విలువైన ప్రభుత్వ భూములపై అధికార పార్టీ నేతలు కన్నేశారు. వాటిని కాజేసేందుకు పథకాలు రచిస్తున్నారు. రెవెన్యూశాఖలోని కొందరి బలహీనతలను ఆసరాగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వ భూములను సొంతం చేసుకుంటున్నారు. ఈ అక్రమాల వెనుక వీఆర్‌ఓలే కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరి స్వార్థానికి ప్రభుత్వభూములే కాకుండా చెరువులు, కుంటలు.. ఆఖరుకు శ్మశానాలు సైతం కరిగిపోతున్నాయి.
- అనంతపురం అర్బన్
జాతీయ రహదారి పక్కనున్న భూములే కీలకం
రాష్ర్ట విభజన అనంతరం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భూముల ధరలు రెట్టింపు కావడంతో ప్రభుత్వ భూములపై కొందరు ప్రబుద్ధులు కన్నేశారు. ప్రధానంగా 44వ జాతీయరహదారిని ఆనుకుని ఉన్న భూములను దక్కించుకునేందుకు తెగబడుతున్నారు. ఈ వ్యవహారం వీఆర్‌ఓలకు కాసుల వర్షం కురిపిస్తుండడంతో వారు సైతం కబ్జాదారులకు అండగా నిలిచి, అవరసమైన రికార్డులు పూర్తి చేసి ఇస్తున్నారు. జిల్లాలో సుమారు 3.76 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉండేది.
2004కు ముందు అప్పటి టీడీపీ ప్రభుత్వం హయాంలో సుమారు 20 వేల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీలో భాగంగా సుమారు 75 వేల ఎకరాలను పేదలకు పంచిపెట్టింది. అదే ప్రభుత్వ హయాంలో 2010-14 మధ్య మరో ఆరు వేల ఎకరాలను ఇతరుల పేరుతో పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేసింది. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ పరిస్థితి మరీ దారుణంగా మారింది.
20 వేల ఎకరాలకు పైగా కబ్జా
రాప్తాడు నుంచి పెనుకొండ వరకు 44వ జాతీయ రహదారికి ఇరువైపులా వేల ఎకరాల్లో ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇటీవల 20 వేల ఎకరాలు కబ్జాకు గురైనట్లు విశ్వసనీయ సమాచారం. కనగానపల్లి మండలం దాదలూరు సమీపంలో 44వ జాతీయ రహదారి పక్కనే ఉన్న సర్వే 498-2బీ భూమిని చింత వనం కోసం ప్రభుత్వం కేటాయించింది.
అయితే అదే సర్వే నంబర్‌లో దాదాపు 90 ఎకరాల ప్రభుత్వ భూమిని ముక్తాపురానికి చెందిన ఓ వ్యక్తికి ధారాదత్తం చేసినట్లు ఉన్నతాధికారుల విచారణలో వెలుగు చూసింది. ఏడాదిగా దాదాలూరు పంచాయతీకి వీఆర్‌ఓ లేకపోవడంతో ముక్తాపురం వీఆర్‌ఓను ఇన్‌చార్జిగా నియమించారు. ప్రభుత్వ భూమిని ఇతరుల పేర్లతో పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేసినందుకు ఇన్‌చార్జి వీఆర్‌ఓపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆక్రమిత చింతవనంలో గోరు చిక్కుడు పంటను సాగు చేస్తుండడం గమనార్హం.
ఇలా కాజేస్తున్నారు..
వీఆర్‌ఓలు కొంతమంది రాజకీయ నాయకులతో పరిచయాలు పెంచుకుని ప్రభుత్వ భూములను కబ్జా చేయడానికి ప్రక్క ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రభుత్వ భూములకు సంబంధించి సాగుకు అనుకూలంగా ఉన్న భూములకు ఒక ఎకరాకు రూ. 10 వేలు నుంచి రూ. 20 వేల వరకు తీసుకుని ఒక్కొక్కరి పేరుతో మూడు నుంచి ఐదు ఎకరాలకు పాత తేదీలలో ఫోర్జరీ సంతాకాలతో పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చేస్తున్నారు.
రహదారులు, జాతీయ రహదారుల సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములకు ఒక ఎకరానికి రూ. 50వేలు నుంచి రూ. 60 వేల వరకు తీసుకుని పలుకుబడి ఉన్న నాయకులకు అప్పనంగా ఇచ్చేస్తున్నారు. రాప్తాడు, చెన్నేకొత్తపల్లి, గోరంట్ల, ఓడీసీ, అమడగూరు, కూడేరు, నార్పల, మండలాల్లో ప్రభుత్వ భూమి వేలాది ఎకరాలు కబ్జాకు గురైయింది.
ఈ కబ్జాకు గురైన భూమిపై వివిధ బ్యాంకుల్లో పంట రుణాలు కూడా తీసుకున్నారు. ఒకసారి కబ్జాకు గురైన ప్రభుత్వ భూమికి ఎన్‌ఓసీ జారీ చేస్తే ఆ భూమి రెట్టింపు ధరలకు విక్రయించుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఈ ప్రభుత్వ భూముల కబ్జాలతో కొంతమంది వీఆర్‌ఓలు కోట్లకు పడగలెత్తున్నారనే ఆరోపణలు కోకొల్లలు.
ప్రభుత్వ భూమి కబ్జా
Published Thu, Nov 13 2014 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM
Advertisement
Advertisement