరుద్ధరించారు. ట్రీమచ్, రోడ్లు, మల్లెలమ్మ కుంట వద్ద అభివృద్ధి చేశారు. ఈ ఏడాది కూడా రూ.10లక్షలతో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఏనుగులు రాకుండా కంచెను ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకుల కోసం వసతి సౌకర్యాల ఏర్పాటుచేస్తున్నారు. పర్యాటకులు రూ.10 ప్రవేశ రుసుంతో సఫారీలో పర్యటించవచ్చు. అది కూడా సాయంత్రం 5గంటల వరకు తిరిగి బయటికిరావాల్సి ఉంటుంది. రెడ్‌వుడ్ జంగిల్ సఫారీ అభివృద్ధికి చర్యలు రూ.10లక్షలతో తుమ్మలబైలు అటవీ ప్రాంతంలో రెడ్‌వుడ్ జంగిల్ సఫారీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. ట్రీమచ్‌లు ఏర్పాటుచేశాం. ఏనుగులు రాకుండా కంచెను బలోపేతం చేస్తున్నాం. సోలార్ వెలుగులు తీసుకొచ్చాం. పర్యాటకులకు వసతి సౌకర్యాలు పునరుద్ధరిస్తున్నాం. రూ.3లక్షలతో జంగిల్ సఫారీ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. ఎర్రచందనం, జంతువుల గురించి పర్యాటకులకు తెలిసే సైన్‌బోర్డులు ఏర్పాటుచేస్తున్నాం. –నరసింహారావు, ఇన్చార్జి డీఎఫ్ఓ, రాజంపేట -
రూ. 20 లక్షల ఎర్రచందనం దుంగలు స్వాధీనం
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు సమీపంలో ఉన్న రాగామాకుల కుంట వద్ద మంగళవారం ఉదయం టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఒక స్మగ్లర్ పట్టుబడ్డాడు. ఆధికారులు అతన్ని అరెస్టు చేసి సుమారు రూ. 20 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో పట్టుబడ్డ స్మగ్లర్ తమిళనాడు రాష్ట్రంలోని జమునామత్తూరుకు చెందిన స్వామినాథన్‌గా గుర్తించారు. కాగా ఎర్రచందనం కూలీలు తనిఖీ చేసే టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై రాళ్ల దాడికి దిగారు. ఈ క్రమంలో అధికారులు రాళ్లదాడిని ప్రతిఘటించి కుంబింగ్ కొనసాగిస్తున్నారని సమాచారం. -
తమిళ కూలీ
పెద్ద రావి చెట్టు కింద ఆపి వుంచిన జీపుపైన ఎండుటాకులు రాలిపడ్తున్నాయి. మానుపై వాలిన పక్షులు శబ్దం చేస్తున్నాయి.గుంజన యేరుకు అవతల నల్లరాతికొండ వద్ద ఒక తమిళ కూలీ పట్టుబడ్డాడు.ఎర్రచందనం చెట్టు కొట్టడానికి వచ్చిన మిగిలిన కూలీలు పరారయ్యారు.‘చిక్కిన తమిళ కూలీ నుంచి చిన్న సంచిని, ఒక గొడ్డలిని స్వాధీనపర్చుకున్నారు. విధి నిర్వహణలో భాగంగా గాలింపు చేస్తున్న బీటు ఆఫీసరుకి వీడు దొరికాడు.పట్టుకొచ్చి లోపలేశారు.ఎవరు మాట్లాడుతారు....వాడికి తెలుగు రాదు. వీళ్ళకు తమిళం రాదు. ఏదో విధంగా వాడి నుంచి సమాచారాన్ని రాబడుతున్నారు. మధ్యాహ్నం నుంచి వార్త రాసుకోవడం కోసం విలేకర్లు అక్కడికక్కడే తచ్చాడుతున్నారు. వాళ్ళందరితో పాటు నేను కూడా!ఇంకో జీపు దుమ్ము రేపుకుంటూ ఆవరణలోకి వచ్చింది. మరో ఇద్దరు అధికార్లు దిగారు. చకచకా అడుగులు వేసుకుంటూ లోపలికి వెళ్లారు. వీస్తున్న గాలికి కొమ్మలు ఊగుతున్నాయి.కాసేపటి తర్వాత బయటికొచ్చిన బీటు ఆఫీసరు జీపులో వెనుక వైపు వున్న రెండు ఎర్రచందనం దుంగల్ని లోపలికి తీసుకురమ్మని చెప్పి కళ్ళద్దాలు సర్దుకుంటూ వేగంగా వెళ్ళిపోయాడు. సిబ్బంది వాటిని మోసుకెళ్ళారు. వాతావరణం వేడిగా వుంది. మరోవైపు స్తబ్దత. పదేపదే టైం చూసుకుంటున్నారు చెట్టుపక్కన నిల్చున వాళ్ళు.సెల్ పట్టుకొని కాలక్షేపంలో ఇంకొందరు.ఆఫీసు కాంపౌండ్‌కు ఎడమ పక్కన వున్న పాతరేకుల షెడ్డులో టీ కొట్టు దగ్గరికి ఫారెస్ట్ ఆఫీసులో ప్రొటెక్షన్ వాచర్‌గా ఉద్యోగం చేస్తున్న నాగరాజు వచ్చాడు.‘దొరికిన తమిళ కూలీ ఏమైనా చెప్పాడా...’ అడిగాను ఆత్రుతగా.‘ఆ...’ అని అతను ఊకొట్టాడు.‘ఏం పేరంటా?’‘శివలింగం’ ‘ఎక్కడి నుంచి వచ్చాడో తెలిసిందా..’ మళ్ళీ ప్రశ్న.‘వాడి దగ్గర చెన్నై సెంట్రల్ టూ కోడూరు వరకు వున్న జనరల్ రైల్వే టికెట్ దొరికింది’ ‘అయితే ఉదయాన్నే మెయిల్‌కు వచ్చి వుంటాడు’ అన్నాను నా అభిప్రాయం వ్యక్తం చేస్తూ. ‘అట్నే వుంది!’ పొడిగా జవాబిస్తూ ఐదు టీలు ఆఫీసులోకి పంపించమని టీ కొట్టు వెంకట్రాముడికి చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు...అడిగాను మళ్ళీ...‘తనని ఇక్కడికి ఎవరు పిలిపించారో, అతడి వెనుక వున్న పెద్ద మనిషి పేరు ఏదైనా చెప్పాడా...’అసహనంగా చూశాడు నాగరాజు.‘కాసేపు ఆగితే ఎస్సైసారే...మిమ్మల్నందర్నిలోపలికి పిలిచి విషయాలన్నీ చెప్తాడు’ అంటూ చిరాగ్గా లోపలికి వెళ్లిపోయాడు.త్వరగా వార్త రాసి పంపితే నా పని అయిపోతుంది. డెస్క్‌కు వాట్సాప్ మెసేజ్ పెట్టాను.ఈమధ్య ఎర్రచందనం వార్తలకు బాగానే ప్రాధాన్యత ఇస్తున్నారు. జిల్లా టాబ్లాయిడ్లో రెండవ పేజీలో ఇలాంటి వార్తలకే చోటు లభిస్తోంది.చెన్నై సెంట్రల్ నుంచి తిరుపతి, రేణిగుంట మీదుగా మామండూరు, బాలపల్లె పరిధిలో వున్న ఎర్రచందనం కోసం రైల్వేకోడూరులోకి దిగుతున్నారు తమిళ కూలీలు.మెయిల్ తెల్లవారుజామున మూడున్నరకు వస్తుంది.రైల్వేస్టేషన్లో దిగడం కొండదారెంబడి సాగిపోవడం ఎంతోకాలంగా సాగుతోంది.ఒక్కోసారి గుంపులు గుంపులుగా కూడా దిగుతుంటారని అక్కడుండేవారు చెప్తుంటారు.వీళ్ళందరూ ఎందుకిలా వస్తున్నారు...?బతకలేనితనం వారిని కూలీలుగా మారుస్తోంది.వీరి వెనుక వుండి నాటకం అంతా నడిపించే స్మగ్లర్లు ఎక్కడో విదేశాల్లో విలాసాలు అనుభవిస్తూ వుంటారు. కడపాత్రంతో గొడ్డలి చేతబట్టి భయంకరమైన అడవుల్లోకి ఎర్రచందనం కొట్టడానికి వస్తున్న కూలీల బతుకు దుర్భరం.క్షణక్షణం భయంభయంగా జీవించాలి. ఇంటికి తిరిగి క్షేమంగా చేరగలమో లేదో కూడా తెలియదు. తెగిస్తున్నారు. ఇట్నుంచి పదకొండు కిలోమీటర్లు ముందుకెళ్తే శేషాచలం అభయారణ్యంలో భాగమైన శ్రీవెంకటేశ్వర అభయారణ్యం మొదలవుతుంది. అటే ముందుకు సాగితే కుక్కలదొడ్డి అనే ప్రాంతం వస్తుంది. అక్కడి నుంచి పదికిలోమీటర్ల దూరంలో వున్న తుంబరతీర్థం చేరుకుంటే అడవిలోకి దారులు ఏర్పాటు చేయబడివున్నాయి.పచ్చటి ప్రకృతిలో ఎల్తైన ఎర్రచందనం చెట్ల దారుల్లో ప్రయాణం సాగిస్తే కోనలెన్నో పలుకరిస్తాయి.వలసకోన, చాకలి రేవు కోన, ముత్తరాచకోన, కాశికోన, తలకోనలు అడవిపాటను నేర్పుతాయి.గుంజనేరు దగ్గర ఏనుగుల మందలు సంచరిస్తుంటాయి. వాన కురిసేటప్పుడు యుద్ధారాల తీర్థం అందాలు చూడ్డానికి రెండు కళ్ళు చాలవు.విష్ణుగుండం పొంగి పొర్లుతోంది.ఇంత ప్రకృతి విధ్వంసానికి గురవుతున్న నేటి దృశ్యం హృదయ విదారకరం.విలేకర్లను లోపలికి పిలిచారు.సెల్ లోపల రెండు చేతులూ, రెండు కాళ్ళూ తాడుతో కట్టివేయబడివున్న తమిళకూలీ శివలింగం కన్పిస్తున్నాడు. ముఖమంతా కమిలిపోయి వుంది.కింద పెదవి పగిలి నెత్తుటి చారలు చూపిస్తోంది.మాసిపోయి చినికిపోయి వున్న చొక్కా, ఎర్రటి దుమ్ము నిండి రంధ్రాలు పడివున్న ప్యాంటు, ఈదురుగాలికి కొట్టుకొచ్చి పడివున్న వాడిలాగా కన్పిస్తున్నాడు. భరించలేనంత వాసన వేస్తోంది.కళ్ళు లోతుకు పోయి వున్నాయి.దువ్వని జుట్టు దుమ్మును మోస్తోంది.ఎక్కడి పక్షి మరెక్కడికో వలస వచ్చి బంధించబడినట్లున్నాడు.పగుళ్ళుబారిన శరీర చర్మం. గారపట్టిన దంతాలు. నల్లటిదేహం.అడవిలో దొరికిన మృగాన్ని కటకటాల్లో బంధించినట్లు వాడున్నాడు.శివలింగంకు కట్టిన తాడు విప్పారు.వాడు లేవలేని స్థితిలో వున్నాడు.వాడి దగ్గరి నుంచి స్వాధీనం చేసుకున్న పాత పసుపురంగు సంచి. దానికి సుబ్రహ్మణ్యస్వామి చిత్రం ముద్రించి వుంది. అందులో ఒక సిల్వర్టిఫిన్ క్యారీ, నాలుగు గుట్కా ప్యాకెట్లు వున్నాయి.దానితో పాటే వాడు ఉపయోగించే గొడ్డలి.ఇవి స్వాధీనం చేసుకున్న వస్తువులు. వాడు కొడుతుండగా పట్టుకున్న రెండు ఎర్రచందనం దుంగలు.సిబ్బంది ప్రెస్‌కు ఇవ్వాల్సిన ఫొటో కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.శివలింగం బాధగా ప్రాధేయపూర్వకంగా దాహమేస్తున్నట్లు సైగ చేశాడు. అక్కడ మూలగా వున్న మట్టికుండలో వున్న నీళ్ళను కూడా లేచివెళ్లి తాగలేని స్థితి. ఎవరో గ్లాసుతో అందించారు.గడగడ తాగి వాడు ఊపిరి పీల్చుకున్నాడు.శివలింగం దగ్గర దొరికిన రైల్వేటికెట్ను చూపించాడు అటవీ అధికారి.చెన్నై సెంట్రల్ టూ కోడూరు అని అందులో రాసి వుంది.జనరల్ టికెట్.విలేకర్లు ఫొటో తీసుకున్నారు.‘వివరాలు చెప్పండి సార్! వార్త రాసుకోవాలి...’ పక్కనున్న మరో విలేకరి కొంత ఆసక్తిగా అడిగాడు.అటవీ అధికారి చిన్నగా నవ్వాడు.‘ముందు టీ తీస్కోండి. చల్లారిపోతుంది’ అంటూ బదులిచ్చాడు.మేమందరం తాగుతుంటే శివలింగం మావైపే చూస్తున్నాడు.‘అతడికి కూడా టీ ఇప్పించండి సార్’ ఎవరో వెనక నుంచి అన్నారు.ఇమ్మన్నట్లు అధికారి సైగ చేశాడు. అతడికీ టీ ఇచ్చారు.అధికారి చెప్పడం ప్రారంభించాడు.‘పట్టుబడిన తమిళకూలీ పేరు శివలింగం.తమిళనాడు తిరువణ్ణామలై జిల్లా మురగంబాడి గ్రామానికి చెందినవాడు. ఇతడి వయసు ముప్ఫై సంవత్సరాలు. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి పెంపకంలో పెరిగాడు. పదో తరగతిలోనే చదువు మానేశాడు. ఇతడి భార్య పేరు మునియమ్మాళ్. ఇతడికి నాల్గవ తరగతి చదువుతున్న కూతురు వుంది. పేరు రేవతి’పై ఫ్యాను వేగంగా తిరుగుతోంది.టేబుల్‌పైన వున్న కాగితాలు గాలికి కదులుతున్నాయి.తాగడం పూర్తి కావడంతో కప్పును దూరంగా పెట్టాడు. మీసాలు సవరించుకున్నాడు అధికారి.‘ఎర్రచందనం చెట్టుకొట్టే పని ఎవరు ఇతనికి అప్పగించారు?’ మరొక ప్రశ్న వేశారు.‘అదే చెప్పబోతున్నాను’ అంటూ కళ్ళు ఎగరేశాడు అధికారి.‘శివలింగం వూర్లో వుండేటప్పుడు ఆటో నడుపుకుంటూ జీవించేవాడు. ఇతడికి టింబర్ డిపోలో పనిచేసే మాణిక్యంతో పరిచయమైంది. అతడి పని ఏమిటంటే మన ప్రాంతంలో ఎర్రచందనం చెట్లను కొట్టడానికి కావలసిన మనుషులను సప్లై చేయడం.ఏజెంట్‌గా వ్యవహరిస్తాడు.ఇలాంటి ఏజెంట్లు అక్కడ చాలామంది వుంటారు. వారే కూలీలను స్మగ్మర్లకు సమకూర్చిపెడతారు. విదేశాల్లో వుండే స్మగ్లర్లకు ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళూ, రాజకీయనాయకులూ సహకరిస్తుంటారు. వ్యవహారమంతా గొలుసు పద్ధతిలో సాగుతూ ఉంటుంది’అధికారి సెల్ ఫోన్ మోగింది.అతడి పై ఆఫీసర్ నుంచి వచ్చినట్లుంది.కోరిన వివరాలు సాయంత్రంలోగా పంపిస్తానని అంటున్నాడు.భాష అర్థం కాకపోయిన అధికారి చెప్పే మాటలన్ని తలొంచుకొని వింటున్నాడు శివలింగం.మాణిక్యం అనే పేరు వచ్చినప్పుడల్లా శివలింగం కళ్ళు ఎరుపెక్కుతున్నాయి. ఆవేశంగా చూస్తున్నాయి.తన జీవితం జైలు పాలు కావడానికి అతడే కారణమని కావచ్చు ఏజెంటు మాటలు నమ్మి అడవిబాట పట్టి కష్టాలు పడుతున్న వైనం శివలింగాన్ని కుదురుగా ఉండనివ్వడం లేదు. మాణిక్యం కనిపిస్తే తనువెంటతెచ్చుకున్న గొడ్డలితోనే సమాధానం ఇచ్చేటట్లున్నాడు.గట్టిగా తాడుతో కట్టివేయడం వల్ల అతడి చేతులు వాతలు పడినట్లు చారలు కమిలిపోయి కన్పిస్తున్నాయి. బయట చెట్టుపైన పక్షుల శబ్దం ఆగిఆగి విన్పిస్తోంది.అధికారి మళ్లీ చెప్పడం మొదలుపెట్టాడు.‘అంతర్జాతీయ మార్కెట్టులో ఎర్రచందనానికి విపరీతమైన డిమాండ్ ఉంది. అందువల్లనే స్మగ్లర్లు ఎంతకైనా తెగిస్తున్నారు. తమిళనాడులో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. వారి ద్వారా కూలీలను సమకూర్చుకుంటున్నారు. వాటాలు తీసుకుంటున్నారు.’‘చూస్తున్నారు కదా...ఇక్కడ కూలీలను పట్టుకుంటున్నాం. మధ్యలో ఏజెంట్లను పట్టుకున్నాం. అక్కడ స్మగ్లర్లను వలేసి పట్టుకున్నాం. అయినా సమస్య ఇంకా ఉంటుంది’ తాగిన టీకప్పులన్నీ చెత్తబుట్టలోకి చేరాయి.‘ఏదైనా అడగాలనుకుంటే అడగవచ్చు’ అన్నాడు అధికారి కుర్చీలో వెనక్కి వాలుతూ.శివలింగాన్ని ఎక్కడ పట్టుకున్నారు?‘గుంజన యేరుకు అవతల నల్లరాతి కొండ వద్ద’‘ఎప్పుడు?’‘నిన్న సాయంత్రం’‘ఒక్కడే దొరికాడా?’‘అవును. మిగిలిన అయిదుమంది పరారయ్యారు. వారి కోసం గాలిస్తున్నాంరైల్వేటికెట్ పైన తేదీ చూస్తే శివలింగం వచ్చి పదిరోజులు దాటుతోంది కదా!‘అయ్యి ఉండవచ్చు. మాకైతే నిన్న సాయంత్రమే పట్టుబడ్డాడు’నీళ్లుతాగి గ్లాసుకింద పెట్టాడు అధికారి.మీ కస్టడీలో ఎన్నిరోజుల నుంచి ఉన్నాడు?మరో ప్రశ్న వాలింది. జవాబు లేదు.ఫొటో కార్యక్రమం.శివలింగాన్ని మోకాళ్ళ పైన మధ్యలో నిల్చోబెట్టారు. చేతులు కట్టుకొని ఉన్నారు. అతడి వెనుక అటు నలుగురు ఇటు నలుగురు అటవీ సిబ్బంది నిల్చున్నారు.శివలింగం ముందు రెండు ఎర్రచందనం కొయ్యలు, గొడ్డలి అతడి పాతసంచి ఉంచారు.ఫొటోలు చకచకా తీసుకున్నారు.‘కాసేపు అతడితో మాట్లాడించండి సార్!’ అని అన్నాను అధికారితో.‘ఎందుకబ్బా!’ అన్నట్లు చూశాడు.‘అతను తమిళంలో మాట్లాడుతాడు...మీకు అర్థం అవుతుందా?’ అని సన్నగా నవ్వుతూ అన్నాడు అధికారి.శివలింగం విలేకర్ల ముందుకొచ్చాడు.‘ఎనక్కు కవలైయా ఇరుక్కు(నాకు బాధగా ఉంది)ఎన్ నలం సరి ఇల్లై(నా ఆరోగ్యం బాగుండడం లేదు)ఎన్ కై ఎలుంబు మరిన్దదు(నా చేతి ఎముక విరిగింది)వాన్ ది వర మాదిరి ఇరుక్కు(వాంతి వచ్చేలాగా ఉంది)అని అన్నాడు కళ్ళ నిండా కన్నీళ్ళు నింపుకొని.ఇంక చాలు వీడ్ని తీసుకెళ్ళి లోపలెయ్యండి అన్నట్లు అధికారి చూశాడు.శివలింగం ఏదో అడగాలనుకుంటున్నట్లు సంశయంగా చూస్తున్నాడు.‘ఈరోజు తారీఖు ఎంత సామీ?’ అని దుఃఖం నిండిన స్వరంతో అడిగాడు తమిళంలోనే.ఎవరో చెప్పారు జవాబు.‘ఈరోజు నా కూతురు పుట్టినరోజు’ అంటూ ఏడుస్తూ అక్కడికక్కడే కన్నీటి సంద్రమైనాడు. బయట పెద్దరావి చెట్టుపైన అంతవరకు శబ్దం చేస్తూ ఉన్న పక్షులు నిశ్శబ్దమయ్యాయి. చెట్టు కింద ఆపి ఉంచిన జీపుపైన ఎండుటాకులు రాలి పడ్తున్నాయి. -
12 ఎర్రచందనం దుంగల పట్టివేత
పొదలకూరు: జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ ఆదేశాల మేరకు ఆత్మకూరు డీఎస్పీ జీ రామాంజనేయరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా టాస్క్‌ఫోర్స్, డక్కిలి, పొదలకూరు, వరికుంటపాడు ఎస్సైలు దాడులు నిర్వహించి శనివారం రూ. 11 లక్షల విలువైన 12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కారును స్వాధీనం చేసుకున్నారు. పొదలకూరు సర్కిల్ కార్యాలయంలో సీఐ ఏ శివరామకృష్ణారెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో ఆత్మకూరు డీఎస్పీ వివరాలు వెల్లడించారు. శనివారం పొదలకూరు, డక్కిలి, వరికుంటపాడు ఎస్సైలు అల్లూరు జగత్సింగ్, మరిదినాయుడు, ముత్యాలరాజు ఏకకాలంలో రహదారుల్లో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో దుంగలు తరలిస్తున్న స్మగ్లర్లు పోలీసులను వాహనంతో ఢీకొట్టించే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు తప్పించుకుని తమ వాహనాల్లో కారును వెంటాడి పట్టుకున్నారు. కారులో తనిఖీ చేయగా 12 ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారు. దుంగలతో పాటు కారు, సెల్ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తమిళనాడు రాష్ట్రం సేలం, నెల్లూరు, రాపూరు మండలాలకు చెందిన వారిగా గుర్తించారు. డక్కిలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చలంచర్ల అక్కయ్య(గోనుపల్లి), బండి ఏడుకొండలు (నెల్లూరు నగరం, నవాబుపేట), వరికుంటపాడు పీఎస్ పరిధిలో గుంజి రత్నయ్య (గోనుపల్లి), పొదలకూరు పీఎస్ పరిధిలో సత్యరాజు (తమిళనాడు, సేలం జిల్లా), గిలకా నాగరాజు (గోనుపల్లి)లను అదుపులోకి తీసుకున్నట్టు డీఎస్పీ వివరించారు. స్మగ్లర్ల కదలికలపై గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. గతేడాది రూ.16 కోట్ల విలువైన 16.32 టన్నుల దుంగలను పట్టుకున్నట్టు చెప్పారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై సమాచారం ఇస్తే వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. సమాచారం తెలియజేయాలనుకున్న వారు 93907 77727 పోలీస్ వాట్స్‌యాప్ నంబరుకు పెట్టవచ్చునన్నారు. ఎర్రచందనం కేసులో నిందితుడి అరెస్ట్ నెల్లూరు (క్రైమ్): ఎర్రచందనం కేసులో నిందితుడిని మూడోనగర పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. నగరంలోని ఏబీఎం కాంపౌండ్‌లో నివాసముంటున్న విశ్రాంత పోలీసు ఉద్యోగి సుధాకర్ ఇంటిపై 2015 సెప్టెంబర్ 3న తిరుపతి, నెల్లూరు టాస్క్ఫోర్సు పోలీసులు దాడి చేశారు. అతని ఇంట్లో సుమారు రూ.2 లక్షలు విలువ చేసే 120 కేజీల 16 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఆంతోని, జాని, భరత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. కేసులో నిందితుడైన ప్రసాద్ అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం నిందితుడు ప్రసాద్ కాకుటూరులోని తన రెండో భార్య అంకమ్మ ఇంట్లో ఉన్నాడన్న సమాచారం మూడో నగర ఇన్స్పెక్టర్ బి. పాపారావుకు అందింది. దీంతో ఆయన తన సిబ్బందితో కలిసి ఇంటిపై దాడి చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. -
స్మగ్లర్ బాబు.. కటకటాల పాలు
కడప అర్బన్ : తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా, అనేకట్ తాలూకా బంగ్లామేడు గ్రామానికి చెందిన అనేకట్ బాబు అలియాస్ వేలూరు బాబు అలియాస్ మురుగేషన్ బాబు చదివింది కేవలం పదవ తరగతి మాత్రమే. మొదట చందనం అక్రమ రవాణాకు పాల్పడుతుండేవాడు. ఆ తరువాత అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లు సేతు మాధవన్, మణియప్పన్‌లకు ప్రధాన అనుచరుడిగా ఎదిగాడు. ఇతను ప్రస్తుతం వేలూరు సమీపంలోని కాట్పాడిలో నివాసముంటున్నాడు. ఇతని స్వగ్రామం బంగ్లామేడు గ్రామం చుట్టు పక్కల ప్రాంతాల అడవుల్లో (జావాది హిల్స్) తన అనుచరులతో కలిసి చందనం చెట్లు నరికి వాటిని దుంగలుగా తయారు చేసేవాడు. 1990 నుంచి చందనం (శ్యాండిల్ వుడ్) అక్రమరవాణా చేస్తూ డబ్బును సంపాదించాడు. 1992 నుంచి 2000 సంవత్సరం వరకు ఆరు కేసులను తమిళనాడు రాష్ట్రం అటవీ, పోలీసు అధికారులు నమోదు చేశారు. చందనం అక్రమ రవాణా తర్వాత 2010 నుంచి తమిళనాడుకు చెందిన పలువురు ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు ఏర్పరచుకుని అప్పటి నుంచి ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడు. ఇతను తమ ప్రాంతంలోని చెట్లు నరికే కూలీలకు భారీగా డబ్బు ఆశ చూపి వారి సహకారంతో రాయలసీమ జిల్లాలలోని శేషాచలం, లంకమల్ల, నల్లమల, అటవీ ప్రాంతాల నుంచి వాహనాలలో ఎర్రచందనం దుంగలను తమిళనాడు రాష్ట్రానికి చేరవేసి అక్కడి అంతర్జాతీయ స్మగ్లర్లకు అందజేసేవాడు. ఇటీవల జిల్లాలో అరెస్టయిన సేతు మాధవన్, ఆర్కాట్ భాయ్‌ల విచారణలో అనేకట్ బాబు గుట్టు రట్టయింది. జిల్లాలో ఇతను 24 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 2010 నుంచి దాదాపు 500 టన్నుల ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడ్డాడని పోలీసుల విచారణలో తెలిసింది. అనేకట్ బాబుతో పాటు మరో నలుగురు అరెస్ట్ : అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అనేకట్ బాబుతో పాటు, చిత్తూరు జిల్లాకు చెందిన సుధాకర్, సత్య, హైదర్ ఆలీలు వృత్తి రీత్యా డ్రైవర్లుగా, అనేకట్ బాబుకు ప్రధాన అనుచరులుగా ఉన్నారు. అనేకట్ బాబు ఆదేశాల మేరకు తమిళనాడు నుంచి కూలీలను తీసుకొచ్చి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శేషాచలం, నల్లమల, లంకమల, పాలకొండలు అటవీ ప్రాంతాల్లోకి వాహనాల్లో చేరవేస్తూ ఉంటారు. వీరిపై జిల్లాలో మూడు కేసులు నమోదయ్యాయి. వీరితోపాటు కడప నగరం ఎర్రముక్కపల్లెకు చెందిన షేక్ మున్నా ఆటో డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఇతను సుధాకర్, సత్యలకు అనుచరుడిగా ఉంటూ వారు చెప్పిన మేరకు ఎర్రచందనం నరికే వారిని బస్టాండు, రైల్వేస్టేషన్ల నుంచి తన ఆటోలో తీసుకెళ్లి మైదుకూరు, పోరుమామిళ్ల అటవీ ప్రాంతాల సమీపంలో వదిలేవాడు. వారికి బియ్యం, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలను చేరవేసేవాడు. ఇతనిపై జిల్లాలో మూడు కేసులు నమోదయ్యాయి. జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ నేతృత్వంలో పోలీసులు పక్కా వ్యూహంతో వీరిని అరెస్టు చేశారు. -
అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్
-
అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్
సాక్షి, కడప అర్బన్: మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర స్మగ్లర్ ఆర్కాట్ భాయ్‌తోపాటు, మరో 10 మంది స్మగ్లర్లను జిల్లాలోని మూడు పోలీస్స్టేషన్ల పరిధిలో పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 85 ఎర్రచందనం దుంగలు, కంటైనర్, రెండు లారీలు, మూడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటి విలువ దాదాపు రూ.3 కోట్లు ఉంటుందన్నారు. మంగళవారం వైఎస్సార్ జిల్లా కడపలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ వివరాలు వెల్లడించారు. రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, చిట్వేలి పోలీస్స్టేషన్ల పరిధిలో తమిళనాడుకు చెందిన ఆర్కాట్ భాయ్, వెడి శక్తివేలు, మురగరి రామన్‌లు, చిన్నకన్ నాగరాజు, విశ్వనాథన్, గోవిందరాజు సందీప్‌కుమార్; ఓబులవారిపల్లెకు చెందిన ఆదిశేఖర్‌రెడ్డి అలియాస్ మందారపు బాబు, వై.కోటకు చెందిన పాకాల చంద్రమౌళి, చెన్నంరాజుపోడుకు చెందిన గంగరాజు వెంకటరామరాజు, గుంటుమడుగు దశరథరాజు, తలారి సుబ్బారాయుడులను పట్టుకున్నామన్నారు. వీరంతా ఎర్రచందనం దుంగలను వాహనాల ద్వారా అక్రమ రవాణా చేస్తున్నారని తెలిపారు. ఆర్కాట్ భాయ్.. దుబాయ్‌కి చెందిన ఎర్రచందనం స్మగ్లర్ సాజికి ప్రధాన అనుచరుడని, దాదాపు 500 టన్నుల ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేసినట్టు తెలిసిందన్నారు. పట్టుకున్న 11 మందిలో ఏడుగురు అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లు అని పేర్కొన్నారు. వీరిని అరెస్ట్ చేయడంలో కీలకపాత్ర పోషించిన రాజంపేట డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు కనుమారి సాయినాథ్, ఎస్డీ శివశంకర్ నాయక్, ఎస్ఐలు భక్త వత్సలం, బి.హేమకుమార్, కొండారెడ్డి, వెంకటేశ్వర్లు, హాజివల్లి, డాక్టర్ నాయక్, బి.నాగమురళి, కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించారు. -
‘లక్ష్మణ’ గీత దాటిన సంగీత!
పోలీసుల ముప్పు ఉందని సంగీతకు భర్త లక్ష్మణ్ హెచ్చరిక పగలు పేయింగ్ గెస్ట్.. రాత్రులు పబ్ పబ్బుల్లో మన పోలీసులకు తప్పని చిందులు మూడుసార్లు విఫలం.. ఆపై విజయం చిత్తూరు (అర్బన్): ఎర్రచందనం కేసులో పీడీ యాక్టుపై జైల్లో ఉన్న సంగీత చటర్జీ భర్త మార్కొండ లక్ష్మణ్ గత నెల బెయిలుపై విడుదలయ్యాడు. అప్పటికే అజ్ఞాతంలో ఉన్న సంగీతను లక్ష్మణ్ హెచ్చరించాడు. ఎక్కడపడితే అక్కడ తిరగొద్దని, ఓకేచోట ఎక్కువ రోజులు గడపొద్దని, చుట్టు పక్కల ఎవరైనా రెక్కీ నిర్వహిస్తున్నారో చూసుకోమని సంగీతకు ఫోన్లో సూచిం చాడు. మదనపల్లె సబ్ జైలులో ఉన్న లక్ష్మణ్ తన స్నేహితుడి ద్వారా నెలకు సంగీతకు రూ.లక్ష నగదు అందజేస్తూ, ఆమె పోలీసుల దొరకకుండా ఎప్పటి కప్పుడు సలహాలు ఇస్తుండే వాడు. భర్త మాటల్లో కొన్నింటిని పాటించిన సంగీత ప్రధాన హెచ్చరికలను పెడచెవిన పెట్టింది.. పోలీసులకు చిక్కింది. మూడుసార్లు విఫలం సంగీతను పట్టుకోవడానికి చిత్తూ రు పోలీసులు దాదాపు ఏడాదిన్నకాలం గా ప్రయత్నిస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో సంగీతను అరెస్టు చేయడానికి కోల్‌కతాకు వెళ్లిన పోలీసులకు ఆమె ఆచూకీ కనుక్కోవడానికే సరిపోయింది. మే 3వ తేదీన మరోమారు కోల్‌కతాకు వెళ్లిన పోలీసులు సంగీతను అదుపులోకి తీసుకున్నారు. కోల్‌కతాలోని న్యాయస్థానంలో హాజరుపరచి చిత్తూరుకు తీసుకురావాలనుకున్నా ఆమె నటనతో పోలీసు ల వ్యూహం బెడిసికొట్టింది. ఇక మూడోసారి 2016 అక్టోబర్‌లో మరోమారు సంగీతను పట్టుకోవడానికి పోలీసులు కోల్‌కతా వెళ్లారు. నాలుగురోజుల పాటు పలు ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ కనుక్కోలేకపోయారు. ఈసారి సఫలం గతం నేర్పిన అనుభవాల రీత్యా ఈసారి సంగీత కోసం పోలీసులు వెతుకుతూ కోల్‌కతాకు వెళ్లినట్లు ఎక్కడా సమాచారం బయటకు పొక్కకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి సంగీత పేయింగ్ గెస్ట్ (పీజీ)గా పలుచోట్ల నెలకు రూ.12 వేల అద్దె చెల్లించి సాధారణ మహిళగా ఉంటోం దని సమాచారం అందడంతో మార్చి 23న డీఎస్పీ, సీఐ, మహిళా ఎస్ఐతో పాటు ముగ్గురు సిబ్బంది కోల్‌కతాకు వెళ్లారు. అక్కడి కస్బా, రూబ్, సీఎన్ రాయ్ ప్రాంతాల్లో సంగీత తిరుగుతున్నట్లు సమాచారం అందినా 25 వరకు ఆచూకీ దొరకలేదు. నిరుత్సాహంతో ఉన్న పోలీసులకు ఓ సమాచారం అందింది. సోమవారం రూబ్ సెల్లార్‌లోని పబ్‌లో సంగీత ఉందని తెలిసింది. డీఎస్పీ గిరిధర్, సీఐ ఆదినారాయణ, ఎస్ఐ వాసంతి, మరో మహిళా కానిస్టే బుల్ జంటలుగా నటిస్తూ పబ్‌లోకి వెళ్లారు. అక్కడ సంగీతను చూశారు. నిర్ధారించుకోవడానికి కాలు కదుపుతూ చిందులేస్తూ దగ్గరకు వెళ్లి చూశారు. అవును.. అక్కడ సంగీత ఉందని నిర్ధారించుకున్నారు. అప్పటికే సమయం రాత్రి 2.30 గంటలు. అక్కడి నుంచి సంగీత నేరుగా సీఎన్ రాయ్ రోడ్డులోని పీజీ హాస్టల్ చేరుకుంది. పోలీసులు çసమీపంలో ఓ గది అద్దెకు తీసుకుని నిఘా ఉంచారు. మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో సంగీత మందులు తీసుకోవడానికి గది నుంచి బయటకొచ్చింది. ఒక్కసారిగా పోలీసులు ఆమెను చుట్టుముట్టారు. మర్యాదగా తమతో రావాలన్నారు. వాంతులు వస్తున్నట్లు.. కళ్లు తిరుగుతున్నట్లు సంగీత నటించినా పోలీసులు లెక్క చేయలేదు. నిమిషాల వ్యవధిలో ఆమెను కస్బా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి తమ వద్ద ఉన్న అరెస్టు వారెంట్లను చూపించారు. ఆ వెంటనే కోల్‌కతా విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి విమానంలో బెంగళూరు రావడం.. అటు నుంచి చిత్తూరుకు తీసుకురావడం చకచకా జరిగిపోయింది. పోలీసు కస్టడీకి సంగీత చిత్తూరు జిల్లా జైలులో ఉన్న సంగీత చటర్జీని కస్టడీకి ఇస్తూ పాకాల న్యాయస్థానం గురువారం ఆదేశాలు జారీచేసింది. సంగీతను తమ కస్టడికిస్తే ఆమెను విచారించి పలువురు నిందితుల పేర్లను తెలుసుకోవచ్చునని చిత్తూరు పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. పది రోజుల పాటు సంగీతను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. అయితే నాలుగు రోజులపాటు కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. దీంతో పోలీసులు సంగీతను శుక్రవారం కస్టడీకి తీసుకునే అవకాశముంది. -
‘ఎర్ర’ వనంలోకి మహిళా డాన్లు
⇒రూ.కోట్లు కూడబెడుతున్న వైనం ⇒నిన్న సంగీత.. నేడు జ్యోతి ⇒ నివ్వెరపోతున్న పోలీసులు చిత్తూరు (అర్బన్): ఇప్పటి వరకు మగవాళ్లు మాత్ర మే చేస్తున్న ఎర్ర చందనం స్మగ్లింగ్‌లోకి తాజాగా మహిళలు కూడా చేరారు. గతేడాది రంగుల లోకం సుందరి సంగీత చటర్జీని అరెస్టు చేసిన పోలీసులు.. తాజాగా జ్యోతి అనే మహిళా డాన్‌ను అరెస్టు చేశారు. వెలగని జ్యోతి... తమిళనాడులోని వేలూరు నగరం అళగిరినగర్‌కు చెంది న ఎన్.జ్యోతి, ఆమె భర్త, ఇద్దరు కొడుకుల్ని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రచందనం అక్రమ వ్యాపా రంలో జ్యోతి ప్రస్తావన తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జ్యోతి నాలుగో తరగతితోనే విద్యాభ్యాసాన్ని ముగించింది. భర్త నాగేంద్రన్ లారీ డ్రైవర్ కావడంతో ఇసుక లోడ్లు తీసుకెళుతూ ఎర్ర చం దనం స్మగ్లర్లతో పరిచయాలు పెంచుకున్నాడు. ఈ విష యం జ్యోతికి చెప్పడంతో అవకాశాన్ని వదులుకోవద్దని భర్తకు చెప్పి తానూ 2013 నుంచి స్మగ్లింగ్‌లోకి అడుగుపెట్టింది. అనతికాలంలోనే రూ.కోట్లకు పడగలెత్తింది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు చెందిన బడా స్మగ్లర్లతో పరిచయాలు పెంచుకుంది. వీరప్పన్ కంచుకోటైన జవ్వాదిమలై గ్రామం నుంచి చెట్లను నరికే కూలీలను పిలిపించి శేషాచలం అడవుల్లోకి పంపి ఎర్రచందనం దుంగలు తరలించడమే పనిగా పెట్టుకుంది. ఇలా మూడేళ్ల కాలంలో జిల్లా నుంచి వంద టన్నుల ఎర్రచందనం దుంగల్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసి రూ.10 కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆమెపై జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో నాలుగు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం జ్యోతి అరెస్టు కావడంతో ఆమె వెనుక ఉన్న బడా స్మగ్లర్లు రామ్‌నాథ్, రంగనాథ్, మాలూర్ బాషా కోసం పోలీసుల అన్వేషణ కొనసాగుతోంది. కనిపించని సంగీత మోడల్‌గా, ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తున్న సంగీత చటర్జి అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ లక్ష్మణ్‌ను రెండో పెళ్లి చేసుకుంది. భర్త జైల్లో ఉండగా అంతర్జాతీయ ఎర్రచందనం సామ్రాజాన్ని ఆమె చేతుల్లోకి తీసుకుంది. ఐదు రాష్ట్రాల్లోని బడా స్మగ్లర్లకు హవాలా రూపంలో రూ.కోట్లు సమకూర్చి వంద టన్నుల ఎర్రచందనం దుంగలను జిల్లా నుంచి విదేశాలకు పంపినట్లు జిల్లా పోలీస్ రికార్డులకెక్కింది. ఆమె బ్యాంకు లాకర్లను బద్దలుకొట్టిన పోలీసులు కిలోల లెక్కన బంగారు, రూ.కోట్ల విలువ చేసే స్థిరాస్తులను సీజ్ చేశారు. కోల్‌కతాకు చెందిన సంగీతపై చిత్తూరులో అరెస్టు వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. తమ కళ్లుగప్పి తిరుగుతున్న సంగీతను పట్టుకోవడం ఇప్పట్లో సాధ్యపడే విషయం కాదని పోలీసులు పెదవి విరుస్తున్నారు. -
ఎర్రచందనం వేలం వివరాలు సమర్పించండి
ఏపీ సర్కారుకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం ఎర్రచందనాన్ని విక్రయించేందుకు నిర్వహించిన వేలంలో చోటు చేసుకున్న అక్రమాలను అడ్డుకోవా లని దాఖలైన వాజ్యంపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. ఎర్రచం దనం వేలాన్ని ఎవరి పేరు మీద ఖరారు చేశారు.. వేలంలో ఎన్ని బిడ్లు దాఖలయ్యాయి? ఎన్ని బిడ్లను తిరస్కరించారు.. తదితర వివరాలను సమర్పించాలంటూ మంగళవా రం ఏపీ సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ–వేలంలో తక్కువ ధరలు కోట్ చేసిన వారికే ఎర్ర చందనం విక్రయిం చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోం దని, నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్న ఈ చర్యలను అడ్డుకుని ఎర్రచందనం ఎగుమతులను ఆపాల ని గుంటూరుకు చెందిన డి.బసవ శంకర్రావు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై మంగళ వారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. -
ఎర్రచందనం టెండర్లలో భారీ గోల్మాల్
⇒ సర్కార్ ఖజానాకు రూ.987 కోట్ల నష్టం ⇒ అడ్డదిడ్డంగా టెండర్లు.. కారు చౌకగా అమ్మకం ⇒ 2014లో టన్ను రూ.కోటి తొంభై లక్షలు కాగా ఇప్పుడు కేవలం 38 లక్షలకే విక్రయం ⇒ బిడ్ల ఆమోదంపై సర్వత్రా అనుమానాలు ⇒ గతేడాది డిసెంబర్ 29న వేలం జరగాల్సి ఉండగా 26నే బిడ్లకు ఆమోదం!! ⇒ ప్రభుత్వ పెద్దల అనధికారిక ఒప్పందాల వల్ల రాత్రికి రాత్రే ఖరారు? ⇒ కీలక నేతలకు భారీగా ‘ముట్టినట్లు’ సమాచారం సాక్షి, అమరావతి: ఎర్రచందనం టెండర్లలో భారీ గోల్మాల్ జరిగింది. అత్యంత విలువైన ఎర్రచందనాన్ని లోపాయికారీ ఒప్పందాలతో రాష్ట్రప్రభుత్వం కారు చౌకగా అమ్మేస్తోంది. దీనివల్ల ఖజానాకు రూ.987 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. 2014 నవంబర్‌లో విక్రయించిన ధరతో పోలిస్తే ప్రస్తుత విక్రయ ధర అతి తక్కువగా ఉండటం, దీనికితోడు ప్రభుత్వం ఆగమేఘాలపై విక్రయ బిడ్లను ఆమోదించడం పలు సందేహాలకు తావిస్తోంది. డిమాండ్‌కు సరిపడా సరుకు రావడం లేదని, ఉత్పత్తి పడిపోయిందని పలు మాటలు చెప్పి వ్యాపారులు ధరలు పెంచి లాభాలు గడిస్తారు. బండ్ల మీద పండ్లు, షాపుల్లో కిరాణా సరుకులు అమ్మే చిరు వ్యాపారులు మొదలు వెండి, బంగారం విక్రయించే పెద్ద వ్యాపారుల వరకూ అంతా దీనిని పాటిస్తారు. ఇది మార్కెటింగ్ సూత్రం. రాష్ట్ర ప్రభుత్వం ఈ పాటి మార్కెటింగ్ సూత్రాన్ని కూడా పాటించకుండా కారు చౌకగా ఎర్రచందనాన్ని విక్రయించడం వెనుక ప్రభుత్వ పెద్దల ప్రయోజనం ఉండి ఉంటుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సరైన ధర రాకపోతే టెండర్లను రద్దు చేయాల్సింది పోయి.. రాత్రికి రాత్రే విక్రయ బిడ్లను ఆమోదించడంపై అధికారులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ‘ఖజానాకు సుమారు రూ.వెయ్యి కోట్లు గండి కొట్టారంటే ఆ మేరకు కీలక నేతలకు లబ్ధి చేకూరితేనే కదా...’ అని అధికారులు చర్చించుకుంటున్నారు. ఆదాయానికి గండి ఇలా... ఎర్రచందనం విక్రయ టెండర్లలో ప్రభుత్వం అనుసరించిన అడ్డగోలు విధానం వల్ల ఖజానాకు అక్షరాలా రూ.987 కోట్లకు పైగా గండి పడిందని ప్రభుత్వ గణాంకాలే తేటతెల్లం చేస్తున్నాయి. 2014 నవంబర్‌లో ఇదే చంద్రబాబు ప్రభుత్వం విక్రయించిన ధరలను ప్రామాణికంగా తీసుకుంటే జరిగిన నష్టమిదీ. అంతర్జాతీయ మార్కెట్లో ఎర్రచందనం ధరలేమీ పడిపోలేదని, కీలక నేతలు చేసుకున్న అనధికారిక ఒప్పందాల్లో భాగంగానే బయ్యర్లు తక్కువ ధరకు బిడ్లు వేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే వాటిని ప్రభుత్వం ఆమోదించిందన్న ఆరోపణలూ ఉన్నాయి. టన్ను ‘ఎ’ గ్రేడ్ ఎర్రచందనాన్ని 2014 నవంబర్‌లో జరిగిన టెండర్లలో కోటీ తొంభై అయిదు లక్షల రూపాయలకుపైగా రేటుతో విక్రయించిన ప్రభుత్వం.. ఇప్పుడు కేవలం రూ.38.56 లక్షలకే అమ్మేందుకు టెండర్లు ఆమోదించడం గమనార్హం. ‘ఎ’ గ్రేడ్ ఎర్రచందనాన్ని 2014లో ధర కంటే తక్కువకు విక్రయించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రూ.719 కోట్లకు పైగా గండి పడింది. అప్పట్లో నాలుగు టన్నులే.. ఇప్పుడు 372 ఇదిలాఉండగా, 2014 నవంబర్‌లో అత్యంత నాణ్యమైన ‘ఎ’ గ్రేడ్ ఎర్రచందనం దుంగలను 4.691 టన్నుల మేర మాత్రమే విక్రయించగా.. ఇప్పుడు ఏకంగా 372.721టన్నుల విక్రయ బిడ్లను సర్కార్ ఆమోదించింది. అలాగే నాణ్యతలో ద్వితీయ శ్రేణికి చెందిన ‘బి’ గ్రేడ్ దుంగలను అప్పట్లో 166.186 టన్నులు విక్రయించగా.. తాజాగా 622.347 టన్నులకు సంబంధించిన బిడ్లను ఓకే చేసింది. అంటే 2014లో అమ్మిన దాని కంటే 75 శాతానికి పైగా ఎక్కువ పరిమాణంలో ‘ఎ’ గ్రేడ్ దుంగలను, మూడున్నర రెట్లకు పైగా ‘బి’ గ్రేడ్ దుంగలను ఇప్పుడు విక్రయించనుండటం గమనార్హం. బిడ్ల వివరాలు రాకముందే ఆమోదం!! గతేడాది డిసెంబర్లో జరిగిన ఎర్రచందనం టెండర్ల బిడ్ల వివరాలు కూడా రాకముందే చంద్రబాబు ప్రభుత్వం వాటిని ఆమోదించేసింది. ఈ విషయం స్పష్టంగా జీవోలోనే ఉండటం గమనార్హం. గతేడాది డిసెంబర్ 19, 21, 23, 27, 29 తేదీల్లో ఎర్రచందన విక్రయానికి ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ(ఏపీఎఫ్డీసీ) విక్రయ ఏజెంటుగా ఈ– వేలం నిర్వహించింది. ఇందులో వివిధ సంస్థలు దాఖలు చేసిన హెచ్–1(అధిక రేట్ల) బిడ్లను గతేడాది డిసెంబర్ 26న ప్రభుత్వ ఆమోదం కోసం ఏపీఎఫ్డీసీ వైస్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ పంపించారు. రాష్ట్ర అటవీ దళాల అధిపతి డిసెంబర్ 28న ప్రభుత్వానికి పంపించారు. దీనిని ఆమోదించిన ప్రభుత్వం బిడ్ల ధరలను అంగీకరిస్తున్నట్లు జనవరి 4న జీవో జారీ చేసింది. అయితే డిసెంబర్ 29న జరిగిన ఈ–వేలంలో వచ్చిన బిడ్ల రేట్లను డిసెంబర్ 26నే ఏపీఎఫ్డీసీ మేనేజింగ్ డైరెక్టర్, అదే నెల 28న అటవీ దళాల అధిపతి ప్రభుత్వానికి ఎలా పంపుతారని అధికారులను ప్రశ్నించగా.. ‘‘అప్పటి అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అధిపతిగా నియమితులయ్యారు. ఆయన ఢిల్లీకి వెళ్లే హడావుడిలో ఉండగా ప్రభుత్వ పెద్దలు రాత్రికి రాత్రే ఆమోదింపజేసి జీవో జారీ చేయించినట్లున్నారు. దీనివల్లే సాంకేతిక తప్పిదం జరిగినట్లుంది..’’ అని వారు నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. -
ఎర్రచందనం దేశ సరిహద్దులు ఎలా దాటుతోంది?
టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు ప్రశ్న తిరుపతి మంగళం: మనదేశంలో ఎవరి సహాయ సహకారాలు లేకుండా అత్యం త విలువైన ఎర్రచందనం ఆంధ్ర రాష్ట్రం తో పాటు దేశ సరిద్దులు దాటి ఇతర దేశాలకు ఎలా వెళుతోందని టాస్క్‌ఫోర్స్ డీఐజీ మాగాంటి కాంతారావు ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలు లేకుం డా ఒక్క దుంగ కూడా బయటకు వెళ్లే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. మంగళవారం కపిలితీర్థం సమీపంలోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో డీఐజీ విలేకరుల సమావేశం నిర్వహిం చి మాట్లాడారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు తాము కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్నామన్నారు. తమకు ఎవరి సహకారం లభిం చకున్నా కేవలం 150మంది సిబ్బందితో ఎర్రచందన అక్రమ రవాణాను, బడా స్మగ్లర్ల ఆట కట్టించినట్లు పేర్కొన్నారు. శేషాచల అడవుల్లోకి తమిళనాడులోని జావాదీహిల్కు చెందిన కూలీలు రాకుం డా చాలావరకు కట్టడి చేశామన్నారు. అటవీ, టాస్క్‌ఫోర్స్ అధికారులపై ఎర్ర స్మగ్లర్లు దాడులకు పాల్పడాలంటే భయపడేలా చేశామన్నారు. అయితే ఎర్రచందనంతో పాటు అడవుల్లో అక్కడక్కడా ఉన్న శ్రీగంధం చెట్లపై కూడ ఎర్రస్మగ్లర్ల కన్ను పడిందన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టి అక్రమ రవాణాను అరికట్టేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. డీఎస్పీలు శ్రీధర్‌రావు, హరినాథ్‌బాబు, మహేశ్వరరాజు పాల్గొన్నారు. -
భారీగా ఎర్రచందనం పట్టివేత
చంద్రగిరి(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని శేషాచలం అడవుల్లో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం వేకువజామున కూంబింగ్ నిర్వహించారు. ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు తమిళకూలీలను అరెస్ట్‌చేయడంతో పాటు, 21 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. చంద్రగిరి మండలం చీకటికోన సమీపంలో ఎర్రచందనం చెట్లను నరికి తరలిస్తుండగా పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. -
లక్ష్మణ్ తమ్ముడూ ఎర్ర డానే..!
• గుర్తించిన చిత్తూరు పోలీసులు • కళ్లు గప్పి తిరుగుతున్న స్మగ్లర్ • గాలింపు చర్యలు ముమ్మరం చిత్తూరు (అర్బన్): లక్ష్మణ్ - ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పరిచయం అవసరంలేని వ్యక్తి. సింపుల్‌గా పోలీసు రికార్డుల్లో ఉన్నట్లు చెప్పాలంటే రూ.వంద కోట్ల ఆస్తి, జిల్లాలో 20కి పైగా కేసులు, చిత్తూరు నుంచి చైనా వరకు ఎర్రచందనం దుంగల్ని రాచమార్గంలో తీసుకెళ్లగలిగే వ్యక్తి. ప్రస్తుతం కడప కేంద్ర కారాగారంలో పీడీ యాక్టు కింద ఉన్నాడు. ఓ పెద్ద స్మగ్లర్‌కు చెక్ పెట్టగలిగామని సంబరపడుతున్న పోలీసులకు అతని తమ్ముడు రమేష్ ఇప్పుడు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. విదేశాలకూ విస్తరించిన ‘ఎర్ర’ నెట్వర్క్ ఎర్రచందనం రవాణాలో అంతర్జాతీయ స్మగ్లర్‌గా ఎదిగిన లక్ష్మణ్ స్వస్థలం చెన్నై. ఇతన్ని రెండేళ్ల క్రితం అరెస్టు చేసిన పోలీసులు తొలిసారిగా రెండుసార్లు పీడీ యాక్టు బనారుుంచి అతడిని కటకటాల్లోకి నెట్టగలిగారు. అయినా జైల్లో నుంచే లక్ష్మణ్ తన రెండో భార్య. ఎర్రచందనం స్మగ్లింగ్ క్వీన్, మాజీ ఎరుుర్ హోస్టెస్ సంగీత ద్వారా హవాలా రూపంలో స్మగ్లర్లకు భారీగా నగదు పంపిస్తూ, ఎర్రచందనాన్ని విదేశాలకు అక్రమ రవాణా చేస్తూ వచ్చాడు. ఇది తెలుసుకున్న చిత్తూరు పోలీసులు సంగీతను కోల్‌కత్తాలో అరెస్టు చేయడం, భారీగా బంగారు, వెండి ఆభరణాలను సీజ్ చేయడం తెలిసిందే. అరుుతే, చిత్తూరులో పెండింగ్ కేసులు ఉన్నా న్యాయస్థానానికి హాజరుకాకుండా సంగీత తప్పించుకు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో ప్రస్తుతం రమేష్ అనే పేరు తెరపైకి వచ్చింది. లక్ష్మణ్‌కు స్వయాన తమ్ముడైన రమేష్ ఇప్పుడు ఎర్రచందనం రవాణాలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు పోలీసులకు దిమ్మదిరిగే వాస్తవాలు తెలిశాయి. గత నెల 17న చిత్తూరు పోలీసులు కడపకు చెందిన అందాలరాముడు అనే స్మగ్లర్‌ను అరెస్టు చేశా రు. ఇతడిని విచారణ చేయగా లక్ష్మణ్ తమ్ముడు రమేష్‌తో కలిసి స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులకు వెల్లడించడంతో అసలు విషయం బయటపడింది. చెన్నై కేంద్రంగా ’ఎర్ర’ వ్యాపారం లక్ష్మణ్‌కు ఇద్దరు తమ్ముళ్లు. కరుప్పన్ అనే వ్యక్తి కొంతకాలం క్రితమే అనారోగ్యంతో చనిపోయాడు. లక్ష్మణ్ జైలుకు వెళ్లిన తరువాత సంగీత ఆటలు సాగకపోవడంతో రమేష్ ఎర్రచందనం స్మగ్లింగ్‌లోకి దిగాడు. జిల్లా నుంచి ఎర్రచందనం దుంగల్ని చెన్నై, బెంగళూరుకు చేర్చడం, కడప నుంచి కూడా పెద్ద ఎత్తున ఎర్రచందనం దుంగల్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసినట్లు పోలీసులు గుర్తించారు. చెన్నై కేంద్రంగా రమేష్ చేస్తున్న వ్యాపారాన్ని రట్టు చేసేందుకు చిత్తూరు నుంచి ఓ ప్రత్యేక బృందం గాలిస్తోంది. రమేష్ పోలీ సులు త్వరలోనే పట్టుకోగలమనే పకడ్బందీ వ్యూహం తో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. అతడిని అరెస్టు చేస్తే చెన్నైలో 80 శాతం ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టనట్లే అవుతుందని పోలీసులు భావిస్తున్నారు. -
పోలీసులపై ‘ఎర్ర’ స్మగ్లర్ల దాడి
అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న దుండగులను పట్టుకోవడానికి యత్నించిన పోలీసులపై దాడికి యత్నించారు. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా సుండుపల్లి మండలం చిన్న గొల్లపల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానిక రామన్నకుంట సమీపంలోని ఎర్రచందనం దుంగలు స్మగ్లింగ్ జరగుతుందనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులపై స్మగ్లర్లు నాగరాజు, లక్ష్మయ్య, సుబ్బయ్య కత్తులతో దాడి చేశారు. ఈ దాడుల నుంచి తప్పించుకున్న పోలీసులు ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి ఏడు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పరారైన మరో దొంగ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
14 మంది తమిళ కూలీలు అరెస్టు
వైఎస్సార్ జిల్లా గోపవరం మండలం లక్కవారిపల్లె గ్రామ సమీపంలోని నక్కదోన అటవీ ప్రాంతంలో గురువారం పోలీసులు 14 మంది తమిళ కూలీలను అరెస్టు చేసి, 15 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. మైదుకూరు డీఎస్పీ ఎం.వి.రామకృష్ణయ్య తెలిపిన వివరాలివీ.. ముందస్తు సమాచారం మేరకు బద్వేలు సీఐ రామాంజినాయక్ , రూరల్ ఎస్ఐ నరసింహారెడ్డిలు అటవీ సిబ్బంది, ఇతర పోలీసు సిబ్బందితో కలిసి నక్కదోన అటవీ ప్రాంతంలో గాలిస్తుండగా కొంతమంది వ్యక్తులు ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారు. వారు పోలీసులను చూడగానే గట్టిగా కేకలు వేస్తూ పోలీసులపైకి రాళ్లు, గొడ్డళ్లు విసురుతూ పారిపోయేందుకు ప్రయత్నించారు. సిబ్బంది వెంటపడి 14 మందిని అరెస్టు చేయగా మరికొంతమంది పారిపోయారు. వారి వద్ద నుంచి 334 కేజీల బరువు గల 15 ఎర్రచందనం దుంగలు, 15 గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారంతా తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లా హరూన్, పాపిరెట్టపట్టి తాలూకాలకు చెందిన వారు. -
రూ.2 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత
చిత్తూరు పోలీసులు 2 కోట్లు విలువ చేసే ఎర్రచందనాన్ని బుధవారం తమిళనాడు రాష్ట్రం పొండూరులో స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలు గురువారం ఏఆర్ గ్రౌండ్లో రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు, ఎస్పీ జయలక్ష్మీ విలేకర్ల సమావేశంలో తెలిపారు. ఆగస్టు 19వ తేదీన చంద్రగిరి పరిధిలో రాంమోహన్, అతని అనుచరులు జగన్నాధం, బాలన్‌ను ఎర్రచందనం అక్రమరవాణాకు పాల్పడుతూ ఉండగా అదుపులోకి తీసుకున్నామని వివరించారు. . పోలీసుల దాడుల్లో ముగ్గరు మాత్రమే పట్టుబడ్డారని... మిగతా.. 13 మంది పరారైయ్యారని చెప్పారు. వీరిని విచారించగా పారిపోయిన వారిలో ప్రధాన స్మగ్లర్ కిరుబాకరాన్ అలియాస్ కిరుబా, అలియాస్ కిరుబాను తెలిసిందని చెప్పారు. వీరిని ఆగస్టు 23వ తేదీన అరెస్ట్ చేశామన్నారు. కిరుబాకరన్ తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లా పెరంబదూర్ తాలూకా పొండూరు గ్రామంలో ఆటోమేటిక్ కారిడార్‌లో ఓ గోడౌన్లో మరో స్మగ్లర్ అయిన సెల్వరాజ్ ఇతనికి సంబంధించిన దుంగలను దాచి ఉన్నట్లు విచారణలో తేలిందని చెప్పారు. ఈ సమాచారం మేరకు బుధవారం గోడౌన్ పై దాడులు నిర్వహించి 2 కోట్ల రూపాయలు విలువ చేసే 395 దుంగలు స్వాధీనం చేసుకున్నామన్నారు. దీని బరువు సుమారు 9,586 కేజీలు (9.5) టన్నులు ఉంటుందన్నారు. వీరి వద్ద నుండి ఎర్రచందనం దుంగలతో పాటు ఈచర్ లారీ, 2 వెయిట్ మిషన్లు, 2 రంపాలు స్వాధీనం చేసుకుని గోడౌన్‌ను సీజ్ చేశామన్నారు. 2014 జూలై నుంచి 1393 కేసులు నమోదు 2014 జూలై నుంచి ఇప్పటి వరకు 1393 కేసులను రాయలసీమలో నమోదు చేసినట్లు రాయలసీమ రేంజ్ ఐజీ శ్రీధర్‌రావు తెలిపారు. ఇందులో 6,924 మందిని అరెస్ట్ చేశామన్నారు. వీరిలో ఏపీకి చెందిన వారు 3,221 మంది ఉండగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 3,703 మంది ఉన్నామన్నారు. ఇప్పటి వరకు 22,108 ఎర్రచందనం దుంగలు, 1016 వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. -
శేషాచలంలో టాస్క్ ఫోర్స్ పోలీసుల కూంబింగ్
శేషాచలం అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ గురువారం నిర్వహించారు. ఎర్రచందనం అక్రమ రవాణా కోసం కూలీలు ప్రవేశించారనే సమాచారంతో అటవీ ప్రాంతమంతా జల్లెడ పట్టారు. ఈ సందర్భంగా పోలీసులను చూసిన ఎర్ర చందనం కూలీలు పరారయ్యారు. పరారైన కూలీలు 30 మందికి పైగా ఉంటారని అధికారులు తెలిపారు. పరారైన కూలీలు తమ వద్ద ఉన్న ఎర్ర చందనం దుంగలను వదిలేసి వెళ్లారని వివరించారు. వీటి విలువ మార్కెట్ లో రూ.30 లక్షలు ఉంటుందని వివరించారు. -
చెన్నై టు చైనా
కడప అర్బన్: ఎల్ఈడీ వ్యాపార ముసుగులో ఎర్ర చందనం అక్రమ రవాణాదారులకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న చైనాకు చెందిన అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ కె.ఎ.దావూద్ జాగీర్ అలియాస్ జాకీర్(52) కటకటాలపాలయ్యాడు. దావూద్ జాగీర్తోపాటు అతని అన్న కుమారుడు ఫిరోజ్ దస్తగిరిని కడప జిల్లా పోలీసులు రాజంపేట–రాయచోటి రహదారిలోని ఆకేపాడు క్రాస్ వద్ద శనివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి భారీగా ఎర్రచందనం దుంగలు, నాలుగు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు స్మగ్లర్ల వివరాలను వెల్లడించారు. రాజంపేట పరిధిలోని ఆకేపాడుకు చెందిన జాకీర్ దావూద్ అంతర్జాతీయ స్మగ్లర్‌గా పేరుగాంచాడు. అతను మొదట్లో తమిళనాడు రాష్ట్రం చెన్నైకి వెళ్లి అక్కడున్న అంతర్జాతీయ స్మగర్లతో సంబంధాలను ఏర్పరుచుకున్నాడు. తరువాత ఏకంగా చైనాకే మకాం మార్చాడు. ప్రస్తుతం చైన్నైలోని మన్నాడి పట్టణం సలై వినాయగర్ కోయిల్ స్ట్రీట్‌లో నివాసం ఏర్పరుచుకున్నాడు. అతను వ్యాపారాల నిమిత్తం చైనా దేశం గ్వాన్డాంగ్ రాష్ట్రంలోని పెంగ్జియాంగ్ జిల్లా యాంగువాన్లోని వుయికంట్రీ గార్డెన్, శ్రీలంక రాజధాని కొలొంబోలోని డెమటగోడలో కూడా నివాసాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఏడో తరగతి వరకు విద్యనభ్యసించాడు. అతను 1997లో చెన్నై నగరం నుంచి చైనాకు వెళ్లి అక్కడ లైటింగ్ వ్యాపారాన్ని (ఎల్ఈడీ బల్బులు) ప్రారంభించాడు. చెన్నై నుంచి తరచూ చైనాకి వెళ్లి వస్తుండటంతో ఆ దేశానికి చెందిన లీయాన్ అనే యువతితో సాన్నిహిత్యం ఏర్పడి వివాహం చేసుకున్నాడు. ఇతని అన్న జాఫర్ దస్తగిర్ చైనాలో స్థిరపడ్డాడు. ఎల్ఈడీ బల్బుల వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో జాగీర్ చైనా దేశంలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ కంపెనీలు, షోరూమ్‌లు, వ్యాపారవేత్తలను కలిసేవాడు. ఈ క్రమంలో చెన్నై రెడ్‌హిల్స్‌కు చెందిన పలువురు ఎర్ర చందనం స్మగ్లర్లతో సంబంధాలు ఏర్పడ్డాయి. చైనీస్ భాషపై పట్టు ఉండటంతో అక్కడి వ్యాపారులు దావూద్ జాగీర్ను మధ్యవర్తిగా(బ్రోకర్) ఏర్పాటు చేసుకున్నారు. తమిళం, ఇంగ్లిష్, చైనీస్, జర్మనీ, ఉర్దూ, హిందీ, బర్మిస్, జపనీస్ భాషలు మాట్లాడటంలో ఇతను దిట్ట. దీంతో ఆయా దేశాల్లో ఉన్న స్మగ్లర్లు చైనాలో ఎర్ర చందనం అక్రమ రవాణా కార్యకలాపాలు నిర్వహించుటకు జాగీర్ సహకారం పొందేవారు. చెన్నై స్మగ్లర్లతో నేరుగా సంబంధాలు: చైనాలో ఎర్ర చందనం అక్రమ రవాణాపై పూర్తిస్థాయి పరిజ్ఞానం సాధించడంతో చెన్నైకి చెందిన ఎర్ర చందనం స్మగ్లర్లతో నేరుగా సంబంధాలు పెంచుకున్నాడు. వారు చూపే పెద్ద మొత్తాలకు ఆకర్షితుడై చెన్నైకి చెందిన ప్రధాన అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్లు సంతాన్మీరన్ అలియాస్ చందన్ మీరన్, సాహుల్ హమీద్, సాహుల్ భాయ్, కందస్వామి, పార్థీబన్ అలియాస్ పార్తిపన్లతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు. చైనా దేశానికి చెందిన అంతర్జాతీయ స్మగ్లర్లతో పాటు ఆసియా దేశాలకు చెందిన ఎర్ర చందనం స్మగ్లర్లకు మధ్య ఎర్ర చందనం అక్రమ రవాణా వ్యాపార కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగడానికి దోహదపడ్డాడు. హాంగ్‌కాంగ్, మలేషియా, సింగపూర్‌లకు రవాణా: చెన్నైకి చెందిన సాహు హమీద్‌తో సంబంధాలు ఏర్పరచుకుని 2000 సంవత్సరం నుంచి ఎర్ర చందనాన్ని కంటైనర్ల ద్వారా హాంగ్‌కాంగ్, మలేషియా, సింగపూర్‌లకు తరలించి అక్కడి కొనుగోలుదారులకు జాగీర్ విక్రయించేవాడు. ఆ సొమ్మును ‘హవాలా’ ద్వారా సాహుల్ హమీద్‌కు చేరవేసేవాడు. అందుకు గాను కొనుగోలుదారులు, విక్రయదారుల నుంచి భారీగా కమీషన్ పొందేవారు. కొంతకాలం తర్వాత తమిళనాడు, ఆంధ్రా, ఢిల్లీ రాష్ట్రాల్లోనే స్మగ్లర్ల నుంచి నేరుగా ఎర్ర చందనం దుంగలను కొనుగోలు చేసి చైనాకు అక్రమంగా తరలించి నిరాటంకంగా వ్యాపారం సాగించేవాడు. జాగీర్ ఎర్ర చందనం అక్రమ రవాణాలో చైనాకు చెందిన చెన్చెంగై, చెన్ చెంగ్వు, సంతన్మీరన్, జాంగ్యాంగ్, వాంగ్ లీ ఫా, హాంకాంగ్‌కు చెందిన జిమ్మి, సింగపూర్‌కు చెందిన హనీఫ్, డేవిడ్, మయన్మార్‌కు చెందిన షణ్ముగమ్లతో సంబంధాలు ఏర్పరచుకుని వారికి ఎర్ర చందనం దుంగలను విక్రయించేవాడు. సీమలో 57 కేసులు అతనిపై కడప జిల్లాలో 34, చిత్తూరు జిల్లాలో 22, కర్నూలు జిల్లాలో ఒకటి, మొత్తం 57 ఎర్ర చందనం అక్రమ రవాణా కేసులు ఉన్నాయి. చైనా, దుబాయ్, సింగపూర్, హాంగ్‌కాంగ్, మలేషియాతో పాటు మరికొన్ని దేశాల్లో ఇతనికి ఆస్తులు ఉన్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. ఆయా దేశాల స్మగ్లర్లతో జాగీర్‌కు ఉన్న లావాదేవీలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్లు ఐజీ తెలిపారు. కొత్తగా సవరించిన ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్, 1967 నిబంధనల మేరకు జాగీర్ ఆస్తుల వివరాలను సేకరించి ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకునేందుకు చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 2 వేల టన్నుల ఎర్ర చందనం దుంగలను ఎగుమతి చేసి విదేశాల్లో విక్రయించినట్లు జాగీర్ పోలీసు విచారణలో అంగీకరించాడు. అన్న కుమారుడు సహకారం: చెన్నైలో నివాసముంటూ కారు డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న ఫిరోజ్ దస్తగిరి.. దావూద్ జాగీర్ అన్న కుమారుడు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకతో పాటు, ఇతర రాష్ట్రాల్లోని ఎర్ర చందనం స్మగ్లర్ల నుంచి కొనుగోలు చేసిన ఎర్ర చందనం దుంగలను వాహనాలలో జాగీర్ చెప్పిన ప్రదేశాలకు చేరుస్తూ అక్రమ రవాణాకు సహకరించాడు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎర్ర చందనం స్మగ్లర్లతో సంబంధాలు ఏర్పరచుకుని చిన్నాన్న జాగీర్ అక్రమ రవాణా వ్యాపారాలలో సహాయ సహకారాలు అందిస్తున్నాడు. -
కదులుతున్న ఎర్ర డంప్‌లు
- పుష్కర విధుల్లో జిల్లా పోలీసులు - ఇదే అదునుగా పేట్రేగుతున్న స్మగ్లర్లు - శేషాచలం నుంచి పెద్ద ఎత్తున ఎర్రచందనం రవాణా - బుధ, గురువారాల్లో 13 మంది స్మగ్లర్లు అరెస్ట్ - బడా స్మగ్లర్ శ్రీనివాసరెడ్డి కోసం గాలింపు సాక్షి ప్రతినిధి. తిరుపతి శేషాచలంలోని ఎర్ర చందనం డంప్‌లు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తమిళనాడు నుంచి వస్తోన్న ఎర్ర స్మగ్లర్లు చాకచక్యంగా ఎర్రదుంగల తరలింపును ముమ్మరం చేశారు. జిల్లా పోలీసుల్లో 80 శాతం మంది కృష్ణా పుష్కర విధులకు హాజరవడం వీరికి కలిసొచ్చింది. ఇదే సరైన అదునుగా భావించిన స్మగ్లర్లు అడవుల్లో దాచిన ఎర్రచందనం దుంగల డంప్‌లను గుట్టూచప్పుడు కాకుండా బయటకు రవాణా చేసేందుకు యత్నిస్తున్నారు. గడచిన మూడు రోజులుగా ఈ రవాణా పెరిగినట్లు టాస్క్ఫోర్సు అధికారులు గుర్తించారు. బుధ, గురువారాల్లో విస్తృతంగా తనిఖీలు జరిపి 13 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.40 లక్షల విలువైన 58 ఎర్రచందనం దుంగలను (2 టన్నులు)స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లోని 5 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న శేషాచలంలో ఇంకా 30 శాతం ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. ఇప్పటికే నరికిన చెట్ల తాలూకు దుంగల నిల్వలు పెద్ద ఎత్తున అడవుల్లో నిల్వ ఉన్నాయి. వీటిని బయటకు తరలించే విషయంలో ఇటు ఆంధ్ర, అటు తమిళనాడు స్మగ్లర్లు విస్తృతంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. గడచిన రెండు నెలల్లో సుమారు 20 టన్నులకు పైన ఎర్ర దుంగలను స్వాధీనం చేసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు 25 మందికి పైబడి స్మగ్లర్లును అరెస్టు చేశారు. రెడ్‌శాండల్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్‌ఫోర్స్‌కు చెందిన 13 బృందాలు శేషాచలంలో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. వెలిగొండ, పాలకొండ, నల్లమల, లంకమల అటవీ ప్రాంతాల్లో వీరి కూంబింగ్ జరుగుతోంది. ఈ నెల ఏడో తేదీన జిల్లాకు చెందిన 80 శాతం మంది పోలీసులు కృష్ణా పుష్కర విధులకు వెళ్లిపోయారు. దీంతో అన్ని మార్గాల్లోనూ పోలీసుల తనిఖీలు లేకుండా పోయాయి. ఇదే అదునుగా తీసుకున్న స్మగ్లర్లు రాత్రి వేళల్లో యథేచ్చగా ఎర్రచందనాన్ని రవాణా చేస్తున్నారు. 13 మంది అరెస్టు ...పరారీలో ముగ్గురు ఇదిలా ఉండగా బుధవారం మధ్యాహ్నం ఉగ్గరాల తిప్ప దగ్గర కూంబింగ్‌లో ఉన్న టాస్క్ఫోర్సు పోలీసులకు ఎర్ర చందనం దుంగలను రవాణా చేసే ముగ్గురు తమిళనాడు స్మగ్లర్లు దొరికారు. వీరిని చాకచక్యంగా అరెస్టు చేసిన పోలీసులు వీరి నుంచి 58 దుంగలు (2 టన్నులు)స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.40 లక్షలు ఉంటుందని టాస్క్ఫోర్సు డీఎస్సీ శ్రీధర్‌రావు విలేకరులకు తెలిపారు. గురువారం ఉదయం 5 గంటలకు జూపార్కు సమీపంలోని పెరుమాళ్లపల్లి అడవుల్లో అడవిలోకి ప్రవేశిస్తోన్న ఎర్ర స్మగ్లర్లపై టాస్క్ఫోర్సు ఆర్ఎస్ఐ వాసు, నర్సింహయ్యల టీములు ఒక్కసారిగా దాడులు జరిపాయి. మొత్తం 10 మందిని అరెస్టు చేశారు. వీరిలో రేణిగుంటకు చెందిన కె. శివ, తిరుచ్చికి చెందిన లక్ష్మన్ సెంథిల్ కుమార్, రాసు షణ్ముగం, పిలెందిరన్ అంగముత్తు, క్రిష్టన్మూర్తి, రామర్ నాగరాజన్, నల్లిస్వామి పెరుమాళ్, నగరాజన్ సత్యవేల్, సంథానమ్ రవి, సంథానమ్ రాములు ఉన్నారని డీఎస్పీ శ్రీథర్రావు వివరించారు. వీరికి నాయకత్వం వహిస్తోన్న పేరూరి శ్రీనివాసరెడ్డి, మునస్వామి, రామానాయుడులు పరారయ్యారు. అరెస్టయిన వారి నుంచి ఓ ఆటో, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. బడా స్మగ్లర్ పేరూరి శ్రీనివాసరెడ్డి కోసం గాలిస్తున్నారు. సహకరిస్తోన్న అగ్రికల్చర్ కాలేజీ వాచ్మెన్, రైల్వే ఉద్యోగిలను విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. -
ముగ్గురు తమిళ కూలీల అరెస్ట్
-58 ఎర్రచందనం దుంగలు స్వాధీనం రైల్వేకోడూరు రూరల్ అక్రమ రవాణాకు సిద్ధం చేసిన 58 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ముగ్గురు తమిళ కూలీలను అరె స్టు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరులోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. బాలుపల్లె అటవీశాఖ పరిధిలో పుల్లగూరపెంట వద్ద సుమారు 50 మంది కూలీలు ఎర్రచందనం దుంగలతో టాస్క్‌ఫోర్స్ సిబ్బందికి తారసపడ్డారని చెప్పారు. వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా కొందరు పారిపోగా తమిళనాడు రాష్ట్రం తిరువ ణ్ణామలై ప్రాంతానికి చెందిన పొన్నుస్వామి, తిరుమలై, ధర్మపురికి చెందిన కుమార్‌లను పట్టుకున్నామన్నారు. కాగా, బుధవారం మధ్యాహ్నం రైల్వేకోడూరుకు చేరుకున్న టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు నిందితులను పోలీసు స్టేషన్లో అప్పగించేందుకు ప్రయత్నించగా స్థానిక పోలీసులు వివిధ కేసుల దర్యాప్తు నిమిత్తమై బిజీగా ఉండటంతో నిందితులు, దుంగలతో సహా తిరుపతికి వెళ్లారు. తమిళ కూలీలపై తిరుపతిలో కేసు నమోదు చేస్తామని ఆయన తెలిపారు. -
సంగీతా చటర్జీకి 31వరకు గడువు
ఎర్రచందనం అంతర్జాతీయ మహిళా స్మగ్లర్ సంగీత చటర్జీ ఈనెల 31వ తేదీలోపు చిత్తూరు న్యాయస్థానంలో హాజరుకావాలని కోల్‌కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల క్రితం చిత్తూరు పోలీసులు ఈమెను అరెస్టు చేసి కోల్‌కతా కోర్టులో హాజరుపరిచింది. దీంతో.. తదుపరి విచారణకు చిత్తూరు కోర్టు నుంచి మినహాయించాలని సంగీత కోల్‌కతా కోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేస్తూ సంగీత చిత్తూరు కోర్టుకు హాజరయ్యేలా చూడాలని మన పోలీసులు ఇటీవల కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం కేసు విచారణకు హాజరుకాకుండా కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. ఈనెలాఖరులోపు చిత్తూరు న్యాయస్థానంలో హాజరుకావాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది.