ఇసుక దందా | Sand Mafia In Adilabad | Sakshi
Sakshi News home page

ఇసుక దందా

Published Tue, Sep 4 2018 6:51 AM | Last Updated on Sat, Sep 22 2018 8:30 PM

Sand Mafia In Adilabad - Sakshi

చాందా(టీ) ఇసుకను ట్రాక్టర్లులో నింపుతున్న దృశ్యం

ఆదిలాబాద్‌రూరల్‌: జిల్లాలో ఇసుక దందా మళ్లీ జోరందుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగి.. ఇసుక మేటలు వేసింది. ఇది అక్రమార్కులకు వరంగా మారింది. వాగుల నుంచి నిత్యం వందలాది వాహనాల్లో అక్రమార్కులు దర్జాగా ఇసుక తరలిస్తున్నారు. యథేచ్ఛగా వివిధ ప్రాంతాలకు ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. మైన్స్, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఆదిలాబాద్‌ మండలం లాండసాంగ్వి, అర్లి(బి) శివారు ప్రాంతాల్లోని సాత్నాల వాగు, చాందా(టి), భీంసరి, జైనథ్‌ మండలం తరోడ, పూసాయి, బేల మండలం పెన్‌గంగ పరీవాహక ప్రాంతాలు, తాంసి, తలమడుగు, ఇచ్చోడ, బోథ్, ఉట్నూర్‌ తదితర మండలాల్లోని వాగుల నుంచి ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. ఆయా ప్రాంతాల్లోని వాగుల్లో వర్షాకాలంలో కురిసే వర్షాలతో వాగు ప్రవహిస్తుంది. దీంతో ఆయా వాగు పరీవాహక ప్రాంతంలో రైతులకు సంబంధించి పంట పొలాలకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

వాగుల నుంచి ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున ఇసుకను తరలిస్తుండడంతో క్రమేణ భూగర్భ జలాలు అడుగంటి పోయే ప్రమాదం నెలకొంది. కొన్నేళ్లుగా నిరంతరాయంగా అక్రమ ఇసుక రవాణా సాగుతోంది. దీంతో భూగర్భ జలాలు అడుగంటి సాగునీటి వనరులు గణనీయంగా తగ్గిపోతున్నాయని రైతులు పేర్కొంటున్నా ప్రయోజనం లేకుండాపోతోంది. ప్రవాహిస్తున్న వాగుల నుంచి సైతం ఇసుకను తొడేస్తున్నారు. దాడుల సమయంలో పది వాహనాలు పట్టుబడితే వాటిలో కొన్ని వదిలేసి నాలుగైదు వాహనాలకే జరిమానాలు విధిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఆయా గ్రామాల శివారు ప్రాంతాల్లోని ప్రజలు సంబంధిత అధికారులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించినా పట్టించుకోవడంలేదని విమర్శలున్నాయి.

దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి అధికారులు ఎంతమాత్రం కృషి చేయడం లేదు. పగలు రాత్రీ అని తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా సాగుతున్నా ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదని ప్రజలు వాపోతున్నారు. నిత్యం వందలాది ట్రాక్టర్లతో ఇసుక పట్టణంతోపాటు వివిధ ప్రాంతాలకు తరలిపోతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో భూగర్భజలమట్టం మరింతగా పడిపోయే ప్రమాదం ఉందని ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇసుక అక్రమ రవాణా అరికట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

రోడ్లు గుంతలమయం
ఆయా ప్రాంతాల నుంచి జోరుగా అక్రమ ఇసుక రవాణా సాగుతుండగా.. ట్రాక్టర్ల రద్దీకి రోడ్లు గుంతలమయంగా మారుతున్నాయి. దీంతో వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అక్రమంగా ఇసుక రవాణా చేయకూడదని, వాగుల సమీపంలోని పొలాలు ఉన్న రైతులు చెబుతున్నా వారు పట్టిం చుకోవడం లేదని వాపోతున్నారు. కొందరు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారి నుంచి రాయల్టీ రూపంలో ఒక్కో ట్రాక్టర్‌కు రూ.400 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

ప్రభుత్వ పనుల పేరుతో..
ప్రభుత్వ పనులు జరుగుతున్నాయని చెప్పి చాలామంది వ్యాపారులు ప్రైవేట్‌ వారికి ఇసుకను అమ్ముతున్నారు. వ్యాపారులు లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. సంబంధిత ఆయా శాఖల రెవెన్యూ అధికారుల దాడులు సైతం అంతంత మాత్రంగానే ఉండడంతో వారి వ్యాపారం జోరుగా సాగుతోంది.

నీరుగారుతున్న వాల్టా చట్టం.. 
భూగర్భ జల వనరుల సంరక్షణకు తీసుకువచ్చిన వాల్టా చట్టం అమలు నీరుగారుతోంది. వాల్టా చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నా సంబంధిత అధికారులు ప్రేక్షక పాత్ర మినహా మరే ఇతర చర్యలు తీసుకున్న దాఖాలాలు లేవు. కళ్ల ముందే అక్రమ ఇసుక రవాణా సాగుతున్నా పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో వ్యాపారం మూడు ట్రాక్టర్లు ఆరు వేలు అన్న చందంగా సాగుతోంది. మైన్స్, రెవెన్యూ తదితర సంబంధిత శాఖల అధికారులు స్పందించి వాల్టా చట్టం పరిరక్షణకు కృషి చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.


రెవెన్యూ అధికారులే చూసుకోవాలి
పలు ప్రాంతాల్లో ఇసుక రవాణా కొనసాగుతున్నట్లు మా దృష్టికి కూడా వచ్చింది. అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని గతంలోనే చెప్పాం. వారికి నోటీసులు కూడా జారీ చేశాం. – రవిశంకర్, జిల్లా మైన్స్‌ అధికారి, ఆదిలాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement