uday kumar
-
‘హియర్ సే ఎవిడెన్స్’ సాక్ష్యంగా చెల్లదు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. హియర్ సే ఎవిడెన్స్ (నాకు మరొకరు చెప్పారని సాక్ష్యం చెప్పడం) చట్ట ప్రకారం సాక్ష్యంగా చెల్లదని, గూగుల్ టేక్ అవుట్ ప్రామాణికమని ఆ సంస్థే ధ్రువీకరణ ఇవ్వదని భాస్కర్‌రెడ్డి, ఉదయ్కుమారెడ్డి తరపు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్ రెడ్డి కోర్టుకు నివేదించారు. అలాంటి సాక్ష్యాలతో అరెస్టు సమర్థనీయం కాదని చెప్పారు. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు పక్షపాత వైఖరితో సాగుతోందని, కావాలనే ఈ కేసులో తమను ఇరికించారని, తమకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యం లేదని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘మూడో చార్జీషీట్ (ఈ కేసులో 2వ మధ్యంతర చార్జిషీట్) దాఖలు చేసే వరకు పిటిషనర్లపై ఎలాంటి ఆరోపణలు లేవు. ఆ తర్వాత నిందితులుగా చేర్చడంలో కుట్ర కోణం దాగి ఉంది. అవినాశ్‌రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన వారు కిరాయి హంతకుడు దస్తగిరి (ఏ–4) యథేచ్ఛగా తిరగడానికి మాత్రం పూర్తిగా సహకరిస్తున్నారు. హత్య వెనుక భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్ ఉన్నారని గంగిరెడ్డి తనకు చెప్పారంటూ దస్తగిరి వాంగ్మూలం ఇవ్వగా.., గంగిరెడ్డి మాత్రం తాను అలా చెప్పలేదని స్పష్టం చేశారు. దస్తగిరి చెప్పిన విషయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న సీబీఐ.. ఇతరుల వాంగ్మూలాలను మాత్రం పట్టించుకోవడం లేదు’ అని పేర్కొన్నారు. ‘రెండున్నర నెలలు ఢిల్లీలో సీబీఐ కస్టడీలో ఉన్నానని దస్తగిరి చెప్పాడు. ఆ తర్వాతే అప్రూవర్‌గా మారి పిటిషనర్ల పేర్లు చెప్పాడు. దస్తగిరి బెయిల్‌కు సీబీఐ పూర్తిగా సహకరించింది. నాటి దర్యాప్తు అధికారి రాంసింగ్‌పై తీవ్ర ఆరోపణలున్నాయి. ఆయనపై సుప్రీం కోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. దీంతో అత్యున్నత న్యాయస్థానం కేసు దర్యాప్తు బాధ్యత నుంచి ఆయన్ని తప్పించి, మరొకరిని నియమించింది. హత్య జరిగిన రోజున అవినాశ్‌రెడ్డికి భాస్కర్‌రెడ్డి ఫోన్ చేయడాన్ని కూడా సీబీఐ కుట్ర కోణంగా పేర్కొనడం సమంజసం కాదు. తండ్రి కుమారుడికి ఫోన్ చేయడం కూడా కుట్రేనా? కావాలనే ట్రయల్ కోర్టులో విచారణను సీబీఐ సాగదీస్తోంది. ముఖ్యంగా నాలుగు అంశాలను ఇక్కడ పరిశీలించాలి. ఇందులో మొదటిది పిటిషనర్లపై ఉన్నది ఆరోపణలు మాత్రమే. వాటికి సాక్ష్యాలు లేవు. రెండోది భాస్కర్‌రెడ్డి వయస్సు. ఆయన వయస్సు దాదాపు 72 ఏళ్లు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడం మూడో అంశం. ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన ట్రయల్ కోర్టు పలుమార్లు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. ఆయనకు అత్యవసరమైతే 30 నిమిషాల్లో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణకు చేర్చాలి. జైలులో ఉంటే అది సాధ్యం కాదు. ఆయనకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? నాలుగోది ఆయన్ని అరెస్టు చేసి సంవత్సరమయ్యింది. ఏడాదిగా జైలులో ఉంటున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని భాస్కర్‌రెడ్డితోపాటు ఉదయ్‌కుమార్‌కు బెయిల్ మంజూరు చేయాలి. ఇదే హైకోర్టు శివశంకర్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. అదే వీరికి కూడా వర్తిస్తుంది. సరైన సాక్ష్యాలు లేనప్పుడు నెలల తరబడి నిందితుల పేరుతో జైలులో ఉంచడం వారి హక్కులను హరించడం కిందకే వస్తుందని సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పింది’ అని నిరంజన్‌రెడ్డి వాదించారు. అనంతరం సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. బెయిల్ పిటిషన్లపై తీర్పు రిజర్వు చేశారు. -
చెంచుల చెంతకు అధికారులు
అమ్రాబాద్: నల్లమల అటవీ పరిధిలోని చెంచు పెంటల చెంతకు అధికార యంత్రాంగం తరలివచ్చింది. చెంచులకు విద్య, వైద్యం అందని ద్రాక్షగా మారింది.ఆరు నెలలుగా గిరిపోషణ ముందుకు సాగడం లేదు. చిన్నపిల్లల నుంచి బాలింతల వరకు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. వారి వెతలకు ‘సాక్షి’ అక్షరరూపం ఇస్తూ ‘అడవే చెంచులకు అమ్మ’ శీర్షికన బుధవారం కథనం ప్రచురించింది. దీనిపై నాగర్‌కర్నూల్ కలెక్టర్ ఉదయ్ కుమార్ స్పందించారు. చెంచు పెంటలను క్రమం తప్పకుండా సందర్శించి, వారికి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఇన్చార్జ్ డీఎల్పీఓ వెంకటయ్య, పీఆర్ ఏఈ రుక్మాంగధ అమ్రాబాద్ మండలంలోని కొమ్మెనపెంట, కొల్లంపెంటను çసందర్శించారు. చెంచు కుటుంబాల బాధలను అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ డీఎల్పీఓ వెంకటయ్య మాట్లాడుతూ చెంచు కుటుంబాల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని, వారికి కావాల్సిన వసతులు, వారి అవసరాలను గుర్తించి కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామని చెప్పారు. ప్రధాన మంత్రి జన్మన్ కార్యక్రమంలో భాగంగా అటవీ ప్రాంతంలో ఉండే కొల్లంపెంట, కొమ్మెనపెంటలకు కనీస రవాణా సౌకర్యం కోసం 11.30 కిలోమీటర్ల మేర రోడ్డు మర మ్మతులు చేపడతామన్నారు. ఐటీ డీఏ ఆధ్వర్యంలో నిర్మించనున్న అంగన్వాడీ భవన నిర్మాణానికి స్థలం ఖరారు చెప్పారు. వారి వెంట ఎంపీడీఓ రామ్మోహన్, కార్యదర్శి మల్లేష్, ఉపాధి హామీ పథకం ఈసీ రేణయ్య, టీఏ అంజనేయులు తదితరులు ఉన్నారు. -
వస్తున్నాయ్.. సత్యదేవుని కొత్త రథాలు
అన్నవరం: రత్నగిరి వాసుడైన సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతిదేవి కోసం కొత్త రథాలు సిద్ధమవుతున్నాయి. రూ.1.42 కోట్ల వ్యయంతో నాణ్యమైన బస్తరు టేకుతో ఈ రెండు రథాలను అన్నవరం దేవస్థానం తయారు చేయిస్తోంది. వీటిలో రూ.34 లక్షలతో నిర్మించిన చిన్నరథం స్వామి, అమ్మవార్ల ఊరేగింపునకు సిద్ధమైంది. దీనికి వెండి రేకు తాపడం చేసేందుకు దాతల కోసం దేవస్థానం అన్వేషిస్తోంది. మరోవైపు రూ.1.08 కోట్లతో నిర్మిస్తున్న పెద్ద రథం పనులు చురుగ్గా జరుగుతున్నాయి. మరో మూడు నెలల్లో ఈ రథం కూడా సిద్ధమవుతుందని చెబుతున్నారు. చురుగ్గా పెద్ద రథం పనులు ♦ రూ.1.08 కోట్లతో పెద్ద రథం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ♦ దీని ఎత్తు 33.9 అడుగులు, వెడల్పు 14 అడుగులు, పొడవు 23.5 అడుగులు. ♦ ఈ రథంపై వివిధ లతలు, దేవతామూర్తుల చిత్రాలు, వివిధ డిజైన్లు చెక్కుతున్నారు. ♦ పెద్ద రథం పీఠం నిర్మాణ పనుల్లో శిల్పులు నిమగ్నమయ్యారు. పెద్ద రథానికి సంబంధించి స్తంభాలు సైతం చెక్కుతున్నారు. ♦ సత్యదేవునికి ఇప్పటికే రెండు రథాలున్నాయి. వీటిలో ఒకటి వెండి రథం కాగా.. మరొకటి వైశాఖ మాసంలో జరిగే వార్షిక కల్యాణ మహోత్సవాల్లో మూడో రోజు స్వామి, అమ్మవార్లను ఊరేగించే రావణ బ్రహ్మ వాహనం. వెండి రథం శిథిలావస్థకు చేరింది. ♦ కొత్త రథం తయారు చేయించాలన్న ప్రతిపాదన పదేళ్లుగా ఉన్నా వివిధ కారణాలతో అధికారులు సాహసించలేదు. ♦ వెండి, బంగారం పనులు చేయించేటప్పుడు పలు సమస్యలు ఉత్పన్నమవుతాయని వెనుకంజ వేశారు.అయితే.. గత ఈవో చంద్రశేఖర్ ఆజాద్ నూతన రథం తయారీకి ఉపక్రమించారు. ♦ వెండి రథంతోపాటు స్వామి, అమ్మవార్లను కొండ దిగువన ఊరేగించేందుకు పెద్ద రథం కూడా తయారు చేయాలని నిర్ణయించారు. ♦ పాలకవర్గం ఆమోదంతో వీటి తయారీకు గత ఈవో ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ ఆగస్ట్ నెలలో టెండర్లు పిలిచారు. ♦ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మురమళ్లకు చెందిన శ్రీమాణిక్యాంబ శిల్పకళ వుడ్ వర్క్స్ అధినేతలు కొల్లాటి కామేశ్వరరావు, కొల్లాటి శ్రీనివాస్ ఈ పనులను దక్కించుకున్నారు. సిద్ధమైన చిన్న రథం ♦ చిన్న రథం నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. ఈ రథం ఎత్తు 14 అడుగులు, వెడల్పు 6.3 అడుగులు, పొడవు 7.5 అడుగులు ఉంది. నాలుగు స్తంభాలపై శిఖరం వస్తుంది. నాలుగు చక్రాల మీద అందమైన లతలు చెక్కారు. ♦ రథం మీద దేవతామూర్తుల చిత్రాలతో పాటు పలు ఆకర్షణీయమైన డిజైన్లు చిత్రీకరించనున్నారు. ముందు భాగంలో రెండు గుర్రాలను అమర్చారు. ♦ దీనిని టేకుతో తయారు చేయడానికి రూ.34 లక్షలు అవుతుండగా.. వెండి రేకు తాపడానికి సుమారు 300 కిలోల వెండి అవసరం కానుంది. దాతల సహకారంతో వెండి తాపడం చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. చిన్న రథం నిర్మాణం బాగుంది చిన్న రథం నిర్మాణం పూర్తయింది. చాలా బాగుంది. ఈవో కె.రామచంద్ర మోహన్ దీనిని పరిశీలించిన అనంతరం ట్రయల్ రన్ వేస్తాం. అనంతరం దీనిని స్వామివారి సేవలో ఎప్పుడు ఉపయోగించాలో ఈవో పండితులు, నిర్ణయిస్తారు. – ఉదయ్ కుమార్, డీఈ, అన్నవరం దేవస్థానం -
వివేకా హత్య కేసు: దోషులని నిర్ణయించుకుని.. అదే లక్ష్యంగా దర్యాప్తు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కొందరిని దోషులుగా నిర్ణయించుకుని, అదే లక్ష్యంగా దర్యాప్తు చేస్తోంది తప్ప.. అసలు నేరస్థులను పట్టుకునే ప్రయత్నం చేయడంలేదని మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్టయిన వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌ల న్యాయవాదులు సీబీఐ కోర్టులో వాదనలు వినిపించారు. వాదనలు విన్న సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి సీహెచ్ రమేశ్‌బాబు తీర్పును మంగళవారానికి వాయిదా వేశారు. భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్ కస్టడీ పిటిషన్‌తో పాటు ఉదయ్‌కుమార్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సోమవారం కోర్టులో వాదనలు జరిగాయి. భాస్కర్‌రెడ్డి తరఫున ఉమామహేశ్వర్, ఉదయ్ తరఫున రవీందర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘ఏ–4 (దస్తగిరి) చెప్పాడని వైఎస్ భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేశారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల నాటి నుంచి భాస్కర్‌రెడ్డి, అవినాశ్, శివశంకర్‌రెడ్డితో వివేకాకు విభేదాలున్నాయని పేర్కొన్నారు. హత్య కోసం రూ.40 కోట్లకు ఒప్పందం కుదిరిందని, రూ.కోటి ఇచ్చారని చెప్పారు. ఈ ఆరోపణలకు ఎలాంటి సాక్ష్యాలు లేవు. రిమాండ్ పిటిషన్‌లోని సబ్జెక్ట్‌ను మార్చి కస్టడీ పిటిషన్‌గా వేశారు. దీనిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌ను పాటించకుండా ఇష్టం వచ్చినట్లు పిటిషన్ దాఖలు చేశారు. ఒక్క కస్టడీ అన్న పదం తప్ప రెండు పిటిషన్లు ఒక్కటే. 75 ఏళ్ల వృద్ధుడైన భాస్కర్‌రెడ్డిని పలుమార్లు విచారణకు పిలిచారు. విచారణలో ఏం అడిగారు, ఆయన ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పలేదో తెలపకుండా.. సహకరించలేదని అనడం సరికాదు. సీబీఐ కోరుకున్న విధంగా ఆయన సమాధానాలు వెల్లడించరు. అలాగే సీబీఐ దాఖలు చేసిన రెండు చార్జీషీట్లలోనూ భాస్కర్‌రెడ్డి ప్రస్తావన కూడా లేదు. ఇష్టం వచ్చినట్లు అరెస్టు చేసి నిందితుల జాబితాలో చేరుస్తున్నారు. ఇంకా ఎంత మందిని కోర్టు అనుమతి లేకుండా ఇలా చేరుస్తారో తెలియదు. సాక్షులు ఎవరన్నది కూడా పిటిషన్లో లేదు. తప్పుడు సాక్ష్యాలు సృష్టించి కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. భాస్కర్‌రెడ్డి వెన్నెముకకు సర్జరీ జరిగింది. చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు. భాస్కర్‌రెడ్డి కస్టడీ పిటిషన్‌ను కొట్టివేయాలి’ అని ఉమామహేశ్వర్ వాదించారు. అరెస్టులతో హడావుడి ‘ఉదయ్‌కుమార్‌ను ఏ నేరం కింద అరెస్టు చేశారో సీబీఐ ఎక్కడా చెప్పలేదు. సీఆర్పీసీ 173 ప్రకారం.. కోర్టు అనుమతి తీసుకున్న తర్వాతే ఏ–6 (ఉదయ్‌కుమార్), ఏ–7 (వైఎస్ భాస్కర్‌రెడ్డి)లను నిందితులుగా పేర్కొనాలి. కానీ కోర్టు నుంచి సీబీఐ ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ఏ–6పై నమోదు చేసిన అన్ని సెక్షన్లు బెయిల్ ఇచ్చేవే. ఇప్పటికి 22 సార్లు సీబీఐ ఉదయ్‌కుమార్‌ను విచారించింది. అతని మొబైల్ తీసుకున్న అధికారులు రసీదు కూడా ఇవ్వలేదు. ఇన్నిసార్లు విచారణ జరిపి.. ఇంకా సహకరించలేదనడం హాస్యాస్పదం. తెలియని ప్రశ్నలకు సమా«దానం చెప్పకపోవడం అతని హక్కు. సీబీఐ మూడేళ్లుగా విచారణ చేస్తున్నా రెండు చార్జిషీట్లు వేయడం తప్ప సాధించిన పురోగతి లేదు. సుప్రీంకోర్టు ఆదేశించిన గడువు దగ్గరపడుతుండటంతో అరెస్టులు చేస్తున్నారు తప్ప ఆధారాలను సేకరించడంలేదు. చట్టాలను పాటించడం లేదు. సీబీఐ విచారణాధికారి రాంసింగ్‌పై ఉదయ్ ఫిర్యాదు చేశారు. ఈ కేసు ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. చదవండి: దస్తగిరితో డ్రామా! అప్రూవర్ వాంగ్మూలం ఉత్త కథే ఉదయ్‌ను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఆయనపై మోపినవి నాన్–కాగ్నిజబుల్ నేరాలే. దీన్ని పరిగణనలోకి తీసుకుని ఉదయ్‌కి బెయిల్ ఇవ్వాలి’ అని రవీందర్‌రెడ్డి కోరారు. ‘2017 ఎమ్మెల్సీ ఎన్నికల నాటి నుంచి వివేకాతో వైఎస్ భాస్కర్‌రెడ్డికి, శివశంకర్‌రెడ్డికి పలు విభేదాలు ఉన్నాయి. 2017లో ఎమ్మెల్సీగా పోటీ చేసిన వివేకా ఓడిపోయారు. ఈ ఓటమికి భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి కారణమని వివేకా తీవ్ర ఆగ్రహంతో ఉండేవారు. హత్య చేసిన వారు కూడా భాస్కర్‌రెడ్డికి, శివశంకర్‌రెడ్డికి అత్యంత సన్నిహితులు’ అని సీబీఐ పీపీ వాదనలు వినిపించారు. -
ప్రపంచాన్ని మెప్పించిన పాతికేళ్ల కుర్రాడు.. కడప బాహుబలి
కడప, స్పోర్ట్స్ : కడప నగరానికి చెందిన పాతికేళ్ల కుర్రాడు ప్రపంచాన్ని మెప్పించాడు. ధనుర్విద్యతో యావత్ భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేకమంది అభిమానాన్ని చూరగొన్నాడు. బాహుబలిలా ధనుస్సు చేతబట్టి ఏకకాలంలో విభిన్న లక్ష్యాలను ఛేదిస్తూ కడప బాహుబలిగా పేరుప్రఖ్యాతులు సాధిస్తున్నాడు. ఇటీవల ఓ ప్రైవేట్ టెలివిజన్ చానల్ నిర్వహించిన ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ రియాలిటీ షోలో పాల్గొని ఈయన చేసిన ప్రదర్శనకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. ఏకకాలంలో రెండు బాణాలతో రెండు విభిన్న లక్ష్యాలను చేధించడంతో పాటు కదిలే లక్ష్యాన్ని ఛేదించి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశాడు. కష్టాల కడలిని ఈదుతూ.. కడప నగరానికి చెందిన దివంగత శ్రీనివాసులు, విజయ దంపతుల కుమారుడు వర్ధి ఉదయ్‌కుమార్. 2009లో తండ్రి చనిపోవడంతో తల్లి చేపట్టిన చిరువ్యాపారం(సోడా తయారీ)లో చేదోడు వాదోడుగా ఉండేవాడు. కష్టాలెన్ని ఎదురైనా వెరవలేదు. చిన్నప్పటి నుంచి వివిధ క్రీడల పట్ల మక్కువ పెంచుకున్నాడు. 2007లో మార్షల్‌ఆర్ట్స్‌లో శిక్షణ ప్రారంభించిన ఉదయ్‌కుమార్ 2011లో నేపాల్‌లో నిర్వహించిన అంతర్జాతీయస్థాయి కుంగ్‌ఫూ పోటీల్లో తొలి అంతర్జాతీయ పతకం(కాంస్యం) సాధించాడు. అదే యేడాది చెన్నైకి వెళ్లి అక్కడ వాసుదేవన్ ఆధ్వర్యంలో ఆర్చరీలో శిక్షణ పొందాడు. అనంతరం వారానికి రెండురోజులు చెన్నైలో, మిగతా రోజులు కడపలో ప్రాక్టీస్ చేసుకోవడం ప్రారంభించాడు. View this post on Instagram A post shared by Vardi Uday Kumar (@vardi_uday_kumar) 2015లో ముంబైలో నిర్వహించిన మేయర్ కప్ ఆర్చరీ పోటీల్లో కాంస్యపతకం సాధించాడు. చెన్నైలో నిర్వహించిన స్పీడ్ ఆర్చరీ టార్గెట్స్ కాంపిటీషన్లో పాల్గొని 2018లో ఏషియా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నాడు. తాను నేర్చుకున్న విద్యను పదిమందికి పంచాలన్న ఉద్దేశంతో తన తల్లి పేరు మీద కడప నగరంలో విజయాస్ ఆర్చరీ అకాడమీని ఏర్పాటు చేశాడు. చాలామందిని జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాడు. దీంతో పాటు ఏపీ ఫీల్డ్ ఆర్చరీ అసోసియేషన్‌ను ఏర్పాటు చేసి వ్యవస్థాపక కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాడు. దీంతో పాటు 2018లో ఇంటర్నేషనల్ ఫీల్డ్ ఆర్చరీ అసోసియేషన్ వారు నిర్వహించిన లెవల్–2 కోచ్‌గా ఉత్తీర్ణత సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు క్రీడాకారుడు ఈయనే కావడం విశేషం. ఇటీవలే ‘ఉషు’ క్రీడలో సైతం పాటియాలలోని ఎన్ఐఎస్ శిక్షణ కేంద్రంలో 6 వారాల శిక్షణ పూర్తి చేసి శిక్షకుడుగా మారాడు. వెదుక్కుంటూ వచ్చిన అవకాశం కోవిడ్ సమయంలో లాక్డౌన్ కారణంగా క్రీడాశిక్షణ ఆగిపోవడంతో, తనకు తెలిసిన విద్యలను సాధన చేసుకుంటూ వాటి వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. వీటిని పరిశీలించిన సోనీ టెలివిజన్ బృందం గతేడాది నవంబర్‌లో రియాలిటీషో కోసం ఆడిషన్స్‌కు రావాలని ఆహ్వానించారు. ముంబైలోని యశ్‌చోప్రా స్టూడియోలో నిర్వహించిన ఆడిషన్స్‌లో ఈయన ప్రతిభను పరిశీలించిన నిర్వాహకులు రియాల్టీషోకు ఎంపికచేశారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 5న ప్రసారమైన ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ రియాలిటీ షోలో ఈయన పాల్గొని ధనుర్విద్యలో తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించాడు. కదిలే తెరపై ఉన్న లక్ష్యాలను ఛేదించడం, ఎదురుగా ఉన్న వేర్వేరు టార్గెట్లను ఏకకాలంలో రెండు బాణాలతో ఛేదించడంతో నిర్వాహకులు, న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన బాలీవుడ్ ప్రముఖులు శిల్పాశెట్టి, బాద్షా, మనోజ్, కిరణ్ఖేర్లు ఆశ్చర్యానికి లోనయ్యారు. షోలో అద్భుత ప్రదర్శన కనబరచడంతో తదుపరి రౌండ్‌కు నిర్వాహకులు ఎంపికచేశారు. తదుపరి రౌండ్లో భారతంలో అర్జునుడు చేధించిన మత్స్యయంత్రం తరహా లక్ష్యాలను చేధించడం, ఏకకాలంలో 5 లక్ష్యాలను ఛేదించడం వంటి అంశాలు ఉండే అవకాశం ఉందని ఉదయ్‌కుమార్ తెలిపాడు. గతంలో 7 లక్ష్యాలను ఛేదించడం కూడా సాధన చేశానని, అయితే షో కోసం ప్రస్తుతానికి 5 లక్ష్యాల పైనే దృష్టిసారిస్తున్నానని తెలిపారు. జర్మనీకి చెందిన హెన్నిక్ ఓంకార్ మార్గదర్శనంలో ధనుర్విద్యపై మరింత పరిశోధన చేస్తున్నానని తెలిపాడు. అలాగే త్వరలో అమెరికాలో నిర్వహించనున్న మరో రియాల్టీ షో కోసం సన్నద్ధం అవుతున్నట్లు ఉదయ్‌కుమార్ తెలిపాడు. 1Arrow | moving two balloons | one shot |#vardiudaykumar #dhanurvidya #Archery #indianarchery pic.twitter.com/mYiYRGK1pH — Vardi Uday Kumar (@UdayVardi) February 12, 2022 -
ఆలోచింపజేస్తోంది
ఈశ్వర్ హీరోగా టువ చక్రవర్తి, అంకిత మహారాణా హీరోయిన్లుగా ఆర్.రఘురాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘4 లెటర్స్’. ఓం శ్రీచక్ర క్రియేషన్స్ బ్యానర్‌పై దొమ్మరాజు ఆశాలత, దొమ్మరాజు ఉదయ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదలైంది. హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రదర్శితమవుతున్న పలు థియేటర్లను చిత్రబృందం సందర్శించింది. అదేవిధంగా సెయింట్ మేరీస్ ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్‌తో చిత్రవిజయాన్ని పంచుకున్నారు. ‘‘నేటితరం ప్రేమకథా చిత్రంగా రుపొందిన ‘4 లెటర్స్’ యువతకు ఎంతగానో నచ్చింది. ప్రధానంగా హీరో కళాశాల ప్రొఫెసర్ల గురించి గొప్పగా, గౌరవంగా మాట్లాడే సన్నివేశాలు, ప్రేమ–పెళ్లి నేపథ్యంలో సాగే పతాక సన్నివేశాలతో పాటు కళాశాలలో జరిగే సన్నివేశాలలోని వినోదం ప్రేక్షకులను అలరిస్తున్నాయి. విద్యా బుద్ధులు నేర్పించిన గురువులకు విద్యార్థులు అండగా నిలవాలన్న సందేశం యువతను ఆలోచించేలా చేస్తోంది. ఇదే చిత్ర విజయానికి సంకేతం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
అన్నదాతకు కన్నీళ్లే
► వర్దాతో భారీగా పంటనష్టం ► 28వేల హెక్టార్లలో దెబ్బతిన్న పంట ► త్వరలో సాయం ► మృతుల కుంటుంబాలకు రూ.4 లక్షలు ► మరో గండం వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం ► రెవెన్యూ మంత్రి ఆర్బీ.ఉదయకుమార్ ► ముందస్తు చర్యలతో తగ్గిన ప్రాణనష్టం సాక్షి, చెన్నై : అసలే తీవ్ర కష్టాల్లో ఉన్న అన్నదాతను వర్దా మరింతగా దెబ్బతీసింది. మూడు జిల్లాల్లోని రైతులకు కన్నీళ్లు మిగిల్చే రీతిలో వర్దా విలయతాండవం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల మేరకు 28 వేల హెక్టార్లలో పంటనష్టం జరిగింది. త్వరలో బాధితులకు సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కాగా, మరో గండం ముంచుకొస్తోందన్న ఆందోళన వద్దని, ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు ముందస్తుగానే సిద్ధం చేశామని ప్రకటించింది. తాజాగా తీసుకున్న ముందస్తు చర్యలతో పెను ప్రాణనష్టం తప్పినట్టు తెలిపింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో ని అన్నదాతలు పంట సాగును పక్కనబెట్టి వలసబాట పట్టాల్సిన పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. కొందరు రైతులు సాహసం చేస్తుండగా, మరి కొందరు బతుకు బండి లాగించేందుకు పొలం బాట పడుతున్నారు. డెల్టా అన్నదాతలు కావేరి నీళ్లు అందక తీవ్ర కష్టాల్లో ఉంటే, దక్షిణాది, కొంగు మండలం రైతులు వర్షాలు కరువై కన్నీటి మడుగులో మునిగారు. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లోని రైతులను వర్దా ముంచేసిందని చెప్పవచ్చు. ఏ మేరకు పంటనష్టం జరిగిందో ఆ వివరాలు ప్రభుత్వం గుప్పెట్లోకి చేరడం బట్టి చూస్తే, ఏ మేరకు అన్నదాతలు విలవిల్లాడాల్సిన పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. 28 వేల హెక్టార్లలో పంటనష్టం: సోమవారం ఎళిలగంలో రెవెన్యూ మంత్రి ఆర్బీ.ఉదయకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. వర్దా రూపంలో చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో ఏ మేరకు పంటనష్టం జరిగిందో వివరాలను సేకరించినట్టు తెలిపారు. మొత్తం 28 వేల హెక్టార్లలో పంటనష్టం జరిగిందని, రైతు లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అందరికీ త్వరలో నష్ట పరిహారం అందిస్తామన్నారు. 529 పశువులు, 299 మేకలు, 33 వేల కోళ్లు వర్దా ధాటికి మరణించాయని వివరించారు. 70 వేల గుడిసెలు దెబ్బతిన్నాయని, విద్యుత్ సరఫరాను పూర్తిస్థాయిలో అందించేందుకు ముమ్మరంగా చర్యలు సాగుతున్నాయన్నారు. ఆరుగురు మంత్రులు స్వయంగా పనుల్ని పర్యవేక్షిçస్తున్నారని వివరించారు. మరో గండాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధం వర్దా ముప్పును ముందే గుర్తించి, ముందస్తుగా తీసుకున్న చర్యలతో పెను ప్రాణనష్టం తప్పినట్టు రెవెన్యూ శాఖ మంత్రి ఆర్బీ.ఉదయకుమార్ పేర్కొన్నారు. ఈ ధాటికి 24 మంది మరణించారని, ఈ కుటుంబాలను ఆదుకునేందుకు తలా రూ.4 లక్షలు చొప్పున సాయాన్ని ఇప్పటికే ప్రకటించామన్నారు. బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడిందని గుర్తుచేశారు. దీని గురించి ఆందోళన వద్దని ప్రజలకు భరోసా ఇచ్చారు. మరో తుపాను ముప్పు తప్పదన్నట్టుగా ప్రచారం జరుగుతోందని, దీనిపై ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మరో గండం ముంచుకొచ్చినా ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలను ప్రభుత్వం సిద్ధం చేసిందని ధీమా వ్యక్తం చేశారు. సీఎంకు సహకారం సీఎం పన్నీరు సెల్వంకు తాను పూర్తి సహకారం అందిస్తున్నానని, ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు ఆర్బీ ఉదయకుమార్ సమాధానమిచ్చారు. పార్టీలోనూ, అధికారంలోనూ ఒకరే నేతృత్వం వహిస్తే, ఎలాంటి విమర్శలు, ఆరోపణలు, అపోహలకు తావు ఉండదన్నదే తన అభిమతంగా వ్యాఖ్యానించారు. సీఎం పన్నీరు సెల్వం అమ్మ జయలలితకు, అన్నాడీఎంకేకు విశ్వాసపాత్రుడు అని, ఆయన నుంచి విశ్వాసం నేర్చుకున్నానని పేర్కొన్నారు. -
పోస్టుమార్టం నివేదిక రాకుండానే కేసు మూసేస్తారా?
♦ నా భర్త సూసైడ్‌నోట్‌లో పేర్కొన్న వారందరినీ విచారించాలి ♦ ‘సాక్షి’తో కన్నీళ్ల పర్యంతమైన డాక్టర్ శశికుమార్ భార్య కాంతి సాక్షి, హైదరాబాద్: ఇరవై ఏళ్ల వైవాహిక జీవితం వారిది. ఒక కుమార్తె. ఒక కుమారుడు. పిల్లలు చాలా చలాకీగా చదువుతున్నారు. వృత్తిపరంగా కాసులకు కొదవలేదు. జీవితం సాఫీగా సాగిపోతోంది. ఇంతలోనే ఊహించని పరిణామం. అన్నీ తానై చూసుకుంటున్న అతను చనిపోయాడనే వార్త ఆ కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. హిమాయత్‌నగర్‌లో డాక్టర్ శశికుమార్ తోటి డాక్టర్ ఉదయ్‌కుమార్‌పై కాల్పులు జరపడం, అదే రాత్రి మొయినాబాద్‌లో తన స్నేహితురాలి ఫామ్‌హౌస్‌లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అసలేమి జరిగిందో తెలియక అంతులేని ఆవేదనలో శశికుమార్ భార్య కాంతి కుంగిపోయారు. తన భర్త మరణంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలని కన్నీళ్ల పర్యంతమయ్యారు. తన భర్త మరణంపై ఆమె మనసులో ముసురుకున్న అనుమానాలను ప్రపంచం ముందుకు తెచ్చే ప్రయత్నం చేసింది ‘సాక్షి’. ‘ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. అయితే నా భర్తకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే మీ ద్వారా నా ప్రశ్నలను అడగాలనుకుంటున్నా’నని ఆమె బాధాతప్త హృదయంతో మాట్లాడారు. హైదరాబాద్ చైతన్యపురి ప్రభాత్నగర్లోని తమ నివాసంలో ఆమె ‘సాక్షి’ మీడియాతో మాట్లాడారు. పోస్టుమార్టం నివేదిక రాకుండానే పోలీసులు కేసు మూస్తామని చెబుతుండటం బాధిస్తోందన్నారు. ఆయన వెంట తీసుకెళ్లిన కారు, బ్రీఫ్ కేసు జాడ ఇంకా తెలియలేదని చెప్పారు. బ్రీఫ్ కేసులో ఆయన సంతకం చేసిన చెక్‌బుక్ లీఫ్లు, ముఖ్యమైన ప్రొఫెషనల్ డాక్యుమెంట్లు ఉన్నాయన్నారు. ఆయన సూసైడ్ నోట్లో సాయికుమార్, ఓబుల్‌రెడ్డి, రమణారావు, చెన్నారెడ్డి, కేకే రెడ్డిలను శిక్షించాలని రాసిన దాని గురించి పోలీసులు పట్టించుకోవడం లేదని వాపోయారు. మానసిక ఆందోళనకు గురయ్యారు లారెల్ హాస్పిటల్స్ విషయంలో రెండు నెలల నుంచి ఉదయ్, సాయికుమార్‌ల వల్ల శశికుమార్ తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారని, తిండి కూడా సరిగా తినలేదని ఆమె చెప్పారు. ‘సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు వారి వద్ద నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. హిమాయత్‌నగర్‌కి రమ్మని చెప్పారు. అప్పుడు ఆయన మొహంలో ఆందోళన కనిపించింది. ఆయనతో మాట్లాడదామని అనుకునేలోపు వెళ్తున్నా అని బ్రీఫ్ కేసు పట్టుకొని కారులో బయలుదేరి వెళ్లారు. అయితే సాయంత్రం 5.30 గంటల సమయంలో హిమాయత్‌నగర్‌లో కాల్పులు జరిగాయన్న విషయం తెలిసింది. మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటలకి శశికుమార్ చనిపోయాడన్న విషయం తెలవడంతో అందరం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాం’ అని ఆమె పేర్కొన్నారు. మానసికంగా చాలా ఆందోళనకు గురవుతున్న శశికుమార్‌ది ఎదుటివాళ్లను చంపాలనే మనస్తత్వం ఎంతమాత్రం కాదన్నారు. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కూడా కాదని కాంతి చెప్పారు. మొయినాబాద్ నక్కలపల్లిలోని ఫాంహౌస్‌కు శశికుమార్‌ను తీసుకెళ్లిందని మీడియాలో వస్తున్న వార్తల్లో కనిపిస్తున్న చంద్రకళ.. తన భర్త స్నేహితురాలిగా మాత్రమే తెలుసన్నారు. ఆత్మరక్షణ కోసమే రివాల్వర్ వెంట పెట్టుకునేవారని చెప్పారు. -
ఎవరి పాత్ర ఏంటి?
ముమ్మరంగా ‘డాక్టర్ కాల్పుల’ కేసు దర్యాప్తు ♦ సెల్‌ఫోన్ లొకేషన్లు, హోటల్ సీసీ కెమెరాల్లోని దృశ్యాల విశ్లేషణ ♦ సూసైడ్ నోట్, వేలిముద్రలు, తూటాలు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు.. ♦ హోటల్ వద్ద శశికుమార్ కారు స్వాధీనం.. సాక్షి, హైదరాబాద్: ఉదయ్‌కుమార్, సాయికుమార్‌తోపాటు ఉన్న సూసైడ్‌నోట్‌లో ఉన్న ఇతర పేర్లు ఎవరివి..? వారితో శశికుమార్‌కు ఉన్న లావాదేవీలు ఏంటి..? ఆత్మహత్యకు ప్రేరేపించడంతో వారి పాత్ర ఉందా..? డాక్టర్ కాల్పుల కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ అంశాలపై దృష్టి సారించారు. సాంకేతిక అంశాలే ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశా రు. డాక్టర్ల సెల్‌ఫోన్ లోకేషన్లు, హోటల్లోని సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను విశ్లేషిస్తున్నారు. వైద్యుల వేలిముద్రలు, శశికుమార్ రాసిన సూసైడ్ నోట్, తూటాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నారు. హిమాయత్‌నగర్‌లో సోమవారం డాక్టర్ శశికుమార్ తోటి డాక్టర్ ఉదయ్‌కుమార్‌పై కాల్పులు జరపడం, అదే రాత్రి మొయినాబాద్‌లో తన స్నేహితురాలి ఫామ్‌హౌస్‌లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఉదయ్‌పై హత్యాయత్నం కేసును నారాయణగూడ పోలీసులు, శశి ఆత్మహత్య కేసును మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరిపింది తాను కాదని సూసైడ్ లేఖలో శశికుమార్ పేర్కొనడం, తన భర్తను హత్య చేశారని ఆయన భార్య కాంతి ఆరోపించిన నేపథ్యంలో మొయినాబాద్ పోలీ సులు ప్రాథమికంగా దీన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ఆత్మహత్య స్థలంలో దొరికిన రివాల్వర్‌పై వేలి ముద్రలు శశివేనా కాదా నిర్ధారించుకునేందుకు ల్యాబ్‌కు పంపారు. సూసైడ్ నోట్లో చేతి రాత శశికుమార్దేనని ప్రాథమికంగా భావిస్తున్నా.. అధికారికంగా ధ్రువీకరించుకునేందుకు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపుతున్నారు. హోటల్ వద్ద కారు స్వాధీనం... సోమవారం మధ్యాహ్నం హిమాయత్‌నగర్‌లోని మినర్వా కాఫీ షాప్‌లో సమావేశానికి శశికుమార్ సొంత కారులోనే వచ్చారు. అక్కడ్నుంచి మిగిలిన ఇద్దరితో కలిసి ఉదయ్‌కి చెందిన కారులో వెళ్లారు. దీంతో శశికుమార్ కారు హోటల్ వద్దే ఉండిపోయింది. పోలీసులు బుధవారం ఈ కారును స్వాధీనం చేసుకున్నారు. తన భర్త బ్రీఫ్‌కేస్ కూడా మాయమైందని శశి భార్య ఆరోపించారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న దర్యాప్తు అధికారులు ఉదయ్, సాయిల ఆసుపత్రులు, వారి నివాసాల్లో తనిఖీ చేయాలని నిర్ణయించారు. అలాగే మినర్వా కాఫీ షాప్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫీడ్‌ను సేకరించారు. ఇందులో డాక్టర్లు లోపలికి రావడం, కూర్చుని టిఫిన్/కాఫీ తీసుకోవడం, తిరిగి వెళ్లడం వంటి దృశ్యాలు నమోదయ్యాయి. ఈ ముగ్గురికీ చెందిన సెల్‌ఫోన్ టవర్ లోకేషన్స్‌తో పాటు కాల్డిటేల్స్ను సేకరించి విశ్లేషిస్తున్నారు. దీని ద్వారా వారు ఏ సమయంలో ఎక్కడున్నార? ఎవరితో సంప్రదింపులు జరిపారన్న అంశాలు తేలనున్నాయి. మరోపక్క ఉదయ్ శరీరం నుంచి వైద్యులు బయటకు తీసిన తూటాను, శశికుమార్ మృతదేహం వద్ద లభించిన తూటాతో పాటు ఆ రివాల్వర్‌ను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలని నిర్ణయించారు. మిగిలిన వారు ఎవరు? సూసైడ్ నోట్లో ఉదయ్, సాయితో పాటు శశికుమార్ పేర్కొన్న వారు ఎవర న్న వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. శశికుమార్‌ను ఫాంహౌస్‌లో దింపి వచ్చిన ఆయన స్నేహితురాలు చంద్రకళను కూడా ప్రశ్నించాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించారు. ఈ కేసులో సాయికుమార్ ప్రత్యక్ష సాక్షిగా మారాడు. అయితే కాల్పులు జరిపింది సాయికుమారే అని శశి సూసైట్ నోట్లో పేర్కొన్నాడు. దీంతో సాయి చేతి వేళ్ల మధ్యలో గన్‌షాట్ రెసిడ్యూ(జీఎస్సార్) ఉందా లేదా అన్నది నిర్ధారించునేందుకు పోలీసులు ఆయన నుంచి నమూనాలు సేకరించారు. వీటన్నింటినీ ఫోరెన్సిక్ పరీక్షలకు పంపిస్తున్నారు. ఉదయ్‌ను కాల్చింది శశికుమారే ‘‘ప్రాథమికంగా లభించిన ఆధారాల ప్రకా రం ఉదయ్‌కుమార్‌పై కాల్పులు జరిపింది శశికుమార్‌గా తేలింది. ఈ కేసులో అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి చంద్రకళను మరోసారి ప్రశ్నిస్తున్నాం. అన్ని కోణాల్లోనూ సమగ్రంగా దర్యాప్తు చేసిన తర్వాతే పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుంటాం’’ - మీడియాతో మధ్య మండల డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి -
కాల్పులు జరిపింది శశికుమారే!
లోరల్ ఆస్పత్రి భాగస్వామి ఉదయ్ కుమార్ మీద కాల్పులు జరిపింది.. ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ శశికుమారేనని డీసీసీ కమలాసన్ రెడ్డి చెప్పారు. ప్రాథమిక విచారణలో ఈ విషయం వెల్లడైందని, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని ఆయన అన్నారు. కారులో వెళ్లేటప్పుడు డ్రైవింగ్ సీట్లో ఉదయ్, పక్కసీట్లో సాయికుమార్ కూర్చోగా.. వెనకాల సీట్లో శశికుమార్ కూర్చున్నారు. చెవి దగ్గర కాల్చే అవకాశం వెనక కూర్చున్నవాళ్లకే ఉంటుందని, అందువల్ల కాల్పులు జరిపింది శశికుమారేనని భావిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఉదయ్ కుమార్ ఆస్పత్రిలో కోలుకుంటున్నారని.. ఆయన పరిస్థితి కొంత మెరుగుపడినా, పూర్తిగా కోలుకోడానికి సమయం పడుతుందని చెప్పారు. ఇక శశికుమార్ స్నేహితురాలు చంద్రకళను కూడా నారాయణగూడ పోలీసులు విచారిస్తారని డీసీపీ తెలిపారు. ఆమెతో పాటు లోరల్ ఆస్పత్రికి చెందిన మిగిలిన డాక్టర్లను కూడా ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. అసలు వైద్యుల మధ్య వివాదం ఎందుకు వచ్చింది, వాటాల వివాదం ఏంటన్న విషయాన్ని తెలుసుకుంటారు. -
క్షణక్షణం
హిమాయత్‌నగర్ టు మొయినాబాద్ డాక్టర్ల ఘటన పూర్వాపరాలు ఇవీ.. సిటీబ్యూరో: డాక్టర్ల త్రయం ఉదయ్ కుమార్, శశికుమార్, సాయికుమార్‌ల వ్యవహారం సోమవారం సాయంత్రం హిమాయత్ నగర్లో ఉదయ్ కుమార్‌పై హత్యా యత్నంతో ప్రారంభమైంది. అర్ధరాత్రి దాటిన తర్వాత మొయినాబాద్‌లోని నిష్ ఫామ్‌హౌస్‌లో శశికుమార్ ఆత్మహత్యతో ఆగింది. ఈ మధ్య కాలంలో ఏ క్షణం ఏం జరిగిందనేది పోలీసుల కథనం ప్రకారం... సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలు మినర్వా కాఫీ షాప్ దగ్గర ఉదయ్, శశి, సాయి కలుసుకున్నారు. అక్కడ శశి దోశ తినగా... మిగిలిన ఇద్దరూ కాఫీ తాగారు. ► 4.30: ఈ ముగ్గురి మధ్యా వాగ్వాదం చోటు చేసుకోవడంతో కాఫీ షాప్ నుంచి బయటకు వచ్చి కారులో స్ట్రీట్ నెం.6లోకి వెళ్లారు. ►4.40: ఆవేశానికి లోనైన శశికుమార్ తన .32 లెసైన్స్డ్ రివాల్వర్‌తో ఉదయ్‌పై కాల్పులు జరిపాడు. ►5.15: చికిత్స కోసం ఉదయ్ కుమార్ తనంతట తానుగా హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రికి వెళ్లారు. పోలీసులకు సమాచారం అందింది. ►6.15: శశికుమార్ సోమాజిగూడలోని స్నేహితురాలు చంద్రకళ ఇంటికి వెళ్లారు. ►6.30: సోమాజిగూడ నుంచి చంద్రకళ, శశికుమార్‌లు మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌కు బయలుదేరారు. ► రాత్రి 7.45: దారిలో షాపింగ్ చేసుకుంటూ వీరిద్దరూ నక్కలపల్లిలో ఉన్న నిష్ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. ►8.00: శశికుమార్‌ను అక్కడే వదిలిన చంద్రకళ తన కారులో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ► 9.30: ఇంటికి చేరుకున్న చంద్రకళ రెండుసార్లు వాచ్మెన్ నెంబర్‌కు ఫోన్ చేసి శశికుమార్‌తో మాట్లాడారు. ►9.45: ఉదయ్ కుమార్‌పై కాల్పులు, శశికుమార్ వాంటెడ్ వివరాలను టీవీల్లో చూసిన చంద్రకళ షాక్‌కు గురయ్యారు. ►10.15: తనకు పరిచయస్తుడైన ఓ ఆర్మీ అధికారి సాయంతో పంజగుట్ట పోలీసు స్టేషన్‌కు వెళ్లి విషయం చెప్పారు. ►11.10: పంజగుట్ట పోలీసు స్టేషన్‌కు వచ్చిన నారాయణగూడ పోలీసులు చంద్రకళతో కలిసి ఫామ్‌హౌస్‌కు బయలుదేరారు. ►12.50: నిష్ ఫామ్‌హౌస్‌కు చేరుకున్న పోలీసు బృందం శశికుమార్ ఆత్మహత్య చేసుకున్న విషయం గుర్తించింది. ►మంగళవారం ఉదయం 10.30శశికుమార్ మృతదేహాన్ని మొయినాబాద్ పోలీసులు ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ►మధ్యాహ్నం 1.30: పోస్టుమార్టం పరీక్షలు పూర్తి చేసిన ఫోరెన్సిక్ వైద్యులు శశికుమార్ మృతదేహాన్ని ఆయన సోదరుడికి అప్పగించారు. -
కాల్పుల కేసులో చంద్రకళ స్టేట్మెంట్
హైదరాబాద్ : హిమాయత్ నగర్ కాల్పుల కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ఆత్మహత్యకు పాల్పడిన డాక్టర్ శశికుమార్ స్నేహితురాలు చంద్రకళ స్టేట్మెంట్ను మంగళవారం నారాయణగూడ పోలీసులు రికార్డు చేశారు. చంద్రకళ ఏం చెప్పారంటే ' సోమవారం సాయంత్రం కాల్పులు జరిపిన తర్వాత శశికుమార్ నేరుగా నా నివాసానికి వచ్చాడు. తీవ్ర ఒత్తిడిలో ఉన్నానని..ఫాంహౌస్‌కు తీసుకెళ్లాలని కోరాడు. నేను నా కారులో శశికుమార్‌ని ఫాంహౌస్‌కు తీసుకెళ్లాను. ఫాంహౌస్‌లో శశికుమార్‌ను విడిచిపెట్టి జాగ్రత్తగా చూసుకోమని వాచ్మెన్ శంకరయ్యకు చెప్పాను. నేను తిరిగి ఇంటికి వచ్చాక రాత్రి 10 గంటల పమయంలో వాచ్మెన్ ఫోన్ చేశాడు. ఆ ఫోన్లోనే నేను శశికుమార్‌తో 10 నిమిషాలు మాట్లాడాను. తాను ఆత్మహత్య చేసుకుంటాన్నానని చెప్పి ఫోన్ కట్ చేశాడు. నేను వెంటనే పంజాగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చాను. పోలీసులతో కలసి ఫాంహౌస్‌కు వెళ్లాను. అప్పటికే శశికుమార్ చనిపోయాడు'. వ్యాపార లావాదేవిలలో తగాదాల కారణంగా సోమవారం సాయంత్రం డాక్టర్ ఉదయ్ కుమార్‌పై మరో డాక్టర్ శశికుమార్ కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. -
సస్పెన్స్ కథ... సరికొత్త స్క్రీన్‌ప్లే...
హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రుద్ర ప్రొడక్షన్స్ పతాకంపై అరుణ్ రుద్ర నిర్మించిన చిత్రం ‘టాకీస్’. తాన్య ప్రధాన పాత్రలో ఉదయ్‌కుమార్ సీహెచ్ దర్శకత్వం వహించారు. చిత్రవిశేషాలను నిర్మాత తెలియజేస్తూ -‘‘ఇప్పటివరకు వచ్చిన హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. తెలుగు సినిమా చరిత్రలో రాని స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రం సాగుతుంది. ఉదయ్‌కుమార్‌కి ఇది తొలి చిత్రం అయినప్పటికీ అద్భుతంగా తీశాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇందులో పాటలు ఉండవు. సంభాషణలు కథానుసారం ఉంటాయి. ‘హృదయ కాలేయం’ సంగీత దర్శకుడు ఆర్.కె. చేసిన రీ-రికార్డింగ్ బాగుంటుంది. రవికుమార్ నీర్ల కెమెరా పనితనం చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. కచ్చితంగా మా ‘టాకీస్’ అందర్నీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: రుద్ర భాస్కర్. -
ఏసీబీ వలలో ఏఈ
జీలుగుమిల్లి : ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. రూరల్ వాటర్ వర్క్స్ జీలుగుమిల్లి ఏఈ ఎం.ఉదయ్‌కుమార్ రూ.4 వేలు లంచం తీసుకుంటుం డగా అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ఐ.వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. జీలుగుమిల్లి పంచాయతీ కార్యాలయం వద్ద ఉప సర్పంచ్ నెలటూరి అప్పారావు, వార్డు మెంబర్లు గుడెల్లి వెంకటేశ్వరరావు, కుంజా రవీంద్ర కలసి రూ.2.30 లక్షల విలువైన మోటార్ బోరు వేరుుంచారు. ఇందుకు సంబంధించి బిల్లులు సమర్పిం చి, ట్రెజరీ నుంచి ఆ మొత్తాన్ని పొందాల్సి ఉంది. బిల్లులు రూపొందించాలంటే మోటార్ బోరు ఏర్పాటుకు సంబంధించిన పని వివరాలు, కొలతలను మెజర్మెంట్ బుక్ (ఎం.బుక్)లో నమోదు చేయూల్సి ఉంది. ఈ పనిని ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈ ఉదయ్‌కుమార్ చేయూల్సి ఉండటంతో ఉపసర్పంచ్ అప్పారావు తదితరులు ఆయనను సంప్రదించారు. ఆ పనికి సంబంధించిన వివరాలను ఎం.బుక్‌లో నమోదు చేయూలంటే రూ.10 వేలు లంచంగా ఇవ్వాలని ఏఈ డిమాండ్ చేశారు. సొమ్ము ఇవ్వకపోవడంతో 20 రోజు లనుంచి పని వివరాలను నమోదు చేయడం లేదు. దీంతో ఉపసర్పంచ్ తదితరులు తొలుత రూ.4 వేలు ఇస్తామని, మిగిలిన రూ.6 వేలను బిల్లు మంజూరయ్యూక ఇస్తామని చె ప్పారు. అందుకు ఏఈ అంగీకరించగా, వారు ఏసీబీ అధికారులను ఆశ్రరుుంచారు. దీంతో వల పన్నిన ఏసీబీ అధికారులు ఉపసర్పంచ్ అప్పారావు నుంచి ఏఈ ఉదయ్‌కుమార్ రూ.4 వేలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఏఈపై కేసు నమోదు చేశామని, అతణ్ణి కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ చెప్పారు. దాడుల్లో ఏసీబీ సీఐ యూజే విల్సన్, సిబ్బంది పాల్గొన్నారు. -
హౌసింగ్ అక్రమాల్లో డిప్యూటీ కలెక్టర్లు
కామారెడ్డిటౌన్ : హౌసింగ్, ఇందిరమ్మ గృహాల నిర్మాణాల్లో అవినీతి, అక్రమాలపై ఎవరినీ వదిలేది లేదని సీఐడీ డీఎస్పీ శ్రీనివాస్‌రావు, సీఐ ఉదయ్‌కుమర్ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో వారు విలేకరులతో మాట్లాడారు. సీఎం ఆదేశాల మేరకు జిల్లాలోని బోధన్, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని కల్లూరు, సిద్దాపూర్, పోల్కంపేట్, భూంపల్లి గ్రామాల్లో రెండునెలలుగా 400 మంది లబ్ధిదారులకు సంబంధించి కేసులను విచారణ చేపట్టి పూర్తిచేశామన్నారు. ఈవిచారణలో బేస్మిట్ లేవల్, పాత ఇండ్లకు, స్లాబ్‌లేవల్‌లకు బిల్లులు, ఒకే ఇంటిపై రెండు బిల్లుల చెల్లింపులు జరిగాయన్నారు. మొత్తం వంద కేసులు నమోదు చేశామన్నారు. ఈ అక్రమాల వెనక రెవెన్యూ, హౌసింగ్ డీఈలు, అసిస్టెంట్ ఇంజనీర్లు, వర్క్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో పాటు రాజకీయ నాయకులు సైతం ఉన్నారని, వారి జాబితాను త్వరలో ప్రకటిస్తామన్నారు. వారందరిపై కేసులు నమోదు చేశామని, దసరా పండగ అనంతరం అరెస్టులు చేస్తామని స్పష్టం చేశారు. ఈ అవినీతిలో ఉన్న హౌసింగ్ రెవెన్యూ విభాగాల్లో పనిచేసిన అధికారులు ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్ హోదాలో సైతం ఉన్నారని, వారిపై కూడా కేసులు నమోద య్యాయని పేర్కొన్నారు. వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తున్నామన్నారు. అక్రమాలకు పాల్పడిన లబ్ధిదారులపై కూడా కేసులు నమోదు చేశామన్నారు. ప్రభుత్వం ఆదేశిస్తే జిల్లాలోని 36 మండలాల్లో విచారణ జరుపుతామని, విచారణ జరిపితే పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు బయటపడుతాయని వారు తెలిపారు. అక్రమాలకు పాల్పడిన కొందరు వ్యక్తులు డబ్బులను చెల్లిస్తున్నారని తెలిపారు. మరో రెండు నెలల్లో విచారణ పూర్తవుతుందని వివరించారు. విచారణలో బయటపడిన ఆధారాలను, ఫొటోలను, బిల్లుల వివరాలను విలేకరులకు చూపించారు. సమావేశంలో ఎస్సై నాగేందర్, జహంగీర్, హెడ్‌కానిస్టేబుల్ రశీదొద్దిన్, కానిస్టేబుళ్లు ఉన్నారు. -
‘ఇంటి’ దొంగలపై చర్యలకు వెనకడుగు దేనికో?
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎర్రచందనం స్మగ్లర్లకు దన్నుగా నిలుస్తున్న పోలీసు, అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వెనుకడుగు వేయడం వెనుక ఆంతర్యమేమిటనేది అంతుచిక్కడం లేదు. తిరుపతిలో టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీగా పనిచేసిన ఉదయ్‌కుమార్, రాజంపేట డీఎస్పీ రమణపై మాత్రమే గురువారం ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసి మిగిలిన వారిపై చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శేషాచలం అడవుల్లో విస్తారంగా లభించే ఎర్రచందనం ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించిన విషయం విదితమే. ఇది అంతర్జాతీయ మార్కెట్లో ఎర్రచందనానికి విపరీతమైన డిమాండ్ వచ్చేలా చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఎర్రచందనాన్ని విక్రయించి, సొమ్ము చేసుకోవడమే లక్ష్యంగా చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాలకు చెందిన రాజకీయపార్టీల నేతలు, రౌడీషీటర్లు ఎర్రచందనం స్మగ్లర్ల అవతారం ఎత్తారు. ఎర్రచందనం స్మగ్లర్లతో అటు అటవీశాఖలో కొందరు అధికారులు.. ఇటు పోలీసుశాఖలో ఇంకొందరు అధికారులు కుమ్మక్కయ్యారు. ఇది నిఘా వర్గాల విచారణలో వెల్లడైంది. నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో పోలీసుశాఖలో పనిచేసిన ఓ ఐపీఎస్, ఐదుగురు డీఎస్పీలు, 11 మంది సీఐలు, 18 మంది ఎస్ఐలు ఎర్రచందనం దొంగలకు సహకరిస్తున్నట్లు ఏడాది క్రితమే నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదించాయి. ఓ కన్సర్వేటర్, నలుగురు డీఎఫ్‌వోలు, 25 మంది అటవీశాఖ అధికారులు సైతం స్మగ్లర్లకు దన్నుగా నిలుస్తున్నట్లు నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదిక అందించాయి. ఐదు నెలల క్రితం వరకూ చిత్తూరు జిల్లాలో అప్పట్లో ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తోన్న నేత సోదరుడి కనుసైగల మేరకు ఎర్రచందనం స్మగ్లర్లకు ఇద్దరు అటవీశాఖ అధికారులు పైలట్లుగా వ్యవహరించినట్లు నిఘా వర్గాలు పేర్కొనడం గమనార్హం. అప్పుడూ.. ఇప్పుడూ ఒకటే ఏడాది క్రితం నిఘా వర్గాల నివేదికపై చర్యలు తీసుకోవాల్సిన అప్పటి కిరణ్ సర్కారు కేవలం పీలేరు సీఐ పార్థసారథి, యర్రావారిపాళెం ఎస్సై వెంకటేష్‌పై సస్పెన్షన్ వేటు వేసి చేతులు దులుపుకుంది. స్మగ్లర్లకు దన్నుగా నిలుస్తున్న పోలీసు, అటవీశాఖ అధికారులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని పదే పదే ప్రకటనలు చేస్తోన్న ప్రస్తుత సీఎం చంద్రబాబు కూడా కిరణ్ బాటలోనే పయనిస్తున్నారు. ఎర్రదొంగలకు సహకరిస్తున్నారనే ఆరోపణలపై రాజంపేట డీఎస్పీ రమణ, తిరుపతి టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీగా పనిచేసిన ఉదయ్‌కుమార్(ప్రస్తుతం సీఐడీ డీఎస్పీ)ను గురువారం ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తిరుపతి టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీగా పనిచేసిన ఉదయ్‌కుమార్ 1999 నుంచి 2004 వరకూ చంద్రబాబు భద్రత విభాగం ఓఎస్డీగా వ్యవహరించడం గమనార్హం. రాజంపేట డీఎస్పీ రమణ సైతం వైఎస్ఆర్ జిల్లాకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధి ఒకరికి అత్యంత సన్నిహితుడని పోలీసువర్గాలు వెల్లడిస్తున్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టడంలో విఫలమవుతున్నారనే విమర్శలను దారి మళ్లించేందుకే ఇద్దరు డీఎస్పీలపై వేటు వేసి చంద్రబాబు చేతులు దులుపుకున్నారనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ఎర్రచం‘ధనం’ మాటేంటి బాబూ.. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి పార్టీ ఫండ్ రూపంలో ఎర్రచందనం స్మగ్లర్లు భారీ ఎత్తున నిధులు సమకూర్చారనే ఆరోపణలు బలంగా వినిపించాయి. ఎర్రచందనం కేసులో అరెస్టై ఇటీవల బెయిల్‌పై విడుదలైన ఓ టీడీపీ ఎర్రచందనం స్మగ్లర్ చిత్తూరు జిల్లాలో ఆపార్టీ సీనియర్ నేతలకు ఎన్నికల ఖర్చుల కోసం రూ.పది కోట్లకుపైగా ముట్టజెప్పినట్లు సమాచారం. ఇందుకు ప్రతిఫలంగా తన ఇలాకాలో సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు ఆ ఎర్రదొంగలకు టీడీపీ సీనియర్ ప్రజాప్రతినిధి తన ఇంటి నుంచి టిఫిన్, భోజనం పంపి కృతజ్ఞత చాటుకున్నారని ఆపార్టీ వర్గాలు వెల్లడించాయి. వైఎస్ఆర్ జిల్లాలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ ప్రజాప్రతినిధి ఎన్నికల ఖర్చుల కోసం ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి భారీ ఎత్తున ఫండ్ వసూలు చేశారని ఆపార్టీ వర్గాలే అనేక సందర్భాల్లో పేర్కొన్నాయి. ఎర్రదొంగలను అణచివేస్తామని చీటికిమాటికీ ప్రకటనలు చేస్తోన్న చంద్రబాబు.. తన పార్టీలో స్మగ్లర్ల నుంచి ఫండ్ తీసుకుని గెలుపొంది, అధికారాన్ని అనుభవిస్తోన్న నేతలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని అధికారవర్గాలు ప్రశ్నిస్తుండటం కొసమెరుపు. -
'ఫేస్బుక్' ద్వారా అసభ్య మెసేజ్‌లు, అరెస్ట్
హైదరాబాద్ : సోషల్ మీడియా (పేస్బుక్) ద్వారా అసభ్యకర మెసేజ్‌లు పంపి విద్యార్థినిని వేధిస్తున్న ఆకతాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ నరేష్ కథనం ప్రకారం రాజేంద్రనగర్‌కు చెందిన విద్యార్థిని హనుమాన్ టెకిడీలోని ఓ ప్రయివేట్ కళాశాలలో బీయస్సీ రెండో సంవత్సరం చదువుతోంది. అంబర్‌పేటకు చెందిన ఉదయ్ కుమార్ అనే సహచర విద్యార్థి...... విద్యార్థినికి ఫేస్బుక్ ద్వారా అసభ్యకర మెసేజ్‌లు పంపుతున్నాడు. ఈ విషయమై విద్యార్థిని అతడిని నిలదీయగా ...దుర్భాషలాడటంతో పాటు ఆమెను బెదిరించాడు. దీంతో బాధితురాలు, కుటుంబ సభ్యులతో కలిసి సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉదయ్ కుమార్ ను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
‘‘నాన్న.. లే నాన్నా.. వెళ్దాం.. నాన్న’’
...అంటూ గుండెలవిసేలా విలపిస్తున్న ఈ అబ్బాయి పేరు ఉదయ్‌కుమార్. రోడ్డుపై నిర్జీవంగా పడి ఉన్నది ఆయన తండ్రి రాఘవేందర్. గురువారం ఉదయ్‌ని ఎంసెట్ పరీక్షకు తీసుకువెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మరణించాడు. నల్లగొండకు సమీపంలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా కొడుకును పరీక్షకు అనుమతించరన్న ఆదుర్దాతో వెళ్తూ రాఘవేందర్ మృత్యుఒడికి చేరాడు. తండ్రి మరణం గుండెల్ని పిండేస్తున్నా.. ఆయన ఆశయాన్ని నెరవేర్చేందుకు ఉదయ్ పరీక్షకు హాజరయ్యాడు. ‘నిమిషం’ తో నరకం ! సాక్షి, హైదరాబాద్: ప్రశ్నలు లీక్ అవుతాయన్న అనుమానం.. దాన్ని అరికట్టలేని చేతగానితనం.. అధికారుల అత్యుత్సాహం... వెర సి లక్షల మంది విద్యార్థులకు నరక యాతన! నిమిషం ఆలస్యమైనా ఎంసెట్ పరీక్షకు అనుమతించబోమన్న నిబంధన విద్యార్థులను తీవ్ర మాన సిక ఒత్తిడికి గురిచేస్తోంది. కొంద రు విద్యార్థుల జీవితాల్లో చీకట్లు నింపుతోంది. ఏళ్ల తరబడి చదువుకొని, రేయింబవళ్లు నెలల కొద్దీ కష్టపడ్డా ఒక్క ‘నిమిషం’ వారి ఆశలను చిదిమేస్తోంది. ఆలస్యం కారణంగా పరీక్ష రాయలేని విద్యార్థులను కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తోంది. ‘నిమిషం’ భయం పిల్లలకే కాదు.. తల్లిదండ్రులకూ వణుకు పుట్టిస్తోంది. పిల్లలను పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లే క్రమంలో ప్రమాదాల బారిన పడేస్తోంది. నల్లగొండ జిల్లాలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదం ఈ కోవలోనే జరిగింది. కొడుకును ఎంసెట్ (ఇంజనీరింగ్) పరీక్షకు తీసుకెళ్తున్న తండ్రి మరణించడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. తండ్రి పోయారన్న ఆవేదనతోనే, దుఃఖాన్ని దిగమింగుకొని ఆ విద్యార్థి పరీక్ష రాయాల్సి వచ్చింది. జాతీయ స్థాయి పరీక్షల్లోనూ సడలింపు.. అసలు రాష్ట్రం నిర్వహించే ఎంసెట్, ఐసెట్ తదితర అన్ని ప్రవేశ పరీక్షల్లో ఇలాంటి నిబంధన అవసరమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)... దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ లాంటి పరీక్షలను కూడా ఆన్లైన్/ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తోంది. అంతేకాదు గేట్ వంటి పరీక్షల్లోనూ ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయడం లేదు. పరీక్ష ప్రారంభమైన పావుగంట వరకు కూడా అనుమతిస్తున్నారు. పక్కరాష్ట్రం తమిళనాడులో అయితే పరీక్ష ప్రారంభమైన అరగంట వరకు విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతిస్తున్నారని విద్యా నిపుణులు చెబుతున్నారు. ఇక సివిల్స్, గ్రూపు-1 వంటి వివిధ కీలక పరీక్షల్లో నిర్ణీత సమయంలో పరీక్ష హాల్లో ఉండాలన్న నిబంధన ఉన్నా కాస్త వెసులుబాటు కల్పిస్తున్నారు. పావుగంట వరకూ కూడా అభ్యర్థులను అనుమతిస్తున్నారు. అలాంటిది ఈ ప్రవేశ పరీక్షలో ఎందుకు? చిన్నారులను తీవ్ర ఒత్తిడికి గురిచేసే ఈ నిబంధనతో అధికారులు సాధించేదేంటి? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. శాస్త్రీయత లేని నిబంధన.. విద్యార్థులను, తల్లిదండ్రులను మానసిక ఒత్తిడికి గురి చేసి ఇబ్బందుల పాలుచేసే ఈ నిమిషం నిబంధనకు అసలు శాస్త్రీయతే లేదు. కేవలం బయట ఉన్న విద్యార్థులకు లోపల ఉన్న విద్యార్థుల నుంచి సమాచారం వెళ్తుందన్న అనుమానంతో లక్షల మందిని క్షోభకు గురిచేస్తున్నారు. పరీక్షకు ఆలస్యంగా వె ళ్తే నష్టం తనకేనన్న విషయం విద్యార్థికి తెలుసు. సాధ్యమైనంత వరకు ముందుగా రావడానికే ప్రయత్నిస్తారు. కానీ అనుకోని పరిస్థితుల్లో కొద్ది నిమిషాలు పరీక్షకు ఆలస్యంగా వెళ్తే జీవితాన్ని నష్టపోవాలా అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ నిబంధనను తొలగిండచడంతోపాటు ఆన్లైన్లో పరీక్ష వంటి ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నా.. అధికారులు అటువైపు చూడడం లేదు. పైగా ఇంటర్మీడియట్, పదో తరగతి వంటి పబ్లిక్ పరీక్షల్లోనూ ఈ అడ్డగోలు నిబంధనను అమలు చేసే ఆలోచనలు చేస్తుండటం దారుణం. నిజానికి ఎంసెట్ వంటి ప్రవేశ పరీక్షకు ఇలాంటి నిబంధనల అవసరమే లేదని ఉన్నత విద్యాశాఖకు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు. శుక్రవారం జరగనున్న ఐసెట్‌కు సైతం ఈ నిమిషం నిబంధనను అమలు చేయనున్నారు. ఒక్కో గడియారంలో ఒక్కో సమయం గడియారంలో సమయమే ఒక్కొక్కరికి మధ్య ఐదు నిమిషాల వరకూ తేడా ఉంటుంది. విద్యార్థుల చేతుల్లో గడియారం ఒక సమయం చూపిస్తే.. పరీక్ష హాల్లో ఉండే గడియారంలో సమయానికి తేడా ఉంటుంది. ఇన్విజిలేటర్ చేతికి ఉండే గడియారంలో మరో సమయం చూపిస్తుంది. పర్యవేక్షణ అధికారి చేతి గడియారంలో కూడా ఒకట్రెండు నిమిషాలు తేడా ఉండొచ్చు. గేటు వద్ద ఉండే వాచ్మెన్ గడియారంలో సమయం మరోలా ఉండొచ్చు. అలాంటపుడు నిమిషం నిబంధన కు ప్రామాణికతే లేదు. అందుకే ఇలాంటి నిబంధనను తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రాణం తీసిన నిబంధన ఒక్క నిమిషం.. ఓ నిండు జీవితాన్ని బలి తీసుకుంది! కొడుకు నుంచి తండ్రిని దూరం చేసింది. ఆ కుటుంబానికి అంతులేని శోకాన్ని మిగిల్చింది. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎంసెట్ పరీక్షకు తన కొడుకును అనుమతించరన్న ఆదుర్దాతో బయల్దేరిన ఓ తండ్రి రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మరణించారు. గురువారం నల్లగొండలో ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. భువనగిరిలోని బాహార్‌పేటకు చెందిన రాఘవేందర్(48) తన కొడుకు ఉదయ్‌కుమార్‌ను ఎంసెట్ పరీక్షకు తీసుకువెళ్లేందుకు మోటార్ సైకిల్‌పై బయలుదేరాడు. మరో 10 నిమిషాల్లో నల్లగొండకు చేరుకోబోతుండగా.. మహత్మాగాంధీ యూనివర్సిటీ సమీపంలో వారి వెనుక వేగంగా వస్తున్న లారీ బైక్‌ను ఢీకొంది. ైబె క్‌పై నుంచి తండ్రీకొడుకులు చెరోవైపు పడిపోయారు. రాఘవేందర్‌పై నుంచిలారీ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మరణించాడు. తండ్రి అచేతనంగా రోడ్డుపై పడిపోవడంతో ఉదయ్‌కుమార్ కన్నీరుమున్నీరుగా విల పించాడు. ‘లే డాడీ...వెళ్దాం..’ అంటూ చేయి పట్టి లాగడం చూసేవారిని కంటతడి పెట్టించింది. ఈలో పు అంబులెన్స్ రావడంతో ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మరణించాడని వైద్యులు తెలిపారు. తండ్రి మరణం గుండెల్ని పిండేస్తున్నా.. ఉదయ్ పరీక్షకు హాజరయ్యాడు. తెలిసినవారు వెంట రాగా ఎన్జీ కాలేజీ సెంటర్‌కు చేరుకొని పరీక్ష రాశాడు. తనను ఇంజనీర్‌గా చూడాలనుకున్న తండ్రి ఆశయాన్ని నెరవేర్చుతానంటూ ఉదయ్ కన్నీళ్లతో చెప్పాడు. గేట్లు మూసేసే పరిస్థితి ఉండదు జేఈఈ మెయిన్ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో పావుగంట, ఇరవై నిమిషాల వరకు పరీక్షా హాల్లోకి అనుమతిస్తారు. అంతేకాదు సివిల్స్, గ్రూప్స్ వంటి పరీక్షల్లోనూ పరీక్ష సమయానికంటే ముందుగా హాల్లోకి రావాలని మాత్రమే చెబుతారు. పావుగంట వరకు పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని గేట్లు మూసేసే పరిస్థితి ఉండదు. రాష్ట్రస్థాయి పోటీ పరీక్షల్లోనే ఈ విపరీత ధోరణి కనిపిస్తోంది. - జేఈఈ శిక్షణా సంస్థ ప్రతినిధి కృష్ణచైతన్య, సివిల్స్ శిక్షణా సంస్థ ప్రతినిధి శ్రీకాంత్ విద్యార్థుల హక్కులను కాలరాయడమే నిమిషం నిబంధన పేరుతో విద్యార్థులను పరీక్ష రాయకుం డా చేయడం వారి హక్కులను కాలరాయడమే. ఆలస్యంగా వెళ్లే వారిలో ఎక్కువ మంది నిరుపేద విద్యార్థులే ఉంటారు. ధనవంతుల పిల్లల్లాగ వారు కార్లలో వెళ్లలేరు. బస్సులు వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టుపైనే ఆధారపడతారు. కాబట్టి ఒక్కోసారి ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. - మధుసూదన్‌రెడ్డి, జూనియర్ లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శి దుర్మార్గపు విధానం ట్రాఫిక్ సమస్యలు, ఇంటి నుంచి బయలుదేరడం ఆలస్యం కావడంతో పరీక్షకు కొంత ఆలస్యంగా వచ్చే పరిస్థితి ఉంటుంది. అలాగని వారిని పరీక్షకే అనుమతించకపోవడం దుర్మార్గం. ఎక్కడాలేని విధానం అమలు చేస్తున్నారు. విద్యార్థులను ముందే భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. - లక్ష్మయ్య, ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి జీవితాలు నాశనం చేయడమే నిమిషం పేరుతో వందల మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేయడమే. మండల కేంద్రాల్లో సెంటర్లు లేవు. ట్రావెలింగ్ సమస్యలు ఉన్నాయి. డివిజన్, జిల్లా కేంద్రాలకు వెళ్లడంలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. - ఆవుల అశోక్, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
అనారోగ్యం తాళలేక విద్యార్థి ఆత్మహత్య
పాలకొండ/పాలకొండరూరల్, న్యూస్‌లైన్: అనారోగ్యం తాళలేక స్థానిక సత్యసాయి పాఠశాలలో పదో తరగతి చదువుతున్న వీరఘట్టం మండలం చలివేం ద్రి గ్రామానికి చెందిన కలమట ఉదయ్‌కుమార్(15) సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పాఠశాలకు అనుబంధంగా ఉన్న వసతి గృహంలో ఉంటున్న ఉదయ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొన్నాడు. ఉదయం పాఠశాలకు హాజరైన ఉదయ్ కొద్దిసేపటి తర్వాత మలమూత్ర విసర్జనకు వెళ్లాల్సి ఉందంటూ తోటి విద్యార్థులకు చెప్పి హాస్టల్‌కు వెళ్లాడు. హాస్టల్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. హిస్నోఫీలియా, ఇతర అనారోగ్య కారణాలతో బాధపడుతున్నట్టు, రెండుసార్లు ఆపరేషన్లు కూడా చేయించినట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమా న్య ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. ఉదయ్ ఆత్మహత్య చేసుకోవడంతో తోటి విద్యార్థులు ఉద్వేగానికి లోనయ్యారు. ఉదయ్ తమ్ముడు ప్రవీణ్ ఇదే పాఠశాలలో చదువుతున్నాడు. అన్న ఆత్మహత్య చేసుకోవడంతో ప్రవీణ్ ఖిన్నుడయ్యాడు. తన చావుకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ నోట్ ఇదిలావుండగా ఉదయ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్న ఘటనా స్థలం వద్ద ఆయన దస్తూరీతో ఉన్న రెండు సూసైడ్ నోట్లు లభించాయి. తనను హాస్టల్ వార్డెన్‌తో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎంతో బాగా చూసుకున్నారని, తాను చనిపోతున్నందుకు వారంతా క్షమించాలని కోరాడు. ఒక స్నేహితుడిని ఉద్దేశించి మరో నోట్లో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నందుకు చింతిస్తున్నానని పేర్కొన్నాడు. ఉదయ్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి తల్లిదండ్రులు రామకృష్ణ, సరోజని పాలకొండకు చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎస్సై ఎం.వినోద్‌బాబు వసతిగృహాన్ని సందర్శించి ఆత్మహత్యకు పాల్పడిన ప్రదేశాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి పంచనామా అనంతరం ఏరియా ఆసుపత్రి పోస్టుమార్టం నిర్వహించారు.