హద్దుల సమస్యే అడ్డంకి..
రెవెన్యూ శాఖ ద్వారా అసైన్డ్ పట్టాలు పొందిన రైతులు పలు ప్రాంతాల్లోని ఆయా భూముల్లో సాగు చేసుకుంటున్నారు. అయితే కొన్ని చోట్ల అసైన్డ్ భూములు ఫారెస్ట్ పరిధిలోకి వస్తున్నాయని ఆ శాఖ అధికారులు దిమ్మలు ఏర్పాటు చేసి కందకాలు తవ్వారు. దీంతో చాలా చోట్ల రైతులు, అటవీ సిబ్బంది మధ్య గొడవలు చోటుచేసుకోగా పోలీస్ కేసులు నమోదయ్యాయి. కోర్టుల్లో సైతం కేసులు నడుస్తున్నాయి. ఈ విషయాల్లో రెవెన్యూ శాఖ ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉంది. జిల్లాలో అటవీ, రెవెన్యూ భూమికి సంబంధించి పక్కా హద్దులు లేకపోవడంతోనే సమస్య జఠిలంగా మారినట్లు తెలుస్తోంది.
అటవీ సరిహద్దుల్లోని సర్వే నంబర్లలో ఇచ్చిన అసైన్డ్ పట్టా భూములకు సంబంధించి ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు అంచనా. ఈ సమస్య పరిష్కారానికి ఫారెస్ట్, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా సర్వే నిర్వహించి హద్దులు గుర్తించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలోనే నిర్ణయించాయని.. ప్రస్తుతం ఆ మాటే మరిచాయని అసైన్డ్ పట్టాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఈ సమస్యపై దృష్టి సారించి.. తమకు హక్కులు కల్పించి న్యాయం చేయాలని కోరుతున్నారు.
38,770 ఎకరాల్లో అసైన్డ్ భూములు..
జిల్లాలోని 11 మండలాలు 52 రెవెన్యూ గ్రామాల పరిధిలో మొత్తం 66,901.05 ఎకరాల్లో అటవీ విస్తీర్ణం కలిగి ఉంది. ఇందులో 1,630 మంది రైతులు 3,195.68 ఎకరాల్లో ఆక్రమణలో ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మరోవైపు ప్రభుత్వ భూముల్లో రిజర్వ్ ఫారెస్ట్‌కు కేటాయించిన భూమి పోను.. మిగతా దాంట్లో కొంత మేర పేద రైతులకు అసైన్డ్ కింద పట్టాలు అందజేశారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో మొత్తం 48,320 ఎకరాల భూమిని అసైన్డ్ పట్టా కింద పేదలకు ఇవ్వగా.. ఇందులో అటవీ పరివాహక గ్రామాలున్న 11 మండలాల్లో అసైన్డ్ పట్టా భూములు దాదాపు 38,770 ఎకరాలున్నట్లు రికార్డులు చెబుతున్నాయి.
ఏం చేయాలో తోచడం లేదు..
నాకు చిన్నదర్పల్లి గ్రామ శివారు సర్వే నంబర్ 16లో మూడు ఎకరాల విస్తీర్ణంలో లావణిపట్టా భూమి ఉంది. సుమారు 50 ఏళ్లుగా ఈ భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నాం. ఈ సీజన్‌లో పంట వేసేందుకు భూమిని చదును చేస్తుంటే అటవీ అధికారులు అడ్డుకున్నారు. దీంతో హన్వాడ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి మా భూమిలో పంటలు వేసుకోనివ్వాలని వేడుకున్నా. తరతరాలుగా సాగుచేసుకుంటున్న భూమిలో ఇప్పుడు పంటలు వేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియడం లేదు. నాకు ఏం చేయాలో తోచడం లేదు.
– వడ్డె తిరుమలయ్య, చిన్నదర్పల్లి, హన్వాడ
Comments
Please login to add a commentAdd a comment