ఖాకీపై ఖద్దర్ స్వారీ
అనంతపురం టూటౌన్ ఎస్‌ఐ హమీద్వీఆర్‌కు బదిలీ
మంత్రి పరిటాల సునీత ఒత్తిడితోఉన్నతాధికారుల నిర్ణయం?
నిక్కచ్చిగా ఉన్నందుకు మొన్న గోరంట్ల మాధవ్.. నేడు హమీద్ బలి
బదిలీలపై పోలీసు అధికారుల సంఘంలో చర్చ
(సాక్షిప్రతినిధి, అనంతపురం) మంత్రి పరిటాల సునీత ఒత్తిడితో మరో ఎస్‌ఐ బలయ్యారా? విధినిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించిన ఎస్‌ఐని కాపాడటం కనీస బాధ్యత అనే విషయాన్ని విస్మరించి, అధికార పార్టీ ఆదేశాలనే ఉన్నతాధికారులు శిరసావహించారా? మొన్న గోరంట్ల మాధవ్..నేడు హమీద్ బదిలీల వెనుక మర్మమిదేనా? అధికార పార్టీ నేతలను ఎదిరిస్తే ఎవరికైనా ‘లూప్‌లైన్’ తప్పదనే సంకేతాన్ని పంపారా?.. తాజా పరిస్థితులు చూస్తే ఈ ప్రశ్నలకు ఔననే సమాధానం వస్తోంది. మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరాంను కేబుల్ వ్యవహారంలో గట్టిగా మందలించడం...స్థలం విషయంలో చమన్‌కు మీడియా ద్వారా హెచ్చరికలు పంపడాన్ని సీరియస్‌గా తీసుకుని గతంలో సీఐ గోరంట్ల మాధవ్ బదిలీకి కారణమైన అధికారపార్టీ నేతలు ఇప్పుడు మరో యువ ఎస్‌ఐపై కన్నెర్ర చేశారు.
తమ అనుచరులను అదుపులోకి తీసుకున్నారనే కారణంతో టౌటౌన్ ఎస్‌ఐ హమీద్‌ను లూప్‌లైన్‌కు బదిలీ చేయించారు. ఈ బదిలీపై ప్రస్తుతం పోలీసుశాఖలో తీవ్ర చర్చ సాగుతోంది.హమీద్ చేసిన నేరం ఇదేనా?హమీద్ బదిలీకి సంబంధించి పోలీసువర్గాలు చెప్పిన వివరాలిలా ఉన్నాయి. ‘అనంత’లోని నందమూరినగర్‌కు చెందిన టీడీపీ నేత మనోహర్‌నాయుడు పరిటాల వర్గానికి ప్రధాన అనుచరుడు. ఇటీవల ఆంథోనిరెడ్డి అనే రియల్టర్‌ను కిడ్నాప్ చేసి రూ.50 లక్షలు డిమాండ్ చేశాడు. రూ.20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఆంథోనిరెడ్డి కుటుంబసభ్యులు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్‌ఐ హమీద్.. మనోహర్‌నాయుడి కోసం గాలించారు. విషయం తెలిసి అతను పరారయ్యాడు.
దీంతో అతని కుమారుడు కార్తీక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో మనోహర్ అనుచరుడు జయకృష్ణ స్టేషన్‌కు వెళ్లి హమీద్‌తో దురుసుగా మాట్లాడాడు.దీంతో చిర్రెత్తిన హమీద్ అతనికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ విషయం సునీత దృష్టికి వెళ్లింది. హమీద్ సంగతి తేల్చాలని మనోహర్‌తో పాటు జయకృష్ణ తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతోనే సునీత పోలీసుశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి హమీద్‌ను వీఆర్‌కు పంపించినట్లు తెలుస్తోంది.
అధికార పార్టీకివ్యతిరేకంగా పనిచేయకూడదా?
యువ ఎస్‌ఐలలో హమీద్‌కు మంచి పేరుంది. పార్టీలకతీతంగా బాధితులకు న్యాయం చేసేలా వ్యవహరిస్తుంటారు. ఇదే క్రమంలో మనోహర్‌నాయుడు సునీత అనుచరుడని తెలిసినా, తాను ఉద్యోగధర్మం నిర్వర్తిస్తున్నాననే ధోరణిలోనే ముందడుగు వేశారు. గతంలో కూడా టూటౌన్ పరిధిలో ఇంటిస్థలం విషయమై ఓ యువతితో మనోహర్ నాయుడు అసభ్యంగా ప్రవర్తించారని పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. దీంతో పాటు మనోహర్‌పై పలు ఫిర్యాదులు వచ్చినా సీఐ శుభకుమార్ పూర్తిగా పక్కనపెట్టారని తెలిసింది. సీఐ చర్యలను భరిస్తూ వచ్చిన హమీద్.. ఆంథోనిరెడ్డి కిడ్నాప్ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. గతంలో సీఐ గోరంట్ల మాధవ్ కూడా రాజకీయనేతలను కాదని బాధితుల పక్షాన నిలవడంతోనే సీఐడీకి బదిలీ అయ్యారని ఆ శాఖ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఈ రెండు బదిలీలపై పోలీసుశాఖలో తీవ్ర చర్చ సాగుతోంది. రాజకీయనేతలు సిఫారసు చేస్తే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారని పోలీసు సంఘంలోని కొందరు ప్రశ్నిస్తున్నారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించే పోలీసులపై అధికారపార్టీనేతల నుంచి ఇబ్బందులు రావడం సహజమని, అయితే ఉన్నతాధికారులు అండగా నిలవాలని అంటున్నారు. ‘అనంత’పోలీసు శాఖలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని అంటున్నారు. దీన్ని ఇలాగే వదిలేస్తే మరింత మంది అధికారులు బలవుతారని, కావున దీనిపై గట్టిగా పోరాడాలని పోలీసుసంఘం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇద్దరు ఎస్‌ఐలు వీఆర్‌కు..
అనంతపురం క్రైం : నగరంలో పనిచేస్తున్న ఇద్దరు ఎస్‌ఐలను వీఆర్‌కు పంపుతూ ఎస్పీ రాజశేఖర్‌బాబు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. త్రీటౌన్ ఎస్‌ఐ తమీమ్ అహ్మద్, టూటౌన్ ఎస్‌ఐ హమీద్‌ఖాన్‌లను వీఆర్‌కు పంపారు. ఇటీవల చోటు చేసుకున్న కొన్ని ఘటనల నేపథ్యంలో వీరిని వీఆర్‌కు పంపినట్లు తెలిసింది.