మోర్తాడ్ సదస్సులో మాట్లాడుతున్న మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
మోర్తాడ్(బాల్కొండ) : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం విషయంలో రెవెన్యూ ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపై వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. గురువారం బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలంలోని రామన్నపేట్, పడిగెల్, మోర్తాడ్, కమ్మర్‌పల్లి మండలంలోని బషీరాబాద్‌లలో రైతుబంధు సదస్సులను నిర్వహించారు. ప్రధానంగా పార్ట్ ‘ఎ’లో చేర్చిన భూములకు పెట్టుబడి సహాయం అందించిన తీరుపై రైతుల నుంచి వివరాలను తెలుసుకోవడంతో పాటు పార్ట్ ‘బి’లో చేర్చిన భూములకు పెట్టుబడి సహాయం అందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సదస్సు సాగింది.
మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రామ్మోహన్‌రావు, జాయింట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులు ఈ సదస్సులలో పాల్గొన్నారు. పార్ట్ ‘ఎ’లో చేర్చిన భూములకు పూర్తి స్థాయిలో పెట్టుబడి సహాయం అందించకపోవడానికి రెవెన్యూ ఉద్యోగుల నిర్లక్ష్యమే కారణం అంటూ రైతులు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ ఉద్యోగులు సరైన విధంగా భూ ప్రక్షాళన సర్వేను నిర్వహించకపోవడం వల్ల తాము నష్టపోతున్నామని రైతులు పేర్కొన్నారు. తమకున్న భూమి విస్తీర్ణానికి అందిన పెట్టుబడి సహాయానికి ఎంతో వ్యత్యాసం ఉందని రైతులు వాపోయారు. రెవెన్యూ రికార్డులలో గతంలో ఉన్న వివరాలకు, ఇప్పుడు వెల్లడించిన వివరాలకు పొంతన లేకుండా ఉందని రైతులు వివరించారు. పార్ట్ ‘ఎ’ కంటే పార్ట్ ‘బి’లోనే భూముల శాతం ఎక్కువగా ఉండటం పూర్తిగా రెవెన్యూ తప్పిదమే అని మంత్రి పోచారం స్పష్టం చేశారు. రామన్నపేట్‌లో 870 ఖాతాలు, మోర్తాడ్‌లో 800 ఖాతాలు, పడిగెల్‌లోను 750 ఖాతాలు, బషీరాబాద్‌లోను దాదాపు 200 ఖాతాలను పార్ట్ ‘బి’లో ఎందుకు చేర్చాల్సి వచ్చిందని మంత్రి రెవెన్యూ ఉద్యోగులను ప్రశ్నించారు.
ప్రతి రైతుకు పెట్టుబడి సహాయం అందించాలని ప్రభుత్వం ఆదేశిస్తే రెవెన్యూ సిబ్బంది తమ నిర్లక్ష్యంతో పార్ట్ ‘ఎ’లో చేర్చాల్సిన వివరాలను పార్ట్ ‘బి’లో చేర్చి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకు వస్తున్నారని మంత్రి ఆసహనం వ్యక్తం చేశారు. మోర్తాడ్ వీఆర్వో మాణిక్యంను సస్పెండ్ చేయాలని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించడంతో సభా స్థలి వద్దనే సస్పెన్షన్ ఉత్తర్వులను అందించారు.
రామన్నపేట్, పడిగెల్‌లలోను రెవెన్యూ సిబ్బంది పనితీరుపై మంత్రి ఆగ్రహించారు. బషీరాబాద్‌లో వీఆర్వో పనితీరుపై ఆక్షేపించిన మంత్రి చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డికి సూచించారు. పార్ట్ ‘బి’లో చేర్చిన భూములకు సంబంధించి కోర్టు కేసులు ఉన్నవాటిని పక్కన పెట్టి మిగిలిన భూములకు పెట్టుబడి సహాయం, పట్టా పాసుపుస్తకాలను జూన్ 20 వరకు పంపిణి చేయడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. నాలుగు గ్రామాలలో సాగిన రైతుబంధు సదస్సులలో రెవెన్యూ తీరును మొదటి నుంచి మంత్రి తప్పుపట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ప్రత్యేక బృందాలతో మళ్లీ పరిశీలన..
పంపిణీ కాని పట్టా పాసుపుస్తకాలు, పెట్టుబడి సహాయం చెక్కులకు సంబంధించి పరిశీలన జరుపడానికి గ్రామాలలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నటు మంత్రి వెల్లడించారు. పార్ట్ ‘బి’లో చేర్చిన భూములకు పట్టాపాసు పుస్తకాలు, పెట్టుబడి సహాయం చెక్కులను అందించడానికి ప్రత్యేక బృందాలు కృషి చేయాలని మంత్రి సూచించారు. మంత్రి సూచన మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడానికి కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌లు ఆమోదం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment