హౌసింగ్ అక్రమాల్లో డిప్యూటీ కలెక్టర్లు | deputy collectors involved in real estate irregularities | Sakshi
Sakshi News home page

హౌసింగ్ అక్రమాల్లో డిప్యూటీ కలెక్టర్లు

Oct 1 2014 3:04 AM | Updated on Sep 22 2018 8:22 PM

హౌసింగ్, ఇందిరమ్మ గృహాల నిర్మాణాల్లో అవినీతి, అక్రమాలపై ఎవరినీ వదిలేది లేదని సీఐడీ డీఎస్పీ శ్రీనివాస్‌రావు, సీఐ ఉదయ్‌కుమర్ పేర్కొన్నారు.

 కామారెడ్డిటౌన్ :  హౌసింగ్, ఇందిరమ్మ గృహాల నిర్మాణాల్లో అవినీతి, అక్రమాలపై ఎవరినీ వదిలేది లేదని సీఐడీ డీఎస్పీ శ్రీనివాస్‌రావు, సీఐ ఉదయ్‌కుమర్ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో వారు విలేకరులతో మాట్లాడారు. సీఎం ఆదేశాల మేరకు జిల్లాలోని బోధన్, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని కల్లూరు, సిద్దాపూర్, పోల్కంపేట్, భూంపల్లి గ్రామాల్లో  రెండునెలలుగా 400 మంది లబ్ధిదారులకు సంబంధించి కేసులను విచారణ చేపట్టి పూర్తిచేశామన్నారు.

ఈవిచారణలో బేస్మిట్ లేవల్, పాత ఇండ్లకు, స్లాబ్‌లేవల్‌లకు బిల్లులు, ఒకే ఇంటిపై రెండు బిల్లుల చెల్లింపులు జరిగాయన్నారు. మొత్తం వంద కేసులు నమోదు చేశామన్నారు. ఈ అక్రమాల వెనక రెవెన్యూ, హౌసింగ్ డీఈలు, అసిస్టెంట్ ఇంజనీర్‌లు, వర్క్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌లతో పాటు రాజకీయ నాయకులు సైతం ఉన్నారని, వారి జాబితాను త్వరలో ప్రకటిస్తామన్నారు. వారందరిపై కేసులు నమోదు చేశామని, దసరా పండగ అనంతరం అరెస్టులు చేస్తామని స్పష్టం చేశారు.

ఈ అవినీతిలో ఉన్న హౌసింగ్ రెవెన్యూ విభాగాల్లో పనిచేసిన అధికారులు ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్ హోదాలో సైతం ఉన్నారని, వారిపై కూడా కేసులు నమోద య్యాయని పేర్కొన్నారు. వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తున్నామన్నారు. అక్రమాలకు పాల్పడిన లబ్ధిదారులపై కూడా కేసులు నమోదు చేశామన్నారు. ప్రభుత్వం ఆదేశిస్తే జిల్లాలోని 36 మండలాల్లో విచారణ జరుపుతామని, విచారణ జరిపితే పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు బయటపడుతాయని వారు తెలిపారు.

అక్రమాలకు పాల్పడిన కొందరు వ్యక్తులు డబ్బులను చెల్లిస్తున్నారని తెలిపారు. మరో రెండు నెలల్లో విచారణ పూర్తవుతుందని వివరించారు. విచారణలో బయటపడిన ఆధారాలను, ఫొటోలను, బిల్లుల వివరాలను విలేకరులకు చూపించారు. సమావేశంలో ఎస్సై నాగేందర్, జహంగీర్, హెడ్‌కానిస్టేబుల్ రశీదొద్దిన్, కానిస్టేబుళ్లు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement