
ముమ్మరంగా శిథిలాల తొలగింపు
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగంలో గల్లంతైన కార్మికుల ఆచూకీ కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఇందుకోసం డీ2 ప్రదేశం వరకు పేరుకుపోయిన మట్టి, బురద, బండరాళ్లు, టీబీఎం ప్లాట్‌ఫాం, శిథిలాలను 281 మీటర్ల వరకు పూర్తిగా తొలగించారు. సొరంగం మార్గంలో సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బందికి నిషేధిత ప్రదేశం సవాల్‌గా మారింది. సాంకేతిక కమిటీ సూచనల మేరకు శనివారం నుంచి డీ–1 ప్రదేశంలో 10 మీటర్ల వరకు శిథిలాల తొలగింపు ప్రక్రియ చేపడుతున్నారు. దక్షిణమధ్య రైల్వే సిబ్బంది ప్లాస్మా థర్మల్ గ్యాస్ కట్టర్‌తో టీబీఎం ప్లాట్‌ఫాం భాగాలు కత్తిరించి లోకో ట్రైన్, ఎస్కవేటర్ల సహాయంతో సొరంగం బయటకు తరలిస్తున్నారు. ఉబికి వస్తున్న నీటి ఊటను భారీ మోటార్ల సాయంతో పంపింగ్ చేస్తూ కృష్ణాదిలోకి వదులుతున్నారు. అయితే నిషేధిత ప్రదేశంలో మట్టి, రాళ్లు కదిలిస్తే మరో ప్రమాదం జరిగే ఉండటంతో అంతకు మించి ముందుకు వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు.
నిషేధిత ప్రదేశంలో..
డేంజర్ జోన్ పరిధిలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్, సింగరేణి, హైడ్రా, దక్షిణమధ్య రైల్వే సిబ్బంది జంకుతున్నట్లు తెలిసింది. సొరంగం లోపలకు వెళ్లేందుకు వారు నిరాకరించడంతో ఆదివారం జేపీ కంపెనీకి చెందిన ఆరుగురు కార్మికులు నిషేధిత ప్రదేశానికి వెళ్లి వాటర్ జెట్‌లతో కాంక్రీట్ సెగ్మెంట్ బ్లాకుల లిఫ్టింగ్ క్రేన్ ప్లాట్‌ఫాం, టీబీఎం మిషన్ ప్లాట్‌ఫాంలపై పేరుకుపోయిన మట్టి, బురద తొలగించారు. గల్లంతైన కార్మికులు ప్లాట్‌ఫాంలో ఉండే అవకాశం ఉందని భావించి సహాయక చర్యలు చేపడుతున్నారు. టీబీఎం, క్రేన్ ప్లాట్‌ఫాం భాగాలను తొలగిస్తున్నారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇవ్వడంతోపాటు సొరంగంలో నెలకొన్న భయానక పరిస్థితులు ఉన్న ప్రదేశంలోకి వెళ్లేందుకు నిరాకరించడంతో ఆరుగురు సిబ్బంది సస్పెండ్ చేసింది. ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందికి వాటర్ జెట్ ఉపయోగించే అనుభవం ఉండటం, వారు విధుల్లో చేరకపోవడంతో నిషేధిత ప్రదేశంలో పనుల్లో జాప్యానికి కారణమవుతున్నట్లు తెలిసింది.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో కొనసాగుతున్న అన్వేషణ
నేటికీ అంతుచిక్కని ఆరుగురికార్మికుల ఆచూకీ