డివైడర్‌పై మొక్కలతో పచ్చగా మారిన ఇల్లెందు పట్టణం
ఇల్లెందు: ఇల్లెందు మున్సిపాలిటీకి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు దక్కింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పురస్కారాలకు ఎంపిక చేసిన మున్సిపాలిటీల్లో హరితహారం పచ్చదనం విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచింది. స్వయం సహాయక సంఘాలు, వీధి వ్యాపారుల అభివృద్ధికి రుణాల పంపిణీలో రెండో స్థానం లభించింది. మూడున్నరేళ్ల కాలంలో అనేక సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధిలో ఇల్లెందు మున్సిపాలిటీ రాష్ట్రంలోనే అగ్రభాగాన నిలిచినట్లు మున్సిపల్ శాఖ గుర్తించింది.
ముఖ్యంగా పట్టణం మధ్య నుంచి ప్రవహిస్తున్న బుగ్గవాగులో పేరుకుపోయిన పూడిక తొలిగించి వర్షాకాలంలో వాగు ఉప్పొంగి ఇళ్లల్లోకి నీరు చేరకుండా చేశారు. బుగ్గవాగును క్లీన్ అండ్ గ్రీన్ చేయడంతో దోమల బెడద తొలిగిపోయింది. కాగా, వరుసగా రెండు సంవత్సరాలు ఉత్తమ అవార్డుకు ఎంపిక కావడం పట్ల పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, హైదరాబాద్‌లోని శిల్పారామంలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు శుక్రవారం అవార్డు అందుకోనున్నారు.
పలు సమస్యలు పరిష్కారం..
కోరగుట్ట భగీరథ ట్యాంక్ నుంచి ఇందిరానగర్, ఫైర్ స్టేషన్, జగదాంబ సెంటర్, కోర్టు ఏరియాల్లో వేసవికాలం మినహా రోజు విడిచి రోజు తాగునీరు అందిస్తున్నారు. మున్సిపాల్టీలో తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించి డంప్‌యార్డుకు చేరుస్తున్నారు. పట్టణంలోని ప్రధాన డ్రెయిన్లను శుభ్రం చేశారు. తద్వారా దుర్వాసన సమస్య పరిష్కారం అయింది. పట్టణంలో పలు చోట్ల ప్రభుత్వ స్థలాలను గుర్తించి ఆక్రమణలు తొలిగించారు. శిథిలావస్థకు చేరిన పురాతన భవనాలను కూల్చేశారు. రైల్వే పట్టాల వెంట గల ఖాళీ స్థలం, పురాతన భవనాలను తొలిగించారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలలను స్వాధీనం చేసుకుని వివిధ మార్కెట్లు, స్ట్రీట్ వెండర్స్ కాంప్లెక్స్‌లు నిర్మించారు.
ఆరు జంక్షన్లలో హైమాస్ట్ లైట్లు..
పట్టణంలోని ప్రధాన రహదారి వెంట, ఆయా బస్తీల్లో ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేసి అంధకార సమస్యను పరిష్కరించారు. ముఖ్యమైన మహబూబాబాద్ క్రాస్‌రోడ్, గోవింద్ సెంటర్, కొత్తబస్టాండ్, బుగ్గవాగు, పాత బస్టాండ్, ప్రభుత్వ ఆస్పత్రి, జగదాంబా సెంటర్లలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుత పాలక వర్గం అధికారంలోకి వచ్చాక పట్టణంలో మోడల్ మార్కెట్, మల్టీయుటిలిటీ సెంటర్, కమ్యూనిటీ హాల్, స్కిల్ డెవలప్ సెంటర్, నర్సరీలు, పబ్లిక్ టాయిలెట్ల వంటి ప్రజావసర పనులు చేశారు.
కేటీఆర్ ప్రోత్పాహంతో ముందడుగు
ఇల్లెందు మున్సిపాలిటీ అభివృద్ధికి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రోత్సాహం, ఎమ్మెల్యే హరిప్రియ, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సహకారం మరువలేనివి. పట్టణాన్ని అన్ని విధాలా అగ్రభాగంలో నిలిపేందుకు పాలక వర్గం కృషి చేస్తోంది. మాతోపాటు కార్మికులు, సిబ్బంది, అధికారుల సమష్టికృషితో ఆక్రమణల తొలగింపు, బుగ్గవాగు క్లీనింగ్, ఆంబజార్ రోడ్ నిర్మాణం.. ఇలా రూ.153 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేస్తున్నాం. ప్రజల సహకారంతో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నాం. – డి.వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment