టీడీపీ ఆగడాలను అడ్డుకోండి
సాక్షి ప్రతినిధి, కర్నూలు : జిల్లాలో అధికార పార్టీ ఆగడాలు ఎక్కువయ్యాయని, అడ్డుకోండని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారన్నారు. జిల్లాలోని 11 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కలిసికట్టుగా శ్రేణులకు అండగా ఉంటారని ఆయన భరోసానిచ్చారు. శనివారం కర్నూలులోని మెగాసిరి ఫంక్షన్ హాలులో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ప్రసంగించారు.
అధికార బలంతో టీడీపీ నేతలు భయభ్రాంతులకు గురిచేసో, ఆశ పెట్టో ఒక పార్టీ టికెట్టుపై గెలిచిన వారిని తమ పార్టీలోకి తీసుకోవడం మంచి కార్యక్రమం కాదని హితవు పలికారు. ప్రస్తుతం ఇల్లు కట్టుకోవాలంటే ప్రజలను ఇసుక ధర భయపెడుతోందని అన్నారు. ఇసుక రేటు చూసి పేదలు ఇల్లు కట్టుకోవడాన్ని నిలిపివేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజులపాటు (శుక్ర, శనివారాలు) జరిగిన కర్నూలు జిల్లా సమీక్ష సమావేశాలు శనివారంతో ముగిశాయి. రెండో రోజు కర్నూలు పార్లమెంటు స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.
మన పార్టీ నుంచి వెళ్లిపోయిన వ్యక్తుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వారి స్థానంలో మరింత మంచి వారిని తయారుచేసుకునేందుకు మనకు అవకాశం వచ్చిందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ తీరును ఆయన ఎండగట్టారు. అవ్వాతాతల పింఛన్ల సంఖ్యలో కోత పెట్టేందుకు సామాజిక కార్యకర్తల పేరుతో టీడీపీ నేతలు వస్తున్నారని మండిపడ్డారు.
రెండు రోజుల పాటు సాగిన సమీక్ష సమావేశాలు జిల్లాలోని పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని కలిగించాయి. పార్టీ నాయకత్వం మొత్తం కర్నూలుకు తరలివచ్చింది. పార్టీ శ్రేణుల రాకతో కర్నూలు కిటకిటలాడింది. మొత్తం మీద రెండు రోజుల పాటు సాగిన సమీక్ష సమావేశాలు అటు నేతల్లోను, ఇటు కార్యకర్తల్లోనూ సమరోత్సాహాన్ని నింపింది. ప్రజా సమస్యలపై కలిసి పోరాడదామని ప్రతిన పూనారు.
పోరాడమని ప్రజలడుగుతున్నారు...!
ఎన్నికల వుుందు బాబు ఇచ్చిన మోసపు వాగ్దానాలకు, అబద్ధాలకు విసుగెత్తి ప్రజలందరూ తవు తరపున పోరాటం చేయూలని పార్టీపై ప్రజలు ఒత్తిడి తెస్తున్నారని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రుణమాఫీ పేరుతో కనీసం వడ్డీని కూడా మాఫీ చేయలేదని విమర్శించారు. మొత్తం రూ.87 వేల కోట్ల రుణాలుంటే కేవలం రూ.4,600 కోట్లు మాత్రమే చంద్రబాబు ప్రభుత్వం కేటాయించిందని మండిపడ్డారు. వాస్తవానికి రూ.87 వేల కోట్లకు 14 శాతం అపరాధ రుసుంతో లెక్కిస్తే వడ్డీనే రూ.12 వేల కోట్లు అవుతుందన్నారు. మరోవైపు కొత్త రుణాలు లభించక అధిక వడ్డీలకు ప్రజలు అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ర్టంలో ఉన్న కోటి 75 లక్షల కుటుంబాలకు ఇంటికొక ఉద్యోగం ఇస్తానని ఎన్నికల ముందు చెప్పిన బాబు.. ఇప్పుడు అసెంబ్లీలో నిలదీస్తే నేనెక్కడ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని చెప్పానని నిస్సిగ్గుగా బుకాయిస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యోగం లేని వారికి రూ.2 వేల నిరుద్యోగ భృతి గురించి కనీసం ప్రస్తావించడం లేదన్నారు. అవ్వాతాతల పింఛన్లను కత్తిరించేందుకు సామాజిక కార్యకర్తల పేరుతో టీడీపీ మంత్రులు చెప్పిన వారిని నియమించారని.. వీరి పనంతా పింఛన్లను కత్తిరించడమేనని ధ్వజమెత్తారు.
‘బ్యాంకులో బంగారం ఇంట్లోకి వస్తుందనుకుంటే బ్యాంకు వాళ్లు వేలం వేసే పరిస్థితి ఏర్పడింది. అరుుతే, చంద్రబాబు ఇంట్లో బంగారు వూత్రం ఆయున భార్య మెడలోనే ఉంది. డ్వాక్రా అక్కాచెల్లెవ్ముల రుణాలు వూఫీ కాకపోగా... వాళ్లు పొదుపు చేసుకున్న డబ్బులను బ్యాంకులు లాక్కొంటున్న పరిస్థితి ఉంది’ అని విమర్శించారు. ఇంత దుర్మార్గంగా ప్రభుత్వ పాలన సాగుతున్న ఈ పరిస్థితులల్లో వునం ప్రజలకు తోడుగా ఉండాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.
20 గంటలపాటు సమీక్ష..
రెండు రోజుల పాటు సాగిన ఈ సమీక్షా సమావేశాల్లో 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొదటి రోజు నంద్యాల పార్లమెంటు స్థానం పరిధిలోని నియోజకవర్గాల సమీక్ష సమావేశం 12 గంటలకు ప్రారంభమై రాత్రి 10 గంటల వరకూ సాగింది. రెండోరోజు కర్నూలు పార్లమెంటు స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమావేశం ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగా... రాత్రి 8 గంటల వరకూ విరామం లేకుండా సాగింది. అంటే మొదటి రోజు 10 గంటలు... రెండో రోజు 10 గంటల చొప్పున మొత్తం 20 గంటలపాటు సమీక్ష సమావేశాలు జరిగాయన్నమాట.
ఈ సమావేశాల్లో నియోజకవర్గానికి కనీసం 50 చొప్పున లెక్కిస్తే.. మొత్తం 14 నియోజకవర్గాల నుంచి సుమారు 700 మంది కార్యకర్తలతో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా మాట్లాడారు. వారిని పేరు పేరునా పలకరించి.. పార్టీ పటిష్టతకు వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ముఖ్యమైన అంశాలను నోట్ చేసుకుని తప్పకుండా పాటిస్తానని కార్యకర్తలకు హామీనిచ్చారు. ఓడిపోయిన మూడు నియోజకవర్గాల్లో ఎందుకు ఓడిపోయామో కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. నాయకుల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను పక్కన పెట్టాలని సూచించారు.
అధికార పార్టీ నుంచి వచ్చే విమర్శలను వెంటనే ఖండించాలని ఆదేశించారు. మొత్తమ్మీద ఈ సమీక్ష సమావేశాల వల్ల జిల్లాలో పార్టీకి మరింత ఊపు వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శనివారం జరిగిన సమీక్ష సమావేశంలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, సీజీసీ సభ్యుడు, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి, ఎమ్మెల్యేలు సాయిప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి, గౌరు చరిత, ఎస్వీ మోహన్‌రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఐజయ్య, మణిగాంధీ, గుమ్మనూరు జయరాం, జిల్లా మాజీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, సీఈసీ సభ్యుడు కొత్తకోట ప్రకాష్ రెడ్డి, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, సీనియర్ నేత ఎర్రబోతుల వెంకటరెడ్డి, పత్తికొండ రామచంద్రారెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా కన్వీనరు హఫీజ్ ఖాన్, మహిళా విభాగం జిల్లా కన్వీనరు నారాయణమ్మ, జిల్లా పార్టీ గ్రీవెన్స్‌సెల్ కన్వీనర్ తెర్నేకల్లు సురేందర్ రెడ్డి, పార్టీ నేతలు బుడ్డా శేషారెడ్డి, మురళీధర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఎర్రబోతుల ఉదయభాస్కరరెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజశేఖర్, వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా కన్వీనర్ రమణ, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డిగారి రాకేష్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎ.శ్రీధర్‌రెడ్డి, పార్టీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.