‘అటవీ’ దొంగలు? స్మగ్లర్లకు సహకరిస్తున్న కొందరు అటవీశాఖ సిబ్బంది | - | Sakshi
Sakshi News home page

‘అటవీ’ దొంగలు? స్మగ్లర్లకు సహకరిస్తున్న కొందరు అటవీశాఖ సిబ్బంది

Published Tue, Jun 27 2023 12:28 AM | Last Updated on Tue, Jun 27 2023 1:15 PM

జిల్లా అటవీశాఖ కార్యాలయం - Sakshi

జిల్లా అటవీశాఖ కార్యాలయం

చుంచుపల్లి: ఒకవైపు హరితహారం కింద రాష్ట్ర ప్రభుత్వం మొక్కలను విరివిగా నాటుతూ అడవులను పెంచేలా చర్యలు తీసుకుంటుంటే మరోవైపు అడవులను నిరంతరం కాపాడాల్సిన అటవీశాఖ సిబ్బందిలో కొందరు ఇంటిదొంగలుగా మారుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా అక్రమార్కులకు సహకరిస్తున్నారు. ఇదే అదునుగా అక్రమార్కులు విలువైన టేకు, జిట్రేగి, వేప, తుమ్మ చెట్లను నరికి ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గడిచిన ఏడాది కాలంగా కలప స్మగ్లర్లకు సహకరిస్తున్నారనే కారణంతో ఇల్లెందు, భద్రాచలం, మణుగూరు, కొత్తగూడెం అటవీ డివిజన్ల పరిధిలో పలువురు సెక్షన్‌ ఆఫీసర్లు, బీట్‌ ఆఫీసర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. అయినా కలప అక్రమంగా తరలిపోతోంది. ఉన్నతాధికారులు నామమాత్రపు చర్యలతో చేతులు దులుపుకుంటున్నారని, అందుకే సిబ్బందిలో మార్పు రావడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

కొన్ని సంఘటనలను పరిశీలిస్తే..
● దుమ్ముగూడెం మండలంలో రెండేళ్ల క్రితం ఇద్దరు అటవీశాఖ సిబ్బంది మధ్య కలప రవాణాకు సంబంధించిన పంపకాల్లో తేడా రావడంతో గొడవ జరిగింది. దీంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టి వారిపై సస్పెన్షన్‌ వేటు వేశారు.

● భద్రాచలం డివిజన్‌ పరిధిలోని ఒక గ్రామంలో అక్రమంగా కలపను తరలిస్తున్న ట్రాక్టర్‌ను స్థానికులు గుర్తించి ఆపేశారు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన క్షేత్రస్థాయి అటవీ ఉద్యోగిపై అధికారులు చర్యలు తీసుకున్నారు.

● గతేడాది మార్చిలో చాతకొండ రేంజ్‌ పరిధిలో అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా కలప తరలిస్తూ కొత్తగూడెం క్రాస్‌ రోడ్డు వద్ద పట్టుబడిన వాహనాన్ని వదిలేసేందుకు సహకరించారనే కారణంతో ఒక రేంజ్‌ ఆఫీసర్‌తో పాటు, ఇద్దరు బీట్‌ ఆఫీసర్లను సస్పెండ్‌ చేశారు.

● అదే ఏడాది జూన్‌లో అశ్వాపురం రేంజ్‌ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలప విషయంలో టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. అధికారుల నివేదిక ఆధారంగా ఇందులో నిర్లక్ష్యంగా వ్యహరించిన ఇద్దరు బీట్‌ ఆఫీసర్లను సస్పెండ్‌ చేశారు.

● ఇల్లెందు రేంజ్‌ పరిధిలో కలప విక్రయం, నిధుల గోల్‌మాల్‌ వంటి అవినీతి ఆరోపణల నేపథ్యంలో విచారణ చేసిన అటవీశాఖ ఉన్నతాధికారులు గతేడాది జూలైలో ఒక రేంజర్‌తోపాటు ఇద్దరు సెక్షన్‌ ఆఫీసర్లు, ఒక బీట్‌ ఆఫీసర్‌ను సస్పెండ్‌ చేశారు.

● ఇక తాజాగా అశ్వాపురం రేంజ్‌ ఇరవెండి పరిధి లో జామాయిల్‌ కలపను కొట్టి ఐటీసీ కాంట్రాక్టర్ల తో కలిసి విక్రయించారనే ఆరోపణలతో విచారణ చేపట్టి అటవీశాఖ జిల్లా అధికారులు ఒక సెక్షన్‌ ఆఫీసర్‌, ఒక బీట్‌ ఆఫీసర్‌ను సస్పెండ్‌ చేశారు.

ఉపేక్షించేది లేదు
అటవీశాఖలో పనిచేస్తూ తప్పుడు మార్గాల్లో స్మగ్లర్లకు సహకరించే అటవీ సిబ్బంది విషయంలో ఉపేక్షించేది లేదు. అలాంటి వారిపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే పలువురిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాం. పద్ధతి మార్చుకోకపోతే శాఖాపరంగా కఠినమైన చర్యలకు సైతం వెనకాడబోం.
–లక్ష్మణ్‌ రంజిత్‌ నాయక్‌, డీఎఫ్‌ఓ

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement