రింగ్.. రింగా..!
‘వడ్డించేవాడు మనవాడైతే...’ అన్న చందంగా మారింది విజయవాడ నగర పరిధిలో పోలీసు శాఖ వ్యవహారం. బంధువైన రాష్ట్రస్థాయి ఉన్నతాధికారి అండదండలు... టీడీపీ ప్రజాప్రతినిధుల సహకారం ఉండడంతో పోలీసు శాఖలో ‘రింగ్ మాస్టర్’ రాజ్యం యథేచ్ఛగా కొనసాగుతోంది. తీవ్ర అవినీతి ఆరోపణలు సాక్ష్యాధారాలతోసహా బయటపడటంతో ప్రస్తుతం ఆయన పశ్చిమగోదావరి జిల్లాలో అజ్ఞాతవాసంలో ఉన్నారు. అయినా తాను సృష్టించిన ‘రింగ్’ ద్వారా విజయవాడ నగరంపై పట్టు కొనసాగిస్తూనే ఉన్నారు. తన వర్గీయులైన ఇద్దరు అధికారుల ద్వారా వ్యవహారాలు నడుపుతున్నారు.
– సాక్షి, అమరావతి బ్యూరో
సాక్షి, అమరావతి బ్యూరో : ‘రింగ్ మాస్టర్’ గతంలో ఏసీబీలో పనిచేసినప్పుడు నగరంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. అనంతరం ఆయన ఏసీబీ నుంచి పోలీసు ప్రధాన కార్యాలయానికి బదిలీ అయ్యారు. కానీ సన్నిహితులైన సిబ్బంది ద్వారా ఏసీబీ వ్యవహారాలను తన గుప్పిట్లోనే ఉండేలా చక్రం తిప్పారు. ప్రధానంగా ఓ కింది స్థాయి ఉద్యోగి ద్వారా ఏసీబీ దాడులకు గురైన అధికారుల నుంచి యథేచ్ఛగా వసూళ్లు కొనసాగించారు. ఆ అవినీతి సొమ్ముతో నగర పరిధిలో రియల్ ఎస్టేట్ వెంచర్లలో పెట్టుబడి కూడా పెట్టారు.
ఆ క్రమంలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి అడ్డగోలు వ్యవహారాలు సాగించారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో ఏసీబీ ఉన్నతాధికారి ఆ కింది స్థాయి ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు. అరెస్టు కూడా చేయాలని నిర్ణయించారు. ఆ ఉద్యోగిని అరెస్టు చేస్తే తన బండారం కూడా బయటపడుతుందని రింగ్‌మాస్టర్ ఆందోళన చెందారు. తమ సమీప బంధువైన రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి ద్వారా నేరుగా కథ నడిపారు. అంతే ఆ కిందిస్థాయి ఉద్యోగిని అరెస్టు చేయాలన్న నిర్ణయం నిలిచిపోయింది. అనంతరం ఆయనకు ఏకంగా రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో పోస్టింగ్ వేయించారు.
రింగ్‌లో ఉన్న అధికారులతో...
► ప్రస్తుతం రింగ్‌మాస్టర్ పశ్చిమగోదావరి జిల్లాకు బదిలీ చేయించుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కానీ నగరంలో తాను ఏర్పరచిన ‘రింగ్’లోని అధికారుల ద్వారా ఇప్పటికీ పట్టు కొనసాగిస్తూనే ఉన్నారు. రింగ్‌లో ఒకరు నగరంలో వాణిజ్య కేంద్రం పరిధిలోకి వచ్చే పోలీస్ అధికారి కాగా మరొకరు నగర శివారుప్రాంతంలోని అధికారి. ఏకంగా రాష్ట్రస్థాయి అధికారి సహకారంతో నగరంలో దాదాపు సమాంతర వ్యవస్థను నడుపుతున్నారు. ఆ అధికారులపై కూడా చర్యలు తీసుకోకుండా ప్రజాప్రతినిధుల ద్వారా రింగ్‌మాస్టర్ కథ నడిపిస్తున్నారు.
► వాణిజ్య ప్రాంతంలో పనిచేసే అధికారి క్రికెట్ బెట్టింగు రాకెట్‌కు సహకరిస్తున్నట్లు పక్కా సమాచారం అందింది. దాంతో ఆయనపై చర్యలకు ఉన్నతాధికారి నిర్ణయించారు. ఈ సమాచారం తెలియడంతో ఆయన ‘రింగ్‌మాస్టర్’ ద్వారా నగరంలో వివాదాస్పదుడైన ఓ ప్రజాప్రతినిధిని సంప్రదించారు. తన నియోజకవర్గ పరిధిలోని ఆ అధికారిని బదిలీ చేయడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. ఎందుకంటే ఆ నియోజకవర్గ పరిధిలో ప్రజాప్రతినిధి వర్గీయులు వ్యాపార వర్గాలను లక్ష్యంగా చేసుకుని సాగిస్తున్న దందాలకు ఆ అధికారి సహకరిస్తున్నారు.
► నగర శివారు ప్రాంతంలోని అధికారి కూడా కాల్‌మనీ రాకెట్‌కు సహకరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో నగరంలోని ప్రధాన స్టేషన్‌లో పని చేసినప్పుడు కూడా ఆయనపై ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆయన్ని వీఆర్‌లోకి పంపించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. కానీ రింగ్‌మాస్టర్ ద్వారా ఆయన టీడీపీ ప్రజాప్రతినిధిని ఆశ్రయించారు. తమ వర్గీయుడైన ఆ అధికారిని అక్కడే కొనసాగించాలని ప్రజాప్రతినిధి ఉన్నతాధికారికి స్పష్టం చేశారు. దాంతో ఆయనపై కూడా చర్యలకు వెనకడుగు వేశారు.