‘ఇంటి’ దొంగలపై చర్యలకు వెనకడుగు దేనికో?
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎర్రచందనం స్మగ్లర్లకు దన్నుగా నిలుస్తున్న పోలీసు, అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వెనుకడుగు వేయడం వెనుక ఆంతర్యమేమిటనేది అంతుచిక్కడం లేదు. తిరుపతిలో టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీగా పనిచేసిన ఉదయ్‌కుమార్, రాజంపేట డీఎస్పీ రమణపై మాత్రమే గురువారం ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసి మిగిలిన వారిపై చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
శేషాచలం అడవుల్లో విస్తారంగా లభించే ఎర్రచందనం ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించిన విషయం విదితమే. ఇది అంతర్జాతీయ మార్కెట్లో ఎర్రచందనానికి విపరీతమైన డిమాండ్ వచ్చేలా చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఎర్రచందనాన్ని విక్రయించి, సొమ్ము చేసుకోవడమే లక్ష్యంగా చిత్తూరు, వైఎస్‌ఆర్ జిల్లాలకు చెందిన రాజకీయపార్టీల నేతలు, రౌడీషీటర్లు ఎర్రచందనం స్మగ్లర్ల అవతారం ఎత్తారు. ఎర్రచందనం స్మగ్లర్లతో అటు అటవీశాఖలో కొందరు అధికారులు.. ఇటు పోలీసుశాఖలో ఇంకొందరు అధికారులు కుమ్మక్కయ్యారు.
ఇది నిఘా వర్గాల విచారణలో వెల్లడైంది. నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో పోలీసుశాఖలో పనిచేసిన ఓ ఐపీఎస్, ఐదుగురు డీఎస్పీలు, 11 మంది సీఐలు, 18 మంది ఎస్‌ఐలు ఎర్రచందనం దొంగలకు సహకరిస్తున్నట్లు ఏడాది క్రితమే నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదించాయి. ఓ కన్సర్వేటర్, నలుగురు డీఎఫ్‌వోలు, 25 మంది అటవీశాఖ అధికారులు సైతం స్మగ్లర్లకు దన్నుగా నిలుస్తున్నట్లు నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదిక అందించాయి. ఐదు నెలల క్రితం వరకూ చిత్తూరు జిల్లాలో అప్పట్లో ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తోన్న నేత సోదరుడి కనుసైగల మేరకు ఎర్రచందనం స్మగ్లర్లకు ఇద్దరు అటవీశాఖ అధికారులు పైలట్లుగా వ్యవహరించినట్లు నిఘా వర్గాలు పేర్కొనడం గమనార్హం.
అప్పుడూ.. ఇప్పుడూ ఒకటే
ఏడాది క్రితం నిఘా వర్గాల నివేదికపై చర్యలు తీసుకోవాల్సిన అప్పటి కిరణ్ సర్కారు కేవలం పీలేరు సీఐ పార్థసారథి, యర్రావారిపాళెం ఎస్సై వెంకటేష్‌పై సస్పెన్షన్ వేటు వేసి చేతులు దులుపుకుంది. స్మగ్లర్లకు దన్నుగా నిలుస్తున్న పోలీసు, అటవీశాఖ అధికారులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని పదే పదే ప్రకటనలు చేస్తోన్న ప్రస్తుత సీఎం చంద్రబాబు కూడా కిరణ్ బాటలోనే పయనిస్తున్నారు. ఎర్రదొంగలకు సహకరిస్తున్నారనే ఆరోపణలపై రాజంపేట డీఎస్పీ రమణ, తిరుపతి టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీగా పనిచేసిన ఉదయ్‌కుమార్(ప్రస్తుతం సీఐడీ డీఎస్పీ)ను గురువారం ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
తిరుపతి టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీగా పనిచేసిన ఉదయ్‌కుమార్ 1999 నుంచి 2004 వరకూ చంద్రబాబు భద్రత విభాగం ఓఎస్డీగా వ్యవహరించడం గమనార్హం. రాజంపేట డీఎస్పీ రమణ సైతం వైఎస్‌ఆర్ జిల్లాకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధి ఒకరికి అత్యంత సన్నిహితుడని పోలీసువర్గాలు వెల్లడిస్తున్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టడంలో విఫలమవుతున్నారనే విమర్శలను దారి మళ్లించేందుకే ఇద్దరు డీఎస్పీలపై వేటు వేసి చంద్రబాబు చేతులు దులుపుకున్నారనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.
ఎర్రచం‘ధనం’ మాటేంటి బాబూ..
సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి పార్టీ ఫండ్ రూపంలో ఎర్రచందనం స్మగ్లర్లు భారీ ఎత్తున నిధులు సమకూర్చారనే ఆరోపణలు బలంగా వినిపించాయి. ఎర్రచందనం కేసులో అరెస్టై ఇటీవల బెయిల్‌పై విడుదలైన ఓ టీడీపీ ఎర్రచందనం స్మగ్లర్ చిత్తూరు జిల్లాలో ఆపార్టీ సీనియర్ నేతలకు ఎన్నికల ఖర్చుల కోసం రూ.పది కోట్లకుపైగా ముట్టజెప్పినట్లు సమాచారం. ఇందుకు ప్రతిఫలంగా తన ఇలాకాలో సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు ఆ ఎర్రదొంగలకు టీడీపీ సీనియర్ ప్రజాప్రతినిధి తన ఇంటి నుంచి టిఫిన్, భోజనం పంపి కృతజ్ఞత చాటుకున్నారని ఆపార్టీ వర్గాలు వెల్లడించాయి.
వైఎస్‌ఆర్ జిల్లాలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ ప్రజాప్రతినిధి ఎన్నికల ఖర్చుల కోసం ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి భారీ ఎత్తున ఫండ్ వసూలు చేశారని ఆపార్టీ వర్గాలే అనేక సందర్భాల్లో పేర్కొన్నాయి. ఎర్రదొంగలను అణచివేస్తామని చీటికిమాటికీ ప్రకటనలు చేస్తోన్న చంద్రబాబు.. తన పార్టీలో స్మగ్లర్ల నుంచి ఫండ్ తీసుకుని గెలుపొంది, అధికారాన్ని అనుభవిస్తోన్న నేతలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని అధికారవర్గాలు ప్రశ్నిస్తుండటం కొసమెరుపు.