వైఎస్సార్ సీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీలో చేరిన రంగంపేట మండల వెంకటాపురానికి చెందిన మండల టీడీపీ రైతు విభాగం అధ్యక్షుడు మంగిన రాంబాబు (ఫైల్)
అనపర్తి/బిక్కవోలు/పెదపూడి: అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కల్లబొల్లి మాటలపై నమ్మకం లేని వారంతా ఒక్కొక్కరుగా టీడీపీని వీడుతుండడంతో ఆ పార్టీలో ఆందోళన ప్రారంభమైంది. అడుగడుగునా అవినీతి కార్యక్రమాలతో ఆయన అనుచరులు చెలరేగిపోతున్న తీరుకు విసుగుచెందిన పలువురు ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. వీరంతా ప్రత్యామ్నాయంగా వైఎస్సార్ సీపీ వైపు అడుగులు వేయడంతో నియోజకవర్గ ముఖచిత్రం మారిపోతోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. టీడీపీకి చెందిన పెదపూడి–1 ఎంపీటీసీ సభ్యురాలు గుణ్ణం వనిత ఎమ్మెల్యే అవినీతిపై గతంలో గళం విప్పిన విషయం విదితమే. నియోజకవర్గంలోని పెదపూడి, ఏపీత్రయం, పైన, వెంకటాపురం, నల్లమిల్లి, పెదరాయవరం, మర్రిపూడి తదితర గ్రామాల్లో ఆయన అనుచరులు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీలో భారీగా చేరారు.
రంగంపేట మండలంలో టీడీపీకి చెందిన రిమ్మలపూడి వెంకటేశ్వరరావు వైఎస్సార్‌సీపీలోకి మొదటిగా చేరారు. అనంతరం రంగంపేట మండలం టీడీపీ రైతు విభాగం అధ్యక్షుడు మంగిన రాంబాబు పార్టీలో చేరారు. త్వరలో పెదపూడి1 ఎంపీటీసీ సభ్యురాలు గుణ్ణం వనిత చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో టీడీపీకి కంచుకోటగా నిలిచే ఒక బలమైన సామాజికవర్గం వైఎస్సార్‌సీపీలో చేరడానికి ముందడుగు వేస్తుండడంతో టీడీపీ పునాదులకు బీటలు వారనున్నాయి. అనపర్తిలో బలమైన సామాజికవర్గ ప్రతినిధి చాలా కాలంగా ఎమ్మెల్యేకు దూరం ఉంటూ వస్తున్నారు. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, ఎమ్మెల్యేకు మధ్య అంతర్గత విభేదాలు తారా స్థాయికి చేరాయి. వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితికి వచ్చింది. దీనికితోడు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలేవీ అమలు కాకపోవడంతో ప్రజల్లో చోటుచేసుకున్న అసంతృప్తి ఆ పార్టీని పూర్తిగా ముంచేస్తుందన్న భయంతో అరకొరగా ఉండే నేతలు కూడా దూరంగా ఉండడంతో ఎమ్మెల్యే వర్గంలో కలకలం రేపుతోంది. వైఎస్సార్ సీపీ అధినేత జగన్ బుధవారం నుంచి అనపర్తి నియోజకవర్గంలో ప్రారంభించనున్న పాదయాత్రలో చేరికలు వరుస కట్టనున్నాయని ఆ పార్టీలోని వాళ్లే గుసగుసలాడుకుంటున్నారు.
అన్నింటా అవినీతి చెద...
రంగంపేట, అనపర్తి, బిక్కవోలు, పెదపూడి మండలాల్లో ‘నీరు చెట్టు’ పథకంలో మట్టిని అక్రమంగా అమ్ముకుని కాసులు పోగేసుకున్నారనే అరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని ఒక్కో బ్రాందీ షాపు నుంచి సుమారు రూ.2 లక్షలు వరకు మామూళ్లు ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు తీసుకుంటున్నట్టు, ధాన్యం కోనుకోగలు కేంద్రాల నుంచి కూడా బస్తాకు సుమారు రూ.40 వరకు కమీషన్‌గా అందుతున్నట్లు ఆరోపణలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment