అయిననూ.. తవ్వేస్తాం
కర్నూలు రూరల్: ఇసుక తవ్వకాల్లో అధికార పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. పర్యావరణానికి ముప్పు తప్పదని తెలిసినా.. ఆదాయమే పరమావధిగా ముందుకెళ్తోంది. తవ్వకాలకు కేంద్ర పర్యావరణ అనుమతి లభించకపోయినా.. రెండు రాష్ట్రాల మధ్య నదీ సరిహద్దు వివాదమూ కొలిక్కి రాకపోయినా.. నిడ్జూరు రీచ్‌లో ఏకంగా డిప్యూటీ సీఎం కె.ఈ.కృష్ణమూర్తి చేతుల మీదుగా ఇసుక తవ్వకాలను ప్రారంభించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి.
అనుమతులు లేవనే విషయాన్ని భూగర్భ గనుల శాఖ, డీఆర్‌డీఏ అధికారులు స్పష్టం చేస్తున్నా ఫలితం లేకపోతోంది. హడావుడిగా ఇసుక వ్యాపారం డ్వాక్రా సంఘాలకు అప్పగిస్తున్నామనే ప్రకటన వెనుక అనధికారంగా టీడీపీ నేతల హస్తముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇసుక రీచ్‌ల కేటాయింపుతో డ్వాక్రా సంఘాలను ఆర్థికంగా పరిపుష్టం చేస్తామని చెబుతున్నా.. ఇసుక అక్రమ తరలింపుతో టీడీపీ వర్గీయులకు దోచిపెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది.
పర్యావరణ అనుమతులు పక్కనపెడితే.. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి నదీ సరిహద్దులపై పలుమార్లు ఇరు ప్రాంతాల రైతుల మధ్య వివాదం చెలరేగింది. ఘర్షణలకు కారణమైంది. ఈ అంశం కొలిక్కి రాకమునుపే తవ్వకాలకు సిద్ధమవడం విమర్శలకు తావిస్తోంది. సహజ సంపదను కాపాడాల్సిన అధికారులు.. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి తవ్వకాలకు అనుమతులు ఇచ్చేయడం ఏ పరిస్థితికి దారితీస్తుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది.
డ్వాక్రా సంఘాలకు ఇసుక తవ్వకాలు చేసి విక్రయించేందుకు జిల్లాలో మంత్రాలయం, నిడ్జూరు-బావాపురం రీచ్‌లను మొదటి దశ కింద అధికారులు అనుమతిచ్చారు. నిడ్జూరు రీచ్‌లో 50వేల మెట్రిక్ టన్నుల ఇసుక ఉన్నట్లు భూగర్భ జలవనరుల శాఖ, నీటి పారుదల శాఖ అధికారులు తేల్చారు. వాస్తవానికి అక్కడ అంత మొత్తంలో ఇసుక లేదని స్థానికులు చెబుతున్నారు.
ఈ కారణం వల్లే నిడ్జూరు గ్రామానికి చెందిన ఇసుక ట్రాక్టర్లు 2012 సంవత్సరం వేసవి కాలంలో నది మధ్యలోకి వచ్చి ఇసుక తవ్వకాలు చేస్తున్నారని ఏపీ, తెలంగాణ ప్రాంతాల ప్రజలు ఘర్షణ పడ్డారు. ఇలా రెండు, మూడుసార్లు సరిహద్దుపై వివాదం చెలరేగిన ప్రాంతంలో తవ్వకాలు చేయాలని అధికారులు గుర్తించడం వివాదాస్పదం కానుంది. అంటే ఇసుక లేనప్పటికీ ఇతర ప్రాంతాల్లో అనధికారంగా ఇసుక తవ్వకాలు చేపట్టి.. నిడ్జూరు ఖాతాలో వేసేందుకు పన్నిన పన్నాగంగా తెలుస్తోంది.
నేతల కనుసన్నల్లోనే...
డ్వాక్రా సంఘాలకు కేటాయించిన ఇసుక రీచ్‌లు అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ఉండేలా ముందస్తుగా వారి పార్టీకి అనుకూలమైన వారిచేతనే ఇసుక సహకార సంఘాలను ఏర్పాటు చేయించినట్లు తెలుస్తోంది. అక్షర జ్ఞానం ఉంటే ఇసుక క్రయ విక్రయాల లెక్కలు అడుగుతారనే ఉద్దేశంతో సంఘంలో ప్రెసిడెంట్, సెక్రటరీలను వేలి ముద్రలు వేసే వారిని నియమించారు.
ఆయా రీచ్‌ల సమీపంలోని గ్రామాల డ్వాక్రా సంఘాల్లో ఎంతో మంది చదువుకున్న వారున్నా పట్టించుకోకుండా.. ఏమాత్రం అర్హత లేని వారిని సంఘంలో నియమించారు. ఇప్పటికే తుంగభద్ర నదీ తీరంలోని పంచలింగాల, దేవమాడ, మునగాలపాడు గ్రామాల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమ రవాణా చేసి లక్షలాది రూపాయల ప్రజా సంపదను దోచుకున్నారు.
పంచలింగాలలోని ఇసుక ట్రాక్టర్ల యజమానులకు మేము ఎంత ఇస్తే అంతే తీసుకొని మా డంప్‌లకు ఇసుక తీసుకురావాలని.. లేకపోతే అధికారులతో దాడులు చేయించి మీ వాహనాలకు సీజ్ చేయిస్తామని హెచ్చరికలు జారీ చేస్తుండటం గమనార్హం.