కడప, స్పోర్ట్స్ : కడప నగరానికి చెందిన పాతికేళ్ల కుర్రాడు ప్రపంచాన్ని మెప్పించాడు. ధనుర్విద్యతో యావత్ భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేకమంది అభిమానాన్ని చూరగొన్నాడు. బాహుబలిలా ధనుస్సు చేతబట్టి ఏకకాలంలో విభిన్న లక్ష్యాలను ఛేదిస్తూ కడప బాహుబలిగా పేరుప్రఖ్యాతులు సాధిస్తున్నాడు. ఇటీవల ఓ ప్రైవేట్ టెలివిజన్ చానల్ నిర్వహించిన ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ రియాలిటీ షోలో పాల్గొని ఈయన చేసిన ప్రదర్శనకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. ఏకకాలంలో రెండు బాణాలతో రెండు విభిన్న లక్ష్యాలను చేధించడంతో పాటు కదిలే లక్ష్యాన్ని ఛేదించి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశాడు.
కష్టాల కడలిని ఈదుతూ..
కడప నగరానికి చెందిన దివంగత శ్రీనివాసులు, విజయ దంపతుల కుమారుడు వర్ధి ఉదయ్‌కుమార్. 2009లో తండ్రి చనిపోవడంతో తల్లి చేపట్టిన చిరువ్యాపారం(సోడా తయారీ)లో చేదోడు వాదోడుగా ఉండేవాడు. కష్టాలెన్ని ఎదురైనా వెరవలేదు. చిన్నప్పటి నుంచి వివిధ క్రీడల పట్ల మక్కువ పెంచుకున్నాడు. 2007లో మార్షల్‌ఆర్ట్స్‌లో శిక్షణ ప్రారంభించిన ఉదయ్‌కుమార్ 2011లో నేపాల్‌లో నిర్వహించిన అంతర్జాతీయస్థాయి కుంగ్‌ఫూ పోటీల్లో తొలి అంతర్జాతీయ పతకం(కాంస్యం) సాధించాడు. అదే యేడాది చెన్నైకి వెళ్లి అక్కడ వాసుదేవన్ ఆధ్వర్యంలో ఆర్చరీలో శిక్షణ పొందాడు. అనంతరం వారానికి రెండురోజులు చెన్నైలో, మిగతా రోజులు కడపలో ప్రాక్టీస్ చేసుకోవడం ప్రారంభించాడు.
2015లో ముంబైలో నిర్వహించిన మేయర్ కప్ ఆర్చరీ పోటీల్లో కాంస్యపతకం సాధించాడు. చెన్నైలో నిర్వహించిన స్పీడ్ ఆర్చరీ టార్గెట్స్ కాంపిటీషన్‌లో పాల్గొని 2018లో ఏషియా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నాడు. తాను నేర్చుకున్న విద్యను పదిమందికి పంచాలన్న ఉద్దేశంతో తన తల్లి పేరు మీద కడప నగరంలో విజయాస్ ఆర్చరీ అకాడమీని ఏర్పాటు చేశాడు. చాలామందిని జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాడు. దీంతో పాటు ఏపీ ఫీల్డ్ ఆర్చరీ అసోసియేషన్‌ను ఏర్పాటు చేసి వ్యవస్థాపక కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాడు. దీంతో పాటు 2018లో ఇంటర్నేషనల్ ఫీల్డ్ ఆర్చరీ అసోసియేషన్ వారు నిర్వహించిన లెవల్–2 కోచ్‌గా ఉత్తీర్ణత సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు క్రీడాకారుడు ఈయనే కావడం విశేషం. ఇటీవలే ‘ఉషు’ క్రీడలో సైతం పాటియాలలోని ఎన్‌ఐఎస్ శిక్షణ కేంద్రంలో 6 వారాల శిక్షణ పూర్తి చేసి శిక్షకుడుగా మారాడు.
వెదుక్కుంటూ వచ్చిన అవకాశం
కోవిడ్ సమయంలో లాక్‌డౌన్ కారణంగా క్రీడాశిక్షణ ఆగిపోవడంతో, తనకు తెలిసిన విద్యలను సాధన చేసుకుంటూ వాటి వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. వీటిని పరిశీలించిన సోనీ టెలివిజన్ బృందం గతేడాది నవంబర్‌లో రియాలిటీషో కోసం ఆడిషన్స్‌కు రావాలని ఆహ్వానించారు. ముంబైలోని యశ్‌చోప్రా స్టూడియోలో నిర్వహించిన ఆడిషన్స్‌లో ఈయన ప్రతిభను పరిశీలించిన నిర్వాహకులు రియాల్టీషోకు ఎంపికచేశారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 5న ప్రసారమైన ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ రియాలిటీ షోలో ఈయన పాల్గొని ధనుర్విద్యలో తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించాడు.
కదిలే తెరపై ఉన్న లక్ష్యాలను ఛేదించడం, ఎదురుగా ఉన్న వేర్వేరు టార్గెట్‌లను ఏకకాలంలో రెండు బాణాలతో ఛేదించడంతో నిర్వాహకులు, న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన బాలీవుడ్ ప్రముఖులు శిల్పాశెట్టి, బాద్‌షా, మనోజ్, కిరణ్‌ఖేర్‌లు ఆశ్చర్యానికి లోనయ్యారు. షోలో అద్భుత ప్రదర్శన కనబరచడంతో తదుపరి రౌండ్‌కు నిర్వాహకులు ఎంపికచేశారు. తదుపరి రౌండ్‌లో భారతంలో అర్జునుడు చేధించిన మత్స్యయంత్రం తరహా లక్ష్యాలను చేధించడం, ఏకకాలంలో 5 లక్ష్యాలను ఛేదించడం వంటి అంశాలు ఉండే అవకాశం ఉందని ఉదయ్‌కుమార్ తెలిపాడు.
గతంలో 7 లక్ష్యాలను ఛేదించడం కూడా సాధన చేశానని, అయితే షో కోసం ప్రస్తుతానికి 5 లక్ష్యాల పైనే దృష్టిసారిస్తున్నానని తెలిపారు. జర్మనీకి చెందిన హెన్నిక్ ఓంకార్ మార్గదర్శనంలో ధనుర్విద్యపై మరింత పరిశోధన చేస్తున్నానని తెలిపాడు. అలాగే త్వరలో అమెరికాలో నిర్వహించనున్న మరో రియాల్టీ షో కోసం సన్నద్ధం అవుతున్నట్లు ఉదయ్‌కుమార్ తెలిపాడు.
1Arrow | moving two balloons | one shot |#vardiudaykumar #dhanurvidya #Archery #indianarchery pic.twitter.com/mYiYRGK1pH
— Vardi Uday Kumar (@UdayVardi) February 12, 2022
Comments
Please login to add a commentAdd a comment