దర్జాగా తిరుగుతున్న ఎర్రస్మగ్లర్లు
కేసులున్నప్పటికీ కోర్టు కేసు నంబర్లకు నోచుకోని వైనం
పోలీస్, అటవీశాఖల సమన్వయ లోపం
చార్జ్‌షీట్ల నమోదులో తీవ్ర జాప్యం
జిల్లావ్యాప్తంగా వందల కేసుల్లో ఇదే సమస్య
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం ఎర్రస్మగ్లర్లకు వరంగా మారింది. అటవీశాఖ నుంచి త్వరితగతిన ప్రాసిక్యూషన్ ఆర్డర్స్ అందకపోవడం, పోలీసుల నుంచి సకాలంలో ఎఫ్‌ఐఆర్ రిమాండర్లు వెళ్లకపోవడంతో ఎర్రచందనం కేసులు ముందుకు సాగడం లేదు. ఫలితంగా ఏళ్లు గడుస్తున్నా నిందితులు దర్జాగా తిరుగుతూ కోర్టులంటే ఏమాత్రం భయం లేకుండా వ్యవహరిస్తున్నారు. కొన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు కట్టిన ఎస్‌ఐలు రిటైరైనా, ఆ కేసుల్లో ఇంతవరకు కోర్టు నంబర్ కాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.కోర్టు వాయిదాలను కూడా పట్టించుకోవడం లేదు.
ఎర్రచందనం కేసుల్లో నిబంధనలిలా..
ఎర్రచందనం దుంగలతో పాటు వాటిని తరలించే వారిని పట్టుకున్నపుడు ప్రాపర్టీని సీజ్ చేసి నిందితులపై పోలీసులు కేసులు నమోదు చే స్తారు. అరెస్ట్ చూపే నాటికి అందుబాటులో ఉన్న నిందితులను రిమాండ్‌కు పంపుతూ మిగిలిన వారిని పరారీలో చూపుతారు. ఆపై అరెస్ట్ అయిన వారికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ను అటవీశాఖకు అందించాల్సి ఉంది. వీరికి సంబంధిత డివిజన్ పరిధిలోని సబ్ డీఎఫ్‌వో స్థాయి అధికారి ప్రాసిక్యూషన్ ఉత్తర్వులను జారీచేస్తారు. దీంతో కేసుకు సంబంధించి కోర్టులో సీసీ (కోర్ట్ కేస్) నంబర్ వచ్చి కేసుకు సంబంధించిన వాయిదాలు ప్రారంభమవుతాయి. ఐవో (ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్) విచారణతో ఈ కేసుల్లో నిందితులకు శిక్షలు పడే అవకాశం ఉంది. పోలీస్ కేసుల్లో సీజ్ అయిన అటవీశాఖకు అప్పగించిన వాహనాలు, ప్రాపర్టీపై విలువ కట్టి వారు వేలం తదితర ప్రక్రియలను నిర్వహిస్తారు.
కానీ.. జరుగుతున్నదేమంటే..
ఉదాహరణకు పలమనేరు పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ఎర్రచందనం కేసులను అటవీశాఖకే అప్పగించేశారు. అయితే ఐపీసీ 379 సెక్షన్ ఉన్న కేసులను మాత్రం పోలీసులే చేపట్టాల్సి ఉంది. గత మూడేళ్లలో సుమారు 12కు పైగా ఎర్రచందనం కేసుల్లో 70 మందికి పైగా నిందితులను స్థానిక పోలీసులు అరెస్ట్‌చేశారు. అయితే కోర్టులో నంబర్ కాకపోవడంతో ఇంతవరకు వారికి వాయిదాలు మొదలు కాలేదు. మూడేళ్లకు ముందు బెయిలుపై వె ళ్లిన నిందితులు ఇంతవరకు కోర్టు మెట్లు ఎక్కని పరిస్థితి. ఇలా చేయడంతో నిందితులకు ఎంతోమేలు కాగా కేసులు కూడా వీగిపోయే పరిస్థితి ఉంది. ఈ సమస్య కేవలం ఒక పలమనేరులోనే కాదు. జిల్లాలోని పలు స్టేషన్ల పరిధిలో వందల సంఖ్యల కేసులు ఇంతవరకు నెంబర్లకు నోచుకోక కోర్టు విచారణలు ఆలస్యమవుతున్నాయి. దీనంతటికీ కారణం పోలీసుల అలసత్వం, అటవీశాఖ నిర్లక్ష్యంగా తెలుస్తోంది.
కుదరని పొంతన
ఎర్రచందనం కేసుల్లో భారీ కేసులను మాత్రం పోలీసులు డీల్ చే స్తూ బలహీనమైన కేసులను తమకు అంటగట్టడం ఎంతవరకు సమంజసమని మొదటి నుంచి అటవీశాఖ మధనపడుతూనే ఉంది. అయితే ఇందుకు కారణం లేకపోలేదు. సంబంధిత కేసులకు సంబంధించి పెద్ద కేసుల్లో నిందితుల నుంచి పోలీసులు ఎంతోకొంత గుంజుకుంటున్నారని, తమకొచ్చే కేసులు ఏ మాత్రం ప్రయోజనం లేని కేసులని అటవీ శాఖ భావిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ కారణంగానే పోలీస్ కేసుల్లో నిందితులకు వెంటనే ప్రాసిక్యూషన్ ఉత్తర్వులను అటవీశాఖ ఇవ్వడం లేదనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. ఈ విషయమై పలమనేరు సీఐ సురేంద్రరెడ్డిని వివరణ కోరగా తాము నిందితులను అరెస్ట్‌చేసిన వెంటనే ఎఫ్‌ఐఆర్ కాపీలను అటవీశాఖకు పంపుతున్నామని అయితే వారినుంచే ప్రాసిక్యూషన్ ఉత్తర్వులు ఆలస్యమవుతున్నాయన్నారు. ఇదే విషయమై ఎఫ్‌ఆర్వో శివన్నను వివరణ కోరగా పరారీలో ఉన్న నిందితులకు కూడా ప్రాసిక్యూషన్ ఉత్తర్వులు ఇవ్వాలంటే కుదరదు కాబట్టే తాము ఆలస్యం చేయాల్సి వస్తోందన్నారు. పీటీ (ప్రిజనర్స్ ట్రాన్స్‌ఫర్) వారెంట్లలోనూ తమకు ఎఫ్‌ఐఆర్ ఇవ్వాల్సిందేనన్నారు.