revenu department
-
జీఎస్టీ వసూళ్లు రూ.1.68 లక్షల కోట్లు
జీఎస్టీ వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. గత ఫిబ్రవరిలో ఏడాది ప్రాతిపదికన 12.5 శాతం పెరిగి రూ.1.68 లక్షల కోట్ల పన్ను వసూలైనట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఏడాది క్రితం ఇదే కాలంలో వసూలైన రూ.1.50 లక్షల కోట్లతో పోలిస్తే ఇది పెరిగింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ 2023-24 ఆర్థిక సంవత్సరంలో సగటు నెలవారీ స్థూల వసూళ్లు రూ. 1.67 లక్షల కోట్లుగా ఉన్నాయని, ఈ మొత్తం గత ఏడాది కంటే ఎక్కువగా ఉందని తెలిపింది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.9.57 లక్షల కోట్లను వసూలు చేయాలని కేంద్రం లక్క్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. -
ఆంధ్రప్రదేశ్‌లో నూతన సంస్కరణలతో రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
పట్టాలెక్కని హక్కు.. ఏళ్ల తరబడి అసైన్డ్ పట్టాదారుల నిరీక్షణ
హద్దుల సమస్యే అడ్డంకి.. రెవెన్యూ శాఖ ద్వారా అసైన్డ్ పట్టాలు పొందిన రైతులు పలు ప్రాంతాల్లోని ఆయా భూముల్లో సాగు చేసుకుంటున్నారు. అయితే కొన్ని చోట్ల అసైన్డ్ భూములు ఫారెస్ట్ పరిధిలోకి వస్తున్నాయని ఆ శాఖ అధికారులు దిమ్మలు ఏర్పాటు చేసి కందకాలు తవ్వారు. దీంతో చాలా చోట్ల రైతులు, అటవీ సిబ్బంది మధ్య గొడవలు చోటుచేసుకోగా పోలీస్ కేసులు నమోదయ్యాయి. కోర్టుల్లో సైతం కేసులు నడుస్తున్నాయి. ఈ విషయాల్లో రెవెన్యూ శాఖ ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉంది. జిల్లాలో అటవీ, రెవెన్యూ భూమికి సంబంధించి పక్కా హద్దులు లేకపోవడంతోనే సమస్య జఠిలంగా మారినట్లు తెలుస్తోంది. అటవీ సరిహద్దుల్లోని సర్వే నంబర్లలో ఇచ్చిన అసైన్డ్ పట్టా భూములకు సంబంధించి ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు అంచనా. ఈ సమస్య పరిష్కారానికి ఫారెస్ట్, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా సర్వే నిర్వహించి హద్దులు గుర్తించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలోనే నిర్ణయించాయని.. ప్రస్తుతం ఆ మాటే మరిచాయని అసైన్డ్ పట్టాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఈ సమస్యపై దృష్టి సారించి.. తమకు హక్కులు కల్పించి న్యాయం చేయాలని కోరుతున్నారు. 38,770 ఎకరాల్లో అసైన్డ్ భూములు.. జిల్లాలోని 11 మండలాలు 52 రెవెన్యూ గ్రామాల పరిధిలో మొత్తం 66,901.05 ఎకరాల్లో అటవీ విస్తీర్ణం కలిగి ఉంది. ఇందులో 1,630 మంది రైతులు 3,195.68 ఎకరాల్లో ఆక్రమణలో ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మరోవైపు ప్రభుత్వ భూముల్లో రిజర్వ్ ఫారెస్ట్‌కు కేటాయించిన భూమి పోను.. మిగతా దాంట్లో కొంత మేర పేద రైతులకు అసైన్డ్ కింద పట్టాలు అందజేశారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో మొత్తం 48,320 ఎకరాల భూమిని అసైన్డ్ పట్టా కింద పేదలకు ఇవ్వగా.. ఇందులో అటవీ పరివాహక గ్రామాలున్న 11 మండలాల్లో అసైన్డ్ పట్టా భూములు దాదాపు 38,770 ఎకరాలున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఏం చేయాలో తోచడం లేదు.. నాకు చిన్నదర్పల్లి గ్రామ శివారు సర్వే నంబర్ 16లో మూడు ఎకరాల విస్తీర్ణంలో లావణిపట్టా భూమి ఉంది. సుమారు 50 ఏళ్లుగా ఈ భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నాం. ఈ సీజన్లో పంట వేసేందుకు భూమిని చదును చేస్తుంటే అటవీ అధికారులు అడ్డుకున్నారు. దీంతో హన్వాడ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి మా భూమిలో పంటలు వేసుకోనివ్వాలని వేడుకున్నా. తరతరాలుగా సాగుచేసుకుంటున్న భూమిలో ఇప్పుడు పంటలు వేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియడం లేదు. నాకు ఏం చేయాలో తోచడం లేదు. – వడ్డె తిరుమలయ్య, చిన్నదర్పల్లి, హన్వాడ -
తీగ లాగితే ‘రెవెన్యూ’ డొంక కదులుతోంది
సాక్షి, గుంటూరు(చేబ్రోలు): ప్రభుత్వం పారదర్శకంగా ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే కొంత మంది అవినీతి అధికారుల కారణంగా చెడ్డపేరు వస్తోంది. చేబ్రోలు తహసీల్దారు కార్యాలయ అధికారి, సిబ్బంది చేతివాటంపై తెనాలి సబ్ కలెక్టర్ నిధి మీనా రెండు రోజులుగా చేబ్రోలులో విచారణ చేపట్టారు. ఈ విచారణలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ‘సాక్షి’ కథనంతో వెలుగులోకి ఈ నెల 3వ తేదీన సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనంతో 4వ తేదీన జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ చేబ్రోలు తహసీల్దారు బీపీ ప్రభాకర్‌ను సస్పెండ్ చేశారు. చేబ్రోలు తహసీల్దారుగా పనిచేస్తున్న బీపీ ప్రభాకర్ మహిళా వలంటీర్‌ని రాత్రి సమయంలో ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడం, ఇళ్ల స్థలాల పంపిణీలో అవకతవకలు, భూములు ఆన్లైన్ నమోదులో అక్రమాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తహసీల్దారును సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై పూర్తిస్థాయిలో విచారణకు తెనాలి సబ్ కలెక్టర్ నిధి మీనా నలుగురు తహసీల్దార్లు, ఆర్ఐలు, రెవెన్యూ సిబ్బంది సహకారంతో జరిపిన రికార్డుల పరిశీలనలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ►రెవెన్యూ నిబంధనల ప్రకారం క్వారీ గోతులకు సాగు భూములుగా అనుమతులు ఇవ్వకూడదు. సస్పెండ్ అధికారి మాత్రం చేబ్రోలు, వడ్లమూడి, సుద్దపల్లి గ్రామాల్లో 80ఎకరాల్లోని క్వారీ భూములకు సాగు భూములుగా ఆన్లైన్లో నమోదు చేసి వాటికి పాసు పుస్తకాలను కూడా అందజేసి సొమ్ము చేసుకున్నట్లు గుర్తించారు. సుద్దపల్లి గ్రామంలోని సర్వే నెంబరు 135,136, 139లలో ఆవుల హరిబాబు, ఝాన్సీ, నవీన్, సుబ్బారావు, సువేందుల కుటుంబానికి చెందిన 60 ఎకరాల భూమి దశాబ్ద కాలం క్రితమే క్వారీంయింగ్ జరిగి గోతులుగా ఉన్న భూమికి సస్పెండ్ అయిన రెవెన్యూ అ«ధికారి లక్షలాది రూపాయిలు జేబులో వేసుకొని కొద్ది నెలల క్రితం పాసుపుస్తకాలు అందజేసి ఆన్లైన్లో నమోదు చేసినట్లు గుర్తించారు. ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చేశారు... ►చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామానికి చెందిన ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చేసి తమ ఘనతను చాటుకున్నారు. వడ్లమూడి గ్రామంలోని సర్వే నెంబరు 345/7లో 96 సెంట్ల భూమి రైతు పేరున ఉంది. దాని పక్కనే ఉన్న ఎకరం ప్రభుత్వ భూమిని కలిపి 1.96 ఎకరాల భూమిని ఆన్లైన్లో ఆ రైతు పేరున నమోదు చేయటం వెనుక లక్షల రూపాయిల సొమ్మును స్థానిక ఆర్ఐ, వీఆర్వో, కంప్యూటర్ ఆపరేటర్ల సహకారంతో సస్పెండ్ అధికారి పూర్తి చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ►చేబ్రోలులోని సర్వే నంబరు 709లో ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో గత 20 ఏళ్లుగా పాసుపుస్తకం జారీకి నోచుకోలేదు. సస్పెండ్ అధికారితో పాటు అతడి అనుచరులు కలిపి పక్కాగా ఆన్లైన్లో నమోదు చేసి పాసుపుస్తకాన్ని అందజేయటంతో లక్షల రూపాయిలు స్వాహా చేసినట్లు సమాచారం. కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను పక్కదారి పట్టించిన సస్పెండ్ అధికారి అతడి సోదరుడు, అతడి ముఖ్య అనుచరులపై విచారణ జరిపి వారిని కూడా సస్పెండ్ చేసి కేసులు నమోదు చేయనున్నట్లు తెలిసింది. ఇళ్ల స్థలాల పంపిణీలో రెవెన్యూ అధికారి లీలలు.. చేబ్రోలు, కొత్తరెడ్డిపాలెం, వేజండ్ల గ్రామాల్లో రెవెన్యూ అధికారులు తమ చేతివాటాన్ని ప్రదర్శించి అనర్హులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్యకు స్థానికులు ఫిర్యాదు చేశారు. డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో కూడా వివిధ గ్రామాల నుంచి తహసీల్దారుపై అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. దీనిపై ఎమ్మెల్యే ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు. నారాకోడూరు మీ సేవా కేంద్రం నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయించి ఎటువంటి విచారణ లేకుండా ఇళ్ల స్థలాలు అందజేసినట్లు గుర్తించారు. తహసీల్దారు 150 మంది వరకు అనర్హులకు ఇళ్ల పట్టాలు, పది నుంచి 20 వేలు వరకు డబ్బులు తీసుకొని అందజేసినట్లు ఫిర్యాదులు అందాయి. ఉన్నతాధికారుల విచారణలో కూడా వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. -
రెవెన్యూలో బయోమెట్రిక్..
ఖానాపురం: చిన్నగా ఆఫీస్‌కు వెళుదామనుకునే రెవెన్యూ ఉద్యోగులకు ఇక కుదరదు. కార్యాలయానికి వెళ్లి కనబడి ఇతర పనులు చూసుకుందామనుకుంటే ఇక ఆ ఆటలు చెల్లవు.. సమయం పాటించని ఉద్యోగులకు బయోమెట్రిక్‌తో పరుగులు పెట్టించడానికి అధికారులు సమయాత్తమవుతున్నారు. రెవెన్యూ కార్యాలయాల్లో సమయపాలన పాటించేవిధంగా ప్రభుత్వం బయోమెట్రిక్‌ను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది.జిల్లా వ్యాప్తంగా 16 మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో తహసీల్దార్, డీటీ, ఆర్ఐ, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లతో పాటు వీఆర్వో, వీఆర్ఏ, కార్యాలయ సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు. ప్రతీ రోజు ఉదయం 10.30 గంటలకు విధులకు హాజరై, సాయంత్రం 5 గంటలకు విధులు ముగించాల్సి ఉంటుంది. ఈ విధానం పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రతీ తహసీల్దార్ కార్యాలయంలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయడానికి మొదట 2012 నుంచి 2014 సంవత్సరం వరకు బయోమెట్రిక్ విధానాన్ని చేపట్టారు. నాడు ఉద్యోగులు ఆధార్ ఎన్రోల్మెంట్ సరిగ్గా చేయకపోవడంతో పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయారు. ఆ తర్వాత బయోమెట్రిక్ విధానాన్ని పూర్తిగా నిలిపివేశారు. ఇటీవల కాలంలో రెవెన్యూశాఖపై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరోసారి తహసీల్దార్ కార్యాలయాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయడానికి కలెక్టర్ ముండ్రాతి హరిత, జేసీ రావుల మహేందర్‌రెడ్డిల ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయాల్లో జరిగే దానికంటే ముందే కలెక్టరేట్ కార్యాలయంలో బయోమెట్రిక్ విధానాలు అమలు చేసి తహసీల్దార్ కార్యాలయాల్లో చేపట్టాలని నిర్ణయానికి వచ్చారు. అనుకున్నదే లక్ష్యంగా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రస్తుతం బయోమెట్రిక్ విధానాన్ని విజయవంతంగా సాగిస్తున్నారు. ఐదు రోజులుగా ఆధార్ ఎన్రోల్మెంట్ ప్రతీ తహసీల్దార్ కార్యాలయంలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసేందుకు కలెక్టర్ హరిత కా ర్యాలయ సిబ్బందికి సూచించారు. ఈ నెల 2 నుం చే అమలు చేయాలని తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో గత వారం రోజులకు పైగా సిబ్బంది బయోమెట్రిక్ విధానాన్ని వినియోగించుకోవడానికి ఆధార్‌ను ఎన్రోల్మెంట్ చేసుకోవ డం జరిగింది. ఆలస్యం చేయకుండా మంగళవా రం నుంచి తప్పకుండా ఉద్యోగులు బయోమెట్రిక్‌ను వినియోగించాలనే స్పష్టమైన ఆదేశాలు రావడంతో ఉద్యోగులు ఆధార్ ఎన్రోల్ చేసుకుం టూనే విధుల హాజరును చేపడుతున్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 191 మంది ఉద్యోగులు రి జిస్టర్ చేసుకోగా 180 మంది ఉద్యోగులకు బయోమెట్రిక్ ఆక్టివేట్ కావడం జరిగింది. అలాగే జిల్లాలో మంగళవారం రోజున 59 మంది బయోమెట్రిక్‌ను ఉపయోగించినట్లు సమాచారం. తేలనున్న ఉద్యోగుల సంఖ్య బయోమెట్రిక్ విధానంతో జిల్లాలో రెవెన్యూ ఉద్యోగుల సంఖ్య స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. ప్రతీ తహసీల్దార్ కార్యాలయంలో ఉండాల్సిన ఉద్యోగల కంటే చాలా తక్కువ స్థాయిలో ఉండటంతో ప్రజలకు న్యాయమైన సేవలు అందడంలేదు. కొన్ని ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో ఐదుగురు లోపు మాత్రమే ఉద్యోగులు ఉండడంతో ప్రజలకు కావాల్సిన సేవలు అందించడంతో రెవెన్యూ ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థి«తులు ఏర్పడుతున్నాయి. బయోమెట్రిక్ విధానం ద్వారా పూర్తిస్థాయిలో ఉద్యోగుల సంఖ్య తెలిసే అవకాశం ఉండగా విధులకు ఎంత మంది హాజరవుతున్నారనే విషయం కలెక్టరేట్లో ఉన్నతాధికారులు ప్రతీ రోజు పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగుల సంఖ్య తేలిన తర్వాత కావాల్సిన ఉద్యోగుల వివరాలను ప్రభుత్వానికి పంపించడానికి కలెక్టరేట్ అధికారులు సమయాత్తమవుతున్నారు. వీఆర్వోలకు మినహాయింపు బయోమెట్రిక్ విధానాన్ని తహసీల్దార్ కార్యాలయంలో పని చేసే ఉద్యోగులకు మాత్రమే వినియోగించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వీఆర్వోలు, వీఆర్ఏలకు బయోమెట్రిక్‌ను అనుసంధానం చేస్తే ఇబ్బందులు ఏర్పడతాయనే ఉద్దేశంతో వారికి మినహాయింపు ఇచ్చినట్లు తెలిసింది. కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు విధులపై నిర్లక్ష్యం చేయకుండా ఉండటానికి బయోమెట్రిక్ చాలా ఉపయోగపడనుంది. బయోమెట్రిక్‌ను అందుబాటులోకి తీసుకువస్తుండడంతో గ్రామాల్లోని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమలుకు శ్రీకారం చుట్టాం ప్రతీ తహసీల్దార్ కార్యాలయంలో బయోమెట్రిక్‌కు శ్రీకారం చుట్టాం. ఈ నెల 2 నుంచి అమలు చేయాలని కలెక్టర్ నుంచి ఆదేశాలు అందుకున్నాం. ఇప్పటికే కలెక్టరేట్లో అమలు చేయడం జరుగుతుంది. ప్రతీ తహసీల్దార్ కార్యాలయంలో బయోమెట్రిక్ విధానాన్ని ప్రారంభిస్తున్నం. – రాజేంద్రనాథ్, కలెక్టరేట్ ఏఓ -
నిబంధనలకు విరుద్ధంగా ఉపాధి
ఫార్మాసిటీ ఏర్పాటు కోసం సేకరించిన అసైన్డ్ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా ఉపాధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ భూముల్లో ఎలాంటి అభివృద్ధి పనులు నిర్వహించవద్దు. కనీసం చెట్ల నరికివేత, మట్టిని కూడా తొలగించవద్దు. అయితే, నింబంధనలకు విరుద్ధంగా డ్వామా అధికారులు నక్కర్తమేడిపల్లిలో ఫార్మాసిటీకి సేకరించిన అసైన్డ్ భూముల్లో నిత్యం వందలాది మంది కూలీలతో భూమి చదును, కరకట్టల నిర్మాణం, ఇంకుడు గుంతల నిర్మాణ పనులు చేయిస్తున్నారు. దాదాపు 500 మందికి పైగా కూలీల ద్వారా ఫార్మాసిటీ భూముల్లో ఉపాధి పనులు జరుగుతున్నాయి. యాచారం: నక్కర్తమేడిపల్లి రెవెన్యూ పరిధిలోని 184, 213, 247 సర్వే నంబర్లల్లోని 600 ఎకరాలకు పైగా అసైన్డ్ భూములను అధికారులు ఫార్మాసిటీ ఏర్పాటు కోసం సేకరించారు. అసైన్డ్ భూముల్లో పట్టాలు పొంది కబ్జాలో ఉన్న రైతులు, పట్టాలున్న రైతులకు ఎకరాకు రూ. 8 లక్షలు, కబ్జాలో ఉన్న రైతులకు ఎకరాకు రూ.7.70 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారు. పరిహారం ఇవ్వడమేకాకుండా సేకరించిన పొలాల్లోని సర్వే నంబర్లలో ఉన్న రైతుల పేర్లు తొలగించి ఫార్మాసిటీకి చెందిన భూములుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేశారు. భూసేకరణ చేసిన పొలాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేయొద్దు. ఈ నేపథ్యంలో యంత్రాంగం రక్షణ నిమిత్తం సేకరించిన భూములకు ప్రత్యేకంగా సిబ్బందిని కూడా కాపలాగా నియమించింది. పరిహారం సరిపోలేదని రైతుల గగ్గోలు ఫార్మాసిటీకి సేకరించిన భూములకు తమకు న్యాయమైన పరిహారం చెల్లించలేదని నక్కర్తమేడిపల్లి రైతులు వాదిస్తున్నారు. భూసేకరణ చట్టం నింబంధనలకు విరుద్ధంగా పరిహారం చెల్లించారని, పట్టాదారు, పాసుపుస్తకాల్లో ఉన్న ఎకరాలకు పూర్తి పరిహారం ఇవ్వలేదని, రాళ్లు, రప్పలు, గుట్టల నెపంతో పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం కోత పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో పరిహారం ఇచ్చే వరకు సదరు భూములు తమవేనని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పూర్తిస్థాయిలో న్యాయమైన పరిహారం ఇవ్వని పక్షంలో వచ్చే ఖరీఫ్‌లో పంటలు కూడా సాగుచేస్తామని బాధిత రైతులు స్పష్టం చేస్తున్నారు. -
నాయకుడు ఆదేశిస్తాడు.. రాయుడు పాటిస్తాడు!
చట్టంతో ఆయనకు సంబంధం లేదు. టీడీపీ నేత చెప్పిందే శాసనం. తన పరిమితులు దాటి ఎవరినైనా బెదిరించడం ఆయన నైజం. ఇదేంటని గట్టిగా ప్రశ్నిస్తే అధికార బలాన్ని ఉపయోగిస్తాడు. భూములు ఆక్రమించుకున్నారని నోటీసులు జారీ చేస్తాడు. కొలతలు వేయించి పట్టాలు రద్దు చేస్తానంటూ బెదిరిస్తాడు. మహానంది మండలంలో ఓ రెవెన్యూ ఉన్నతాధికారి నియంత ధోరణి ఇది. ఈ అధికారి వేధింపులు తాళలేక బుక్కాపురం గ్రామానికి చెందిన రైతు రఘురామ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చావు బతుకుల నుంచి తప్పించుకున్నాడు. మహానంది: మహానంది తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నతాధికారి చెప్పిందే వేదం. అధికారపార్టీ నేతలు అంటే ఆయనకు ఎనలేని ప్రేమ. ఏ అధికారి అయినా అధికారపార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష నేతలను సైతం గౌరవిస్తారు. కానీ ఈయన శైలి మాత్రం వేరు. కేవలం అధికారపార్టీ పక్షానే ఉంటూ వారి పనులకే పెద్దపీట వేస్తున్నాడు. ప్రతి గ్రామంలో ఉన్న అధికారపార్టీ నాయకులను ఓ కోటరీగా తయారు చేసుకుని వారి పనులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్న వైనం ఆశ్చర్యం కలిగిస్తుంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలే టార్గెట్.. శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆయన టార్గెట్. టీడీపీ నేతల ఆదేశాలతో వైఎస్సారీసీపీ కార్యకర్తలైన రైతులకు నోటీసులు జారీ చేయడం..సాగు చేసుకుంటున్న భూములు ప్రభుత్వానివని బెదిరించడం పరిపాటిగా మారింది. ఇప్పటికే ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న 60 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. వీటిలో కొన్ని పట్టా భూములు ఉన్నాయి. కలెక్టర్లు జారీ చేసిన డీ పట్టాలను రద్దు చేయడం, పాసు పుస్తకాల్లో భూములను తొలగించే అధికారం తహసీల్దార్లకు లేదు. దీంతో పలువురు బాధితులు ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించి.. లాయర్ల ద్వారా నోటీసులు జారీ చేశారు. ‘చుక్క’లు చూపిస్తూ... చుక్కల భూములను ఆన్లైన్లో చేర్చేందుకు వివిధ పత్రాలు కలిగి ఉండాలన్న నెపంతో రైతులకు సదరు అధికారులు చుక్కలు చూపిస్తున్నాడు. తిమ్మాపురం గ్రామానికి చెందిన ఓ రైతు భూమిని చేర్చేందుకు ఎకరాకు రూ. 10వేలు డిమాండ్ చేశాడు. ఆయనకు ఉన్న 4.56సెంట్ల భూమిని చేర్చాలంటే సుమారు రూ. 50వేలు డిమాండ్ చేయగా.. రూ. 25వేలకు బేరం కుదుర్చుకున్నా నేటికీ పని కాలేదని తెలుస్తోంది. సంబంధిత రైతు గత జన్మభూమిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. కార్యాలయంలో ఏ విషయం బయటకు చెప్ప వద్దని సిబ్బందిని భయాందోళనలకు గురిచేస్తున్నాడు. ఓటరు జాబితా వివరాలు కావాలన్నా..సదరు అధికారిని అడగాల్సిందే! పట్టా ఉన్నా సరే వేధిస్తున్నాడు.. బుక్కాపురం గ్రామానికి చెందిన మారెడ్డి జయరాం, మారెడ్డి రఘురామ్‌లకు సర్వే నంబరు 89లో చెరో 50 సెంట్ల చొప్పున ఎకరా పొలం ఉంది. వీరిద్దరికి పాసుపుస్తకాల్లో పట్టా నంబర్లు 1002, 1003లలో చెరి 50సెంట్లు ఉంది. అప్పటి తహసీల్దార్ 2004లో డీ పట్టాలు జారీ చేశారు. సుమారు 45 ఏళ్ల నుంచి ఈ పొలాన్ని జయరాం వంశస్తులు సాగు చేసుకుంటున్నారు. ఈ పొలం ప్రభుత్వానికి చెందినదని తహసీల్దార్ ఇటీవల నోటీసులు జారీ చేశాడు. దీనికి కారణం జయరాం వైఎస్సార్సీపీకి చెందినవాడు కావడమే. వీరికే చెందిన మరో పొలం సర్వే నంబరు 93లో 1.25 సెంట్లు పొలం పూర్తిగా ప్రభుత్వానిదే అంటూ నోటీసులు ఇవ్వడం, అధికారపార్టీ నేతలు పోలీసులపై ఒత్తిడి తీసుకుని రావడంతో మారెడ్డి రఘురామ్ ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. కానీ డీపట్టాలను రద్దు చేసే అధికారం తహసీల్దార్‌కు లేదని చట్టాలు తెలిసిన న్యాయవాదులు చెబుతున్నా.. ఈ అధికారి మాత్రం వినకపోవడం వెనుక అధికారపార్టీ నేతల ఒత్తిడి ఏ మేరకు ఉందో అర్థం అవుతూనే ఉందని చెప్పకనే చెప్పవచ్చు. సైనికురాలి సతీమణి పోరాటం.. బండిఆత్మకూరుకు చెందిన ఆదిలక్ష్మి భర్త నాగశేషఫణి భారత సైన్యంలో పనిచేశాడు. ఆయనకు 1992లో మహానంది మండలంలోని పూలకుంట చెరువులో 816 సర్వే నంబరులో 5.08 ఎకరాల భూమిని ఇచ్చారు. అయితే ఇదే పొలానికి రెవెన్యూ అధికారులు మహానంది మండలానికి చెందిన ఓ ముఖ్య అధికారపార్టీ నేతకు పట్టా ఇచ్చారు. దీంతో ఆదిలక్ష్మి కార్యాలయం చుట్టూ తిరుతున్నా, రెవెన్యూ సదస్సులు, జన్మభూమి సభలకు హాజరై తన పరిస్థితి చెప్పుకుని కన్నీటి పర్యంతమవుతున్నా అధికారికి కనికరం లేకుండా పోయింది. తహసీల్దార్‌ను అడిగితే భూములు గుర్తించాక ఇస్తామంటున్నారని బాధితురాలు వాపోతున్నారు. అధికారి అవినీతిపై కరపత్రాలు.. మహానంది మండలంలో అవినీతికి పాల్పడుతున్న రెవెన్యూ ఉన్నతాధికారిపై సీపీఐ(ఎంఎల్) రెడ్స్టార్పార్టీ, సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదలయ్యాయి. పుట్టుపల్లెలో ఒకే రేషన్ కార్డుపై భార్యకు, భర్తకు వేర్వేరుగా ఇళ్లపట్టాలు ఇచ్చారని కరపత్రాల్లో పేర్కొన్నారు. రెవెన్యూ భూములు కాకపోయినా ఆర్అండ్బీ, పంచాయతీరాజ్..తదితర భూముల్లో ఉన్నవారికి సైతం నోటీసులు ఇచ్చి వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కొంత మంది మృతి చెందిన వారిపేరు మీద ఆన్లైన్లో భూములు చేర్చినట్లు తెలిపారు. -
474 మంది ఖరారు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా రెవెన్యూ సిబ్బందిని ఖరారు చేసింది. ఈ మేరకు భూ పరిపాలనా ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాలకు సిబ్బంది సంఖ్యను నిర్దేశించిన ప్రభుత్వం.. డీఆర్ఓ మొదలు చైన్‌మెన్ వరకు ఉద్యోగుల సంఖ్యపై స్పష్టతనిచ్చింది. 2016, ఆక్టోబర్ 11న జిల్లాల పునర్విభజన జరిగింది. ఆ సమయంలో తాత్కాలిక ప్రాతిపదికన (ఆర్డర్ టు సర్వ్) కొత్త జిల్లాలకు ఉద్యోగులను విభజించింది. అప్పటి నుంచి అక్కడే కొనసాగుతున్న ఉద్యోగులకు గతేడాది బదిలీల ద్వారా కొంత వెసులుబాటు కల్పించింది. అయినప్పటికీ, జిల్లాల వారీగా సిబ్బంది సంఖ్యను నిర్ధారించకపోవడంతో రెవెన్యూ విభాగంలో గందరగోళం నెలకొంది. తాజాగా ఈ సంఖ్యపై స్పష్టత రావడంతో ఖాళీగా ఉన్న పోస్టులు తేల నున్నాయి. రెవెన్యూలో.. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల మేరకు కలెక్టరేట్ మొదలు ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలతో కలుపుకొని 474 మంది అవసరమని రెవెన్యూశాఖ నిర్ధారించింది. జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ), డిప్యూటీ కలెక్టర్లు/ఆర్డీవో, పరిపాలనా అధికారులు/తహసీల్దార్లు, సీనియర్ స్టెనో గ్రాఫర్లు, జూనియర్ అసిస్టెంట్లు, జూని యర్ స్టెనోగ్రాఫర్లు, రికార్డు అసిస్టెంట్లు, డ్రైవర్, జమేదార్లు, ఆఫీస్ గుమస్తాలు, చౌకీదార్లు, డిప్యూటీ సర్వే ఇన్స్పెక్టర్లు, మండల గణాంక అధికారులు, మండల సర్వేయర్లు, మండల ప్రణాళిక, గణాంక అధికారులు, చైన్మెన్లు.. ఇలా మొత్తం 18 కేటగిరీల్లో సిబ్బందిని పంపిణీ చేశారు. తద్వారా రెవెన్యూ శాఖ పరిధిలోకి వచ్చే సర్వే ల్యాండ్ రికార్డుల విభాగానికి కూడా ఉద్యోగులను ఖరారు చేశారు. పునర్విభజనకు ముందు జిల్లాలో పనిచేసిన రెవెన్యూ ఉద్యోగులను కొత్త జిల్లాలకు సర్దుబాటు చేశారు. రంగారెడ్డి జిల్లాతోపాటు మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకు కూడా సిబ్బందిని సర్దుబాటు చేయాల్సిరావడంతో అన్ని చోట్ల ఉద్యోగుల కొరత ఏర్పడింది. తాజాగా నిర్ధారించిన కేడర్ స్ట్రెంత్‌లో వికారాబాద్, మేడ్చల్ జిల్లాలో సగం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదే సమయంలో మన జిల్లాలోని ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగంలోనూ ఇదే పరిస్థిత నెలకొంది. ఆర్డీఓల్లో టాప్ తాజా మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో అత్యధికంగా ఆర్డీఓలు కలిగి ఉన్న జిల్లా మనదే కావడం విశేషం. ఐదు రెవెన్యూ డివిజన్లు ఉండడంతో దానికి అనుగుణంగా డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం కేటాయించింది. తహసీల్లార్ద విషయానికి వస్తే అత్యధిక మండలాలు ఉన్న నల్లగొండ తర్వాత మన జిల్లాకు 38 పోస్టులను ఖరారు చేసింది. జిల్లాకు అత్యధికంగా ఏడుగురు రికార్డు అసిస్టెంట్లను కేటాయించారు. -
సాహసోపేతమైన న్యాయమూర్తి
కాలమనేది వోల్టేర్‌ని కూడా జయిస్తుంది కాబట్టి దానికి విరామం కలిగిస్తేనే ఉత్తమమని విల్ డ్యురాంట్ పేర్కొన్నారు. కాని సీవీ నాగార్జునరెడ్డి వంటి అత్యున్నత స్థానాల్లో ఉన్న సాహసోపేతులైన జడ్జీల విషయంలో కాలం కూడా అంతరాయాలను కలిగిస్తుంటుందని చెప్పాల్సి ఉంటుంది. ఏటికి ఎదురీదే స్వభావం, అప్రమత్తతకు మారుపేరైన ఆయన కూడా కాలం ముందు మరొక బాధితుడిగా మారిపోయారనే చెప్పాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణారాహిత్యంతో వ్యవహరిస్తున్న న్యాయవాదుల పట్ల ఆయన తీవ్ర అసహనం ప్రదర్శించేవారు. సమయం గడుస్తున్న కొద్దీ ఆయన మొహంలో కని పించే భావాలను, లంచ్ లోపలే మరో అంశాన్ని ముగించాలంటూ ఆయన ప్రదర్శించే ఆత్రుతను కాస్త తెలివి ఉన్నవారు ఎన్నడూ మర్చిపోలేరు. అయితే ఎంత వేగంగా పనిచేసినప్పటికీ ఆయన తీర్పుల్లో, నాణ్యత విషయంలో ఎలాంటి తడబాటు ఉండదు. న్యాయవాదులు తమ తమ కేసులను చర్చిస్తున్న సమయంలో వారి చాంబర్లలో ఆయన కూడా ఉంటున్నట్లుగా భావించి అప్రమత్తంగా ఉండేవారు. జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి సాహసప్రవృత్తి ఆయన స్వభావంలోనే కాకుండా ఆయన తీర్పుల్లోనూ ప్రతిబింబిస్తూ ఉంటుంది. న్యాయం కోసం తనముందు నిలిచిన ముసలి రైతు, నిస్సహాయ స్థితిలోని కాంట్రాక్ట్ వర్కర్, న్యాయవ్యవస్థ అలసత్వం కారణంగా నిరవధికంగా జైళ్లలో మగ్గుతున్న ఖైదీలు, ప్రాసిక్యూషన్ వారి కేసులో అసంబద్ధ స్వభావంతో కన్నకొడుకును దాదాపుగా కోల్పోయిన తల్లి వీరందరూ ఆయన ముందు సాంత్వన కోసం నిలబడేవారు. జస్టిస్ నాగార్జునరెడ్డికి ముందు కోర్టు వ్యవహారాలు నియమిత వేళల్లో మాత్రమే పనిచేస్తూ వచ్చేవి. సత్వర న్యాయం అనేది శుష్క వాగ్దానంలాగే ఉండేది. జీవిత ఖైదీల అప్పీళ్లు హైకోర్టులో సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న తరుణంలో కనీసం అయిదేళ్ల శిక్షాకాలాన్ని ముగించుకున్న ఖైదీలు బెయిల్తీసుకోవడానికి అర్హులేనంటూ ఆయన సాహసోపేతంగా తీర్పు ఇచ్చారు. న్యాయమూర్తిగా తన 12 ఏళ్ల కెరీర్లో సంవత్సరానికి 92 కేసుల చొప్పున 1,102 తీర్పులను ఆయన వెలువరించారు. ప్రత్యేకించి భూవివాదాలకు సంబంధించిన కేసుల్లో ఆయన ప్రదర్శించిన వైఖరి చరిత్ర సృష్టించింది. జి. సత్యనారాయణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి సంబంధించిన కేసులో రాష్ట్రంలోని రెవెన్యూ చట్టాలపై అద్భుతమైన తీర్పు చెప్పారు. అది భూ వ్యవస్థ పరిణామ చరిత్రను లోతుగా తడిమింది. న్యాయవాదిగా ఉంటూనే సివిల్, పబ్లిక్ చట్టాలపై మంచి అవగాహనను పెంచుకున్నప్పటికీ, నేరన్యాయ చట్టానికి ఆయన చేసిన దోహదం ఆయేషా మీరా హత్య కేసులో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అసలు దోషిని వదిలిపెట్టి పోలీసులు నిందితుడిపై తప్పుడు ఆరోపణలు చేసిన క్రమాన్ని ఆయన చాలా సీరియస్‌గా తీసుకున్నారు. అమాయకుడిపై విచారణ సాగించి అసలు కారకులను వదిలేసిన దర్యాప్తు అధికారులపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించి సంచలనం సృష్టించారు. అలాగే వందలాది ఆరోగ్యమిత్రలు, వైద్య మిత్రలను ఏపీ ప్రభుత్వం తొలగించాలని తీసుకున్న నిర్ణయాన్ని అభిశంసించినంత పనిచేశారాయన. ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి సంక్షేమ రాజ్యంలో ప్రవేశపెట్టిన పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ భావననే ప్రభుత్వాలు ధ్వంసం చేస్తున్నాయని, శాశ్వత నియామకాల పద్ధతి స్థానంలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ నియామకాలకు తావివ్వడం పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ భావనను తొక్కిపడేయడమే కాకుండా ఉద్యోగాలకోసం ఎదురు చూస్తున్న యువతపై తీవ్ర ప్రభావంపడిందని వ్యాఖ్యానించారు. అయిదేళ్ల పాపపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి మరణదండన ఎందుకు విధించలేదంటూ దిగువకోర్టును ఆయన తప్పుపట్టారు. నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళలు, పిల్లలపై జరుగుతున్న నేరాల పట్ల ఆయన అత్యంత ఆసక్తి చూపేవారు. ఈ తరహా నేరాలపై కఠిన చర్యలు తీసుకోనట్లయితే, దేశంలో మహిళలు, పిల్ల లకు భద్రత కరువేనని ఆయన హెచ్చరించారు. ఎలాంటి భయంకానీ, పక్షపాతంకానీ లేకుండా న్యాయవ్యవస్థను సేవిస్తాను అంటూ చేసిన కీలకమైన హామీని ఆయన నెరవేర్చుకున్నారు. పదవీ విరమణ సందర్భంగా ఆయన తన వృత్తిజీవితం పట్ల ప్రదర్శించిన అంకితభావం అనేకమందికి స్ఫూర్తి కలిగిస్తూనే ఉంటుంది. -ఎల్. రవిచంద్ర, సీనియర్ అడ్వొకేట్ (జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి పదవీ విరమణ సందర్భంగా) -
జీఐఎస్ సర్వే నిలుపుదల
కడప కార్పొరేషన్/ప్రొద్దుటూరుటౌన్: జిల్లాలోని కడప నగరపాలక సంస్థ, మున్సిపాలిటీల్లో పన్నును మదింపు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జి యోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సర్వీసు(జీఐ ్డఎస్)ను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సర్కులర్ జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ప్రజలకు పన్ను పెరిగినట్లు స్పెషల్ నోటీసులు జారీ చేయడం, రివిజన్ పిటిషన్లు తీసుకోవడం వంటివన్నీ తక్షణం నిలుపుదల చేయాలంటూ స్టేటస్ కో విధించింది. జిల్లాలోని 8 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లలో ఇప్పటికే జీఐఎస్ సర్వే 90 శాతం పూర్తయింది. ఈ విధానం ద్వారా ప్రతి భవనాన్ని ఉపగ్రహానికి లింక్(జియో ట్యాగింగ్) చేసి కొలతలు వేసి ప న్ను వేసే విధానం ద్వారా జిల్లాలో 80 శాతానికిపైగా ఇళ్లకు పన్ను పెరిగింది. ఆర్వీ అసోషియేట్స్ సంస్థ అనే సంస్థ అన్ని మున్సిపాలిటీల్లో ఈ సర్వే నిర్వహిస్తోంది. జిల్లాలో కడప కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో 2,29,900 గృహాలు ఉండగా, జీఐఎస్ సర్వే వల్ల 1.83లక్షల భవనాలకు పన్ను పె రిగినట్లు తెలుస్తోంది. ఇలా పన్ను పెరిగితే వచ్చే ఎన్నికల్లో పెద్ద దెబ్బ తగులుతుందని భావించిన ప్రభుత్వం నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నిర్ణయం వల్ల పట్టణ ప్రజలకు కాసింత ఉపశమనం కలగనుంది. ఈ సర్వే కోసం ఆర్వీ అసోషియేట్స్ సంస్థకు కోట్ల రూపాయలు చెల్లించింది. ఈ సర్వేను పూర్తిగా నిలిపేస్తే ఆ సంస్థకు చెల్లించిన మొత్తం ప్రభుత్వం నష్టపోక తప్పదు. ఒకవేళ కొనసాగించాలనుకుంటే మాత్రం ఎప్పటి నుంచి కొనసాగిస్తారన్న దానిపై సందిగ్ధత నెలకొంది. సర్వే దాదాపు పూర్తయినందున మెడపై కత్తి వేలాడుతున్నట్లు ప్రభుత్వం ఎప్పటి నుంచి అమలు చేయనుందో, లేక పూర్తిగా రద్దు చేయనుందో తేలేవరకూ టెన్షన్ తప్పదు. రెవెన్యూ సిబ్బందిపై పెరిగిన పనిభారం జీఐఎస్ సర్వే నిర్వహిస్తున్న సంస్థ ప్రతి ఇంటికి సంబంధించిన కొలతలు తీసి మున్సిపల్ కమిషనర్లకు నివేధిక రూపంలో ఇస్తోంది. వీటిని పరిశీలించిన కమిషనర్లు మళ్లీ ఆర్ఐలు, బిల్ కలెక్టర్లతో క్షేత్రస్థాయి విచారణ చేయిస్తున్నారు. దీనివల్ల మున్సిపాలిటీల్లో బిల్కలెక్టర్లు, ఆర్ఐలు, ఆర్ఓలపై పనిభారం పెరిగిపోయింది. ఓ వైపు పింఛన్ల పంపిణీ, మరోవైపు కొత్తగా పన్నులు వేయడం, పేరు మార్పు, పన్నుల వసూళ్లు వంటి పనులన్నీ రెవెన్యూ విభాగం అధికారులే చేయాల్సి ఉంది. కొత్తగా జీఐఎస్ సర్వే వల్ల ప్రతి ఇంటినీ సర్వే చేయడం, ఆ ఇంటికి పన్ను పెరిగితే నోటీసులు ఇవ్వడం, ఆ నోటీసులపై యజమానులు సంతృప్తి చెందకపోతే రివిజన్ పిటిషన్లు స్వీకరించడం వంటి పనుల వల్ల పనిభారం తీవ్రంగా పెరిగిపోయింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ చేసినా పనులు పూర్తి కావడం లేదు. దీంతో సిబ్బందిపై ఆరోపణలు, ఫిర్యాదులు అధికమయ్యాయి. జీఐఎస్ సర్వే డేటా నిలిపివేత పురపాలక శాఖ సంచాలకుల ఆదేశాల మేరకు ఈఆర్పీ సిస్టమ్‌లో దాఖలు చేసిన జీఐఎస్ సర్వే డేటాను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ నిలిపివేయడమైనది. ఈ సర్వే ఆధారంగా ఇవ్వనున్న స్పెషల్ నోటీసుల బట్వాడాను కూడా నిలిపివేస్తున్నాం. స్పెషల్ నోటీసుల బట్వాడా జరిగి, రివిజన్ పిటిషన్లు దాఖలు చేయడబడిన దరఖాస్తులపై తదుపరి ఎలాంటి చర్యలు చేపట్టకుండా వాయిదా వేయాలని ఆదేశాలిచ్చాం. – ఎస్. లవన్న, కమీషనర్, కడప నగరపాలక సంస్థ. -
అంతు లేని నిర్లక్ష్యం!
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : భూప్రక్షాళన ఫలితాలు పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది. చేసిన తప్పులు సరిదిద్దుకోలేని రెవెన్యూ ఉద్యోగులు.. మరో పక్క కాసుల కోసం రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఒంట్లో సత్తువ లేక, అయినవారు ఎవరూ తోడు లేని అభాగ్యులు, రెక్కాడితే డొక్కాడని నిరుపేదలను సైతం వదలకుండా డబ్బుల కోసం పీడిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు... అంతులేని పొరపాట్లు చేసి, పాస్‌పుస్తకంలో సవరణచేయాలన్నా.. పుస్తకం ఇవ్వాలన్నా చేయి తడపాల్సిందేనని డిమాండ్ చేస్తూ కర్షకుల కన్నీటికి కారణమవుతున్నారు. రైతుల అవసరాలను ఆసరా చేసుకుని అందినకాడికి దోచుకుంటున్నారనే విమర్శలున్నాయి. అవసరాలు తీరక... పెట్టుబడికి అవసరమైన అప్పు కోసమే.. లేక లేక అమ్ముకుని అవసరాలు తీర్చుకునేందుకు భూమే ఆధారంగా ఉన్న రైతులకు భూప్రక్షాళన ఇబ్బందులను తెచ్చిపెట్టింది. నిత్యం వందలాది మంది పాస్‌పుస్తకాల కోసం తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గత సంవత్సరం వరకు చేతులో పట్టాదారు పాసుపుస్తకాలున్న చాలా మంది రైతులకు ఇప్పుడు కొత్త పాస్‌పుస్తకాలు అందలేదు. దీంతోబ్యాంకు రుణాలు దేవుడెరుగు... ప్రైవేట్ అప్పులూ పుట్టడం లేదు. అంతంత మాత్రంగా ఉన్న పంటలను రక్షించుకోవడానికి చేతిలో చిల్లిగవ్వ లేని రైతులు రుణం కోసం బ్యాంకులకు వెళ్లగా బ్యాంకర్లు మొండిచేయి చూపుతున్నారు. శాపంగా భూప్రక్షాళన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూప్రక్షాళనలో చోటు చేసుకున్న తప్పులు రైతుల పాలిట శాపంగా పరిణమించాయి. తప్పొప్పుల సవరణకు ప్రభుత్వం గడువు ఇచ్చినా అధికారులు నిర్ణీత సమయంలోగా పూర్తి చేయకపోవడంతో పట్టాదారు పాస్‌పుస్తకాలు చేతికి రాకపోగా రైతుబంధు పథకానికీ దూరమవుతున్నారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన పట్టాదారు పాస్‌పుస్తకాల్లో తప్పులు దొర్లిన వారితో పాటు పార్ట్–బీ(వివాదాస్పదమైనవి)లో ఉన్న భూముల విషయం ఇంకా ఓ కొలిక్కిరాలేదు. భూరిజిస్ట్రేషన్లు, ముటేషన్ల సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు ప్రభుత్వం భూప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టగా ఆశించిన ఫలితాలు రాలేదు. రికార్డుల ప్యూరిఫికేషన్ అనంతరం వివరాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేశారు. ఈ సందర్బంగా చోటు చేసుకున్న తప్పులను సవరించే ప్రక్రియ నేటికీ పూర్తి కాకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎన్నికల విధుల్లోకి ముందస్తు ఎన్నికల నేపథ్యంలో సాధారణ విధులకు దూరమైన అధికారుల తీరుతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూప్రక్షాళన కార్యక్రమాన్ని సగంలోనే వదిలి అధికార యంత్రాంగం ఎన్నికల విధుల్లో నిమగ్నమైంది. పట్టాదారు పాస్‌పుస్తకాల కోసం తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్తున్న రైతులకు ‘ఎన్నికల ఏర్పాట్లలో ఉన్నాం.. ఆగాల్సిందే’ అన్న సమాదానం వస్తుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం కలెక్టర్ కార్యాలయానికి పట్టాదారు పాస్పుస్తకాలిప్పించాలని కోరుతున్నారు. ఇదే క్రమంలో సోమవారం దేవరకద్ర, అడ్డాకులల్లో ఆందోళన చేసిన రైతులు మంగళవారం హన్వాడ, మద్దూరులో నిరసన తెలిపారు. జేబు నింపితేనే.... వీఆర్వో లేరు, తహసీల్దార్ సమావేశంలో ఉన్నారు... మ ళ్లీ రండనే సమాధానాలతో పాస్‌పుస్తకాలకోసం వెళ్లిన రై తులు నిత్యం ఎదుర్కొంటున్నారు. అయితే, అక్కడ అడిగినంత ముట్టజెప్పితే మాత్రం పాస్‌పుస్తకం వెంటనే చే తికి వస్తోందని పలువురు పేర్కొంటుండడం గమనార్హం. ముడుపు ముట్టజెప్పుకోకపోతే పాస్‌పుస్తకం ఊసెత్తడం లేదని రైతులు బహిరంగంగా పేర్కొంటున్నారు. జిల్లాలో 35,885 సవరణలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూప్రక్షాళన కార్యక్రమంలో రికార్డుల ప్యూరిఫికేషన్ నిర్వహించిన అనంతరం కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సమయంలో పాస్‌పుస్తకాల్లో విపరీతంగా తప్పులు దొర్లడంతో సరిచేసి ఇస్తామని రైతుల నుండి పాస్‌బుక్‌లు, చెక్కులు తిరిగి తీసుకున్నారు. ఇలా జిల్లాలో 35,885 తప్పులను గుర్తించారు. అనంతరం పాస్‌పుస్తకాల్లో దొర్లిన తప్పులు సరిచేయక, చెక్కులు, పాస్‌బుక్కులు అందజేయకపోవడంతో రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టు తిరుగుతున్నారు. -
13 కమిటీలు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ఎన్నికలు పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించే బాధ్యతలను వివిధ కమిటీలకు అప్పగించింది. మొత్తం 13 కమిటీలను నియమించగా, ఒక్కో కమిటీకి ఒ క్కో జిల్లా స్థాయి అధికారికి పర్యవేక్షణ బా ధ్యతలను కలెక్టర్ రామ్మోహన్రావు అప్పగించారు. ఈ మేరకు సంబంధిత శాఖల జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. పోలిం గ్ విధులు నిర్వర్తించనున్న అధికారులు, సిబ్బంది నియామకం బాధ్యతలను జిల్లా రెవె న్యూ అధికారి ఆర్.అంజయ్యకు అప్పగించా రు. అలాగే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు అవసరమైన సిబ్బంది కేటాయింపులు, సూక్ష్మ పరిశీలకుల (మైక్రో అబ్జర్వర్ల) వంటి అంశాలను డీఆర్వో పర్యవేక్షించనున్నారు. ట్రాన్స్‌పోర్టు కమిటీ నోడల్ అధికారిగా డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ఎం.వెంకటేశ్వర్‌రెడ్డిని నియమితులయ్యారు. ఈవీఎంలు, పోలింగ్ సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలింపు వంటి బాధ్యతలను డీటీసీకి అప్పగించారు. అలాగే పోలింగ్ నిర్వహణ అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలకు తరలింపు వంటి అంశాలను వెంకటేశ్వర్‌రెడ్డి పర్యవేక్షించనున్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి శిక్షణ తరగతులు, అవగాహన వంటి వాటి కోసం ప్రత్యేక కమిటీని నియమించారు. బోర్గాం(పి) జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్రా రామారావుకు బాధ్యతలు అప్పగించారు. పోలింగ్ నిర్వహణ, కౌంటింగ్‌కు అవసరమైన సామగ్రి ఏర్పాట్ల బాధ్యతలు కార్మిక శాఖ ఉప కమిషనర్ చతుర్వేదికి అప్పగించారు. ఎంతో కీలకమైన ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, అభ్యర్థుల ఖర్చులపై పర్యవేక్షించే కమిటీకి జిల్లా సహకార శాఖాధికారి సింహాచలం నోడల్ అధికారిగా నియమితులయ్యారు. అభ్యర్థుల ఖర్చుపై ఎప్పటికప్పుడు నిఘా ఉండటం వంటి విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందిని డీసీవో పర్యవేక్షించనున్నారు. ఎన్నికల తీరును పరిశీలించేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ స్థాయి ఉన్నతాధికారులు ప్రత్యేక పరిశీలకులుగా జిల్లాకు రానున్నారు. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఈ పరిశీలకులు జిల్లాకు చేరుకుని ఎన్నికల నిర్వహణ తీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తుంటారు. వీటిని సమన్వయం చేసుకునేందుకు నోడల్ అధికారిగా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ హరికృష్ణను నియమించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తును పర్యవేక్షించే బాధ్యతలు సీపీ కార్తికేయకు అప్పగించారు. ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం కోసం ప్రత్యేకంగా మీడియా సెల్‌ను ఏర్పాటు చేశారు. పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ మహ్మద్ ముర్తుజా నోడల్ అధికారిగా వ్యవహరించనున్నారు. అదనపు పీఆర్వో రామ్మోహన్‌రావుకు కూడా ఈ బాధ్యతలు అప్పగించారు. కంప్యూటరైజేషన్ నోడల్ అధికారిగా ఎన్ఐసీ సమాచార అధికారి రాజ్‌గోపాల్‌ను నోడల్ అధికారిగా నియమించారు. స్వీప్ నోడల్ అధికారులుగా డీసీవో సింహాచలం, బాలభవన్ సూపరింటెండెంట్ ప్రభాకర్ నియమితులయ్యారు. హెల్ప్‌లైన్, ఫిర్యాదుల పరిష్కారం, ఎస్ఎంఎస్ మానిటరింగ్, కమ్యూనికేషన్ ప్లాన్ నోడల్ అధికారిగా కార్తిక్, వికలాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన సదుపాయాల కల్పనకు ప్రత్యేక నోడల్ అధికారి ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.స్రవంతికి బాధ్యతలు అప్పగించారు. ఆయా కమిటీలకు కేటాయించిన విధులను సంబంధిత నోడల్ అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఓటర్ల జాబితా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఓటర్ల జాబితా అందజేసినట్లు కలెక్టర్ రామ్మోహన్రావు తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్చే ఆమోదింపబడిన జాబితాను పార్టీల ప్రతినిధులకు అందజేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూం ఇందూరు(నిజామాబాద్ అర్బన్): ఎన్నికల ఫిర్యాదుల కోసం జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రామ్మోహన్రావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కంట్రోల్ రూం 24 గంటల పాటు పని చేస్తుందని పేర్కొన్నారు. కంట్రోల్ రూంకు 18004256644 లేదా 08462–224001కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అలాగే, ఎన్నికల ప్రవర్తన నియమావళిపై మోడల్ కండక్ట్ కోడ్ నోడల్ అధికారి డీసీవో సింహాచలం (91001 15747)కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. -
ఇసుక రవాణాకు ‘కోడ్’ బ్రేక్
సాక్షి, మోర్తాడ్: ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చి న నేపథ్యంలో అభివృద్ధి పనులకు ఇసుకను రవాణా చేయడాన్ని నిలిపి వేస్తూ రెవెన్యూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పెద్దవాగులో గుర్తించిన పలు పాయింట్ల నుంచి బుధ, శుక్రవారాలలో అభివృద్ధి పనుల కోసం ఇసుకను తరలించే వారు. మో ర్తాడ్ మండలంలోని సుంకెట్, ధర్మోరా, వేల్పూర్ మండలంలోని కుకునూర్, కోమన్‌పల్లి, వెంకటాపూర్ పాయింట్ల నుంచి ఇసుకను తరలించే వారు. జక్రాన్‌పల్లి మండలంలోని పలు గ్రామాల నుంచి కూడా అభివృద్ధి పనుల కోసం ఇసుకను తరలించేందుకు అనుమతి ఇచ్చేవారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో గతంలో ప్రారంభించిన పనులతో పాటు, కొత్తగా చేపట్టబోయే అభివృద్ధి పను లను నిలపివేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దీంతో రూ.కోట్లాది విలువ చేసే అభివృద్ధి పనులకు బ్రేక్ పడింది. అభివృద్ధి పనులను నిలిపి వేయాలని ఎన్నికల కమిషన్ ముందుగానే ఆదేశించడంతో అభివృద్ధి పనుల కోసం ఇసుక అవసరం ఉండదని రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. అభివృద్ధి పను లు జరుగనప్పుడు ఇసుక రవాణాకు అను మతి ఇవ్వకూడదని రెవెన్యూ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఒకవేళ అభివృద్ధి పనులకు ఇసుకను తరలించేందుకు అనుమతి ఇస్తే తరలించిన ఇసుక పక్కదారి పట్టే అవకాశం ఉందని అధికారులు సందేహిస్తున్నారు. దీంతో ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వకపోవడమే మంచిదని అధికారులు ఆలోచిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నుంచి ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వడం లేదు. ఇది ఇలా ఉండగా ప్రైవేటు భవనాల నిర్మాణం కోసం మాత్రం ఇసుక రవాణా చేసేందుకు అనుమతి ఇచ్చే అవకా శం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ పనులకు ఒక ట్రిప్పునకు రూ.500 లను వసూలు చేస్తుండగా ప్రైవేటు నిర్మా ణాలకు ఇసుక కోసం రూ.900ల చొప్పున వసూలు చేస్తున్నారు. -
ఎన్నికల ప్రక్రియ స్పీడ్!
ముందస్తు ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం తన పని తాను చేసుకుపోతోంది. ఇటీవలే షెడ్యూల్ ప్రకటించి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన ఎన్నికల సంఘం.. నవంబర్‌లో నోటిఫికేషన్ వెలువడినా ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధం కావాలని సూచించింది. దీంతో ఎన్నికల ప్రక్రియ స్పీడుగా జరుగుతోంది. 2018 నవంబర్ 30 నాటికి గడిచిన నాలుగేళ్లలో ఒకే జిల్లా పరిధిలో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అధికారులను బదిలీ చేయాలని ఆదేశించింది. ఎన్నికల విధులతో నేరుగా సంబంధమున్న అధికారుల బదిలీలకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. ఇప్పటికే పలువురు జాయింట్ కలెక్టర్లు, టీఆర్వోలు, ఆర్డీవోలు, ఏసీపీ/డీసీపీలను, సీఐలను బదిలీ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 35 ఎస్సైఐ, సీఐలతోపాటు పలువురిని బదిలీ చేశారు. మరో ఐదుగురు ఉన్నతాధికారులతోపాటు 32 మంది తహసీల్దార్లు, పలువురు సీఐ, ఎస్సైల బదిలీ జాబితా నేడో రేపో వెలువడనున్నట్లు అధికారవర్గాల సమాచారం. కాగా.. తాజాగా ఓటర్ల జాబితాను కూడా జిల్లాల వారీగా ప్రభుత్వం శుక్రవారం రాత్రి ప్రకటించింది. దీంతో ఓ వైపు బదిలీలు.. మరోవైపు ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక ప్రాంతాలపై అధికారులు ఆరా తీస్తుండగా, జిల్లాలో ఎన్నికల ప్రక్రియ జోరందుకుంది. సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఓ వైపు ఎన్నికల నిబంధనల ప్రకారం జిల్లాలో మూడేళ్లపాటు పనిచేసిన సీఐలు, ఎస్ఐలను బదిలీ చేయాలని మార్గదర్శకాలు జారీ చేసిన ఎన్నికల సంఘం.. మరోవైపు గ్రామాల్లో శాంతిభద్రతల వ్యవహారంపై దృష్టి సారించాలని ఆదేశించింది. ఈ మేరకు కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లా పోలీసు కమిషనర్లు, ఎస్పీలకు ఓ ప్రశ్నావళిని పంపిన ఎన్నికల సంఘం వీలైనంత తొందరలో నివేదిక పంపాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ విషయమై రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి కూడా రెండు రోజుల కింద జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. 2014 సార్వత్రిక ఎన్నికలు రెండు విడతల్లో జరుగగా.. ఆ ఎన్నికల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఎన్ని బైండోవర్లు చేశారు..? రౌడీషీటర్లు ఎంతమంది ఉన్నారు..? ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులు ఎన్ని..? వీటిలో ఎన్ని పరిష్కారమయ్యాయి..? తుపాకీ అనుమతులు ఎంతమందికి ఉన్నాయి..? తదితర వివరాలు పూర్తిస్థాయిలో సేకరించి ఆ అంశాలను నివేదికలో పేర్కొనాలని ఆ ఉత్తర్వులో ఎన్నికల సంఘం సూచించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల సీపీ/ఎస్పీలు ఈ సమాచార సేకరణ బాధ్యతలను ఆయా సబ్ డివిజన్ల పరిధిలోని డీఎస్పీలకు అప్పగించినట్లు తెలిసింది. గ్రామానికి ఇద్దరు కానిస్టేబుళ్ల చొప్పున పంపిన పోలీసు యంత్రాంగం ఆ సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమైంది. పోలీసుల వద్ద ఇదివరకే ఉన్న అంశాలను ఎన్నికల సంఘానికి పంపినా వచ్చే ఎన్నికల్లో శాంతిభద్రతల అంశమే కీలకం కావడంతో మరో తాజాగా నివేదిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రెవెన్యూ, పోలీసు, పంచాయతీ అధికార్ల జాబితా సిద్ధం.. నేడో రేపో ఎన్నికల బదిలీల ఉత్తర్వులు.. జిల్లాలో మళ్లీ అధికారుల స్థాయిలో బదిలీ సందడి మొదలు కానుంది. ఈ ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం జిల్లా స్థా యిలో అధికారుల బదిలీలు పచ్చజెండా ఊపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జీవో నంబర్ 8తో కూడిన ఉత్తర్వులు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి పేరు మీద విడుదల కాగా ఇప్పటికే పలువురు ఎస్సైలతోపాటు పలువురు ఇన్స్పెక్టర్ల బదిలీలు జరిగాయి. జాయింట్ కలెక్టర్లు, డీఆర్వోలు, ఆర్డీవోలు, అసిస్టెంట్ పోలీసు కమిషనర్లు, డీఎస్పీలతోపాటు ఇతర శాఖల అధికారులు బదిలీ అయ్యారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలువురి బదిలీ లు జరిగే అవకాశం ఉండగా, పోలీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులను క్యాడర్‌ను బట్టి పాత వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలకు, హైదరాబాద్‌కు బదిలీ చేసే అవకాశం ఉంది. అదే విధంగా మూడేళ్లు పూర్తయిన 32 మంది తహసీల్దార్లు, తొమ్మిది మంది పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్లతోపాటు పలువురికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు బదిలీల కసరత్తును పూర్తి చేసిన ఉన్నతాధికారులు నేడో రేపో ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని కూడా తెలిసింది. బదిలీలకు నిర్దేశించిన మార్గదర్శక సూత్రాలివి.. శాసనసభ ముందస్తు ఎన్నికల విధుల్లో పాల్గొంటు న్న అధికారులు సొంత జిల్లాల్లో కొనసాగరాదని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది. 2018, నవంబర్ 30 నాటికి గడిచిన నాలుగేళ్ల కాలంలో ఒకే జిల్లా పరిధిలో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అధికారులను బదిలీ చేయాలి. ఎన్నికల విధులతో నేరుగా సంబంధమున్న అధికారుల బదిలీలకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. బదిలీల్లో భాగంగా సొంత జిల్లాలకు ఎవరినీ పంపించరాదు. అలాగే గత అసెంబ్లీ ఎన్నికలు/ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గం/జిల్లా పరిధిలో పని చేసిన జిల్లా ఎన్నికల అధికారులు (డీఈఓ), రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, పోలీసు ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఆపై హోదా కలిగిన అధికారులు మళ్లీ అదే నియోజకవర్గం/జిల్లా పరిధిలో కొనసాగరాదు. ఈ బదిలీల ప్రక్రియను ఈనెల 17లోగా పూర్తి చేసి, నివేదిక ఎన్నికల సంఘానికి సమర్పించాలి. జిల్లాస్థాయిలో ఎన్నికలతో నేరుగా సంబంధం ఉన్న జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, ఎన్నికల నోడల్ అధికారులు, డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లు, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్లకు ఈ బదిలీ మార్గదర్శకాలు వర్తిస్తాయి. ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లతో సంబంధమున్న సీపీ/ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లకు సైతం ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. -
భూ కబ్జా
నేలకొండపల్లి మండల కేం ద్రంలో రూ.కోట్లు విలువచేసే ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురవుతోంది. సుమారు ఆరు దశాబ్దాల క్రితం కొనుగోలు చేసి ఆస్పత్రికి కేటాయించారు. ఆరోగ్యశాఖకు రిజిస్ట్రేషన్ కూడా చేశారు. కానీ పహాణీలో పేరు మార్చలేదు. ఇదే అదనుగా భావించి కొందరు కబ్జా చేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం నిర్లక్ష్యం వీడడంలేదు. నేలకొండపల్లి (ఖమ్మం): మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి భూమి యథేచ్ఛగా ఆక్రమణకు గురవుతోంది. కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు తగిన చర్యలు తీసుకోవడంలేదు. 1961లో ప్రభుత్వం ఆస్పత్రి కోసం సర్వే నంబర్ 219/1లోని రెండు ఎకరాల భూమి కొనుగోలు చేసింది. అప్పటి పంచాయతీ పాలకవర్గం 1961, ఫిబ్రవరి 25న ప్రభుత్వ ఆస్పత్రికి రిజిస్ట్రేషన్ కూడా చేసింది. కానీ పహాణీలో మాత్రం పేరు మార్చలేదు. ఇప్పటికీ 1961లో ఉన్న రైతుల పేరు మీదనే భూమి ఉన్నట్లు పహణీల్లో చూపిస్తోంది. ఇదే అవకాశంగా భావించి కొందరు ఆ స్థలాన్ని ఆక్రమించుకుని యథేచ్ఛగా భవనాలు నిర్మిస్తున్నారు. అయితే ఇటీవల నిర్మాణ పనులను రెవెన్యూ అధికారులు నిలిపివేశారు. దాదాపు రూ.5 కోట్ల విలువ చేసే ఇప్పటికే 29 కుంటల (3509 గజాలు) భూమి ఆక్రమణకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి స్థానిక తహసీల్దార్ 18 మందికి నోటీసులు కూడా జారీ చేశారు. రెవిన్యూ, ఆరోగ్య శాఖల మధ్య కొరవడిన సమన్వయం నేలకొండపల్లి మండల కేంద్రంలో విలువైన స్థలాన్ని కాపాడాల్సిన రెవెన్యూ, ఆరోగ్య శాఖ అధికారులు మిన్నకుండిపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 1961లో 2 ఎకరాల స్థలాన్ని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి (డీఎంహెచ్ఓ) పేరున రిజిస్ట్రేషన్ చేయించారు. అప్పటి నుంచి ఎంతో మంది అధికారులు మారినప్పటికీ ఆ స్థలాన్ని మాత్రం పహాణీలో ఎక్కించలేదు. భూమికి సంబంధించిన పత్రం ఒక్కటి కూడా ఆరోగ్యశాఖాధికారుల వద్ద లేదు. రెవెన్యూ శాఖ అధికారులు కూడా అటువైపు చూడడం లేదు. రెవెన్యూ, ఆరోగ్య శాఖల అధికారులు సమన్వయం చేసుకుని, ప్రభుత్వ స్థలాన్ని కాపాడాల్సిందిపోయి, ఎవరికివారు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. గత అధికారుల ఆదేశాలు బేఖాతర్ గతంలో ఆర్డీఓగా పని చేసిన వాసం వెంకటేశ్వర్లు స్థలం ఆక్రమణపై స్పందించారు. క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టారు. ఆక్రమణ రుజువు కావటంతో పూర్తి స్థాయిలో సర్వే చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన బదిలీపై వెళ్లారు. దీంతో స్థానిక రెవెన్యూ అధికారులు కూడా చేతులు దులుపుకున్నారు. గ్రామస్తుల పోరాట ఫలితంగా మరోసారి సర్వే.. గ్రామస్తులు ఆక్రమణపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయటంతో స్పందించి విచారణకు ఆదేశించారు. సర్వే డిప్యూటీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసచారిని ఆదేశించటంతో కొద్ది రోజులు హడావుడి చేసి చేతులు దులుపుకున్నారు. ఆయన ఖమ్మంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కటంతో ఆక్రమణ కథ కంచికి చేరింది. సీపీఎం, సీపీఐ నాయకులు మరో మారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయటంతో విచారణాధికారిగా సర్వే డిప్యూటీ ఇన్స్పెక్టర్ మురళిని ఆదేశించారు. ఆయన కూడా రెండు రోజులు నేలకొండపల్లిలో హడావుడి చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పటికైనా స్థలంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. రిలే దీక్షలకు అనుమతి నిరాకరణ ఆక్రమణ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని సీపీఎం నాయకులు పలుమార్లు ఆందోళనలు చేపట్టారు. ప్రత్యక్ష కార్యాచరణకు కూడా సిద్ధమయ్యారు. ఈ నెల 8 నుంచి సీపీఎం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో దీక్షలకు అనుమతి ఇవ్వలేదు. దీంతో సోమవారం నుంచి చేపట్టాల్సిన దీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కోర్టులో కేసు నడుస్తోంది ప్రభుత్వ ఆస్పత్రి స్థలం ఆక్రమణపై 18 మందికి నోటీసులు ఇచ్చాం. వారిలో ముగ్గురు కోర్టును ఆశ్రయించారు. కోర్టులో వాయిదాలు నడుస్తున్నాయి. దీంతో ముందుకు సాగలేకపోతున్నాం. కోర్టు వాయిదాలు పూర్తయిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం. –దొడ్డారపు సైదులు, తహసీల్దార్, నేలకొండపల్లి నిర్లక్ష్యం వీడాలి ప్రభుత్వ ఆస్పత్రి స్థలం ఆక్రమణ విషయం తెలిసి కూడా అధికార యంత్రాంగం స్పందించడంలేదు. ప్రజల ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకుంటే పట్టించుకోకపోవటం సరికాదు. అధికార యంత్రాంగం ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడాలి. –ఏటుకూరి రామారావు, నేలకొండపల్లి -
లక్కీ చాన్స్!
సాక్షి, వికారాబాద్: ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్న, సాగు భూములుగా వినియోగించుకుంటున్న వారు.. సదరు స్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఇప్పటికే పలు మార్లు ఈ వెసులుబాటు కల్పించినప్పటికీ.. మరోమారు అవకాశమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఉమ్మడి రాష్ట్రంలోని ఆక్రమిత స్థలాలను రెగ్యులరైజ్ చేయాలని అప్పటి ప్రభుత్వాలు ప్రయత్నాలు సాగించినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేసి సఫలీకృతమైంది. గతంలోనే జీవో.నెం 59 ద్వారా ఆక్రమిత నివాస గృహాల స్థలాలకు సాధారణ మార్కెట్ ధర ప్రకారం లబ్ధిదారుల పేరుమీదనే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. అయినప్పటికీ ఇంకా చాలా మంది ప్రభుత్వ స్థలాల ఆక్రమణదారులు దీన్ని సద్వినియోగం చేసుకోలేదని నిర్ధారించుకున్న ప్రభుత్వం మరోమారు అవకాశమిచ్చింది. అంతే కాకుండా పలు కారణాలతో గతంలో తిరస్కరించిన దరఖాస్తులకు కూడా ఈ విడతలో పరిష్కరించాలని నిర్ణయించింది. గతంలో ఆఫ్‌లైన్‌లో సాగిన ఈ ప్రక్రియ ఈ సారి ఆన్లైన్లోనే చేపట్టనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వ భూముల ఆక్రమణలను క్రమబద్ధీకరించడానికి గాను మొదటిసారిగా జీవో.166ను విడుదల చేశారు. ఈ జీవో ప్రకారం 200 చదరపు గజాల విస్తీర్ణం మేర రెగ్యులరైజేషన్‌కు అవకాశం కల్పించారు. ఈ జీవో కింద వచ్చిన దరఖాస్తులలో అర్హత ఉంటే వాటిని జిల్లా జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీ ఆమోదం మేరకు ఆక్రమణదారులకే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. కాగా ప్రస్తుత క్రమబద్ధీకరణ ప్రక్రియను భూపరిపాలన చీ ఫ్ కమిషనర్ పర్యవేక్షణలో కొనసాగుతోందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. జీవో.179 విడుదల... ప్రభుత్వ స్థలాల, భూముల ఆక్రమణకు సంబంధించి క్రమబద్ధీకరణకు గాను ప్రభుత్వం తాజాగా జీవో.179 విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం సీఎం కేసీఆర్ మరోమారు ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. వీటికి సంబంధించి 20015లో జీవో.58, 59లను జారీచేశారు. జీవో 58 కింద 125 గజాలలోపు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారికి ఉచితంగా రెగ్యులరైజ్ చేశారు. జీవోనెం.59 ప్రకారం 125 గజాలకు పైగా ఆక్రమించుకున్న వారికి మార్కెట్ ధరపై (నామినల్ రేట్) ప్రకారం క్రమబద్ధీకరించారు. ఆక్రమించుకున్న స్థలంలో శాశ్వత కట్టడం (ఇళ్లు నిర్మించుకొని) ఉంటేనే రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించారు. ఖాళీ స్థలాలు ఉన్న పక్షంలో క్రమబద్ధీకరణకు అనర్హులని షరతు పెట్టారు. దీంతో అప్పట్లో ఈ అవకాశాన్ని చాలా మంది వినియోగించుకున్నా..ఇంకా చట్టబద్ధత లేని ఆక్రమిత స్థలాలు ఉన్నట్లు అధికారులు నివేదించారు. ముఖ్యంగా మండల కేంద్రాల్లో ఈ ఆక్రమణలు అధికంగా ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో రెవెన్యూ ఉన్నతాధికారుల సూచనల మేరకు మరోమారు ప్రభుత్వం క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తూ సీఎం కేసీఆర్ తాజా నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని ఇళ్లను నిర్మించుకున్న వారికి, వేయి చదరపు గజాల కంటే ఎక్కువ ప్రభుత్వ భూములను అనధికారికంగా కబ్జాలో ఉంచుకున్నవారికి ఆ భూములను ప్రభుత్వ నిబంధనల ప్రకారం హక్కులు పొందేందుకు గాను తాజాగా జీవోనెం.179ను జారీచేశారు. ఆక్రమణ స్థలం మార్కెట్ రేటు ప్రకారం ఎంత చెల్లించాలనేది నిర్ణయిస్తారు. రెండు, మూడు వాయిదాల్లో ఈ సొమ్మును చెల్లించే అవకాశాన్ని కూడా కల్పించారు. గతంలో తిరస్కరించిన, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు ఈ దఫా మోక్షం కలిగించాలని ప్రభుత్వం సూచించింది. ఈనెల 15వతేదీ నుంచి ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. వచ్చేనెల 15వతేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. వచ్చే సంవత్సరం జనవరిలోగా క్రమబద్ధీకరణ ప్రక్రియను ముగించాలని నిర్ణయించారు. -
కబ్జా గుప్పిట్లో సర్కారు భూమి
శంషాబాద్ రూరల్: ప్రభుత్వ భూములను పరిరక్షించడంలో రెవెన్యూ యంత్రాంగం విఫలమవుతోంది. రూ. కోట్లు విలువ చేసే స్థలాలను అక్రమార్కులు యథేచ్ఛగా కబ్జా చేసి ఇతరులకు విక్రయిస్తున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. అధికారుల నిర్లక్ష్యం.. ఉదాసీనత కబ్జాదారులకు వరంగా మారింది. శంషాబాద్ మండలం.. పాల్మాకుల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 87లో 13 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. పది సంవత్సరాల క్రితం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇందులోని కొంత స్థలం జేఎన్ఎన్యూఆర్ఎం గృహ సముదాయాలకు కేటాయించారు. ఇదే సమయంలో బెంగళూరు జాతీయ రహదారి– ఔటర్ రింగు రోడ్డు అనుసంధానం కోసం కొత్తగా పీ–వన్ రోడ్డు ఏర్పాటు చేశారు. ఈ రహదారి ఇదే సర్వే నంబరులోని భూముల నుంచి వెళ్లింది. రోడ్డుకు రెండు వైపులా దాదాపు రెండెకరాల భూమి మిగిలిపోయింది. దక్షిణం వైపు జేఎన్ఎన్యూఆర్ఎం గృహ సముదాయాలను నిర్మించగా.. కొంత ఖాళీ స్థలం మిగిలింది. ఇక పీ–వన్ రోడ్డుకు ఉత్తరం వైపున సుమారు 2 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండిపోయింది. ఈ స్థలాన్ని ఆనుకుని ఉన్న పట్టా భూముల యజమానులు ప్రభుత్వ భూమిని తమ పొలంలో కలిపేసుకున్నారు. స్థానికంగా రెవెన్యూ అధికారులు, సిబ్బంది అండదండలు పుష్కలంగా ఉండడంతో కొందరు స్థిరాస్తి వ్యాపారులు ప్రభుత్వ భూమిని పట్టా భూముల్లో కలిపేసి ఇతరులకు విక్రయించారు. ఈ భూమి చుట్టూ ప్రహరీ కూడా నిర్మించారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. విలువైన భూముల రక్షణ ఇంతేనా? శంషాబాద్ విమానాశ్రయం, ఔటర్ రింగు రోడ్డు ఏర్పాటుతో మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. పాల్మాకులలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమి పక్క నుంచే నాలుగు వరసల పీ–వన్ రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సమీపంలోనే బెంగళూరు జాతీయ రహదారి కూడా ఉంది. ఈ ప్రాంతంలో ఎకరం పొలం సుమారు రూ.కోటిన్నర వరకు ధర పలుకుతోంది. సర్వే నంబరు 87లో దాదాపు రెండు ఎకరాలు కబ్జాకు గురి కాగా.. ఈ భూములను ఆధీనంలోకి తీసుకున్న కొందరు ఇటీవలే అమ్మకానికి పెట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. విలువైన ప్రభుత్వ భూములను పరిరక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ యంత్రాంగం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. -
ఇసుక దందా
ఆదిలాబాద్‌రూరల్: జిల్లాలో ఇసుక దందా మళ్లీ జోరందుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగి.. ఇసుక మేటలు వేసింది. ఇది అక్రమార్కులకు వరంగా మారింది. వాగుల నుంచి నిత్యం వందలాది వాహనాల్లో అక్రమార్కులు దర్జాగా ఇసుక తరలిస్తున్నారు. యథేచ్ఛగా వివిధ ప్రాంతాలకు ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. మైన్స్, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఆదిలాబాద్ మండలం లాండసాంగ్వి, అర్లి(బి) శివారు ప్రాంతాల్లోని సాత్నాల వాగు, చాందా(టి), భీంసరి, జైనథ్ మండలం తరోడ, పూసాయి, బేల మండలం పెన్‌గంగ పరీవాహక ప్రాంతాలు, తాంసి, తలమడుగు, ఇచ్చోడ, బోథ్, ఉట్నూర్ తదితర మండలాల్లోని వాగుల నుంచి ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. ఆయా ప్రాంతాల్లోని వాగుల్లో వర్షాకాలంలో కురిసే వర్షాలతో వాగు ప్రవహిస్తుంది. దీంతో ఆయా వాగు పరీవాహక ప్రాంతంలో రైతులకు సంబంధించి పంట పొలాలకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాగుల నుంచి ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున ఇసుకను తరలిస్తుండడంతో క్రమేణ భూగర్భ జలాలు అడుగంటి పోయే ప్రమాదం నెలకొంది. కొన్నేళ్లుగా నిరంతరాయంగా అక్రమ ఇసుక రవాణా సాగుతోంది. దీంతో భూగర్భ జలాలు అడుగంటి సాగునీటి వనరులు గణనీయంగా తగ్గిపోతున్నాయని రైతులు పేర్కొంటున్నా ప్రయోజనం లేకుండాపోతోంది. ప్రవాహిస్తున్న వాగుల నుంచి సైతం ఇసుకను తొడేస్తున్నారు. దాడుల సమయంలో పది వాహనాలు పట్టుబడితే వాటిలో కొన్ని వదిలేసి నాలుగైదు వాహనాలకే జరిమానాలు విధిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఆయా గ్రామాల శివారు ప్రాంతాల్లోని ప్రజలు సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించినా పట్టించుకోవడంలేదని విమర్శలున్నాయి. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి అధికారులు ఎంతమాత్రం కృషి చేయడం లేదు. పగలు రాత్రీ అని తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా సాగుతున్నా ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదని ప్రజలు వాపోతున్నారు. నిత్యం వందలాది ట్రాక్టర్లతో ఇసుక పట్టణంతోపాటు వివిధ ప్రాంతాలకు తరలిపోతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో భూగర్భజలమట్టం మరింతగా పడిపోయే ప్రమాదం ఉందని ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇసుక అక్రమ రవాణా అరికట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రోడ్లు గుంతలమయం ఆయా ప్రాంతాల నుంచి జోరుగా అక్రమ ఇసుక రవాణా సాగుతుండగా.. ట్రాక్టర్ల రద్దీకి రోడ్లు గుంతలమయంగా మారుతున్నాయి. దీంతో వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అక్రమంగా ఇసుక రవాణా చేయకూడదని, వాగుల సమీపంలోని పొలాలు ఉన్న రైతులు చెబుతున్నా వారు పట్టిం చుకోవడం లేదని వాపోతున్నారు. కొందరు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారి నుంచి రాయల్టీ రూపంలో ఒక్కో ట్రాక్టర్‌కు రూ.400 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ పనుల పేరుతో.. ప్రభుత్వ పనులు జరుగుతున్నాయని చెప్పి చాలామంది వ్యాపారులు ప్రైవేట్ వారికి ఇసుకను అమ్ముతున్నారు. వ్యాపారులు లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. సంబంధిత ఆయా శాఖల రెవెన్యూ అధికారుల దాడులు సైతం అంతంత మాత్రంగానే ఉండడంతో వారి వ్యాపారం జోరుగా సాగుతోంది. నీరుగారుతున్న వాల్టా చట్టం.. భూగర్భ జల వనరుల సంరక్షణకు తీసుకువచ్చిన వాల్టా చట్టం అమలు నీరుగారుతోంది. వాల్టా చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నా సంబంధిత అధికారులు ప్రేక్షక పాత్ర మినహా మరే ఇతర చర్యలు తీసుకున్న దాఖాలాలు లేవు. కళ్ల ముందే అక్రమ ఇసుక రవాణా సాగుతున్నా పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో వ్యాపారం మూడు ట్రాక్టర్లు ఆరు వేలు అన్న చందంగా సాగుతోంది. మైన్స్, రెవెన్యూ తదితర సంబంధిత శాఖల అధికారులు స్పందించి వాల్టా చట్టం పరిరక్షణకు కృషి చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. రెవెన్యూ అధికారులే చూసుకోవాలి పలు ప్రాంతాల్లో ఇసుక రవాణా కొనసాగుతున్నట్లు మా దృష్టికి కూడా వచ్చింది. అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని గతంలోనే చెప్పాం. వారికి నోటీసులు కూడా జారీ చేశాం. – రవిశంకర్, జిల్లా మైన్స్ అధికారి, ఆదిలాబాద్ -
తహసీల్దార్ కార్యాలయాల్లో దళారీల దందా!
ప్రభుత్వ శాఖలన్నింటిలో ఎక్కువ అవినీతి రెవెన్యూ విభాగంలో ఉందని ప్రభుత్వం నిర్వహించిన సర్వేలు తేటతెల్లం చేశాయి. అవినీతి, దళారీ వ్యవస్థను రూపుమాపాలని మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేసినా అవినీతి రుచిమరిగిన అధికారులు ఎప్పటికప్పుడు కొత్తదారులు వెతుక్కుంటున్నారు. ఏదైనా ధ్రువ పత్రం కోసం సరైన రికార్డులతో మీసేవలో దరఖాస్తు చేసుకుంటే కొద్ది రోజుల్లో సర్టిఫికెట్ వస్తుందని పాలకులు గొప్పలు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం దరఖాస్తుదారులు తహసీల్దార్ కార్యాలయంలో చేయి తడిపితే పని వేగంగా పూర్తవుతుంది. లేదంటే దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. కర్నూలు(అగ్రికల్చర్): మీసేవ కేంద్రాలు అందుబాటులోకి వచ్చినా ధ్రువ పత్రాల కోసం లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఎటవంటి సర్టిఫికెట్ కావాలన్నా మీసేవ కేంద్రంలో తగిన పత్రాలు సమర్పించి ఆన్లైన్లో అప్లోడ్ చేయిస్తే నిర్ణీత గడువు తర్వాత మీసేవ కేంద్రం నుంచి సర్టిఫికెట్ పొందవచ్చనేది నిబంధన. అయితే ఇది ఎక్కడా అమలు కావడం లేదు. పలువురు తహసీల్దార్లు దళారీలను, ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. విచారణ జరిపి ఇవ్వాల్సిన వాటికి మాత్రం అడిగినంత ఇచ్చుకోక తప్పని పరిస్థితి. రెవెన్యూలో అడ్డగోలు వసూళ్లు.... మీసేవ కేంద్రాల్లో రెవెన్యూశాఖకు చెందినవే 70 వరకు సేవలు ఉన్నాయి. మ్యుటేషన్ కమ్ ప్యామిలి ఈ–పాసు పుస్తకం, ల్యాండ్ కన్వర్షన్, ఈబీసీ, ఓబీసీ సర్టిపికెట్లు, వ్యవసాయ ఆదాయపు ధ్రువపత్రం, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తదితర వాటి కోసం వీటిల్లో తగిన డాక్యుమెంట్లతో దరఖాస్తు చేయాలి. తహసీల్దారు వాటిపై వీఆర్ఓ, ఆర్ఐ ద్వారా విచారణ జరిపించి అన్ని సక్రమంగా ఉంటే నిర్ణీత గడువులోపు ఆమోదించి డిజిటల్ సిగ్నేచర్ ద్వారా సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఇలా దాదాపు ఏ మండలంలో అమలు కావడం లేదు. మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే సర్టిఫికెట్ రాదని తహసీల్దార్లే పరోక్షంగా చెబుతున్నారు. మామూళ్లు ముట్టచెప్పకపోవడంతో తిరస్కరణకు గురవుతున్న దరఖాస్తులు అన్ని మండలాల్లో భారీగానే ఉంటున్నాయి. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ పొందడం గగనమే.. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ పొందడం అతి కష్టంగా మారింది. కుటుంబ యజమాని మరణించినపుడు ఆయన భార్యకు వారసత్వ ( ఫ్యామిలీ మెంబర్) సర్టిఫికెట్ అవసరం. అన్ని డాక్యుమెంట్లతో మీసేవ కేంద్రంలో చేసుకుంటే 15 రోజుల్లో ఆమోదించాలి. ఇందుకు భిన్నంగా అన్ని స్థాయిల వారికి ముడుపులు ఇచ్చుకుంటేనే పని అవుతుంది. మ్యుటేషన్ కావాలంటే ఇచ్చుకోక తప్పదు... భూములు కొనుగోలు చేసినపుడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిష్టర్ చేసిన తర్వాత రెవెన్యూ రికార్డులు, వెబ్‌ల్యాండ్‌లో మార్పులు చేసుకోవాలి. వీటినే మ్యుటేషన్‌గా వ్యవహరిస్తారు. ఇందుకు మీసేవ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. తహసీల్దార్ కార్యాలయాల్లో ఇచ్చుకున్న వారి మ్యుటేషన్లు చేస్తూ మిగిలిన వాటిని తిరస్కరిస్తున్నారనే విమర్శలున్నాయి. మ్యుటేషన్ కమ్ ఈ–పాసుపుస్తకాలకు 59,500 దరఖాస్తులు మీసేవ కేంద్రాల ద్వారా వచ్చాయి. వీటిని 30 రోజుల్లో పరిష్కరించాల్సి ఉంది. ఇందులో 36,000 దరఖాస్తులను మాత్రమే ఆమోదించారు.13,500 తిరస్కరించారు. ముడుపులు ఇవ్వకపోవడం వల్ల తిరస్కరించినవే ఎక్కువ ఉన్నట్లు సమచారం. -
‘ప్రత్యేక’.. కష్టాలు తొలగేనా..!
ఆదిలాబాద్‌అర్బన్: గ్రామ పంచాయతీ బాధ్యతలు చేపట్టిన అధికారులకు ‘ప్రత్యేక’ కష్టాలు తొలగేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంచాయతీల్లో అభివృద్ధి పరుగులు తీసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుంటే.. కింది స్థాయి ఉద్యోగులు, కార్మికులు లేక ప్రత్యేక అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. పల్లెలను పచ్చదనం, పరిశుభ్రంతో తీర్చిదిద్దేందుకు మూడు నెలల కార్యాచరణ ప్రణాళిక తయారీ చేసి పంద్రాగష్టు నుంచి పని ప్రారంభించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. పరిశుభ్రత, పచ్చదనం వైపు అడుగులు వేయడానికి సమయం ఆసన్నం కావడంతో కార్యాచరణ రూపకల్పనలో జిల్లా యంత్రాంగంతోపాటు అధికారులు తలమునకలు అవుతున్నారు. వివిధ శాఖల్లో వివిధ హోదాల్లో ఉంటూ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్న అధికారులకు పంచాయతీ బాధ్యతలు అప్పగించడం ఒక భారమనుకుంటే.. పంచాయతీల్లో కార్యదర్శులు, కార్మికులు సరిపడా లేకపోవడం తలకు మించిన భారమవుతోంది. ఇదిలా ఉండగా, గతంలో పంచాయతీకో కార్యదర్శిని నియమిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.. తాజాగా పంచాయతీ కార్మికులకు సైతం వేతనాలు పెంచి అవసరమైన చోట కార్మికులను నియమిస్తామని ప్రకటించడంతో పంచాయతీల్లో ఖాళీ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయినట్లయింది. 328 కార్యదర్శి పోస్టులు ఖాళీ.. జిల్లాలో 18 మండలాల పరిధిలో 509 రెవెన్యూ గ్రామాలున్నాయి. మొత్తం 467 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. బేల మండలంలోని రెండు గ్రామ పంచాయతీలు మినహా.. 465 పంచాయతీలకు ప్రత్యేక అధికారులు ఉన్నారు. జిల్లాలో మొత్తం 467 పంచాయతీ కార్యదర్శులు అవసరం. ప్రస్తుతం 139 మంది కార్యదర్శులు పని చేస్తున్నారు. ఇంకా 328 మంది పంచాయతీ కార్యదర్శులు అవసరం. కాగా, జిల్లాలో గతంలో 243 గ్రామ పంచాయతీలు ఉండేవి. జనాభా ప్రాతిపదికన రెండు, మూడు చిన్నచిన్న పంచాయతీలను కలుపుతూ ఒక క్లస్టర్‌గా విభజించారు. ఈ క్లస్టర్లకు కార్యదర్శులు బాధ్యత వహించారు. తాజాగా 226 కొత్త పంచాయతీలు ఏర్పాటయ్యాయి. ప్రతీ పంచాయతీకో కార్యదర్శిని నియమించి ప్రత్యేక పాలనను సక్రమంగా అందిస్తామని సీఎం కేసీఆర్ ఇది వరకే ప్రకటించారు. ఈ లెక్కన కొత్త, పాత గ్రామ పంచాయతీలకు కలిపి 328 మంది కార్యదర్శులు అవసరం ఉంది. కార్యదర్శులు సరిపడా లేకపోవడంతో ప్రత్యేక అధ/æకారులు పల్లె పాలనలో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కార్మిక పోస్టుల భర్తీపై ఆశలు.. జిల్లాలోని అన్నీ గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుధ్య కార్మికులు ఉన్నారు. గ్రామంలోని ప్రతీ 500 మంది జనాభాకు ఒక స్వీపర్, ఒక పంప్ ఆపరేటర్ పని చేస్తున్నారు. గ్రామ పంచాయతీలో 2 వేల జనాభా ఉంటే అక్కడ ఇద్దరు స్వీపర్లు, ఒక ఆపరేటర్ ఉన్నారు. 5 వేల జనాభా దాటిన గ్రామ పంచాయతీల్లో ముగ్గురు, నలుగురు చొప్పున పని చేస్తున్నారు. ఉదాహరణకు.. జిల్లా కేంద్రానికి అనుకొని మావల మేజర్ గ్రామ పంచాయతీలో 68 మంది పారిశుధ్య కార్మికులు పని చేస్తున్నారు. ఇప్పుడా పంచాయతీ మున్సిపాలిటీలో విలీనం కావడంతో ఒకే కార్మికుడిని అక్కడ ఉంచి మిగతా వారిని వేరే జీపీలకు సర్దుబాటు చేయాల్సి వచ్చింది. ఒక జీపీకి ఇంత మంది కార్మికులు ఉండాలనేది ఎక్కడా లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు నెలకు రూ.500 నుంచి రూ.వెయ్యి చొప్పున ఇస్తున్నారు. కొన్ని పంచాయతీల్లో కార్మికులు నెలకు రూ.4 వేల నుంచి రూ.5 వేలు పొందుతున్నారు. కాగా, జిల్లాలో 467 పంచాయతీల్లో ఐదు వేల జనాభా దాటిన పంచాయతీలు ఆరు ఉండగా, 461 పంచాయతీల్లో 5 వేల కంటే తక్కువే జనాభా ఉంది. ప్రతీ ఐదు వేల మందికి ముగ్గురు కార్మికుల చొప్పున లెక్కేసుకున్నా.. జిల్లాలో 1,383 మంది కార్మికులు అవసరం. ప్రస్తుతం జిల్లాలో 758 మంది పారిశుధ్య కార్మికులు పని చేస్తున్నారు. ఈ లెక్కన ఇంకా 625 మంది కార్మికులు అవసరం. ఈ పోస్టుల భర్తీకే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులకు గ్రామ పంచాయతీ సొంత నిధుల (జనరల్ ఫండ్స్) నుంచి వేతనాలు చెల్లిస్తున్నారు. సమ్మెలో కార్మికులు పంచాయతీలకు కార్యదర్శులు సరిపడా లేకపోవడంతో ప్రత్యేక పాలనకు ముందునుంచి ఒక్కో కార్యదర్శి రెండు, మూడు పంచాయతీలకు ఇన్చార్జిలుగా వ్యవహారిస్తూ వస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఆ పంచాయతీల్లో బాధ్యతలు నిర్వర్తించడంతో పంచాయతీ స్వరూపంపై వారికి అవగాహన ఉంది. ప్రస్తుతం గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక తయారీలో కార్యదర్శులు పాత్ర కీలకం. ఇదిలా ఉండగా, జిల్లా వ్యాప్తంగా గత 20 రోజుల నుంచి జీపీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలని, తమనే కార్యదర్శులుగా నియమించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీలకు వెళ్లకుండా ఆయా మండలాల పరిధిలో కార్మికులు సమ్మె చేస్తున్నారు. దీంతో మూడు నెలల అభివృద్ది ప్రణాళిక రూపకల్పనకు స్పెషలాఫీసర్లు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించడంతోపాటు కొత్త వారిని నియమించి, ఖాళీగా ఉన్న కార్యదర్శుల పోస్టులను భర్తీ చేయాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
రెవెన్యూ తీరు ఏం బాలేదు
మోర్తాడ్(బాల్కొండ) : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం విషయంలో రెవెన్యూ ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపై వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. గురువారం బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలంలోని రామన్నపేట్, పడిగెల్, మోర్తాడ్, కమ్మర్పల్లి మండలంలోని బషీరాబాద్‌లలో రైతుబంధు సదస్సులను నిర్వహించారు. ప్రధానంగా పార్ట్ ‘ఎ’లో చేర్చిన భూములకు పెట్టుబడి సహాయం అందించిన తీరుపై రైతుల నుంచి వివరాలను తెలుసుకోవడంతో పాటు పార్ట్ ‘బి’లో చేర్చిన భూములకు పెట్టుబడి సహాయం అందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సదస్సు సాగింది. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రామ్మోహన్రావు, జాయింట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులు ఈ సదస్సులలో పాల్గొన్నారు. పార్ట్ ‘ఎ’లో చేర్చిన భూములకు పూర్తి స్థాయిలో పెట్టుబడి సహాయం అందించకపోవడానికి రెవెన్యూ ఉద్యోగుల నిర్లక్ష్యమే కారణం అంటూ రైతులు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ ఉద్యోగులు సరైన విధంగా భూ ప్రక్షాళన సర్వేను నిర్వహించకపోవడం వల్ల తాము నష్టపోతున్నామని రైతులు పేర్కొన్నారు. తమకున్న భూమి విస్తీర్ణానికి అందిన పెట్టుబడి సహాయానికి ఎంతో వ్యత్యాసం ఉందని రైతులు వాపోయారు. రెవెన్యూ రికార్డులలో గతంలో ఉన్న వివరాలకు, ఇప్పుడు వెల్లడించిన వివరాలకు పొంతన లేకుండా ఉందని రైతులు వివరించారు. పార్ట్ ‘ఎ’ కంటే పార్ట్ ‘బి’లోనే భూముల శాతం ఎక్కువగా ఉండటం పూర్తిగా రెవెన్యూ తప్పిదమే అని మంత్రి పోచారం స్పష్టం చేశారు. రామన్నపేట్లో 870 ఖాతాలు, మోర్తాడ్‌లో 800 ఖాతాలు, పడిగెల్లోను 750 ఖాతాలు, బషీరాబాద్లోను దాదాపు 200 ఖాతాలను పార్ట్ ‘బి’లో ఎందుకు చేర్చాల్సి వచ్చిందని మంత్రి రెవెన్యూ ఉద్యోగులను ప్రశ్నించారు. ప్రతి రైతుకు పెట్టుబడి సహాయం అందించాలని ప్రభుత్వం ఆదేశిస్తే రెవెన్యూ సిబ్బంది తమ నిర్లక్ష్యంతో పార్ట్ ‘ఎ’లో చేర్చాల్సిన వివరాలను పార్ట్ ‘బి’లో చేర్చి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకు వస్తున్నారని మంత్రి ఆసహనం వ్యక్తం చేశారు. మోర్తాడ్ వీఆర్వో మాణిక్యంను సస్పెండ్ చేయాలని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించడంతో సభా స్థలి వద్దనే సస్పెన్షన్ ఉత్తర్వులను అందించారు. రామన్నపేట్, పడిగెల్లలోను రెవెన్యూ సిబ్బంది పనితీరుపై మంత్రి ఆగ్రహించారు. బషీరాబాద్‌లో వీఆర్వో పనితీరుపై ఆక్షేపించిన మంత్రి చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డికి సూచించారు. పార్ట్ ‘బి’లో చేర్చిన భూములకు సంబంధించి కోర్టు కేసులు ఉన్నవాటిని పక్కన పెట్టి మిగిలిన భూములకు పెట్టుబడి సహాయం, పట్టా పాసుపుస్తకాలను జూన్ 20 వరకు పంపిణి చేయడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. నాలుగు గ్రామాలలో సాగిన రైతుబంధు సదస్సులలో రెవెన్యూ తీరును మొదటి నుంచి మంత్రి తప్పుపట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేక బృందాలతో మళ్లీ పరిశీలన.. పంపిణీ కాని పట్టా పాసుపుస్తకాలు, పెట్టుబడి సహాయం చెక్కులకు సంబంధించి పరిశీలన జరుపడానికి గ్రామాలలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నటు మంత్రి వెల్లడించారు. పార్ట్ ‘బి’లో చేర్చిన భూములకు పట్టాపాసు పుస్తకాలు, పెట్టుబడి సహాయం చెక్కులను అందించడానికి ప్రత్యేక బృందాలు కృషి చేయాలని మంత్రి సూచించారు. మంత్రి సూచన మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడానికి కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు ఆమోదం తెలిపారు. -
రెవెన్యూలో ప్రకంపనలు
సాక్షి, విశాఖపట్నం : అడ్డగోలు ఆర్డర్లు జారీ చేసి అడ్డంగా బుక్కయిన విశాఖ మాజీ ఆర్డీవో వెంకటేశ్వర్లుపై క్రిమినల్ కేసు నమోదుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం రెవెన్యూ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలే ఓ వైపు ఏసీబీ దాడులు, మరో వైపు సిట్ దర్యాప్తుతో జిల్లా రెవెన్యూ శాఖ పరువు పాతాళానికి చేరుకోగా తాజాగా ఆర్డీవో వ్యవహారం రెవెన్యూ వర్గాలను మరింత కుంగదీస్తోంది. ఆర్డీవోను సరెండర్ చేయడంతోపాటు కలెక్టర్ సిఫార్సుతో సస్పెన్షన్ వేటు వేసిన ప్రభుత్వం తాజాగా క్రిమినల్ కేసుకు అనుమతి ఇవ్వడాన్ని రెవెన్యూ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. క్వాసీ జ్యుడీషియల్ వ్యవహారంలో క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశం లేదని సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పు నేపథ్యంలో న్యాయసలహాతో ముందుకు వెళ్లేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతుండగా, ఎలాగైనా క్రిమినల్ కేసు నమోదు కాకుండా అడ్డుకోవాలని రెవెన్యూ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ విశాఖ బ్రాంచ్ అధ్యక్షుడు పీవీఎల్ఎన్ గంగాధరరావు, కార్యదర్శి పి.చంద్రశేఖరరావు నేతృత్వంలో రెవెన్యూ ప్రతినిధుల బృందం ఆదివారం జేసీ సృజన ను కలిసి ఈ మేరకు వినతి పత్రాన్ని సమర్పించారు. డీఆర్వో చంద్రశేఖర్‌రెడ్డి, ఇన్చార్జి ఆర్డీవో గోవిందరాజులతోపాటు ఏపీ జేఏసీ (అమరావతి) జిల్లా చైర్మన్ ఎస్.నాగేశ్వరరెడ్డి, అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఎస్ ప్రకాశరావు తదితరులు జేసీని కలిసి మాజీ ఆర్డీవోపై క్రిమినల్ కేసు నమోదు విషయంలో తమకున్న అభ్యంతరాలను వ్యక్తం చేశారు. తప్పుడు ఆర్డర్లుగా భావిస్తే హైకోర్టులో కొట్టేయాలే తప్ప క్రిమినల్ చర్యలకు దిగడం సరికాదని ఈ సందర్భంగా సంఘ నేతలు జేసీ దృష్టికి తీసుకువచ్చారు. ఎవరైనా రెవెన్యూ ఉద్యోగులు క్వాసీ జ్యుడీషియల్ అధికారంతో జారీ చేసిన ఉత్తర్వుల్లో ఏమైనా తప్పులున్నట్లయితే వాటిని పై కోర్టుల అపీల్ చేసుకోవాలని, అంతేగాని క్రిమినల్ కేసు నమోదు చేయడం సమంజసం కాదన్నారు. ఇదే విషయాన్ని వేర్వేరు కేసుల్లో హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా ఇచ్చిన తీర్పులో స్పష్టం చేశాయని పేర్కొన్నారు. అవినీతికి పాల్పడితే ఏ అధికారినైనా ప్రభుత్వానికి సరెండర్ చేయడం లేదా సస్పెన్షన్ వేయడాన్ని తాము తప్పుబట్టబోమని, డివిజనల్ మేజిస్ట్రేట్ హోదాలో ఇచ్చిన ఉత్తర్వులను ఆధారంగా చేసుకొని క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని తాము అంగీకరించే ప్రసక్తి లేదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన మెమో తొందరుపాటు చర్యగా భావిస్తున్నామని, తక్షణమే దానిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తప్పుడు ఆర్డర్లుగా పేర్కొంటున్నవాటిపై అంకా పూర్తిస్థాయి విచారణనే మొదలు కాలేదని, సదరు ఆర్డర్లను పై కోర్టులో రద్దు పరచలేదని, అంతే కాకుండా ఈ వ్యవహారంపై విచారాణాధికారి నియామకం కూడా జరగలేదని ఈ దశలో క్రిమినల్ చర్యలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆక్షేపణీయమన్నారు. దీనిపై స్పందించిన జేసీ సృజన న్యాయపరమైన సలహా తీసుకున్న తరువాతే క్రిమినల్ కేసు నమోదు విషయంలో తాము ముందుకు వెళ్తామని, ఎవరూ సందేహపడనవసరంలేదని చెప్పారు. జేసీని కలిసినవారిలో సంఘ నేతలు ఎస్.ఎ.త్రినాథరావు, డి.రాజేంద్రవర్మ, పి.శ్యామ్ ప్రసాద్, పి.వి.రత్నం, సీహెచ్ వెంకటరమేష్, బీఎస్ఎస్ ప్రసాద్, ఎస్డీసీ జవహర్లాల్ నెహ్రూ, తహశీల్దార్లు సుధాకర్ నాయుడు, నాగభూషణం తదితరులు ఉన్నారు. -
జీఓ398ను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం
హైదరాబాద్: రిజిస్ట్రేషన్లను రెవెన్యూ శాఖతో లింకు పెడుతూ శుక్రవారం రాత్రి జారీ చేసిన జీఓ398ను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. రెవెన్యూ రికార్డులు సక్రమంగా లేకపోవడంతో ఇప్పటికే జనం నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్లకు రెవెన్యూ అనుమతి తప్పనిసరని శుక్రవారం రాత్రి 7.20 గంటలకు ప్రభుత్వం జీవో నంబరు 398ను విడుదల చేసింది. తక్షణమే ఈ జీవో అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించింది. ముందస్తు సమాచారం లేకపోవడంతో కొత్త నిబంధనలు తెలియక శనివారం కృష్ణా జిల్లా వ్యాప్తంగా 28 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులు కూడా కొత్త నిబంధనల గురించి పూర్తిగా తెలియక తలలుపట్టుకున్నారు. వ్యవసాయ భూములు అమ్ముకోవడానికి రైతులు ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఏర్పడింది. 398 జీఓకు స్వపక్షంలోనూ వ్యతిరేకత! ఈ నేపధ్యంలో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి 398 జీఓను రద్దు చేయాలని కోరారు. ఈ జీఓకు ప్రతిపక్షాలతోపాటు స్వపక్షం నుంచి కూడా వ్యతిరేకత రావడంతో దీనిని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీఓ 398ని నిలిపివేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి చెప్పారు. రైతుల మనోభావాలు గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. భూముల రిజిస్ట్రేషన్‌కు రెవెన్యూ అధికారుల ధృవపత్రాలు అవసరంలేదన్నారు. ప్రస్తుత పద్ధతిలోనే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ జరుగుతుందని కృష్ణమూర్తి చెప్పారు. ** -
ప్రభుత్వ భూమి కబ్జా
విలువైన ప్రభుత్వ భూములపై అధికార పార్టీ నేతలు కన్నేశారు. వాటిని కాజేసేందుకు పథకాలు రచిస్తున్నారు. రెవెన్యూశాఖలోని కొందరి బలహీనతలను ఆసరాగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వ భూములను సొంతం చేసుకుంటున్నారు. ఈ అక్రమాల వెనుక వీఆర్‌ఓలే కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరి స్వార్థానికి ప్రభుత్వభూములే కాకుండా చెరువులు, కుంటలు.. ఆఖరుకు శ్మశానాలు సైతం కరిగిపోతున్నాయి. - అనంతపురం అర్బన్ జాతీయ రహదారి పక్కనున్న భూములే కీలకం రాష్ర్ట విభజన అనంతరం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భూముల ధరలు రెట్టింపు కావడంతో ప్రభుత్వ భూములపై కొందరు ప్రబుద్ధులు కన్నేశారు. ప్రధానంగా 44వ జాతీయరహదారిని ఆనుకుని ఉన్న భూములను దక్కించుకునేందుకు తెగబడుతున్నారు. ఈ వ్యవహారం వీఆర్ఓలకు కాసుల వర్షం కురిపిస్తుండడంతో వారు సైతం కబ్జాదారులకు అండగా నిలిచి, అవరసమైన రికార్డులు పూర్తి చేసి ఇస్తున్నారు. జిల్లాలో సుమారు 3.76 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉండేది. 2004కు ముందు అప్పటి టీడీపీ ప్రభుత్వం హయాంలో సుమారు 20 వేల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీలో భాగంగా సుమారు 75 వేల ఎకరాలను పేదలకు పంచిపెట్టింది. అదే ప్రభుత్వ హయాంలో 2010-14 మధ్య మరో ఆరు వేల ఎకరాలను ఇతరుల పేరుతో పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేసింది. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ పరిస్థితి మరీ దారుణంగా మారింది. 20 వేల ఎకరాలకు పైగా కబ్జా రాప్తాడు నుంచి పెనుకొండ వరకు 44వ జాతీయ రహదారికి ఇరువైపులా వేల ఎకరాల్లో ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇటీవల 20 వేల ఎకరాలు కబ్జాకు గురైనట్లు విశ్వసనీయ సమాచారం. కనగానపల్లి మండలం దాదలూరు సమీపంలో 44వ జాతీయ రహదారి పక్కనే ఉన్న సర్వే 498-2బీ భూమిని చింత వనం కోసం ప్రభుత్వం కేటాయించింది. అయితే అదే సర్వే నంబర్లో దాదాపు 90 ఎకరాల ప్రభుత్వ భూమిని ముక్తాపురానికి చెందిన ఓ వ్యక్తికి ధారాదత్తం చేసినట్లు ఉన్నతాధికారుల విచారణలో వెలుగు చూసింది. ఏడాదిగా దాదాలూరు పంచాయతీకి వీఆర్ఓ లేకపోవడంతో ముక్తాపురం వీఆర్ఓను ఇన్చార్జిగా నియమించారు. ప్రభుత్వ భూమిని ఇతరుల పేర్లతో పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేసినందుకు ఇన్చార్జి వీఆర్ఓపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆక్రమిత చింతవనంలో గోరు చిక్కుడు పంటను సాగు చేస్తుండడం గమనార్హం. ఇలా కాజేస్తున్నారు.. వీఆర్ఓలు కొంతమంది రాజకీయ నాయకులతో పరిచయాలు పెంచుకుని ప్రభుత్వ భూములను కబ్జా చేయడానికి ప్రక్క ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రభుత్వ భూములకు సంబంధించి సాగుకు అనుకూలంగా ఉన్న భూములకు ఒక ఎకరాకు రూ. 10 వేలు నుంచి రూ. 20 వేల వరకు తీసుకుని ఒక్కొక్కరి పేరుతో మూడు నుంచి ఐదు ఎకరాలకు పాత తేదీలలో ఫోర్జరీ సంతాకాలతో పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చేస్తున్నారు. రహదారులు, జాతీయ రహదారుల సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములకు ఒక ఎకరానికి రూ. 50వేలు నుంచి రూ. 60 వేల వరకు తీసుకుని పలుకుబడి ఉన్న నాయకులకు అప్పనంగా ఇచ్చేస్తున్నారు. రాప్తాడు, చెన్నేకొత్తపల్లి, గోరంట్ల, ఓడీసీ, అమడగూరు, కూడేరు, నార్పల, మండలాల్లో ప్రభుత్వ భూమి వేలాది ఎకరాలు కబ్జాకు గురైయింది. ఈ కబ్జాకు గురైన భూమిపై వివిధ బ్యాంకుల్లో పంట రుణాలు కూడా తీసుకున్నారు. ఒకసారి కబ్జాకు గురైన ప్రభుత్వ భూమికి ఎన్ఓసీ జారీ చేస్తే ఆ భూమి రెట్టింపు ధరలకు విక్రయించుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఈ ప్రభుత్వ భూముల కబ్జాలతో కొంతమంది వీఆర్ఓలు కోట్లకు పడగలెత్తున్నారనే ఆరోపణలు కోకొల్లలు.