
ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని విలపించిన వైనం
స్పందించిన సెక్యూరిటీ గార్డులు
అన్నవరం కొండపై ఆగిన వివాహం
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణస్వామివారి దేవస్థానంలో శనివారం తెల్లవారుజామున ఒక పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది. రామాలయం వద్ద గల విశ్రాంతి మంటపంలో జరుగుతున్న ఒక వివాహంలో వధువు గట్టిగా విలపించడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డులు ఆమె వద్దకు వెళ్లి ప్రశ్నించారు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఆమె తెలిపింది. తన వయసు 22 ఏళ్లు అని, తన కంటే 20 ఏళ్లు పెద్దయిన వ్యక్తితో తనకు వివాహం జరిపిస్తున్నారని విలపించింది.
దీంతో సెక్యూరిటీ గార్డులు వెంటనే ఆ పెళ్లిని నిలిపివేసి, వధూవరులను, ఇరువైపులా పెళ్లి పెద్దలను స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ ఎస్సై శ్రీహరి రాజు వధువును ప్రశ్నించగా తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని, పెళ్లి కొడుకు వయసు 42 ఏళ్లు అని తెలిపింది. అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేయడం చట్టరీత్యా నేరమని చెప్పి వధూవరుల కుటుంబ సభ్యులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు.
పెళ్లి చేయించేందుకు అంగీకరించిన పురోహితుడిని కూడా మందలించారు. కాగా.. వధూవరులిద్దరిదీ నెల్లూరు జిల్లానే. వధువు ఉతుకూరుకు, వరుడు కందుకూరుకు చెందినవారు. బలిజ సామాజికవర్గానికి చెందిన వధువు కుటుంబీకులు పేదవారు. అమ్మాయికి పెళ్లి చేసే స్థోమత లేక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వరుడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు నిశ్చయించినట్టు తెలిసింది. దీనిపై ఎవ్వరూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయనందున కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.