అన్నవరం: రత్నగిరి వాసుడైన సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతిదేవి కోసం కొత్త రథాలు సిద్ధమవుతున్నాయి. రూ.1.42 కోట్ల వ్యయంతో నాణ్యమైన బస్తరు టేకుతో ఈ రెండు రథాలను అన్నవరం దేవస్థానం తయారు చేయిస్తోంది. వీటిలో రూ.34 లక్షలతో నిర్మించిన చిన్నరథం స్వామి, అమ్మవార్ల ఊరేగింపునకు సిద్ధమైంది. దీనికి వెండి రేకు తాపడం చేసేందుకు దాతల కోసం దేవస్థానం అన్వేషిస్తోంది. మరోవైపు రూ.1.08 కోట్లతో నిర్మిస్తున్న పెద్ద రథం పనులు చురుగ్గా జరుగుతున్నాయి. మరో మూడు నెలల్లో ఈ రథం కూడా సిద్ధమవుతుందని చెబుతున్నారు.
చురుగ్గా పెద్ద రథం పనులు
♦ రూ.1.08 కోట్లతో పెద్ద రథం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి.
♦ దీని ఎత్తు 33.9 అడుగులు, వెడల్పు 14 అడుగులు, పొడవు 23.5 అడుగులు.
♦ ఈ రథంపై వివిధ లతలు, దేవతామూర్తుల చిత్రాలు, వివిధ డిజైన్లు చెక్కుతున్నారు.
♦ పెద్ద రథం పీఠం నిర్మాణ పనుల్లో శిల్పులు నిమగ్నమయ్యారు. పెద్ద రథానికి సంబంధించి స్తంభాలు సైతం చెక్కుతున్నారు.
♦ సత్యదేవునికి ఇప్పటికే రెండు రథాలున్నాయి. వీటిలో ఒకటి వెండి రథం కాగా.. మరొకటి వైశాఖ మాసంలో జరిగే వార్షిక కల్యాణ మహోత్సవాల్లో మూడో రోజు స్వామి, అమ్మవార్లను ఊరేగించే రావణ బ్రహ్మ వాహనం. వెండి రథం శిథిలావస్థకు చేరింది.
♦ కొత్త రథం తయారు చేయించాలన్న ప్రతిపాదన పదేళ్లుగా ఉన్నా వివిధ కారణాలతో అధికారులు సాహసించలేదు.
♦ వెండి, బంగారం పనులు చేయించేటప్పుడు పలు సమస్యలు ఉత్పన్నమవుతాయని వెనుకంజ వేశారు.అయితే.. గత ఈవో చంద్రశేఖర్ ఆజాద్ నూతన రథం తయారీకి ఉపక్రమించారు.
♦ వెండి రథంతోపాటు స్వామి, అమ్మవార్లను కొండ దిగువన ఊరేగించేందుకు పెద్ద రథం కూడా తయారు చేయాలని నిర్ణయించారు.
♦ పాలకవర్గం ఆమోదంతో వీటి తయారీకు గత ఈవో ఎస్‌ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ ఆగస్ట్ నెలలో టెండర్లు పిలిచారు.
♦ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మురమళ్లకు చెందిన శ్రీమాణిక్యాంబ శిల్పకళ వుడ్ వర్క్స్ అధినేతలు కొల్లాటి కామేశ్వరరావు, కొల్లాటి శ్రీనివాస్ ఈ పనులను దక్కించుకున్నారు.
సిద్ధమైన చిన్న రథం
♦ చిన్న రథం నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. ఈ రథం ఎత్తు 14 అడుగులు, వెడల్పు 6.3 అడుగులు, పొడవు 7.5 అడుగులు ఉంది. నాలుగు స్తంభాలపై శిఖరం వస్తుంది. నాలుగు చక్రాల మీద అందమైన లతలు చెక్కారు.
♦ రథం మీద దేవతామూర్తుల చిత్రాలతో పాటు పలు ఆకర్షణీయమైన డిజైన్లు చిత్రీకరించనున్నారు. ముందు భాగంలో రెండు గుర్రాలను అమర్చారు.
♦ దీనిని టేకుతో తయారు చేయడానికి రూ.34 లక్షలు అవుతుండగా.. వెండి రేకు తాపడానికి సుమారు 300 కిలోల వెండి అవసరం కానుంది. దాతల సహకారంతో వెండి తాపడం చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.
చిన్న రథం నిర్మాణం బాగుంది
చిన్న రథం నిర్మాణం పూర్తయింది. చాలా బాగుంది. ఈవో కె.రామచంద్ర మోహన్ దీనిని పరిశీలించిన అనంతరం ట్రయల్ రన్ వేస్తాం. అనంతరం దీనిని స్వామివారి సేవలో ఎప్పుడు ఉపయోగించాలో ఈవో పండితులు, నిర్ణయిస్తారు. – ఉదయ్ కుమార్, డీఈ, అన్నవరం దేవస్థానం
Comments
Please login to add a commentAdd a comment