సిలికాన్ ముసుగులో.. ఇసుక దోపిడీ
- గూడూరు నుంచి బెంగళూరుకు వందల లోడ్ల రవాణా
- పక్కా మైనింగ్ పర్మిట్లతోనే తరలుతున్న వైనం
- అక్రమాల్లో చిత్తూరుకు చెందిన అధికారపార్టీ నాయకుల హస్తం
పలమనేరు: సిలికాన్ ముసుగులో ఇసుక దోపిడీ పేట్రేగుతోంది. గూడూరు నుంచి బెంగళూరుకు వందల లోడ్ల ఇసుక రవాణా అవుతోంది. దీనివెనుక చిత్తూరుకు చెందిన అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండడంతో పోలీసులు చూసీచూడనట్టు వదిలేస్తున్నట్టు సమాచారం.
అంతా పక్కాగానే..
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూ రు నుంచి సిలికాన్ ఇసుక బెంగళూరుకు తరలుతోంది. అక్కడ మైనింగ్ లీజుదారులు సిలికాన్ ఇసుకను సబ్‌లీజు, లేదా సేల్స్ ద్వారా టన్ను రూ.500 విక్రయిస్తున్నారు. లారీలోడు 20 టన్నులకు వారికి అక్కడికక్కడే పదివేలు గిట్టుబాటవుతోంది. దీన్ని కొనుగోలుచేసిన వ్యక్తి పక్కా రికార్డులతో అక్కడి నుంచి బయలుదేరి మధ్యలో లారీలోని సిలికాన్ ఇసుక లోకి మామూలు ఇసుకను నింపుకుని పైకి మాత్రం సిలికాన్ ఇసుక కనిపించేలా పట్టలు కప్పి బెంగళూరుకు తరలిస్తున్నారు. సిలికాన్ ఇసుకను గ్లాస్, పింగాణీ, గేర్‌బాక్స్‌లు, టాయ్‌లెట్స్, కొన్ని ఫౌడర్ల తయారీకి ఉపయోగిస్తారు. ఇప్పుడు ఇసుకకు డిమాండ్ ఉంది కాబట్టి మామూలు ఇసుకలోనూ దీన్ని కలిపి భవన నిర్మాణాలకు ఉపయోగిస్తున్నారు. మామూలుగా సిలికాన్ ఇసుకైతే బెంగళూరులో టన్ను రూ.35 వేలు పలుకుతోంది. అదే మామూలు ఇసుకైతే రూ.80 వేల నుంచి లక్షవరకు (12 చక్రాల లారీ) అమ్ముడవుతోంది.
గూడూరు నుంచి నిత్యం బెంగళూరుకు 700 లోడ్లు
గూడూరు నుంచి బెంగళూరుకు అటు తిరుపతి, చిత్తూరు, పలమనేరు మీదుగా రోజుకు 400 లోడ్లు, పుంగనూరు మీదుగా 300 లోడ్లు వెళుతున్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ పక్కా బిల్లులతో సిలికాన్ ఇసుకను తరలించినట్టే వెళుతున్నాయి. అయితే వీటిల్లో కొన్ని లోడ్లు మాత్రం ఇసుకతో వెళుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. మూడు రోజుల క్రితం పలమనేరు పోలీసులు కేవలం ఒక రాత్రిలోనే 30 లారీలను పట్టుకోవడం గమనార్హం.
అంతా మామూళ్ల మయం
ఈ మధ్యలో నాయుడుపేట నుంచి హొస్‌కోట వరకు 16 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. రేణిగుంట, కర్ణాటకలోని వడ్డిపల్లె చెక్‌పోస్టులున్నాయి. ఇక్కడ లారీకి రూ.500 ఇస్తేనే బండి ముందుకు కదులుతుందట. ఇక సంబంధిత పోలీసు సబ్‌డివిజన్లకు నెల మామూళ్లు టంచనుగా అందుతున్నట్టు తెలుస్తోంది.
అక్రమ రవాణాలో అధికారపార్టీ నాయకులే కీలకం
చాలామంది లారీ యజమానులు, సిలికాన్ ఇసుక కొనుగోలుదారులు లోడుకు రూ.ఐదువేలు సంపాదించుకోవడానికే ఈ వ్యాపారం చేస్తున్నారు. కానీ వీరి ముసుగులో చిత్తూరుకు చెందిన ఓ అధికారపార్టీ చోటా నాయకుడు మరో బడా నాయకుని పేరు చెప్పి ఈ అక్రమాలను కొనసాగిస్తున్నట్టు స్థానిక పోలీసులకు తెలియందీమే కాదు. వీరికి పలమనేరుకు చెందిన ఈ జేసీబీ యజమాని, గంగవరం మండలానికి చెందిన ఇరువురు కీలకంగా ఉన్నట్టు సమాచారం. పలమనేరు డీఎస్పీ కార్యాలయంలోని ఓ కీలక వ్యక్తి అండదండలు వీరికున్నాయని తెలిసింది. ఈ విషయమై స్థానిక సీఐ సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ చాలా లారీలు సిలికాన్ పేరిట ఇసుకను తరలిస్తున్నాయనే మాట వాస్తవేమన్నారు. త్వరలో ఈ ముఠా గుట్టురట్టు చేస్తామన్నారు.