
సాంఘిక బహిష్కరణపై చర్యలకు పలువురి డిమాండ్
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో పెరుగుతున్న పెత్తందార్ల ఆగడాలను ఆపాలని పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలోనే దళితులను పెత్తందార్లు సామాజిక బహిష్కరణ చేసిన ఘటన ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇటువంటివి చోటుచేసుకుంటున్నాయని, ఇవి పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్యకు మూలమైన.. విద్యుద్ఘాతం వల్ల చనిపోయిన దళిత యువకుని కుటుంబానికి ప్రభుత్వం రూ.25 లక్షల ఆరి్థక సహాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. వీరి ఆవేదన వారి మాటల్లోనే...
రాష్ట్ర హోంమంత్రి మల్లాం గ్రామానికి వెళ్లాలి
పిఠాపురం నియోజకవర్గంలోని మల్లాం గ్రామంలో దళితులను సాంఘిక బహిష్కరణకు పాల్పడిన పెత్తందార్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినప్పటికీ ‘శాంతి భద్రతల పేరుతో’ చర్చలు జరిపి రాజీలు చెయ్యడం దుర్మార్గం. పెత్తందార్లపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం కేసు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర హోంమంత్రి అనిత, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయులు ఆ గ్రామాన్ని సందర్శించాలి. బాధ్యులపై కేసులు నమోదు చేయించి దళితులకు మనోధైర్యం కల్పించాలి.
– అండ్ర మాల్యాద్రి, కుల వివక్ష వ్యతిరేక పోరాటసంఘం (కేవీపీఎస్) రాష్ట్ర కార్యదర్శి
పవన్ పర్యటించాలి
ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మల్లాం గ్రామంలో పర్యటించి దళితులకు మనోధైర్యం కల్పించాలి. సామాజిక బహిష్కరణ అమలు జరిగిన కాలానికి బాధితులందిరికీ పరిహారం చెల్లించాలి.
–వి.శ్రీనివాసరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
పవన్ స్పందించాలి
స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి పెత్తందార్లపై చట్టపరమైన చర్యలు చేపట్టాలి. గ్రామంలో దళితులకు రక్షణ కల్పించాలి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాం.
– కె.రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
అప్పుడు గరగపర్రు.. ఇప్పుడు మల్లాం
గత టీడీపీ పాలనలో గరగపర్రులో అంబేడ్కర్ విగ్రహం విషయంలో దళితులను సాంఘిక బహిష్కరణ చేయడంతో రాష్ట్రవ్యాప్త ఉద్యమం జరిగింది. అదే తరహాలో ఇప్పుడు టీడీపీ కూటమి పాలనలో మల్లాంలో దారుణం జరిగింది. రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి దారితీయకముందే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
– నల్లి రాజేష్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు