The ruling party
-
పైరవీల కొలువు
♦ వైద్య శాఖ ఉద్యోగాల్లో అధికార పార్టీదే హవా... ♦ కలెక్టర్ ఆదేశాలను తప్పుదారిపట్టిస్తున్న నేతలు ♦ ఒత్తిళ్లకు తలొగ్గి అర్హులను పక్కన పెట్టిన యంత్రాంగం ♦ అనర్హుల కోసం చేతుల మారిన కాసులు సాక్షి ప్రతినిధి, విజయనగరం:ఏదైనా శాఖ ద్వారా పనులొస్తే తమవారికే అప్పగించాలి. పోస్టుల్లోనూ తమవారినే నియమించాలి. పథకాలు ఏవైనా వస్తే తాము చెప్పినవారికే మంజూరు చేయాలి. ఇదీ ప్రస్తుతం జిల్లాలో అధికార పార్టీ సాగిస్తున్న దందా... వారి పైరవీల వల్ల నిజమైన అర్హులకు కూడా అన్యాయం జరుగుతోందనడానికి కిల్లాడ అనూరాధ ఉదంతం ఒకఉదాహరణ మాత్రమే. వెలుగులోకి రానివెన్నో ఇలాంటివి ఉన్నాయి. అసలేమైందంటే... ఐటీడీఏ పరిధిలోని వైద్య, ఆరోగ్యశాఖలో 6 స్టాప్‌నర్సు, 6 ఏఎన్ఎం, నాలుగు ఫార్మసిస్టు, పార్వతీపురంలోని సీమాంక్ సెంటర్లో 2 స్టాఫ్ నర్సు పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఇటీవల జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 11లోగా దరఖాస్తులు సమర్పించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 12న స్క్రూట్నీ, 13న మెరిట్ లిస్టు ప్రకటిస్తామని చెప్పారు. 14న గ్రీవెన్స్ సెల్ అదే రోజున ఫైనల్ మెరిట్ లిస్టు ప్రకటించి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తామని నోటిఫికేషన్లో వివరించారు. కానీ ఈ నెల 14న ఓసారి, 16న మరోసారి అభ్యర్థులు వెళ్లినా అక్కడ మెరిట్ లిస్టు పెట్టలేదు. రోజు లు గడుస్తున్నా తమకు సమాచారం అందకపోవడంతో ఈ నెల 24న డీఎంహెచ్ఓ కార్యాలయానికి వెళ్లి ఆరా తీయగా పోస్టులు భర్తీ చేసేశామని చెప్పారు. మెరిట్లో ముందున్న వారు విషయం తెలిసి అవాక్కయ్యారు. కార్యాలయ సిబ్బందిని అడిగితే దరఖాస్తులందిన తరువాత ప్రభుత్వం కొన్ని నిబంధనలు మార్చి అభ్యర్థులను ఎంపిక చేసిందని చెప్పుకొచ్చారు. పైరవీలకే పెద్దపీట జిల్లాలోని ఏజెన్సీలో పనిచేసేందుకు భర్తీ చేస్తున్న వైద్య శాఖ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినా పలువురు ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నాయకుల సూచనలు, సిఫార్సు లేఖలతోనే ఈ పోస్టుల ఎంపిక జరిగినట్టు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకున్నా వారికి అందకుండా అధికార పార్టీ నాయకుల అనుచరులు, కార్యకర్తలు సూచించిన వారికే పోస్టులు కట్టబెట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాల వారు దరఖాస్తు చేసుకునే ఈ పోస్టులపై కన్నేసి తమ అనుయాయులకు కట్టబెట్టుకున్న నాయకులు వైద్యుల పోస్టుల భర్తీకి మాత్రం కృషి చేయలేకపోవడం విచారకరం. -
దేవరపల్లిలో దౌర్జన్య కాండ
• దళితుల భూముల్లో అధికార పార్టీ దౌర్జన్యం • సాగు భూములను లాగేసుకున్న సర్కారు • పోలీసులను అడ్డుపెట్టి అర్ధరాత్రి తవ్వకాలు • నీరు–చెట్టు పేరుతో నిధుల స్వాహాకు ఎత్తుగడ • జీవనోపాధి కోల్పోయిన దళిత కుటుంబాలు • ఆందోళనకు దిగిన వైఎస్సార్ సీపీ, వామపక్షాల నేతలు • జిల్లా వ్యాప్తంగా 100 మందికిపైగా అరెస్ట్ • బాధితులకు అండగా నిలుస్తామన్న వైఎస్సార్ సీపీ జిల్లాలో అధికార పార్టీ దౌర్జన్యకాండ పరాకాష్టకు చేరింది. దేవరపల్లి దళిత భూముల్లో దౌర్జన్యకాండ కొనసాగింది. గత ఎన్నికల్లో ఓట్లేయలేదన్న అక్కసుతో దశాబ్దాలుగా సాగు చేసుకొని కడుపు నింపుకుంటున్న భూములు లాగేసుకుంది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేసి.. అడ్డొచ్చిన వారిని, ఇళ్లలో ఉన్న గ్రామస్తులను సైతం ఈడ్చుకొచ్చి అరెస్టులు చేయించింది. రాత్రికి రాత్రే నీరు–చెట్టు పేరుతో చెరువులను తవ్వేసింది. ఆ భూములపై ఆధారపడి కుటుంబాలు ఇప్పుడు జీవనాధారం కోల్పోయి వీధిన పడ్డాయి. తాము అనుకున్నది సాధించేందుకు అధికార పార్టీ నేతలు ఎంతకైనా తెగిస్తారనడానికి పర్చూరు మండలం దేవరపల్లి ఘటన ఉదాహరణగా నిలిచింది. దళితుల భూములను అధికార పార్టీ నేతలు ఆక్రమించిన విషయంపై ఆరా తీసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధితులకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, పార్టీ నేతలు దేవరపల్లి వెళ్లేందుకు మరోమారు సిద్ధమయ్యారు. దళితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని వారు ప్రకటించారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు/పర్చూరు : పర్చూరు మండలం దేవరపల్లి గ్రామంలో 159/1 సర్వే నంబరులో కృష్ణంరాజుకుంట పేరుతో సుమారు 39.37 ఎకరాల చెరువు పారంబోకు భూమి ఉంది. ఈ చెరువు కుంటలో ఆగ్రామానికి చెందిన కొన్ని కుటుంబాలు 60 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నాయి. 39.37 ఎకరాలకు గాను 22 ఎకరాలను గ్రామానికి చెందిన 40 దళిత కుటుంబాలు సాగు చేసుకుంటున్నాయి.భూముల్లో 11.37 ఎకరాల్లో గ్రామానికి చెరువు కింద వినియోగించుకుంటున్నారు. దాదాపు ఆరు ఎకరాల భూమిలో ప్రస్తుతం టీడీపీకి చెందిన గ్రామ సర్పంచ్‌తో పాటు, మరికొందరు ఆక్రమించి స్థిర నివాసం ఉంటున్నారు. కాగా దళితుల స్వాధీనంలో ఉన్న 22 ఎకరాల భూములు చెరువుకు సంబంధించినవే అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అనుచరులు గత మూడేళ్లుగా వాటిని లాక్కునే ప్రయత్నానికి దిగారు. భూములు తమవేనంటూ కోర్టుకెక్కిన దళితులు అధికార పార్టీ నేతలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ వస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టి దళితుల భూములు లాక్కునేందుకు అధికార పార్టీ మరోమారు సిద్ధమైంది. గురువారం తెల్లవారుజామున నుంచి దేవరపల్లి దళితుల పొలాల్లో జేసీబీలు, ఇటాచ్‌లు పెట్టి కుంట తవ్వకం ప్రారంభించారు. ఇందుకు భారీగా పోలీస్ బలగాలను రక్షణగా పెట్టుకున్నారు. అంతకు ముందే 40 కుటుంబాల దళితులను పడుకున్న వారిని పడుకున్నట్లే... అరెస్ట్‌లు చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. ఆ తర్వాత పదుల సంఖ్యలో జెసిబిలు, ఇటాచ్‌లు పెట్టి దౌర్జన్యంగా నీరు–చెట్టు పథకంలో కుంట తవ్వకం ప్రారంభించారు. గురువారం సాయంత్రం వరకు భారీ పోలీస్ బందోబస్తు మధ్య తవ్వకాలు సాగుతూనే ఉన్నాయి. దళితులకు మద్ధతుగా ఏ ఒక్కరూ దేవరపల్లికి చేరకుండా పోలీసులు అడుగడుగునా కాపు కాశారు. వారికి మద్ధతుగా వెళ్లేందుకు ప్రయత్నించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకుమాని రాజశేఖర్, జజ్జర ఆనందరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు, సీపీఐ నేత ప్రకాష్, ఐద్వా నేతలు ఆదిలక్ష్మి, రమాదేవిలతో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డిలతో పాటు దాదాపు 40 మంది నేతలను పోలీసులు అరెస్ట్‌లు చేశారు. వీరిని జరుగుమల్లి, నాగులుప్పలపాడు పోలీస్స్టేషన్లకు తరలించారు. దేవరపల్లికి చేరుకునేందుకు పర్చూరుకు వచ్చిన సీపీఎం రాష్ట్ర నేత మధును సైతం అక్కడే పోలీసులు అరెస్ట్‌లు చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. జిల్లావ్యాప్తంగా వందలాది మందిని అరెస్ట్ చేసి నిర్భంధించారు. సాయంత్రం వరకు వారికి వదిలిపెట్టలేదు. మీడియాను సైతం చెరువు తవ్వకం వద్దకు అనుమతించలేదు. ఆర్థిక లబ్ధే ధ్యేయంగా.. మరోవైపు దళితుల భూములను క్రిష్టంరాజుకుంట విస్తరణ పేరుతో నీరు–చెట్టు పథకం ద్వారా చెరువు తవ్వకాన్ని చేపట్టి పెద్ద ఎత్తున ఆర్థిక లబ్ధి పొందేందుకు ఎమ్మెల్యే అనుచరులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే నీరు–చెట్టు పథకం ద్వారా క్రిష్టంరాజుకుంటను ఆధునీకరించినట్లు ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. ఇందుకోసం రూ.6.80 లక్షలు నిధులు మంజూరైనట్లు ఉంది. ఎటువంటి పనులు జరగకుండానే ప్రభుత్వ రికార్డుల్లో పనులు అయిపోయినట్లు చూపించటం చూస్తే ఇప్పటికే ఈ నిధులు స్వాహా చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు దీనిపై మౌన నిద్ర వహిస్తుండటం గమనార్హం. దళితులకు అండగా వైఎస్సార్ సీపీ.. దేవరపల్లి దళితులకు వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. వైఎస్సార్సీపీతో పాటు వామపక్షాలు, ప్రజాసంఘాలు సైతం వారికి మద్ధతు పలుకుతున్నారు. అధికార పార్టీ నేతలు దళితుల భూముల్లో జోలికి వెళ్లొద్దని వారికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి దళితుల పక్షాన ఇప్పటికే ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. సమస్యను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి సైతం తీసుకువచ్చారు. జగన్ సూచనల మేరకు దళితుల పక్షాన పోరుబాట సాగించేందుకు వైఎస్సార్ సీపీ సిద్ధమైంది. ఈ నెల 16న దళితులకు అండగా దేవరపల్లిని సందర్శించి భూములు పరిశీలించేందుకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి సిద్ధంకాగా పోలీసులు ఆంక్షలు విధించారు. 15వ తేదీ అర్థరాత్రే నుంచి ఆయన్ను గృహనిర్భంధం చేశారు. ఆయనతో పాటు జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను పెద్ద ఎత్తున అరెస్ట్‌లు చేసి పోలీస్స్టేషన్లలో నిర్భంధించారు. తాజాగా దళితుల భూములను అధికార పార్టీ నేతలు స్వాధీనం చేసుకొని గురువారం కుంట తవ్వకానికి సిద్ధమైన నేపథ్యంలో దళితుల పక్షాన ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు ఆ పార్టీ సిద్ధమైంది. వామపక్షాలు, ప్రజాసంఘాలు సైతం దేవరపల్లి దళితులకు మద్ధతు పలకనున్నారు. నోరు మెదపని కలెక్టర్ తాము సాగుచేసుకుంటున్న భూములను అధికార పార్టీ నేతలు దౌర్జన్యంగా లాక్కోవడంతో దళితులు లబోదిబోమంటున్నారు. అధికారులకు మొర పెట్టుకున్నా వినే పరిస్థితి లేకపోవడంతో వారిది అరణ్యరోదనే అయింది. దేవరపల్లి రాష్ట్రస్థాయి వివాదంగా మారినా జిల్లా కలెక్టర్ మాత్రం నోరు మెదపకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
‘తమ్ముళ్ల’కే ట్రాక్టర్లు!
►‘రైతురథం’ కింద జిల్లాకు 520 సబ్సిడీ ట్రాక్టర్లు ►మండలానికి 6–10 వరకు కేటాయించే అవకాశం ►దందాకు తెరలేపిన అధికార పార్టీ నేతల అనుచరులు ►మార్గదర్శకాలు రాకనే పైరవీలు కర్నూలు : రైతులకు సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీకి ఉద్దేశించిన ‘రైతురథం’ పథకం కాస్తా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లకు బ్రహ్మరథంగా మారుతోంది. తాము చెప్పిన వారికే ట్రాక్టర్లు ఇవ్వాలంటూ ఇప్పటికే అధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. వారి అనుచరులు ఒకడుగు ముందుకేసి.. ట్రాక్టర్లు ఇచ్చేది తమ వారికేనంటూ మండలాల వారీగా జాబితాలు తయారుచేసే పనిలో పడ్డారు. ఇదే అదనుగా ట్రాక్టర్లు ఇప్పిస్తామంటూ కొందరు అధికార పార్టీ నేతల అనుచరులు కమీషన్లు దండుకునే పనిలో పడ్డారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఆరు వేల ట్రాక్టర్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాకు 520 ట్రాక్టర్లు వచ్చే అవకాశముందని అధికారులు అంటున్నారు. జిల్లాలో 54 మండలాలను లెక్కిస్తే ఒక్కో మండలానికి 6 నుంచి 10 ట్రాక్టర్లు వచ్చే అవకాశముంది. వీటిని దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే పోటీ ప్రారంభమయ్యింది. దీన్ని అదనుగా చూసుకుని కొద్ది మంది అమ్యామ్యాలకు తెరలేపారు. దీనికితోడు జిల్లాలో మొత్తం అర్హుల జాబితాను ఇన్చార్జ్ మంత్రి ఆధ్వర్యంలో సిద్ధం చేయనుండడంతో నిజమైన రైతులకు ట్రాక్టర్లు దక్కేది అనుమానమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇన్చార్జ్ మంత్రికే అధికారాలు! రైతురథం పథకం కింద ట్రాక్టర్‌తో పాటు వ్యవసాయ పనిముట్లకు ఒక్కో దానికి రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకూ సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హుల జాబితాను ఇన్చార్జ్ మంత్రి ఆధ్వర్యంలో వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ (జేడీఏ)తో కలిసి తయారుచేయాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. దీంతో నియోజకవర్గాల వారీగా జాబితాల తయారీని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు చేపడుతున్నారు. ఇదే అదనుగా కొద్ది మంది వారి అనుచరులు కమీషన్లకు తెరలేపారు. మీ–సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోండి... మీకు ట్రాక్టర్ ఇప్పిస్తామని ఆశలు రేపుతున్నారు. మరికొంత మంది అధికార పార్టీ నేతలు బినామీ పేర్లతో దరఖాస్తు చేయించేందుకు సిద్ధమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా.. ట్రాక్టర్ల పంపిణీకి ఇంకా నిర్దిష్ట మార్గదర్శకాలు రాలేదని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఏ నియోజకవర్గానికి ఎన్ని ట్రాక్టర్లు కేటాయించిన విషయమూ ఇంకా తమకు తెలియలేదని అంటున్నారు. ఇవీ నిబంధనలు = రైతురథం పథకానికి దరఖాస్తు చేసుకునే రైతుకు కనీస రెండెకరాల పొలం ఉండాలి. = అప్పటికే సబ్సిడీ కింద ట్రాక్టర్లను తీసుకుని ఉండరాదు. = దరఖాస్తుదారుడి పేరు మీద ఇప్పటికే ట్రాక్టర్ ఉంటే అనర్హుడు. = ఆధార్, పాస్‌బుక్‌లను చూపించి మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేయాలి. = దరఖాస్తు సమయంలో రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది. = వచ్చిన దరఖాస్తులను స్క్రూటినీ చేసి అర్హులను ఎంపిక చేస్తారు. ఇన్చార్జ్ మంత్రి, జేడీఏ కలిసి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇన్చార్జ్ మంత్రి కాస్తా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు చెప్పిన వారినే ఎంపిక చేసే అవకాశముంది. -
పెద్దల్ని తప్పించారు
⇒అటవీ భూముల స్వాహాలో అధికార పార్టీ నేతల బినామీ బాగోతం ⇒ఏడాదిపాటు సాగిన సుదీర్ఘ విచారణ ⇒తహసీల్దార్, ఆర్ఐ, వీఆర్వోలపై వేటు నెల్లూరు : పెద్దలే గద్దలయ్యారు. 545 ఎకరాల అటవీ భూముని స్వాహా చేశారు. పాత రికార్డులను సేకరించి.. తప్పుడు పత్రాలను సృష్టించి.. బినామీల పేరుతో ఏకకాలంలో రిజిస్ట్రేషన్లు చేయించేశారు. ఏడాది క్రితం వరకు పదవిలో ఉన్న చిత్తూరు జిల్లా అమాత్యులు, జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యే కలిసి అటవీ భూమిని కబ్జా చేశారు. ఈ వ్యవహారంలో సూత్రధారుల్ని వదిలేసిన ప్రభుత్వం పాత్రధారులైన రెవెన్యూ ఉద్యోగుల్ని సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకుంది. జిల్లాలో కీలక అంశంగా మారిన ఈ వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు పలువురు ఆందోళనలు చేసినా సర్కారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. సర్వే నంబర్ మార్చేసి.. వెంకటగిరి నియోజకవర్గం రాపూరు మండలం గరిమెనపెంట గ్రామంలోని సర్వే నంబర్ 43/1లో 1,988.81 ఎకరాల అటవీ భూమి ఉంది. దీనిని రీసర్వే చేసి సర్వే నంబర్ 43/1ను 75/2 నంబర్‌గా మార్చా రు. ఫెయిర్ అడంగల్‌లోనూ భూమి వివరాలు నమోదు చేసి.. అటవీ పోరంబోకుగా రికార్డుల్లో చూపారు. ఆ తర్వాత 2014లో జారీ చేసిన జిల్లా నూతన గెజిట్‌లో భూమి వివరాలను మార్చేశారు. 1,988 ఎకరాలకు బదులుగా 1,329 ఎకరాలు మాత్రమే అటవీ భూమి ఉన్నట్టు చూపించారు. మిగిలిన 659.60 ఎకరాలకు పట్టాలు ఇచ్చినట్టు గాని.. ఇతర వివరాలేవీ రికార్డుల్లో నమోదు చేయలేదు. అందులో 549 ఎకరాలపై అధికార పార్టీ ప్రజాప్రతినిధి కన్నుపడింది. వేగంగా పావులు కదిపాడు. వెంటనే చిత్తూరు జిల్లాకు చెందిన మాజీమంత్రి, ఆయన కుమారుడి సహకారంతో పక్కా ప్రణాళిక రచించి అమలు పరిచాడు. ఈ క్రమంలో 1915లోని ఇనాం భూముల రికార్డులు, ఇనాం చట్టంలోని లొసుగులు, ఇతర అంశాలను ఆసరాగా చేసుకుని అక్కడ ఆక్రమంగా సాగు చేస్తున్న వారి నుంచి భూములు కొనుగోలు చేసినట్టు పత్రాలు సృష్టించాడు. వెంటనే 2015లో భూమిని స్వాధీనపర్చుకోవటానికి వీలుగా రిజిస్ట్రేషన్ ప్రకియ పూర్తి చేశాడు. వాస్తవానికి ఆ భూములను రాపూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉండగా, తనకు పరపతి ఉన్న వెంకటగిరి సబ్‌రిజి స్ట్రార్ కార్యాలయంలో 16 మంది బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించారు. వెంటనే రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి బినా మీల పేరుతో పట్టాదారు పాస్ పుస్తకాలు పొందారు. దళిత, గిరిజన సంఘాలు లోకాయుక్తకు ఫిర్యాదు చేయటంతో జిల్లా అధికారులు స్పందించి 2016లో విచారణకు తెర తీశారు. వాస్తవానికి అటవీ భూమి కావటంతో భూమి విలువ అతి తక్కువగా ఉంటుంది. అయితే ఈ భూమిని భూబదలాయింపు కోసం వినియోగించుకుని.. రూ.కోట్లు విలువ చేసే భూమి దక్కించుకోవచ్చు. అలాగే పట్టాదార్ పాస్‌బుక్స్‌పై బ్యాంకుల్లో పంట, ఇతర రుణాలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఏడాదిగా విచారణ ఈ భూముల వ్యవహారంపై నెల్లూరు జెడ్పీ సీఈఓ రామిరెడ్డి 2016లో విచారణ ప్రారంభించారు. ఆయన ఏసీబీకి పట్టుపడిన అనంతరం గూడూరు ఆర్డీఓ అరుణ్‌బాబు విచారణ నిర్వహించారు. చివరగా ఈనెల 3న ఆర్డీఓ విచారణ జరిపి భూముల విషయంలో అక్రమాలు జరిగాయని కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. గతంలో అక్కడ పనిచేసిన తహసీల్దార్ సు«ధాకర్, ఆర్ఐ శరత్, వీఆర్వోలు అంకయ్య, ప్రభాకర్‌రెడ్డిని సస్పెండ్ చేసి కథ ముగించారు. -
కార్డుందా.. రైట్ రైట్
జోరుగా ఇసుక అక్రమ రవాణా మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారగణం చక్రం తిప్పుతున్న అధికారపార్టీ నేత ఇసుక రవాణా విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని భావించిన రాష్ట్ర ప్రభుత్వం, ఇసుక రీచ్‌ల నిర్వహణను రద్దు చేసి ఉచితంగా ఇసుక తీసుకువెళ్లాలని తీసుకున్న నిర్ణయం అధికారపార్టీ వారికి కాసులు కురిపిస్తోంది. ఇది వారి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న అక్రమార్కులు నిత్యం లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు. సోమశిల(ఆత్మకూరు): కార్డుల పేరుతో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నా అటు పోలీసు అధికారులు, ఇటు రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇసుక అక్రమ రవాణాకు మండలంలోని అధికారపార్టీ నాయకుడి అండదండలు ఉండడంతో అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం అనంతసాగరం మండల పరిధిలో రెండు ఇసుకరీచ్‌లు ఉన్నాయి. అందులో ఒకటి పీకేపాడు కాగా, రెండోది లింగంగుంట ఇసుక రీచ్. లింగంగుంట ఇసుక రీచ్‌లో గ్రామస్తులు అడ్డుకోవడంతో ప్రస్తుతం రవాణా సాగడం లేదు. మండలంలోని పడమటి కంభంపాడు ఇసుక రీచ్ నుంచి ప్రకాశం జిల్లా మార్కాపురం, బెస్తవారిపేట, కంభం తదితర ప్రాంతాలకు ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా సాగుతోంది. రోజూ 150 నుంచి 200 ట్రాక్టర్లలో ఇసుక బద్వేల్ వరకు తరలుతోంది. ఇంత వరకు బాగానే ఉన్నా ఇసుక రవాణా మొత్తం అక్రమంగానే సాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ విధించిన నిబంధనల కన్నా ఇసుకను అధికంగా లోడ్ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళల్లో ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. రోజూ వేలాది రూపాయలు దండుకొంటున్నారు. స్థానిక రెవెన్యూ, రవాణా ఇతర శాఖలకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉందని తెలుస్తోంది. ట్రాక్టర్లకు నెల కార్డులు ఈ ప్రాంతంలో ఇసుక రవాణాకు సంబంధించి ఒక్కో ట్రాక్టరుకు నెలకు రూ.2000 చెల్లించాలనే అక్రమ నిబంధన నెల కార్డుల పేరుతో ఉండడంతో ట్రాక్టర్ల డ్రైవర్లు సైతం అధికంగా ఇసుకను అక్రమంగా లోడ్ చేసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఇసుక రవాణా చేసేందుకు పత్రాలు సక్రమంగా ఉన్నా లేకపోయినా ఆత్మకూరు రవాణా శాఖ అధికారికి రూ.1500, మర్రిపాడు పోలీసులకు రూ.2000, వైఎస్సార్ జిల్లా బద్వేల్ పోలీసులకు రూ.2500, రవాణా శాఖ వారికి రూ.1500, పోరుమామిళ్ల పోలీసులకు రూ.1500 నెల కార్డులకు సమర్పించుకుంటే ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకునే వారు ఉండరని సమాచారం. చక్రం తిప్పుతున్న అధికార పార్టీ నేత ఇసుక అక్రమ రవాణాకు మండలంలోని అధికారపార్టీ నాయకుడి అండదండలు ఉండడంతో అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని తెలుస్తోంది. ఆయన ఇసుక అక్రమ రవాణా చేస్తున్న తన అనుచరగణానికి ఇబ్బందులు లేకుండా చూసుకుంటారని సమాచారం. ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపకుంటే కోట్లాది రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండిపడే అవకాశం ఉంది. అక్రమ రవాణాపై చర్యలు చేపడతాం పీకే పాడు ఇసుక రీచ్ నుంచి అధిక లోడుతో ఇసుక తరలుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. దానిపై దృష్టి సారించి చర్యలు చేపడతాం. ఎంసీ కృష్ణమ్మ, తహసీల్దార్, అనంతసాగరం -
ఎంత దారుణం
రుణాల మంజూరులో రాజకీయ ప్రమేయం చెప్పిన వారికే ఇవ్వాలంటూ అధికార పార్టీ నాయకుల హుకుం ఎమ్మెల్యేలనుంచి చోటా నాయకుల దాకా ఒత్తిళ్లు నిజమైన లబ్ధిదారులకు మొండిచెయ్యే! దిక్కుతోచని స్థితిలో అధికారులు అధికారంతో పనిలేకుండా అందరినీ సమానంగా చూడాల్సిన ప్రజాప్రతినిధులు వివక్ష పాటిస్తున్నారు. తాము చెప్పిన లబ్ధిదారులకే రుణాలు మంజూరు చేయాలంటూ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అర్హులను పక్కనబెట్టి తమ కార్యకర్తలకే రుణాలు మంజూరయ్యేలా ప్రణాళిక రచిస్తున్నారు. ఇందులో తేడావస్తే సహించేది లేదంటూ అధికారులకు హెచ్చరికలు పంపిస్తున్నారు. చిత్తూరు ఎడ్యుకేషన్: జిల్లాలో ఇటీవల ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. ఇచ్చిన టార్గెట్ కన్నా ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. పోటీ ఎక్కువకావడంతో అధికారపార్టీ నాయకులు రంగంలోకి దిగారు. తాము ఎవరికి చెబితే వారికే రుణాలు మంజూరు చేయాలంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. టార్గెట్లు తక్కువ.. దరఖాస్తులు ఎక్కువ ఈ ఏడాది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం 4,142 యూనిట్లను టార్గెట్‌గా విధించింది. వీటికి 25,128 దరఖాస్తులు అందాయి. ఒక్కో యూనిట్‌కు సగటున ఆరుగురు పోటీపడ్డారు. ఎస్టీ కార్పొరేషన్‌కు 265 యూనిట్లకుగాను 6,002 దరఖాస్తులు వచ్చాయి. బీసీ రుణాలకు 1,662 యూనిట్లు కేటాయించగా 25,714 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాపు రుణాలకు 2,916 యూనిట్లు కేటాయించగా 13,834 మంది దరఖాస్తు చేసుకున్నారు. అధికార ముద్ర పడాల్సిందే రుణాల మంజూరులో జన్మభూమి కమిటీలు, ఎమ్మెల్యేల పెత్తనం ఎక్కువైంది. మొదట జన్మభూమి కమిటీ సభ్యులు ఆమోదించి సంబంధిత అధికార పార్టీ ఎమ్మెల్యేలకు పంపిస్తున్నారు. అక్కడి నుంచి జెడ్పీ చైర్‌పర్సన్‌కు సిఫార్సు చేస్తున్నారు. ఆపై తాము రూపొందించిన రహస్య నివేదికలను అధికారులకు చేరవేస్తున్నారు. ఇదిలా ఉంటే జిల్లాలో పలుచోట్ల అధికార పార్టీలో రెండు వర్గాలున్నాయి. ఒక వర్గం వారికి ఇస్తే మరో వర్గం అధికారులపై ఒత్తిడి పెంచుతోంది. నిబంధనలు తూచ్ ఎంపిక ప్రక్రియలో నిబంధనలు పాటించడం లేదు. గ్రామసభల సమక్షంలో జన్మభూమి కమిటీలు, ప్రజాప్రతినిధు లు, డ్వాక్రా సంఘాల మహిళల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక చేపట్టాల్సి ఉంది. కానీ జిల్లాలో ఎక్కడా ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కుమ్మక్కై రహస్యంగా పంపిన నివేదికల ఆధారంగా అధికారులు రుణాలు మంజూరు చేయాల్సి వస్తోంది. హెచ్చరికలు ‘‘మేం చెప్పిన అభ్యర్థులకే రుణాలు మంజూరు చేయాలి.. లేదంటే మీ అంతు చూస్తాం’’ అంటూ కొందరు అధికారపార్టీ నేతలు అధికారులకు హెచ్చరికలు పంపిస్తున్నారు. చేసేది లేక నిజమైన లబ్ధిదారులను పక్కన పెట్టి, అనర్హులకు రుణాలు మంజూరు చేయాల్సి వస్తోందని పలువురు మదనపడుతున్నారు. -
జన్మభూమిని.. మమ అనిపించారు
ఆందోళనలు, నిరసనల మధ్యముగిసిన జన్మభూమి ప్రశ్నించిన వారిపై బెదిరింపులు నిరాశపరచిన గ్రామసభలు చిత్తూరు (కలెక్టరేట్):జిల్లాలో చేపట్టిన నాలుగో విడత జన్మభూమి – మా ఊరు గ్రామసభలు ప్రజల ఆందోళనలు, నిరసనల మధ్య తూతూమంత్రంగా ముగిశాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు అంతంత మాత్రంగానే గ్రామ సభలకు హాజరవడంతో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలే తెలియక ప్రజలు నిరాశ చెందారు.జన్మభూమి – మా ఊరు గ్రామసభలను ఈ నెల 2వ తేదీ నుంచి 11వ వరకు నిర్వహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రధానంగా కుటుంబ, సామాజిక వికాసమే లక్ష్యంగా చేపట్టాలని, గ్రామ సభలన్నింటినీ పండుగ వాతావరణంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తొలిరోజు నుంచే గ్రామ సభల్లో అధికారులు, ప్రజాప్రతినిధులకు లబ్ధిదారుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. గతంలో జరిగిన మూడు జన్మభూముల్లో ఇచ్చిన సమస్యలే పరష్కారం కాలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ జన్మభూమితో కూడా ఒరిగేది ఏముందిలే అని సామాన్య ప్రజలతోపాటు, అధికార పార్టీ కార్యకర్తలు కూడా పెదవి విరిచారు. పలుచోట్ల జన్మభూమి గ్రామసభలను అడ్డుకోవడంతో అధికారులు సభలను నిర్వహించలేక, పోలీసుల సహకారాన్ని తీసుకుని, అర్ధాంతరంగా ముగించారు. గ్రామసభల్లో ఎలాంటి హామీలు ఇవ్వకపోగా అధికార పార్టీల నాయకుల ఊకదంపుడు ప్రసంగాలతోనే సమయం కరిగిపోయిందనే విమర్శలు వచ్చాయి. టీడీపీ కార్యకర్తల నుంచే నిరసన జన్మభూమి గ్రామసభల్లో అధికార పార్టీ కార్యకర్తల నుంచే పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. తొలిరోజు టీడీపీ ఆధిపత్యం ఉన్న గ్రామాల్లోనే సభలను ఏర్పాటు చేసినా.. ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో ప్రజాప్రతినిధుల్లో ఆందోళన నెలకొంది. దీంతో చాలాచోట్ల అధికార పార్టీ ప్రజాప్రతినిధులు గ్రామసభలకు డుమ్మాకొట్టారు. కేవలం కిందిస్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులతోనే గ్రామసభలను నిర్వహించి చేతులు దులుపుకున్నారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో అధికారులు సభలను నిర్వహించలేక ఇబ్బందు లు పడిన సంఘటనలు ఉన్నాయి. రసీదులు లేవ్ .. ప్రజలు వివిధ సమస్యలపై ఇచ్చిన అర్జీలకు ప్రతీకగా అధికారులు రశీదులు ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ దఫా జన్మభూమి గ్రామసభల్లో ఎక్కడా అర్జీలకు రశీదులు ఇచ్చిన దాఖలాలు లేవు. లక్ష అర్జీలు.. జిల్లావ్యాప్తంగా నాలుగో విడత జన్మభూమి గ్రామ సభల్లో ప్రజల నుంచి వివిధ సమస్యలపై లక్షకు పైగా అర్జీలు వచ్చాయి. వచ్చిన అర్జీలను అధికారులు రోజువారీగా ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఇసుక దందా
అదే అధికార పార్టీ నేతల పంథా నదీ పరివాహక ప్రాంతాల్లో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు చోడవరం ముద్దుర్తి సంగమేశ్వరస్వామి ఆలయం వద్ద ఇసుక రవాణా బెల్లం పెనాల్లో నది నుంచి ఇసుకను ఒడ్డుకు చేరుస్తున్న ఇసుకాసురులు నదుల్లో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు.. అధికారులు భారీ ఎత్తున పెనాల్టీలు, శిక్షలు వేసినా ఆగని దందాలు.. ఇసుక మాఫియా ఎక్కడా తగ్గడంలేదు.. దీనికి కారణం కొందరు అధికార పార్టీ నాయకుల అండదండలేనన్నది అందరికీ తెలిసిన విషయమే. జిల్లాలో మేజర్ శారద, మైనర్ శారద, పెద్దేరు, బొడ్డేరు, తాచేరు, సర్పా, తాండవ నదులు ప్రధానంగా ఉన్నాయి. అనుమతి లేకుండా ఎక్కడా ఇసుక తవ్వకాలు చేయకూడదనే నిబంధన ఉన్నప్పటికీ ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఇసుక రీచ్‌లను అక్రమంగా ఏర్పాటు చేసి యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. చోడవరం :ఇసుకాసులకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. చోడవరం, దేవరాపల్లి, బుచ్చెయ్యపేట, మాడుగుల, అనకాపల్లి, ఎస్.రాయవరం, పాయకరావుపేట, నక్కపల్లి, కశింకోట మండలాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు బహిరంగంగా జరుగుతున్నాయి. ఆయా ప్రాంతాలకు చెందిన అధికార పార్టీ నాయకులు ఈ ఇసుక మాఫియాకు పరోక్షంగా అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చోడవరం, బుచ్చెయ్యపేట, మాడుగుల, దేవరాపల్లి మండలాల్లో ఇసుక రీచ్‌లపై అధికారులు దాడులు చేయడం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ఒత్తిడి చేసి వారిని విడిపించుకెళ్లడం పరిపాటిగా జరుగుతుంది. ఇటీవల చోడవరం వ ముద్దుర్తి, గవరవరం, జుత్తాడ, గజపతినగరం, గౌరీపట్నం, లక్ష్మీపురం కల్లాలు, బుచ్చెయ్యపేట మండలం విజయరామరాజుపేట రీచ్‌లలో వందలాది క్యుబిక్ మీటర్ల ఇసుకను అధికారులు పట్టుకున్నారు. వీటిలో బుచ్చెయ్యపేట మండలంలో పట్టుకున్న కొన్ని లారీలను స్థానిక టీడీపీ నాయకుల ఒత్తిడి మేర అధికారులు వదిలేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తాజాగా ముద్దుర్తి సంగమేశ్వరస్వామి ఆలయం వద్ద మేజర్ శారదనదిలో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడే గతంతో అధికారులు దాడులు చేసి ఇసుక తరలిస్తున్న బెల్లం పెనాలను స్వాధీనం కూడా చేసుకున్నారు. అయినా ఈ రేవు వద్ద మళ్లీ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఆలయానికి ఆనుకుని ఉన్న రేవులో పూర్తిగా ఇసుక తవ్వేసి లోతు చేశారు ఇసుకాసురులు. జిల్లాలో పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న ఈ ఆలయం, స్నానాల రేవు ఇప్పుడు ప్రమాదకరంగా మారాయి. ఇసుక తవ్వకాల వల్ల ఈ పవిత్ర స్నానఘట్టం కూడా నది నీటిలో తెలియని భారీ గోతులుగా ఏర్పడి ప్రమాదకరంగా మారింది. బెల్లం పెనాల్లో ఇసుక తరలింపు అన్ని చోట్ల నదుల్లో జేసీబీలు, ఇతరత్ర రూపాల్లో ఇసుకను తవ్వేసి ఒడ్డుకు చేరుస్తుంటే ఇక్కడ మాత్రం బెల్లం తయారుచేసే పెద్దపెద్ద పెనాల్లో ఇసుకను ఒడ్డుకు చేర్చుతున్నారు. ఆలయం ఒడ్డు నుంచి నది అవతల ఒడ్డు, మధ్యలో ఉన్న ఇసుక మేట్లను తవ్వి పెనంలో వేసి ఈదుతూ ఇవతల ఒడ్డుకు తెచ్చి గుట్టలుగా పోస్తున్నారు. ఇక్కడ నుంచి లారీలు, యడ్ల బళ్లపై ఇతర ప్రాంతాలకు తరలించి రూ.లక్షల్లో అక్రమ వ్యాపారం చేస్తున్నారు. పట్టించుకోని యంత్రాంగం ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా రెవిన్యూ, ఇరిగేషన్, పోలీసులు పంచాయతీ అధికారులు మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. గ్రామ స్థాయిలో రెవిన్యూ, పంచాయతీ కార్యదర్శుల పాత్ర కూడా ఇందులో ఉందనే ఆరోపణలు ఉన్నాయి. బహిరంగంగానే రోజూ పెద్దసంఖ్యలో లారీలతో ఇసుక తరలిస్తున్నా వీఆర్ఓలు పట్టించుకోకపోవడం ఆరోపణలకు బలం చేకూరుతోందని ప్రజలు అంటున్నారు. ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకుంటాం సంగమేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఇసుక తవ్వకాలపై ఇప్పటికే దాడులు చేశాం. మళ్లీ ఈ రేవుతోపాటు మిగతా రీచ్‌లపై కూడా దాడులు చేస్తాం. కొత్త నిబంధనల ప్రకారం దొరికిన లారీకి రూ.లక్షకు పైగా జరిమానా, రెండేళ్లు జైలు కూడా పడుతుంది. అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకుంటాం. వెంటనే తవ్వకాలు ఆపకపోతే కేసులు నమోదు చేస్తాం. –రామారావు, తహసీల్దార్, చోడవరం -
కార్యదర్శి స్వాహాకారం
► సభ్యులకు ఇవ్వాల్సిన ప్లాట్లు సొంతవారికి ధారాదత్తం.. ► మరికొన్ని ఇతరులకు అక్రమంగా విక్రయం ► రు.5 కోట్ల విలువ చేసే ప్లాట్లు అన్యాక్రాంతం ► ఆ ప్లాట్లలోనే అపార్ట్మెంట్లు నిర్మించి అమ్మకం ► కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సొసైటీలో స్వాహాకాండ ► అరెస్టరుునా ఆగని దందా.. అధికార పార్టీ నేతల అండ ► విచారణ పేరుతో సాగదీస్తున్న అధికారులు కబ్జాకు కాదేదీ అనర్హం అంటున్నారు కొందరు ప్రబుద్ధులు.. అనడమేంటి.. ఆచరణలోనూ చూపిస్తున్నారు. కంచే చేను మేసిన చందంగా.. సొసైటీ పాలక పెద్దలే ప్లాట్లను అన్యాక్రాంతం చేసి.. ఎడాపెడా స్వార్జనకు పాల్పడుతున్నారు. సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా సొంత కుటుంబ సభ్యులకు గిఫ్ట్.. అన్న ముద్దు పేరుతో రెండేసి ప్లాట్లు ధారాదత్తం చేసేశారు. ఆనక వాటిలో అపార్ట్మెంట్లు నిర్మించి ఎంచక్కా అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తరహా అక్రమాలకు నగర శివారులోని పీఎంపాలెం పరిధిలో ఉన్న కేంద్రప్రభుత్వ ఉద్యోగుల సహకార గృహనిర్మాణ సొసైటీ నిలయంగా మారింది. కోట్ల విలువైన ఈ స్వాహాకాండ గురించి వింటే ఎవరైనా ఔరా.. అనక మానరు. విశాఖపట్నం: ఫొటోలో ఈ అపార్టుమెంట్ చూశారుగా.. నగరంలో సొసైటీల స్థలాలు కూడా కబ్జాకు గురవుతున్నాయని చెప్పడానికి ఇదో నిలువెత్తు నిదర్శనం. సెంట్రల్ ఎకై ్సజ్ అండ్ అదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లారుుస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సోసైటీ(నెం.1561) 1971లో సహకార సంఘంగా రిజిస్టర్ ్రఅరుు్యంది. మహా విశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ) 5వ వార్డు పరిధిలోకి వచ్చే పీఎంపాలెంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సమీపంలోని సర్వే నెం.359, 360లలో చెరో 10 ఎకరాలు ప్రభుత్వం మంజూరు చేసింది. వీటికి చాణక్యపురి లే అవుట్‌గా అభివృద్ధి చేసి సొసైటీ సభ్యులకు ఒక్కొక్కరికి 267 గజాలు చొప్పున సర్వే నెం.359లో 107, సర్వే నెం.360లో 102 ప్లాట్లు కేటారుుంచారు. అదే విధంగా నగరపాలెంలోని అయోధ్యనగర్‌లోని సర్వే నెం.63లో 15, సర్వే నెం.2లో 72 ప్లాట్లు కూడా ఇచ్చారు. అక్కడి వరకు అంతా సజావుగానే సాగినా.. ప్లాట్ల విభజన తర్వాతే అసలు కథ మొదలైంది. ఇష్టారాజ్యంగా తనవారికి కేటారుుంపులు సొసైటీ కార్యదర్శిగా వ్యవహరించిన డబ్బీరు గౌరీశంకరరావు అనే వ్యక్తి కోట్ల రూపాయల విలువైన సొసైటీ ప్లాట్లను సభ్యులకు తెలియకుండా తెగనమ్ము కున్నాడు. అక్కడితో ఆగకుండా సొసైటీ సభ్యులకే కేటారుుంచాల్సిన సర్వే నెం.359లో 94, 95.. సర్వే నెం. 360లో 24, 25, 26, 27 ప్లాట్లను నిబంధనలకు విరుద్ధంగా తన కుటుంబ సభ్యులకు గిఫ్టుల పేరుతో కట్టబెట్టేశాడు. మరో రెండు ప్లాట్లను మైనర్లకు అమ్మేశాడు. ఇలా సుమారు రు.ఐదు కోట్లు విలువ చేసే ప్లాట్లు అన్యాక్రాంతమయ్యారుు. ఈ ప్లాట్లలోనే ప్రస్తుతం బహుళ అంతస్తుల భవనాలు శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్నారుు. ఇక సర్వే నెం.2లోని 79 ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో సభ్యులకు కూడా తెలియని పరిస్థితి.రిటైరైన తర్వాత ఇల్లు కట్టుకుని శేష జీవితం హారుుగా గడుపుతామనుకున్న పలువురు సొసైటీ సభ్యులు తమ స్థలాలు ఎక్కడ ఉన్నాయో తెలియక తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. పదవి నుంచి తొలగించినా.. సొసైటీ అస్తులకు కస్టోడియన్‌గా వ్యవహరించాల్సిన కార్యదర్శే తమ స్థలాలను అమ్ముకున్నాడని.. సొంతవారికి కట్టబెట్టేశాడని ఆలస్యంగా గుర్తించిన సొసైటీ సభ్యులు అవాక్కయ్యారు. తర్వాత తేరుకొని కార్యదర్శిని తొలగిస్తూ సొసైటీ సమావేశంలో తీర్మానం చేశారు. అరుుతే సొసైటీ తన చేతుల్లో ఉందని, తనను తొలగించే అధికారం సభ్యులకు లేదని గౌరీ శంకరరావు తేల్చిచెప్పడంతో అతనిపై న్యాయపోరాటానికి సభ్యులందరూ సిద్ధమయ్యారు. సెంట్రల్ ఎకై ్సజ్, అదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లారుుస్ హౌస్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌గా ఏర్పడ్డారు. ఉన్నతాధికారుల దృష్టికి వ్యవహారాన్ని తీసుకెళ్లడంతో విచారణకు ఆదేశించారు. బైలాకు వ్యతిరేకంగా స్థలాల కేటారుుంపులు జరిపినట్లు విచారణలో సహకార శాఖాధికారులు గుర్తించారు. ఈ కేటారుుంపులు అక్రమమేనని కో-ఆపరేటివ్ సోసైటీ ‘51 ఎంకై ్వరీ రిపోర్టు ప్రకారం’ నిర్థారించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు గౌరీశంకరరావును అరెస్ట్ కూడా చేశారు. అధికార పార్టీ నేతల అండ మరోవైపు జైలుకు వెళ్లిన వ్యక్తి కార్యదర్శిగా కొనసాగటం చెల్లదంటూ సహకార శాఖ అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరి 20న ఆదేశాలిచ్చారు. అరుునా పట్టించుకోని గౌరీశంకరరావు అధికార పార్టీ నేతల అండదండలతో ఈ వ్యవహారాన్ని కోర్టు వరకు తీసుకెళ్లి సాగదీస్తున్నాడని సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. చివరికి కోర్టు తప్పుబట్టినా..సహకార శాఖాధికారులు కాదు పొమ్మన్నా సరే పట్టించుకోకుండా సొసైటీకి చెందిన ప్లాట్లలో అక్రమ నిర్మాణాలు సాగిస్తూ అమ్మేసుకుంటున్నాడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విచారణకు ఆదేశించాం దీనిపై సహకార శాఖ జారుుంట్ రిజి్ట్రార్ గౌరీశంకర్‌ను వివరణ కోరగా. ఇటీవలే కొంతమంది సొసైటీ సభ్యులు తమకు మరోసారి ఫిర్యాదు చేశారని, ఈ వ్యవహారంపై విచారణ జరపమని జిల్లా రిజి్ట్రార్ను ఆదేశించామన్నారు. జిల్లా రిజి్ట్రార్ సన్యాసినాయుడ్ని వివరణ కోరగా, ప్లాట్ల అన్యాక్రాంతం..అక్రమ నిర్మాణం వ్యవహారం కోర్టులో ఉందన్నారు. కాగా కొత్త కార్యవర్గం కోసం ఎన్నికలు నిర్వహించాలని కార్యదర్శి వ్యతిరేక వర్గీయులు తమను కోరారని.. త్వరలోనే ఇరువర్గాలతో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా గిఫ్టులు డబ్బీరు గౌరిశంకరరావు అనే వ్యక్తి ఈ సొసైటీకి కార్యదర్శిగా ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా తన తమ్ముడి కుమారునికి, తన కూతురికి రెండేసి ప్లాట్లు గిప్ట్గా ఇచ్చారు. ఇలా ఇవ్వడం చెల్లదని సహకార శాఖ అధికారులు నివేదిక ఇచ్చారు. పైగా మరో రెండు ప్లాట్లు మైనర్లకు గిప్ట్ ఇచ్చారు.. అదీ చెల్లదు. వీటన్నిటిలో అపార్టుమెంట్లు నిర్మించి అమ్ముకుంటున్నారు. అధికారులు స్పందించి వెంటనే పాత కార్యవర్గాన్ని రద్దు చేసి కొత్తగా ఎన్నికలు నిర్వహించాలి. - డి.సత్యనారాయణ, రిటైర్డ్ ఏడీఈ, విద్యుత్ శాఖ సొసైటీ సభ్యుడు -
అటవీ అధికారుల అదుపులో 20 మంది తమిళ కూలీలు
మైదుకూరు(చాపాడు): మైదుకూరు మండలం జాండ్లవరం వద్ద గల లంకమల అడవుల్లో నుంచి బయటికి వస్తున్న 20 మంది తమిళనాడు ప్రాంతానికి చెందిన ఎర్రచందనం కూలీలను మంగళవారం రాత్రి ఫారెస్ట్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా లంకమల అడవుల్లో ఎర్రచందనం నరుకుతూ ఉన్న తమిళ కూలీలు మంగళవారం జాండ్లవరం గ్రామానికి చెందిన బడా స్మగ్లర్, అధికార పార్టీ నాయకుడిని సంప్రదించేందుకు వస్తుండగా బీట్‌లో ఉన్న ఫారెస్ట్ ప్రొటెక్షన్ సిబ్బంది గమనించి వారిని వెంటాడి పట్టుకున్నట్లు తెలిసింది. తమిళ కూలీలు పట్టుబడిన విషయం తెలుసుకున్న అధికార పార్టీ నాయకుడైన బడా స్మగ్లర్ వారిని విడిపించేందు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే ఇందుకు సిబ్బంది అంగీకరించకపోవడంతో తాను అధికార పార్టీ అండ ఉన్న వ్యక్తినని, నియోజకవర్గంలో కీలకమైన నాయకుడినని, కూలీలను వదలకపోతే మీ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఊడిపోతాయని బెదిరింపులకు పాల్పడటంతో పాటు ఓ ఫారెస్ట్ సిబ్బందిపై చేయి చేసుకున్నట్లు తెలిసింది. కాగా, జాండ్లవరం పరిధిలో తమిళ కూలీలు పట్టుబడగా.. ఫారెస్ట్ అధికారులు మాత్రం అక్కడ కాదని, ఖాజీపేట మండలంలోని ఆంజనేయకొట్టాలు వద్ద తమిళ కూలీలు దొరికారని చెబుతున్నారు. జాండ్లవరం వద్ద దొరికినట్లు చెబితే ఆ ప్రాంతానికి చెందిన బడా డాన్‌తో ఇబ్బందులు తలెత్తుతాయనే భయంతో ఫారెస్ట్ సిబ్బంది ఇలా మాట మారుస్తున్నారని, జాండ్లవరం ప్రాంతానికి చెందిన వారు చర్చించుకుంటున్నారు. 20 మంది తమిళ కూలీలు దొరికారుః డీఎఫ్ఓ శివశంకర్ లంకమల అడవుల్లో నుంచి బయటికి వస్తున్న 20 మంది తమిళనాడుకు చెందిన ఎర్రచందనం కూలీలను పట్టుకున్నాము. వీరందరూ ఖాజీపేట మండలంలోని ఆంజనేయకొట్టాల వద్ద అడవిలో నుంచి బయటకి వస్తుండగా తమ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు, అని డీఎఫ్ఓ శివశంకర్ తెలిపారు. -
డైట్ బిల్లుల స్వాహా
ఫోర్జరీ సంతకాలతో లక్షలు కాజేసిన కాంట్రాక్టర్ ఏరియా ఆసుపత్రిలో వెలుగుచూసిన వైనం మల్లగుల్లాలు పడుతున్న వైద్య సిబ్బంది ప్రజా సంక్షేమం కోసం తలపెట్టిన ఉపాధి హామీ.. సీసీరోడ్లు, నీరు-చెట్టు పనుల్లో అధికార పార్టీకి చెందిన అనుయాయులు అందినకాడికి దోచుకుంటున్నారు. ఆఖరికి పేద రోగుల పౌష్టికాహారం కోసం ప్రభుత్వం ఇస్తున్న డైట్ నిధులను సైతం వదలటం లేదు. ఏరియా ఆసుపత్రిలో లక్షల్లో డైట్ నిధుల స్వాహా చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇలాకాలోనే రోగుల సొమ్ము కాజేయటంపై విస్మయం వ్యక్తమవుతోంది. నర్సీపట్నం: అధికారుల ఫోర్జరీ సంతకాలతో స్థానిక ఏరియా ఆస్పత్రి కాంట్రాక్టర్ సుమారు 10 లక్షల రూపాయలు కాజేసిన వైనం వెలుగుచూసింది. గత ఎన్నికల్లో టీడీపీకి విధేయులుగా పనిచేసిన వారిలో కొంత మందికి ఆసుపత్రిలో ఏఎన్ఎంలు, సెక్యూరిటీ గార్డులుగా ఉపాధి కల్పించారు. అప్పటి డైట్ కాంట్రాక్టర్‌ను అర్ధంతరంగా తొలగించి పార్టీకి విధేయుడుగా ఉన్న ఒక వ్యక్తికి బినామీ కాంట్రాక్టర్‌గా అవకాశం కల్పించా రు. వైద్య సిబ్బందిని ప్రలోభ పెట్టడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఫోర్జరీ సంతకాలు చేసేందుకు కూడా వెనకాడలేదు. డైట్ పర్యవేక్షకురాలిగా ఆసుపత్రి హెడ్‌నర్సు పద్మ వ్యవహరిస్తున్నారు. ఆమె ఇచ్చిన హాజరు ప్రకారం రోగులకు భోజనం తయారు చేసి వడ్డించాలి. బిల్లుల చెల్లింపునకు వచ్చేసరికి హెడ్‌నర్సుతో పాటు ఆర్ఎంవో సుధా శారద, గుమస్తా ధ్రువీకరించిన అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ డైట్ కాంట్రాక్టర్‌కు బిల్లు మంజూరు చేయాల్సి ఉంది. అయితే పర్యవేక్షకురాలు పద్మ సంతకం ఫోర్జరీ చేసి, మిగిలిన ఇద్దరు చేత సంతకాలు పెట్టించి సూపరింటెండెంట్‌కు బిల్లులు సమర్పిస్తున్నారు. పర్యవేక్షకురాలు ఇచ్చిన హాజరు ప్రకారం రోగులకు కాంట్రాక్టర్ భోజనం పెడుతున్నాడు. ఉన్నవారి కంటే ఆదనంగా రోగుల సంఖ్యను చూపించి అధిక మొత్తంలో డైట్ బిల్లులు మారుస్తుండటంపై అనుమానం వచ్చి హెడ్‌నర్సు పద్మ డైట్ షీట్లను పరిశీలించారు. ఈ షీట్లలో సంతకాలు తనవి కావని, తన దగ్గర ఉన్న రోగుల హాజరుకు, ఫోర్జరీ సంతకాలతో ఉన్న హాజరుకు చాలా వ్యత్యాసం ఉందని సూపరింటెం డెంట్ హెచ్.వి.దొర దృష్టికి తీసుకెళ్లారు. ఆమె ఫిర్యాదుతో రోగులకు సంబంధించిన డైట్ బిల్లులను క్షుణ్ణంగా పరిశీలించారు. రోగుల సంఖ్య కంటే ఆదనంగా బిల్లు మార్చినట్టు సూపరింటెండెంట్ నిర్ధారణకు వచ్చారు. ఏడాది కాలంగా జరుగుతున్న ఈ స్వాహా పర్వంలో సుమారు రూ.10 లక్షల వరకు కాంట్రాక్టర్ కాజేసినట్లు ఆసుపత్రి అధికారుల పరిశీలనలో వెల్లడైనట్లు తెలిసింది. సంతకాల ఫోర్జరీ వాస్తవమే డైట్ బిల్లుల్లో ఫోర్జరీ సంతకాలు జరిగిన సంగతి వాస్తవమేనని ఆసుపత్రి సూపరింటెండెంట్ దొర స్పష్టంచేశారు. సంబంధిత కాంట్రాక్టర్ నుండి స్వాహా చేసిన నిధులు రికవరీ చేస్తామని చెప్పారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని ఆయన తెలిపారు. చర్యలకు వైఎస్సార్సీపీ డిమాండ్ రోగుల పేరిట నిధులు స్వాహా చేసిన సంబంధిత కాంట్రాక్టర్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్సీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు కోనేటి రామకృష్ణ, పార్టీ నాయకులు పెదిరెడ్ల నాగేశ్వరరావు, గుడబండి నాగేశ్వరరావు తదితరులు సూపరింటెండెంట్ దొరకు మెమొరాండం అందజేశారు. రోగుల సంక్షేమం కోసం ఇస్తున్న నిధులను పక్కదారి పట్టించటం దారుణమని పేర్కొన్నారు. అధికారపార్టీ ప్రజాప్రతినిధుల అండతోనే ఇష్టారాజ్యంగా బిల్లులు చేసుకుని స్వాహా చేశారని ఆరోపించారు. నిధుల స్వాహాపై జిల్లా కలెక్టర్, వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. నిధులు రాబట్టడమే కాకుండా ఫోర్జరీ సంతకాలకు కారకులైన వారిపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
పేరుకు ఉచితం.. దోపిడీ యథాతథం
అధికారపార్టీ అనుచరుల గుప్పెట్లో ఇసుక రీచ్‌లు నిత్యం వందలాది ట్రాక్టర్ల ద్వారా తరలింపు శాఖల మధ్య సమన్వలోపం నర్సీపట్నం: ఉచిత ఇసుక విధానం ప్రభుత్వం అమలులోకి తీసుకురావడంతో ఇక అందరికీ ఇసుక లభిస్తుందని ప్రజలు ఆశించారు. కాని అధికారపార్టీ అనుచరులు ఇసుక రీచ్‌లను వారి గుప్పెట్లో పెట్టుకుని యథేచ్ఛగా ఇసుక రవాణాకు పాల్పడుతున్నారు. అనుమతులు రద్దు చేసిన రీచ్‌ల్లో కూడా అధికార బలంతో తవ్వకాలు జరుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఉచిత ఇసుక రీచ్‌ల వలన సామాన్యులకు ఎలాంటి లాభం చేకూరడం లేదు. ఎప్పట్లాగే ట్రాక్టర్ ఇసుక రూ. 2 వేలు పెట్టి ఇసుక కొనుగోలు చేసుకుంటున్నారు. అధికార పార్టీ నేతలకు భయపడి అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఓ పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా ఇసుక తవ్వేస్తుండడంతో ఆ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత శాఖలు ఎవరికి వారే యమునాతీరే చందంగా వ్యవహరిస్తుండడంతో ట్రాక్టర్లలో ఇసుక తరలించే వారికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. పాలసీ మారినా..: కొద్దికాలం క్రితం వరకు ఇసుక కష్టాలు అందరినీ వెంటాడాయి. వేలకు వేలు వచ్చించి రోజల తరబడి వేచి చూస్తేగాని లభించడం గగనంగా మారింది. డ్వాక్రా సంఘాల పేరిట కొందరు ఇసుక అమ్మకాలతో భారీగా వెనకేసుకున్నారు. ఇటువంటి తరుణంలో ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. రూపాయి కూడా చెల్లించకుండా తీసుకోవచ్చని అదేశాలిచ్చింది. ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన రీచ్‌ల్లోనే తవ్వకాలు చేయాలని పేర్కొంది. దీంతో ఇసుక లభించడం సులభతరమైనా సామాన్యులు మాత్రం సొమ్ము వెచ్చించక తప్పడం లేదు. ట్రాక్టర్ల యజమానులు సమీపంలో రీచ్‌ల నుంచి పెద్ద ఎత్తున ఇసుక త వ్వి తరలిస్తున్నారు. మూసేసిన రీచ్‌లోనూ తవ్వకాలు : రెవెన్యూ విడిజన్ పరిధిలోని మాకవరపాలెం మండలం నారాయణరాజుపేట ఇసుక రీచ్, కోటవురట్ల మండలంలో పందూరు, గొట్టివేడ, చౌడువాడ, కైలాసపట్నం, గొలుగొండ మండలం తాండవ జలాశయం పరిధిలోని ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అనుమతులు ఇచ్చే సమయానికి నారాయణరాజుపేట ఇసుక రీచ్ ఖాళీ అయింది. పరిసర ప్రాంతాల్లోని తాగునీటి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని నారాయణరాజుపేట రీచ్ అనుమతులను రద్దు చేశారు. అయినప్పటికీ అధికార పలుకుబడితో కొందరు నేటికీ యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్నారు. మిగిలిన కీలకమైన రీచ్‌ల్లో ఇష్టానుసారంగా తవ్వకాలు జరుగుతున్నాయి. రీచ్‌లో నిత్యం వందలాది ట్రాక్టర్లు వరుస కడుతున్నాయి. ఆయా రీచ్‌ల్లో ఎవరూ ప్రశ్నించేవారు లేకపోవడంతో ఓ క్రమపద్ధతి అంటూ లేకుండా ఎక్కడికక్కడ తవ్వకాలు జరిపేస్తున్నారు. రీచ్‌లోకి ట్రాక్టర్ ప్రవేశించగానే ఎక్కడ ఇసుక ఉంటే అక్కడే తవ్వేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఒక మీటరు మించి ఎక్కువ లోతులో తవ్వకాలు జరపకూడదు. అలా చేస్తే ఆ ప్రాంతంలో భూగర్భ జలాలపై ప్రభావం చూపుతుంది. అయినా సరే ఏవీ పట్టించుకోవడం లేదు. రీచ్‌లకు ఏర్పాటు చేసిన హద్దులను సైతం పట్టించుకోకుండా తవ్వకాలు జరుపుతున్నారు. ఉచిత ఇసుకపై అటు గనులశాఖ, ఇటు రెవెన్యూ, పోలీసు శాఖలు ఏవీ పెద్దగా పట్టించుకోవటం లేదు. రీచ్‌ల్లో తవ్వకాలను పర్యవేక్షించటం లేదు. రహదారులపై వెళ్లే వాహనాలను మాత్రమే ఆపి విచారించి కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. అనుమతి లేకుండా తవ్వితే చర్యలు.. ఆర్డీవో ఈ విషయమై ఆర్డీవో కె.సూర్యారావును వివరణ కోరగా అనుమతులు లేని రీచ్‌ల్లో తవ్వకాలు జరిపితే తప్పని సరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే ఆయా మండలాల తహసీల్దార్లకు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చామన్నారు. అనుమతులు లేని రీచ్‌ల్లో తవ్వకాలు జరిపితే విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
‘ఇంకుడు’ దోపిడీ
ఇంకుడు గుంతలనూ వదలని తెలుగు తమ్ముళ్లు 90 శాతం గుంతలు టీడీపీ కార్యకర్తలకే రూ.18 కోట్లు అధికారపార్టీ నేతల జేబుల్లోకి? చిత్తూరు: జిల్లాలో భూగర్భజలాల పెంపు కోసం కేంద్రప్రభుత్వం చేపడుతున్న ఇంకుడు గుంతల కార్యక్రమం టీడీపీ నేతల జేబులు నింపుతోంది. లబ్ధిదారుడికి గుంత తవ్వుకునే అవకాశం మాత్రమే ఇచ్చి.. గుంతకు కావాల్సిన సామాగ్రి మొత్తం టీడీపీ నాయకులే సరఫరా చేస్తున్నారు. ఈ ప్రక్రియతో గుంతలకు కేటాయిస్తున్న నిధుల్లో 90 శాతం అధికారపార్టీ నాయకులు, కార్యకర్తలకే వెళ్తోంది. నీరుగారుతున్న లక్ష్యం.. కరువు పరిస్థితుల్లో కూడా ప్రజలు నీటికోసం ఇబ్బందులు పడకుండా ఉండటమే ఇంకుడుగుంతల ఏర్పాటు ముఖ్య లక్ష్యం. అయితే జిల్లాలో అధికారపార్టీ నాయకుల ఆధిపత్యంతో ఈ పథకం ఉద్దేశ్యం పూర్తిగా నీరుగారుతోంది. టీడీపీ కార్యకర్తలకే ఎక్కువ శాతం ఇంకుడు గుంతలను కేటాయించడంతో నిర్దేశిం చిన లక్ష్యం కూడా చేరలేదు. ఈ ఇంకుడుగుంత లు నింపడంలో కూడా పచ్చ కార్యకర్తలు కనీస ప్రమాణాలను పాటించడం లేదు. నిబంధనలు తుంగలో.. ప్రభుత్వం ఒక్క ఇంకుడు గుంత తవ్వుకుంటే లబ్ధిదారుడికి రూ.1670 చెల్లిస్తుంది. గుంత తవ్వుకున్నందుకు రూ.314, కంకర, ఇసుక, సిమెంట్రింగుల కోసం రూ.1,356లు చెల్లిస్తుంది. వీటిని లబ్ధిదారుడే తనకు ఇష్టమొచ్చిన చోట కొనుక్కోవచ్చు. అలా కానిపక్షంలో స్థానిక సర్పంచ్‌ను లబ్ధిదారుడు కోరితే ఆయన సరఫరా చేయవచ్చు. లేకపోతే భూగర్భ గనుల శాఖను కోరినా ఇసుక, కంకరను సరఫరా చేస్తారు. ఈ నిబంధనలు టీడీపీ నాయకులు తుంగలో తొక్కుతున్నారు. లబ్ధిదారులకు ఇష్టం లేకపోయినా తమ దగ్గరే ఇసుక, కంకర కొనుగోలు చేయాల్సిందేనని నిబంధనలు పెడుతున్నారు. కొనుగోలు చేయకుంటే ఇంకుడు గుంత మంజూరు కాకుండా అడ్డుపడుతున్నారు. దోచుకుంటున్నారు ఇసుక, కంకర, స్టీల్ కోసం ప్రభుత్వం ఇచ్చే రూ.1,356 తెలుగు తమ్ముళ్ల జేబుల్లోకే వెళుతున్నాయి. స్థానికంగా ఉండే టీడీపీ నే తలే వీటిని సరఫరా చేస్తున్నారు. కంకరను 20 ఎంఎం, 40 ఎంఎం అనే రెండు రకాలు వాడాలి. అయితే వీటిబదులు ఇటుక ముక్కలు, రాళ్లు సరఫరా చేస్తున్నారు. నాసిరకం సిమెంట్ రింగులను లబ్ధిదారులకు అంటగడుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1.36 లక్షల ఇంకుడు గుంతలను తవ్వారు. దాదాపు వీటన్నింటికీ టీడీపీ నాయకులే మెటీరియల్ సరఫరా చేశారు. ఇంకా అందని బిల్లులు.. ఇంకుడు గుంతలు నిర్మించుకున్న లబ్ధిదారుల కు ఇప్పటివరకు బిల్లులు అందలేదు. జిల్లా వ్యా ప్తంగా తవ్విన 1.36 లక్షల ఇంకుడు గుంతలకు సుమారు రూ.22.72 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనిలో లబ్ధిదారులకు సుమారు రూ.4.27 కోట్లు చేరుతుంది. మిగతా రూ.18.45 కోట్లు పచ్చ బాబుల జేబుల్లోకి చేరనుంది. -
అధికారపార్టీకి ఎన్నికల భయం
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలకు అన్నీ సిద్ధం చేసిన అధికారులు సర్వేలో అధికార పార్టీకి ఎదురుగాలి ఎన్నికలు జరిపేందుకు వెనుకడుగు పార్టీలో గ్రూపు తగాదాలతో సతమతం అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది తిరుపతి కార్పొరేషన్ పరిస్థితి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధికి రూ.వేల కోట్లు ఇస్తున్నా వాటిని రాబట్టుకోలేని స్థితిలో ఉంది. దీనికి కారణం కార్పొరేషన్‌కి పాలకవర్గం లేకపోవడం. అయితే ఓటమి భయంతో తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలు జరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెనుకంజ వేస్తోంది. ఏదో ఒక కారణం చూపుతూ ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తోంది. తాజాగా తిరుపతి నగరపాలక సంస్థకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్లు సుమారు రూ.600 కోట్లకు పైగా నిలిచిపోయాయి. దీంతో నగరపాలక సంస్థ అభివృద్ధికి ఆటంకంగా మారుతోంది. తిరుపతి నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహిం చేందుకు అధికారులు అన్నీ సిద్ధం చేసినా ప్రభుత్వం మీనవేషాలు లెక్కిస్తోంది. రిజర్వేషన్లు ఖరారు చేస్తే ఎన్నికలు నిర్వహించేందుకు రెండు నెలల సమయం అవసరమని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల క మిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఇప్పటికే పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో ఎన్నికలు జరిపేందుకు అన్నీ ఏర్పాట్లు లోలోపల జరిగిపోయాయి. సర్వేలో ఎదురుగాలి తిరుపతి కార్పొరేషన్ పరిధిలో ఎన్నికలు నిర్వహిస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై అధికారపార్టీ ఇటీవల నిఘా వర్గాలతో సర్వే చేయించినట్లు సమాచారం. ప్రస్తు తం ఎన్నికలు నిర్వహిస్తే ఎదురీత తప్పదని, ప్రజాగ్రహా నికి గురయ్యే అవకాశం ఉందని సర్వేలో వెల్లడైనట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నికలు జరిపేందుకు తట పటాయిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతున్నట్లు సమాచా రం. దీంతో అధికార పార్టీ ఎన్నికలను జాప్యం చేయాల నే యోచనలో ఉన్నట్లు ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారు. అధికార పార్టీలో గ్రూపు తగాదాలు కార్పొరేషన్ ఎన్నికలు జరపాలని అధికార పార్టీ ఓ దశలో యోచించినా పార్టీలో గ్రూపు తగాదాలు కలవరపెడుతున్నట్లు సమాచారం. నగరంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఓ బీసీ నేత మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నట్లు సమాచారం. ఓ వర్గానికి టిక్కెట్టు ఇస్తే మరో వర్గం సహకరించదేమోననే భయం నగర నేతలను వెంటాడుతోంది. దీంతో పార్టీ అధినేతలకు అభ్యర్థుల ఎంపిక కష్టంగా మారనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరపడం కంటే వాయిదా వేయడం మేలనే యోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర నిధులు ఆగిపోయి అభివృద్ధికి ఆటంకం కలిగినా ఫర్వాలేదు కానీ ఎన్నికల్లో ఓడిపోతే పరువుపోతుందని భావిస్తున్నారని సమాచారం. సీఎం సొంత జిల్లాలో ఎదురుగాలి వీస్తే ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా చూపుతుందనే భావనలో ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మొత్తం మీద నగరపాలక సంస్థ ఎన్నికలు అధికార పార్టీకి కత్తిమీద సాములా మారాయి. -
సామాన్యులపై శివతాండవం!
ఆస్తిపన్ను వసూళ్లలో అధికారుల ఇష్టారాజ్యం అధికారపార్టీ నేతలవైపు కన్నెత్తి చూడని వైనం చివరి రోజున రూ.24 కోట్ల వసూళ్లు స్తంభన ‘ జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ గీర్వాణి భర్త చంద్రప్రకాష్ పేరిట ఉన్న ఈ భవనం చిత్తూరు కార్పొరేషన్‌కు రూ.7.17లక్షల ఆస్తిపన్ను చెల్లించాలి. పన్ను బకాయిలు ఉంటే ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఉండదనే నిబంధన ఉండటంతో 2014లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్పొరేషన్‌కు పన్ను చెల్లించారు. అప్పటి నుంచి రెండేళ్లుగా కార్పొరేషన్‌కు చిల్లిగవ్వ కూడా చెల్లించలేదు. అత్యధిక బకాయిల జాబితాలో ఈ పెద్ద మనిషి పేరున్నా అధికారపార్టీ నాయకుడు కావడంతో ఏ అధికారీ ఆయనచేత పన్నుకట్టించే దైర్యం చేయలేకపోయారు.’ ..ఇలా పేదలకో న్యాయం.. పెద్దలకో ధర్మం ఎలా ఉంటుందో చిత్తూరు కార్పొరేషన్ అధికారులు స్పష్టంగా చూపించారంతే. మిగిలిన మునిసిపాలిటీల్లో ఇలాంటివి చాలానే ఉన్నాయి. జిల్లాలో ఆస్తిపన్ను వసూళ్లలో అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు ఉదాసీనంగా వ్యవహరించాయి. మార్చి దగ్గరపడుతుందని ఊదరగొడుతూ ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తూ పన్నుల వసూళ్లకు పరుగులు పెట్టిన మునిసిపల్ అధికారులు రూ.లక్షల్లో బకాయిలు పడ్డ పెద్దల జోలికి వెళ్లలేదు. అందులోనూ టీడీపీకి చెందిన నాయకులు రూ.లక్షల్లో అప్పులున్నా వాళ్ల వద్దకువెళ్లి అడగలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని ఆరు మునిసిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలో గురువారంతో 2015-16 ఆర్థిక సంత్సరానికి సంబంధించి ఆస్తిపన్ను వసూళ్ల ప్రక్రియ పూర్తయింది. అయితే కేవలం మధ్య తరగతి కుటుంబాలు, నిరుపేదలు, సమాజంలో గౌర వం కోసం బతికేవాళ్లనే లక్ష్యంగా చేసుకుని పన్నులు వసూలు చేశారే తప్ప పెద్దమనుషులుగా, అధికారపార్టీ నాయకులుగా చెలామణి అవుతున్న వాళ్లు రూ.లక్షల్లో బకాయిలు పడ్డా పట్టించుకోలేదు. ఇలా జిల్లాలో మొత్తం రూ.24 కోట్ల ఆస్తిపన్ను వసూలు కాకుండా స్తంభించిపోయింది. పుత్తూరు టాప్.. ఆస్తిపన్ను వసూళ్లలో జిల్లాలో పుత్తూరు మునిసిపాలిటీ ముందజంలో నిలిచింది. ఇక్కడ గత గురువారం నాటికి మొత్తం రూ.1.39 కోట్లు (99 శాతం)వసూలయిం ది. తరువాతి స్థానాల్లో పుంగనూరు రూ.3.15 కోట్లు(83 శాతం), పలమనేరు రూ.1.25 కోట్లు(82 శాతం), తిరుపతి కార్పొరేషన్ రూ. 31.66 కోట్లు(80 శాతం), శ్రీకాళహస్తి రూ.3.58 కోట్లు (73 శాతం), మదనపల్లె రూ.6.62 కోట్లు (63 శాతం) చిత్తూరు రూ.10.10 కోట్లు (60 శాతం) వసూలు చేసింది. అన్నింటికంటే అట్టడుగులో నగరి మునిసిపాలిటీ రూ.63 లక్షలు వసూలుచేసి 19 శాతం వసూళ్లతో రాష్ట్రంలోనే చివరి స్థానంలో నిలిచింది. -
కలవరం.. కలకలం!
అధికార పార్టీలో మంత్రి పదవి రచ్చ ►కొత్తగా పార్టీలో చేరిన నేతలకు అధినేత హామీలు? ► పార్టీనే నమ్ముకున్నఎమ్మెల్యేల్లో అసంతృప్తి ►నిరాశలో ఓ యువ ఎమ్మెల్యే ఒక్క తాటిపైకి వస్తున్న పాత కాపులు సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఆలూ లేదు చూలూ లేదు.. కొడుపు పేరు సోమలింగం అన్నట్టు తయారయింది జిల్లాలో మంత్రి పదవి కేటాయింపు వ్యవహారం. కొత్తగా పార్టీలో చేరిన వ్యక్తులు తమకు మంత్రి పదవి పక్కా అని ప్రచారం చేసుకుంటుండగా.. ఆయన అయ్యే అవకాశమే లేదని మరో వర్గం వాదిస్తోంది. తాను యువజన, క్రీడా శాఖల మంత్రిని కాబోతున్నానంటూ ఊరు, వాడ ప్రచారం చేసుకున్న ఓ యువ ఎమ్మెల్యే ఇప్పుడు తీవ్ర నిరాశలో కూరుకుపోయినట్టు తెలుస్తోంది. ఎక్కడ తనకు మంత్రి పదవి వరించకుండా పోతుందోనని మదన పడుతున్నట్టు సమాచారం. పాత కాపులంతా ఒకే తాటిపైకి.. అధికార పార్టీలో నిన్నా మొన్నా చేరిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై పాత కాపులంతా మండిపడుతున్నారు. మొదటి నుంచి తమతో ఉన్న పార్టీ శ్రేణులు నిరుత్సాహంలో కూరుకుపోయే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగా పార్టీలోని పాత కాపులంతా ఒక్క తాటిపైకి వస్తున్నారు. పార్టీలో ఎన్నికల ముందు నుంచి ఉన్న వారికే మంత్రి పదవి అవకాశం ఇవ్వాలని.. వీరంతా కోరుతున్నారు. ఇదే అంశాన్ని అందరూ కలిసి వెళ్లి అధినేతకు వివరించాలనే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వీరితో పాటు పార్టీలో చేరిన తాజా మాజీ కాంగ్రెస్ నేతలు కూడా స్వరం కలుపుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సదరు యువ ఎమ్మెల్యే ఆశలు మళ్లీ మొగ్గతొడిగాయి. ఈ నేతలతో సదరు యువ ఎమ్మెల్యే కూడా కలిసి మళ్లీ మంత్రి పదవి యత్నాల్లో పడినట్టు అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు. మంత్రి పదవి చర్చ లేదంటూనే.. వాస్తవానికి ప్రతిపక్ష పార్టీ నుంచి పార్టీలోకి చేర్చుకునే సందర్భంగా భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఇస్తారనే అంశం ఎక్కడా ప్రస్తావనకే రాలేదనేది జిల్లా పార్టీ నేతలు వాదన. మంత్రి పదవి ఇస్తామని ఆశ చూపి పార్టీలో చేర్చుకోలేదని స్వయంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి కూడా పలుమార్లు ప్రకటించారు. తద్వారా ఆయనకు మంత్రి పదవి వచ్చే అవకాశం లేదనే సందేశాన్ని పంపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఏదో ఒక మూలన.. మంత్రి పదవి వస్తుందనే భయంతోనే పాత కాపులంతా ఏకమవుతున్నారని తెలుస్తోంది. మొత్తంగా అధికార పార్టీలో మంత్రి పదవి వ్యవహారంలో ఎవరిది పైచేయి అవుతుందనే విషయం.. బడ్జెట్ సమావేశాల తర్వాత వచ్చే నెలలో తేలే అవకాశం ఉంది. -
‘సెస్’ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
► అభ్యర్థి లేదా ఏజెంట్‌కు అనుమతి ► కౌంటింగ్‌కు నాలుగు టేబుళ్లు ► హైకోర్టు నిర్ణయంపైనే ► ఉత్కంఠ కోర్టు నిర్ణయానికి లోబడి ఫలితాలు ► ఎన్నికల అధికారి చంద్రమోహన్‌రెడ్డి సిరిసిల్ల : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిరిసిల్ల పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, పోటీ చేసిన అభ్యర్థులు, లేదా వారి తరఫున ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు. ఎన్నికల ఫలితాలు సాయంత్రం 3 గంటల వరకు వెల్లడయ్యే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. పోలింగ్ సరళిపై చర్చలు ‘సెస్’ ఎన్నికల్లో పోలింగ్ సరళిపై అంచనాలు వేస్తూ.. తమకు వచ్చే ఓట్ల గురించి అభ్యర్థులు ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. సిరిసిల్ల పట్టణంలో పది మంది బరిలో ఉండగా ఇద్దరి మధ్యే తీవ్ర పోటీ నెలకొంది. ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేటల్లో ద్విముఖ పోటీ ఉండడంతో గెలుపుపై ఎవరికి వారు అంచనాలు వేస్తున్నారు. ముస్తాబాద్‌లో నలుగురు పోటీలో ఉండగా అధికార టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి గెలుపుపై ధీమాగా ఉన్నారు. వేములవాడ పట్టణంలో ఆరుగురు బరిలో ఉండగా విజయంపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. వేములవాడ రూరల్‌లో అధికార పార్టీ గెలుపుపై ధీమాగా ఉంది. చందుర్తిలో చతుర్ముఖ పోటీ ఉన్నా విజయంపై అందరూ ఆశలు పెట్టుకున్నారు. కోనరావుపేటలో చతుర్ముఖ పోటీలో గెలుపెవరిదో అంతుచిక్కని పరిస్థితి. ఇల్లంతకుంటలో ఆరుగురు, బోయినపల్లిలో నలుగురు పోటీలో ఉన్నారు. 11 డెరైక్టర్ స్థానాలకు 50 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. హైకోర్టుదే తుది నిర్ణయం ‘సెస్’ ఎన్నికల ఫలితాలపై హైకోర్టుదే తుది నిర్ణయంగా భావిస్తున్నారు. ఎన్నికల్లో అర్హులైన ఓటర్లను బకాయిల పేరుతో ఓటింగ్‌కు దూరం చేశారని, చనిపోయిన ఓటర్ల స్థానంలో వారి వారసులకు అవకాశం కల్పించలేదని పేర్కొంటూ సిరిసిల్లకు చెందిన డి.ప్రభాకర్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు మధ్యంతర ఆదేశాలను జారీ చేసింది. ఎన్నికల పక్రియను కొనసాగించాలని, ఫలితాలు ఎలా వచ్చినా కోర్టు ఉత్తర్వులకు కట్టుబడి ఉండాలని ఆదేశించింది. పిటిషనర్ ప్రభాకర్‌రావు వాదనను కోర్టు సమర్థిస్తే ఎన్నికలే రద్దయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఆయన వాదనతో ఏకీభవించకుంటే ‘సెస్’ ఎన్నికలకు ఎలాంటి ప్రమాదం లేదని సహకార శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కోర్టు నిర్ణయానికి లోబడి ఫలితాలు సెస్’ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తిచేశాం. మంగళవారం కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇస్తాం. బుధవారం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అభ్యర్థి లేదా అతని తరఫున ఏజెంట్‌ను కౌంటింగ్ కేంద్రంలోకి ఎవరినో ఒక్కరినే అనుమతిస్తాం. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థికి ధ్రువీకరణ పత్రం అందిస్తాం. ఆ పత్రంలో నోట్ పెట్టి కోర్టు నిర్ణయానికి లోబడి ఉండాలనే నిబంధనను స్పష్టం చేస్తాం. ఓట్ల లెక్కింపునకు 25 సిబ్బందిని నియమించాం. గురువారం ‘సెస్’ ఆఫీస్‌లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మెజార్టీ డెరైక్టర్ల ఆమోదం మేరకు జరుగుతుంది. అంతిమంగా కోర్టు నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే - జి.చంద్రమోహన్‌రెడ్డి, ఎన్నికల అధికారి -
అభయం!
భూమా-శిల్పా మధ్య ముసలం ఉద్యోగుల బదిలీ తప్పదనే ప్రచారం ధైర్యం చెప్పే ప్రయత్నంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూమాకు మంత్రి పదవి రాకుండా మోకాలడ్డు నంద్యాల, ఆళ్లగడ్డల్లోని అధికారుల్లో గందరగోళం సమన్వయం’ ఎన్నటికో... సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీలో భూమా-శిల్పాల మధ్య రేగిన ముసలం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే మంత్రి పదవి విషయంలో వివాదం రాజుకుంటుండగానే.. తాజాగా అధికారుల బదిలీల విషయంలో కొత్త సమస్య తెరమీదకొచ్చింది. అన్నకు మంత్రి పదవి రాగానే అధికారులపై వేటు తప్పదనే ప్రచారం ఇప్పటికే అటు ఆళ్లగడ్డ, ఇటు నంద్యాలలో జోరందుకుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని.. ఏ ఒక్కరిపై బదిలీ వేటు పడకుండా చూస్తానని అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి ధైర్యం చెబుతున్నట్టు సమాచారం. మరోవైపు అసలు మంత్రి పదవి ఆయనకు వచ్చే అవకాశమే లేదని కూడా చెబుతుండటం గమనార్హం. డీఎస్పీపై వేటు తప్పదు నంద్యాల డీఎస్పీని బదిలీ చేస్తారనే ప్రచారం ఇప్పటికే సాగుతోంది. ఈ విషయమై నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును భూమా కోరినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన వ్యక్తిగత పనుల మీద కొన్ని రోజుల పాటు సెలవులో వెళ్లారు. ఇదే సందర్భంలో అధికార పార్టీ నేతలు మాత్రం ఆయన బదిలీ అయ్యే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. అధికారుల బదిలీలపై ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి హామీ లభించలేదని.. కేవలం నియోజకవర్గ ఇన్చార్జీల మాటే చెల్లుబాటు అవుతుందని ఇప్పటికే శిల్పా ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆళ్లగడ్డలోనూ వార్ షురూ ఆళ్లగడ్డ నియోజకవర్గంలోనూ ఇదే తరహా యుద్ధానికి తెరలేసింది. నియోజకవర్గంలో గంగుల ప్రభాకర్ రెడ్డి కూడా పలువురు అధికారులను నియమించుకున్నారు. వీరందరిపైనా ఇప్పుడు వేటు తప్పదనే ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా నియోజకవర్గంలోని ఒక మండలంలో రెగ్యులర్ తహశీల్దారును కాదని.. డిప్యూటీ తహశీల్దారునే కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఈయన స్థానానికి కూడా ఎసరు తప్పదనే ప్రచారం ఉంది. ఇదే జరిగితే తాడోపేడో తేల్చుకుంటామని గంగుల వర్గీయులు సవాల్ విసురుతున్నారు. తాజా చేరికలతో జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరుతోంది. కమిటీ వచ్చేదెన్నడో.. పార్టీలో విపక్ష ఎమ్మెల్యేల చేరిక నేపథ్యంలో పాత నేతలు, కొత్త నేతలకు మధ్య సమన్వయం చేసేందుకు జిల్లా ఇన్చార్జి మంత్రి, డిప్యూటీ సీఎం కేఈ, జిల్లా అధ్యక్షులతో కూడిన కమిటీని పార్టీ నియమించింది. అయితే, ఈ కమిటీ ఇప్పటివరకు కనీసం ఇరువురితో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. కమిటీ వచ్చెదెన్నడో.. నేతల మధ్య సమన్వయం సాధించేదెన్నడో అనే చర్చ అధికారపార్టీలో జరుగుతోంది. -
బెదిరింపులతో చితికిపోతున్నాం..!
ఎమ్మెల్యే ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన నగరపాలక సంస్థ ఉద్యోగులు దాడులను ఎదుర్కొనేందుకు నూతనంగా కమిటీ ఏర్పాటు అనంతపురం న్యూసిటీ: నగరపాలక సంస్థలో అధ్వానమైన పరిస్థితి నెలకొందని, నిత్యం బెదిరింపులతో చితికి పోవాల్సి వస్తోందని అధికారులు, ఉద్యోగులు ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఎమ్మెల్యేను కలిసిన నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసుతో పాటు కింది స్థాయి అధికారులు, ఉద్యోగులు ఆయన నివాసంలోనే సమావేశమయ్యారు. ఏఈ సుభాష్ రాజీనామా చేసే స్థాయికి వచ్చాడంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవాలని ఎమ్మెల్యేకు విన్నవించారు. ఇళ్ల వద్దకు వెళ్లి బిల్లుల చేయమని వేధించడమేమిటన్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లతో మానసిక క్షోభను అనుభవిస్తున్నామన్నారు. ఒకరికి పని చేస్తే మరో వర్గం లక్ష్యంగా చేసుకుని దురుసుగా ప్రవర్తిస్తోందన్నారు. ఈఈ, డీఈ, ఏఈ అధికారులన్న ఆలోచన లేకుండా దుర్భాషలాడడం సరికాదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులమైన తమ పట్ల ఇంత వివక్ష చూపించడం సరికాదన్నారు. కార్పొరేటర్లు సైతం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. పాలకవర్గంలోని నేతలు వ్యవహరిస్తున్న తీరుతో కింది స్థాయి ఉద్యోగి నుంచి అధికారుల వర కు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలాగైతే ఏవిధంగా పనిచేయాలని ఎమ్మెల్యేతో తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమను తాము కాపాడుకునేందుకు ఓ కమిటీను వేసుకుంటామని తెలిపారు. ఎవరినీ ఉపేక్షించ వద్దు: ఎమ్మెల్యే విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించాలని, ఎవరినీ ఉపేక్షించవద్దని ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అధికారులకు భరోసా ఇచ్చారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అధికారులు, ఉద్యోగులకు అండగా ఉంటామన్నారు. ధైర్యంగా, స్వేచ్ఛగా పని చేయాలన్నారు. నగరాభివృద్ధికి అందరూ ముందుకు రావాలన్నారు. ఎవరైనా సరే అధికారులు, ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అధికారులతో సమన్వయంతో పని చేయించుకోవాలన్నారు. ఎమ్మెల్యేను కలసిన వారిలో అడిషినల్ కమిషనర్ పగడాల కృష్ణమూర్తి, డిప్యూటీ కమిషనర్ అజయ్ కిషోర్ తదితరులున్నారు. కొత్తగా ఏర్పాటు చేసుకున్న నగరపాలక సంస్థ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఇదేగౌరవాధ్యక్షులుగా చల్లా ఓబులేసు(కమిషనర్), అధ్యక్షుడుగా నరసింహులు, కార్యదర్శిగా బీఎస్ కృష్ణమూర్తి, సహాయ కార్యదర్శిగా మురళీ, కోశాధికారిగా రమణ, ఉపాధ్యక్షులుగా నవనీతకృష్ణ, సతీష్, సురేంద్ర, బాషా ఉన్నారు. దళిత ఉద్యోగులను వేధిస్తే సహించం = ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం హెచ్చరిక అనంతపురం న్యూటౌన్ : అధికార పార్టీ నాయకుల అరాచకాలు క్రమంగా పెరిగిపోతున్నాయని, దళిత ఉద్యోగులపై ప్రతాపం చూపిస్తుండడం దారుణమని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మీనుగ రామప్రసాద్ ఓ ప్రకటనను విడుదల చేశారు. ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న దళిత ఉద్యోగులు మానసికంగా, శారీరకంగా వేధిస్తూ అనేక అవస్థలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. నగర పాలక సంస్థలో పనిచేస్తున్న సుభాష్‌చంద్రబోస్‌కు సమయానికి మించి పని భారం పెట్టడం వల్ల కుటుంబానికి చెప్పుకోలేక, ఇటు అధికారులకు చెప్పలేక మనోవేదనకు గురై ఉద్యోగానికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారన్నారు. దళిత ఉద్యోగులను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెపుతామని హెచ్చరించారు. -
టీడీపీ ఎంపీటీసీ తనయుడి దాడి
తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన బాధితుడు చిలమత్తూరు: అధికార పార్టీ నాయకులు రోజురోజుకూ చెలరేగిపోతున్నారు. అధికారం ఉందని విచక్షణ రహితంగా భౌతిక దాడులకు దిగడం పరిపాటిగా మారుతోంది. తాజాగా మండలంలోని కోడూరు పంచాయతీ మదిరేపల్లి గ్రామానికి చెందిన వార్డు సభ్యురాలు కుమారుడు గంగాధర్ తన స్నేహితులతో కలిసి శుక్రవారం కోడూరు తోపులో టీ తాగుతూ ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు తనయుడు సోమశేఖర్ ఎందుకు నవ్వుతున్నారంటూ వారితో వాదనకు దిగాడు. ఆ గొడవ కాస్త పెద్దది కావడంతో సోమశేఖర్ పక్కనే ఉన్న ఇనుప రాడుతో గంగాధర్‌పై దాడి చేశాడు. దీంతో గంగాధర్ తలకు దెబ్బ తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన బంధువులు గంగాధర్‌ను స్థానిక పోలీసుస్టేషన్‌కు తరలించి ఫిర్యాదు చేశారు. పోలీసులు చికిత్స నిమిత్తం బాధితుణ్ని ఆసుప్రతికి పంపించారు. గతంలో కూడా దారి విషయంలో తమపై దాడి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా దాడి విషయంలో బాధితుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయరాదని అధికార పార్టీ నేతల నుంచి పోలీసులపై ఒత్తిళ్లు ప్రారంభమయ్యాయి. ఈ విషయమై ఉన్నతాధికారులు స్పందించి కేసు నమోదు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
ఇసుక తోడేళ్లు
అక్రమార్కులకు కాసుల వర్షంకురిపిస్తున్న ఇసుకసంఘాల ముసుగులో రూ.కోట్లు దండుకుంటున్న వైనం ఇప్పటికే రూ.182.5 కోట్లఅక్రమార్జనజిల్లాలో ఇసుక రీచ్‌లన్నీ ఖాళీ ధర్మవరం: జిల్లాలో ఇసుక రీచ్‌లు సగానికి పైగా ఖాళీ అయిపోయాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పచ్చతమ్ముళ్లు సహజ సంపదను కొల్లగొట్టారు. తద్వారా కోట్లాది రూపాయలు తమ జేబుల్లోకి వేసుకున్నారు. జిల్లాలోని 35 ఇసుక రీచ్‌లలో 16.87 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక లభ్యమవుతుందని భూగర్భ శాఖ నివేదిక ఇచ్చింది. దీంతో ఇసుకను విక్రయించేందుకు అక్టోబర్, 2014 లో ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు అనుమతి ఇచ్చింది. అప్పటి నుంచి 2016 జనవరి ఆఖరు నాటికి 35 రీచ్‌ల పరిధిలో 4.38 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను డ్వాక్రా సంఘాల ద్వారా విక్రయించారు. రూ.19.98 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం చేకూరింది. తెర వెనుక ఇలా.. ప్రతి రోజూ జిల్లాలోని 35 ఇసుక రీచ్‌లనుంచి నుంచి సగటున 100 నుంచి 120 లారీల ఇసుక ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం. పేరు డ్వాక్రా సంఘాలదే అయినా పెత్తనం మొత్తం అధికార పార్టీనేతల చేతిలో ఉండటంతో వారు అందినకాటికి అమ్మేసి రూ. కోట్లు వెనకేసుకున్నారు. ఇసుక రీచ్‌లలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకే ఇసుకను తవ్వాల్సి ఉంటుంది. ఈ సమయం దాటిపోతానే అనధికాధికారులు ఇసుక రీచ్‌లలోకి వెళ్లి సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు ఇసుకను యధేచ్చగా తరలించేవారు. ఈ ఇసుకరీచ్లపై ఎటువంటి నిఘా లేకపోవడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ తాత్సారం వెరసి జిల్లాలోని రీచ్‌లన్నింటినీ అక్రమార్కులు కొల్లకొట్టేశారు. ప్రతి రోజు జిల్లా నుంచి 100 నుంచి 120 దాకా లారీల ఇసుక జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు తరలుతోంది. ఒక్కో లారీకి 10 క్యూబిక్ మీటర్ల ఇసుకను నింపితే 100 లారీలకు 1200 క్యూబిక్ మీటర్ల ఇసుక బయటి ప్రాంతాలకు తరలిపోయింది. ఈ ప్రకారం ఒక్క ఏడాదిలోనే 4.38 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను అక్రమార్కులు జిల్లా దాటించి సొమ్ముచేసుకున్నారు. అనధికారికంగా జిల్లా దాటిపోయిన ఇసుకను బెంగళూరు, చిక్‌బళాపూర్, బళ్లారి, తదితర ప్రాంతాల్లో విక్రయించగా అక్రమార్కులకు చే కూరిన ఆదాయం చూస్తే కళ్లు బైర్లు కమ్మకపోవు. సీపీరేవు రీచ్నుంచే వందలాది లారీల ఇసుక అక్రమ రవాణా ఒక్క ధర్మవరం నియోజకవర్గంలోనే రోజుకు 30 నుంచి 40 దాకా ఇసుక లారీలు రాష్ట్ర సరిహద్దులు దాటించారు. తాడిమర్రి మండలం చిన్నచిగుళ్ల రేవు ఇసుక రీచ్ వద్దనుంచే ఈ ఏడాది వ్యవధిలో 12,000 లారీల ఇసుక అక్రమంగా తరలిపోయింది. ఆ ఇసుకను విక్రయించగా వారికి దాదాపు 60కోట్లు లాభం చేకూరింది. ఇసుక విక్రయాలు ఆపేసిన తరువాత ఈ అక్రమ తరలింపు రోజుకు 50నుంచి 60 లారీల మేర జరిగినట్లు సమాచారం. కేవలం 20 రోజుల వ్యవధిలోనే 1,000 లారీల ఇసుకను తరలించినట్లు రీచ్‌కు సమీపంలోని గ్రామస్థులు అవేదన వ్యక్తం చేశారు. అధికారులపై ఆరోపణలు అధికారుల అండతోనే ఇసుక వ్యాపారం మూడు డంపులు.. ఆరు లారీలుగా కొనసాగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుకాసురుల కనుసన్నల్లో పోలీసులు, రెవిన్యూ అధికారులు పనిచేస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. బహిరంగంగానే ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు చూడనట్లు వ్యవహరించడం వల్లనే ప్రజాదనం అక్రమార్కుల పాలైందని పలువు నేతలు వ్యాఖ్యానిస్తున్నార -
ఖాకీపై ఖద్దర్ స్వారీ
అనంతపురం టూటౌన్ ఎస్ఐ హమీద్వీఆర్కు బదిలీ మంత్రి పరిటాల సునీత ఒత్తిడితోఉన్నతాధికారుల నిర్ణయం? నిక్కచ్చిగా ఉన్నందుకు మొన్న గోరంట్ల మాధవ్.. నేడు హమీద్ బలి బదిలీలపై పోలీసు అధికారుల సంఘంలో చర్చ (సాక్షిప్రతినిధి, అనంతపురం) మంత్రి పరిటాల సునీత ఒత్తిడితో మరో ఎస్ఐ బలయ్యారా? విధినిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించిన ఎస్ఐని కాపాడటం కనీస బాధ్యత అనే విషయాన్ని విస్మరించి, అధికార పార్టీ ఆదేశాలనే ఉన్నతాధికారులు శిరసావహించారా? మొన్న గోరంట్ల మాధవ్..నేడు హమీద్ బదిలీల వెనుక మర్మమిదేనా? అధికార పార్టీ నేతలను ఎదిరిస్తే ఎవరికైనా ‘లూప్‌లైన్’ తప్పదనే సంకేతాన్ని పంపారా?.. తాజా పరిస్థితులు చూస్తే ఈ ప్రశ్నలకు ఔననే సమాధానం వస్తోంది. మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరాంను కేబుల్ వ్యవహారంలో గట్టిగా మందలించడం...స్థలం విషయంలో చమన్‌కు మీడియా ద్వారా హెచ్చరికలు పంపడాన్ని సీరియస్‌గా తీసుకుని గతంలో సీఐ గోరంట్ల మాధవ్ బదిలీకి కారణమైన అధికారపార్టీ నేతలు ఇప్పుడు మరో యువ ఎస్ఐపై కన్నెర్ర చేశారు. తమ అనుచరులను అదుపులోకి తీసుకున్నారనే కారణంతో టౌటౌన్ ఎస్ఐ హమీద్‌ను లూప్లైన్కు బదిలీ చేయించారు. ఈ బదిలీపై ప్రస్తుతం పోలీసుశాఖలో తీవ్ర చర్చ సాగుతోంది.హమీద్ చేసిన నేరం ఇదేనా?హమీద్ బదిలీకి సంబంధించి పోలీసువర్గాలు చెప్పిన వివరాలిలా ఉన్నాయి. ‘అనంత’లోని నందమూరినగర్‌కు చెందిన టీడీపీ నేత మనోహర్‌నాయుడు పరిటాల వర్గానికి ప్రధాన అనుచరుడు. ఇటీవల ఆంథోనిరెడ్డి అనే రియల్టర్‌ను కిడ్నాప్ చేసి రూ.50 లక్షలు డిమాండ్ చేశాడు. రూ.20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఆంథోనిరెడ్డి కుటుంబసభ్యులు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ హమీద్.. మనోహర్‌నాయుడి కోసం గాలించారు. విషయం తెలిసి అతను పరారయ్యాడు. దీంతో అతని కుమారుడు కార్తీక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో మనోహర్ అనుచరుడు జయకృష్ణ స్టేషన్‌కు వెళ్లి హమీద్‌తో దురుసుగా మాట్లాడాడు.దీంతో చిర్రెత్తిన హమీద్ అతనికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ విషయం సునీత దృష్టికి వెళ్లింది. హమీద్ సంగతి తేల్చాలని మనోహర్‌తో పాటు జయకృష్ణ తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతోనే సునీత పోలీసుశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి హమీద్‌ను వీఆర్‌కు పంపించినట్లు తెలుస్తోంది. అధికార పార్టీకివ్యతిరేకంగా పనిచేయకూడదా? యువ ఎస్ఐలలో హమీద్‌కు మంచి పేరుంది. పార్టీలకతీతంగా బాధితులకు న్యాయం చేసేలా వ్యవహరిస్తుంటారు. ఇదే క్రమంలో మనోహర్‌నాయుడు సునీత అనుచరుడని తెలిసినా, తాను ఉద్యోగధర్మం నిర్వర్తిస్తున్నాననే ధోరణిలోనే ముందడుగు వేశారు. గతంలో కూడా టూటౌన్ పరిధిలో ఇంటిస్థలం విషయమై ఓ యువతితో మనోహర్ నాయుడు అసభ్యంగా ప్రవర్తించారని పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. దీంతో పాటు మనోహర్‌పై పలు ఫిర్యాదులు వచ్చినా సీఐ శుభకుమార్ పూర్తిగా పక్కనపెట్టారని తెలిసింది. సీఐ చర్యలను భరిస్తూ వచ్చిన హమీద్.. ఆంథోనిరెడ్డి కిడ్నాప్ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. గతంలో సీఐ గోరంట్ల మాధవ్ కూడా రాజకీయనేతలను కాదని బాధితుల పక్షాన నిలవడంతోనే సీఐడీకి బదిలీ అయ్యారని ఆ శాఖ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ రెండు బదిలీలపై పోలీసుశాఖలో తీవ్ర చర్చ సాగుతోంది. రాజకీయనేతలు సిఫారసు చేస్తే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారని పోలీసు సంఘంలోని కొందరు ప్రశ్నిస్తున్నారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించే పోలీసులపై అధికారపార్టీనేతల నుంచి ఇబ్బందులు రావడం సహజమని, అయితే ఉన్నతాధికారులు అండగా నిలవాలని అంటున్నారు. ‘అనంత’పోలీసు శాఖలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని అంటున్నారు. దీన్ని ఇలాగే వదిలేస్తే మరింత మంది అధికారులు బలవుతారని, కావున దీనిపై గట్టిగా పోరాడాలని పోలీసుసంఘం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు ఎస్ఐలు వీఆర్‌కు.. అనంతపురం క్రైం : నగరంలో పనిచేస్తున్న ఇద్దరు ఎస్ఐలను వీఆర్‌కు పంపుతూ ఎస్పీ రాజశేఖర్‌బాబు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. త్రీటౌన్ ఎస్ఐ తమీమ్ అహ్మద్, టూటౌన్ ఎస్ఐ హమీద్ఖాన్లను వీఆర్‌కు పంపారు. ఇటీవల చోటు చేసుకున్న కొన్ని ఘటనల నేపథ్యంలో వీరిని వీఆర్‌కు పంపినట్లు తెలిసింది. -
ఇక పనుల పందేరం
అధికార పార్టీ నేతలకు రూ.100 కోట్ల పనులు నీరు-చెట్టు కింద అంచనాల్లో నిమగ్నమైన అధికారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న తమ్ముళ్లు 1500 చెరువుల మరమ్మతులకు ప్రతిపాదనలు పనుల పంపకాలకు తెర లేచింది. గతంలోనే నీరు-చెట్టు కింద అందినకాడికి దోచుకున్న అధికార పార్టీ నేతలకు మరో రూ.100 కోట్ల పనులు కట్టబెట్టనున్నారు. చెరువుల మరమ్మతుల పేరుతో ఈ నిధులను వెచ్చించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. తిరుపతి: జిల్లాలో నీరు-చెట్టు కార్యక్రమం కింద ఈ ఏడాది రూ.100 కోట్ల పనులను అధికార పార్టీ నేతలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం అధికారులు కసరత్తు ప్రారంభించారు. పనులను గుర్తించడం, అంచనాలు రూపొందించడంలో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కువ భాగం చెరువుల్లో నీరు ఉండడంతో నీరు తగ్గిన వెంటనే పనులు ప్రారంభించే దిశగా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. పనుల గుర్తింపు ఇలా.. నీరు-చెట్టు పనులకు ముఖ్యమంత్రి ప్రాధాన్యం ఇస్తుండడాన్ని జిల్లాలోని నేతలు తమకు అనువు గా మలచుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరంచేశారు. ఈ కార్యక్రమం కింద వంకలు, వాగులపై చెక్‌డ్యాంలు, పంటకాలువలు, చెరువుల్లో పూడికతీత, కంపచెట్ల తొలగింపు, కట్టలను బలపరచడం, తూములు, గేట్ల పునరుద్ధరణ, చెరువు మొరవలు, కాంక్రీట్ పనులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కార్యాలయాల చుట్టూ తమ్ముళ్లు నీరు-చెట్టు కార్యక్రమంలో పనులను గుర్తించి అధికారులతో అంచనాలు రూపొందించుకునేందుకు అధికార పార్టీ నేతలు నీటిపారుదల శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. గత ఏడాది నామమాత్రంగా పనులు చేసి లక్షల రూపాయలు స్వాహా చేసిన నేతలు మళ్లీ, ఈ ఏడాది అలానే పనులు చేసి అందిన కాడికి దోచుకునేందుకు సమాయత్తమవుతున్నారు. గతంలో అవసరం లేకున్నా పనులు చేయడం, ఒకే పనిని రెండుమార్లు చేసి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది రూ.136 కోట్ల పనులకు అనుమతి ఇచ్చారు. ఇందులో రూ.103 కోట్ల మేర పనులు చేసి తెలుగు తమ్ముళ్లు జేబులు ఇక పనుల పందేరం నింపుకొన్నారు. పనుల్లో జన్మభూమి కమిటీలది పెత్తనం కావడం, పనులను నామినేషన్‌పైనే కట్టబెడుతుండడంతో దేశం ద్వితీయ శ్రేణి నేతలు పనులు దక్కించుకొనేందుకు అధినేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు తెలిసింది. కొంత మంది పచ్చ నేతలు, తమ అధినాయకులకు కమీషన్లు ఇచ్చి పనులు దక్కించుకొనే దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కోట్లాది రూపాయల పనులు, దీనికి తోడు మట్టి పనులు కావడంతో సొమ్ము చేసుకోవచ్చనే దిశగా తెలుగు తమ్ముళ్లు తహతహలాడుతున్నారు. అధిష్టానం సైతం కార్యకర్తలకు లబ్ధి చేకూరేలా నీరు-చెట్టు పనులను నామినేషన్‌పై కేటాయిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 8000 పైగా చెరువులున్నాయి. ఈ ఏడాది దాదాపు 1500 చెరువులకు పైగా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలనే దిశగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రణాళికలు రూపొందిస్తున్నాం నీరు-చెట్టు కార్యక్రమం కింద పనుల గుర్తింపు కార్యక్రమం సాగుతోంది. ఇప్పటికే అధికారులతో సమావేశం నిర్వహించాం. దాదాపు రూ.100 కోట్ల మేర పనుల కోసం అంచనాలు రూపొందిస్తున్నాం. చెరువుల్లో నీరు తగ్గిన వెంటనే పనులు ప్రారంభించి, నిర్ణీత కాలవ్యవధిలోపు పనులు పూర్తి అయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. - శ్రీరామకృష్ణ. ఎస్ఈ, నీటిపారుదల శాఖ, చిత్తూరు -
కసంక్రాంతి ‘బరి’లో కాక్ ఫైట్
పోలీసులు వర్సెస్ ప్రజాప్రతినిధులు కోడి పందేల నిర్వహణకు భారీ ఏర్పాట్లు మంత్రులతో ప్రారంభించేందుకు సన్నాహాలు వీవీఐపీల రాకపోకలకు ప్రత్యేక రోడ్లు నిర్మాణం కఠిన చర్యలు తప్పవని ఎస్పీల హెచ్చరికలు గుంటూరు సంక్రాంతిని పురస్కరించుకుని జిల్లాలో కోడి పందేలు నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అధికారపార్టీ నేతల అండతో హైకోర్టు, పోలీస్ అధికారుల ఆదేశాలను సైతం లెక్కచేయకుండా లక్షల రూపాయల ఖర్చుతో బరులను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా డెల్టా ప్రాంతంలో కోడి పందేల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికారపార్టీ నేతలు హైదరాబాద్ స్థాయి అధికారులతో పైరవీలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇతర జిల్లాల ప్రజాప్రతినిధులతో కలసి ‘చినబాబు’ వద్ద ఆమోదముద్ర తీసుకున్న నేతలు పోలీసులను లెక్కచేయకుండా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గత ఏడాది సైతం జిల్లా వ్యాప్తంగా కోడి పందేలు జరగకుండా కట్టడి చేసిన పోలీసులు రేపల్లెలో ఏర్పాటు చేసిన బరుల వైపు వెళ్ళలేకపోయారు. సీఎం పేషీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే అప్పట్లో కోడి పందేలను ఆపలేకపోయారనేది బహిరంగ రహస్యమే. ఈ సారి కూడా అలాగే జరుగుతుందని అధికారపార్టీ నేతలు ధీమాగా ఉండగా, పందేలు నిర్వహిస్తే చర్యలు తీసుకునేలా అన్ని జిల్లాల ఎస్పీలకూ స్పష్టమైన ఆదేశాలిస్తామంటూ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. ఇళ్ళల్లోకి చొరబడి మరీ పందెం కోళ్ళను ఎత్తుకెళుతున్న పోలీసులు రేపల్లె మండలంలోని ఓ మాజీ ఎమ్మెల్యే పొలంలో పందేల నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఖాకీ, ఖద్దరు మధ్య వివాదం జరిగిన ప్రతిసారీ ఖద్దరుదే పైచేయిగా నిలుస్తోంది. డీఎస్పీ, సీఐల బదిలీల దగ్గర నుంచి, జిల్లాలో జరుగుతున్నఅక్రమాలను అడ్డుకుంటున్న ఎస్పీల బదిలీల వరకు అధికారపార్టీ నేతల పంతమే నెగ్గుతూ వస్తోంది. మంత్రులు, ఎంపీలతో ప్రారంభించేందుకు సన్నహాలు ... జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలను ఆహ్వానించి కోడి పందేలను ప్రారంభింపజేయాలని నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. పొలాల్లో బరులు ఏర్పాటు చేసినప్పటికీ అక్కడకు నేరుగా వీవీఐపీల వాహనాలు వచ్చేలా రోడ్ల నిర్మాణాలు సైతం చేపడుతున్నారు. లక్షల్లో పందేలు కాసే వారి కోసం ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. అధికారపార్టీ ప్రజాప్రతినిధులు పందేల వద్ద ఉంటే పోలీసులు అక్కడికి వచ్చినా నిలువరించలేరనేది నిర్వాహకుల ఆలోచనగా తెలుస్తోంది. ప్రజాప్రతినిధులు సైతం వారికి ఆ మేరకు భరోసా ఇస్తున్నారు. అయితే అర్బన్, రూరల్ జిల్లా ఎస్పీలు మాత్రం కోడి పందేలు నిర్వహిస్తే సహించేదిలేదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సంక్రాంతి కాక్ ఫైట్‌లో ఖద్దరు, ఖాకీల్లో ఎవరు నెగ్గుతారో వేచి చూడాల్సిందే. -
అధికార పార్టీ ‘చిట్స్’ లీలలు
నూతన చిట్ వేడుకల్లో అసభ్యకర నృత్యాలు అడ్డుకున్న పోలీసులు ఒత్తిళ్లతో చర్యలకు వెనుకడుగు నరసరావుపేట టౌన్ : కాల్‌మనీ వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ వ్యాపారులపై దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి, అతని సోదరుడు నూతన చిట్ వేడుకల్లో భాగంగా మందుపార్టీ, అసభ్యకర నృత్యాలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు కావడంతో చర్యలకు వెనుకడుగు వేశారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే. పట్టణంలో అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్, అతని సోదరుడు నూతన చిట్స్‌ను ప్రారంభించారు. వేడుకల్లో భాగంగా వినుకొండ రోడ్డులోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం రాత్రి మందు పార్టీ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మహిళలతో అసభ్యకర డాన్స్‌లు చేయించారు. హాజరైన చీటీపాట సభ్యులు కార్యక్రమాలను ఫోన్లో చిత్రీకరించి ఇతరులకు వాట్స్ఆప్ ద్వారా పంపారు. కొందరు ఈ విషయాన్ని పోలీసు అధికారుల దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించిన అధికారులు అక్కడకు చేరుకున్నారు. ఈ వేడుకల్లో పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు ఉన్నారు. పోలీసుల రాకను గమనించిన వారు అక్కడ నుంచి మెల్లగా జారుకున్నారు. కార్యక్రమాన్ని నిలిపివేయాలని పోలీసులు సూచించినప్పటికీ కార్యక్రమాన్ని కొనసాగించడంతో నిర్వాహకులపై పోలీసు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈలోగా పై అధికారుల నుంచి ఒత్తిళ్లు రావడంతో నిర్వాహకులను స్టేషన్‌కు రావాలని ఆదేశించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి సోమవారం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై డీఎస్పీ కె.నాగేశ్వరరావును వివరణ కోరగా పోలీసుశాఖ అనుమతి లేకుండా డాన్స్‌లు నిర్వహిస్తున్న కారణంగా కార్యక్రమాన్ని నిలిపివేశామన్నారు.