పెళ్లి వద్దు.. సంపాదన ముద్దు | Changing mindset of youth regarding marriage | Sakshi
Sakshi News home page

పెళ్లి వద్దు.. సంపాదన ముద్దు

Published Thu, Feb 13 2025 5:49 AM | Last Updated on Thu, Feb 13 2025 5:49 AM

Changing mindset of youth regarding marriage

మారిన యూత్‌ మైండ్‌ సెట్‌  

లేటు వయసులో పెళ్లితో ఆరోగ్య సమస్యలు 

ఐవీఎఫ్‌ సెంటర్ల చుట్టూ తిరుగుతున్న జంటలు

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటుంటారు. అయితే ఇప్పుడు పెళ్లి వయసు దాటిపోతున్నా.. యువత మాత్రం అప్పుడే పెళ్లి వద్దు.. జీవితంలో సెటిల్‌ అయ్యాక చేసుకుంటాం అంటున్నారు. ఇంతలో మూడు పదుల వయసు దాటిపోతోంది. ఉద్యోగాల వేట, డాలర్ల భ్రమతో లేటు వయసు పెళ్లిళ్లకు మొగ్గు చూపుతున్నారు. జీవితంలో ఎంజాయ్‌ చేశాకే పెళ్లి అన్న ధోరణితో అసలుకే మోసం వస్తోంది. 

సరైన సమయంలో పెళ్లి చేసుకోకపోవడంతో సంతానం కోసం ఐవీఎఫ్‌ కేంద్రాలకు పరుగు పెడుతున్నారు. పలు రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక అబ్బాయిలకైతే అమ్మాయిలు దొరక్క అవివాహితులుగా మిగిలిపోతున్నారు.  –తాడేపల్లిగూడెం

అమ్మాయిల ట్రెండ్‌ మారింది
తరం మారింది. అబ్బాయిలే కాదు.. అమ్మాయిలు కూడా మూడు పదులు దాటినా పెళ్లి చేసుకోవడం లేదు. 35 ఏళ్లు దాటే వరకు యువతకు పెళ్లి ఆలోచనలు లేకపోవడం చాలా అనర్ధాలకు దారితీస్తోంది. పెళ్లి చేసుకుంటాను.. ఇపుడే కాదు .. ఉద్యోగంలో స్థిరపడ్డాక చేసుకుంటాం.. ఇలా అనుకొనేసరికి వయస్సు 35 సంవత్సరాలు దాటుతోంది. 

అప్పుడు మేరేజ్‌ బ్యూ­రోలో వివరాల నమోదు చేయించుకుంటున్నారు. తీరా పెళ్లయ్యాక పిల్లలను కనే వయసు దాటిపోతుంది. మహిళల్లో ఆధునిక జీవన విధానాలతో 40 ఏళ్లకే మెనోపాజ్‌ వస్తుంది. రక్తహీనత, ఐరన్‌లోపం, విటమిన్‌ డీ లోపాలు ఏర్పడుతున్నాయి. దీంతో జంటలు ఐవీఎఫ్‌ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు.  

61 శాతం జంటల్లో హార్మోన్‌ సమస్యలు  
పిల్లలు వద్దు.. ఆదాయమే ముద్దు అనే పాశ్చాత్య దేశాల కల్చర్‌ మన యువతను కమ్మేస్తోంది. ముందు జీవితాన్ని ఎంజాయ్‌ చేద్దాం అన్న ధోరణి పెరుగుతోంది. అన«ధికారిక లెక్కల ప్రకారం వివాహమైన నేటి తరం జంటల్లో 61 శాతం హార్మోన్‌ సమస్యలు ఉంటున్నాయి.  

పెళ్లికాని ప్రసాదులే కాదు.. అమ్మాయిలు కూడా
పశ్చిమ గోదావరి జిల్లాలో 18 నుంచి 39 సంవత్సరాల వయసున్న యువత  6,88,555 మంది  
18 నుంచి 19 ఏళ్లు  ఉన్నవారు  32,277 మంది
20 నుంచి 29 ఏళ్లు ఉన్నవారు 2,57,495 మంది
30 నుంచి 39 ఏళ్లు ఉన్నవారు 3,98,783 మంది 
యువకులు  3,42,643 మంది 
యువతులు  3,45,912 మంది 
వీరిలో సుమారు నాలుగు లక్షల మందికి ఇంకా వివాహాలు కాలేదని లెక్కలు చెబుతున్నాయి.  

పెళ్లి ట్రెండ్‌ మారింది 
జీవితంలో వివాహం ముఖ్య ఘట్టం. ఇప్పుడు ఉద్యోగ వ్యవస్థ వివాహ స్వరూపాన్ని మార్చేసింది. ఇగోలు పెరిగి వివాహ బంధం విచ్ఛిన్నమవుతుంది. వయసు రాగానే పెళ్లి చేసుకోవడం మేలు. అనురాగం, ఆప్యాయతల నడుమ ఈ పెళ్లిళ్లు సాగాలి.  – భోగిరెడ్డి ఆదిలక్ష్మి, స్పందన పౌండేషన్‌  

లేటు వివాహాలు అనర్థదాయకం 
పెళ్లి ఆలస్యంగా చేసుకోవడం అన­ర్థం. ఇన్‌ఫెరి్టలిటీ పెరుగుతుంది. స్పెర్మ్‌ వైటాలిటీ తగ్గుతుంది. బీపీ, మధుమేహం వంటివి వస్తున్నా­యి. బర్త్‌ రేటు తగ్తుతుంది. 

పుట్టిన పిల్లల్లో క్రోమోజోము­ల అసమ­తుల్యంతో వైకల్యం రావచ్చు. సహజీవనం, ఇతర మార్గాలలో సంబంధాలు పెట్టుకోవడం వల్ల సుఖ వ్యాధులు, హెచ్‌ఐవీ రిస్క్‌ పెరుగుతుంది. జ­నరేషన్‌ గ్యాప్‌ ఏర్పడి ఇబ్బందులు తలెత్తుతాయి. 23 నుంచి 30 సంవత్సరాలలోపు పెళ్లిళ్లు చేసుకోవాలి. – డాక్టర్‌ తాతారావు, గూడెం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement